Sunday, June 29, 2025

అంతా క్రిష్ణమయం

 అంతా  క్రిష్ణమయం  నా  ఒడలెల్ల  క్రిష్ణమయం

 
కనుల  నిండుగా  గోవింద  రూపం
నాలుక  పండించే   వాసుదేవ  మంత్రం 
కర్ణముల  కింపయ్యనే  క్రిష్ణ  లీలలు
నాసిక  శ్వాసించే  గోపి  లోలుని  వనమాలికా  గంధం
 
అంతా  క్రిష్ణమయం  నా  ఒడలెల్ల  క్రిష్ణమయం
 
హృదయ  కమలమున  కోరి  నిల్పితి  కమల  నాభుని
కరముల  పురిగొల్పితి  కరి  వరదుని  సేవకు
ఉదరం  వాసమయ్యే  దామోదరునకు
పాదములు  నర్తించే  రాదా  ప్రియ  మురళీ  రవముకు
 
అంతా  క్రిష్ణమయం  నా  ఒడలెల్ల  క్రిష్ణమయం
 
శిరము  నుండి  కొనగోటి  వరకు   నర  నరముల
నలు  చెరగులా  నడుచు  చుండె  నీల  మేఘ  శ్యాముడు
తనువుకు  చైతన్యమై , కార్యములకు  కర్తయై
సుఖ  దుఖంబుల  భోక్తయై    నా  ప్రభువై  నిలిచేనే  గోవిందుడు
 
అంతా  క్రిష్ణమయం  నా  ఒడలెల్ల  క్రిష్ణమయం

Monday, June 23, 2025

వారాహీ నవరాత్రులు

 శ్రీ గణేశాయ నమః 

                              శ్రీ శ్యామలాయై నమః 
                              శ్రీ లలితాయై నమః 
                              శ్రీ వారాహీ దేవ్యై నమః 

ఆషాఢ పాఢ్యమి నుండి ఆషాఢ నవమి వరకు వారాహీ నవరాత్రులుగా ప్రసిద్ది 
వారాహీ స్వరూపం ఉగ్రదేవత గా ప్రసిద్ధి . ఆ అమ్మ వారిని సాధారణంగా గృహాలలో 
పండితుల యొక్క ఆధ్వర్యం లో మాత్రమే పూజించటం ఉత్తమమైన మార్గం . 
ఆ తల్లి ని అందరూ ధ్యానించటానికి అనువుగా దూర్వాస మహర్షి అమ్మ వారి లోకాన్ని అమ్మ వారి రూపాన్ని తానూ దర్శించి మనకు దర్శింప చేశారు . 
 
 ఆయన చూపిన మార్గంలో మనమూ ధ్యానం చేసి అమ్మ వారి కృపకు పాతృలమవుదాం . ముందుగా అమ్మ వారి లోకాన్ని దర్శిద్దాం 
 వారాహీ  దేవి నివశించే లోకం చుట్టూ ఉన్న ప్రాకారం లేలేత పచ్చగడ్డి కాంతులతో
ప్రకాశించు మరకత మణులతో నిర్మితమై ఉంటుంది.     


ఆ ప్రాకారాన్ని ధ్యానించటం ద్వారా స్థిరమైన సంపద శ్రేయస్సు పుష్టి పొందగలం . 

ఆ ప్రాకారం లోపల బంగారు తాటి చెట్ల వనం . ఆ వనం పచ్చని కాంతులతో ప్రకాశిస్తుంది . ఆ వనం లో మరకత మణులతో నిర్మితమై రెప రెప లాడుతున్న 
జెండాలతో కూడిన నివాస గృహంలో 

నూఱు బంగారు స్తంభాలతో కూడిన బంగారు వేదికపై , ఒక బంగారు పీఠం 
ఆ పీఠం పై బంగారు రెక్కలతో కూడిన పద్మం . ఆ పద్మం యొక్క నడిమి భాగాన 
కరుగుతున్న బంగారపు కాంతులతో మెరిసిపోవు కర్ణిక (పూల పుప్పొడి ఉండే ప్రాంతము )

ఆ కర్ణిక పై బిందు ఆవరణం దాని చుట్టూ త్రికోణం దాని చుట్టూ వర్తులాకార ఆవరణం దాని చుట్టూ వేయి దళాలతో కూడిన పద్మం ఆ పద్మం చుట్టూ  రెండు 
వృత్తాకార ఆవరణలు 

ఆ ప్రదేశంలో నూట పది అక్షరాల సమూహంతో సేవించబడు ఆ కలహంసి యగు 
వారాహీ దేవి సంచరిస్తున్నది 
   
ఈ విధంగా అమ్మవారిలోకాన్ని ధ్యానించి ఆ తదుపరి అమ్మ వారి రూపాన్ని దర్శిద్దామిలా 


వరాహ ముఖం తో విరాజిల్లుతూ  పద్మముల  వంటి కనులతో 
ఆ పద్మములకు శత్రువైన చంద్రుని శిరము పై అలంకారంగా 
చేసుకుని  లేత బంగారు కాంతులీను దేహంతో   సంధ్యా సమయపు 
సూర్యుని ఎఱుపు రంగుతో శోభిల్లు వస్త్రములు ధరియించి 

తన  చేతులలో హల (నాగలి ) ముసల (రోకలి) శంఖ ,చక్ర, పాశం,
అంకుశం ధరించి  ఒక చేతితో అభయ ముద్ర ను మరొక చేతితో 
వర ముద్ర ను ప్రదర్శిస్తూ 
సంపూర్ణమైన దయతో నిండిన కనులు కలిగి , సమస్త దేవతా స్త్రీల చేత   అర్చించబడి 
హృదయంపై కుంకుమ కాంతులతో ప్రకాశిస్తూ అతి సుకుమారమైన సన్నని నడుముతో ఆ తల్లి ఒప్పారుతుంటుంది . 

ఆ తల్లి మూఢులకు దూరముగా వుంటూ , ఆర్తులకు శుభములు కలిగించు ఆర్తాలి 
కోరుకున్న కోరికలు ప్రసాదించు వార్తాలి . 
 ఆ అమ్మ వారికి నాలుగు దిక్కులలో ఉన్మత్త భైరవి , స్వప్న భైరవి , తిరస్కరిణి దేవి, కిరిపదా అనే నలుగురు  ప్రధాన శక్తులు వుంటారు 
అలాగే అష్ట భైరవులు , పదిమంది హేతుకులు సంచరిస్తూ వుంటారు . 
అలా ఆ తల్లి పరివారాన్ని తలచుకుని అమ్మ వారిని ద్వాదశ నామాలతో స్మరించుకుంటూ 
ఈ స్తోత్రం తో ధ్యానం చేసుకుందాం 
శ్రీ మాత్రే నమః 
 పంచమీ  
దండనాథా  
సంకేతా   
సమయేశ్వరి 
 సమయసంకేతా 
వారాహీ 
 పోత్రిణీ 
 శివా  
వార్తాలి  
మహాసేనా 
ఆజ్ఞాచక్రేశ్వరి 
 అరిఘ్ని
 శ్రీ మాత్రే నమః  

సదనే తత్ర హరిన్మణి-
-సంఘటితే మండపే శతస్తంభే ।
కార్తస్వరమయపీఠే
కనకమయాంబురుహకర్ణికామధ్యే ॥

బిందుత్రికోణవర్తుల-
-షడస్రవృత్తద్వయాన్వితే చక్రే ।
సంచారిణీ దశోత్తర-
శతార్ణమనురాజకమలకలహంసీ ॥ 

కోలవదనా కుశేశయ-
-నయనా కోకారిమండితశిఖండా ।
సంతప్తకాంచనాభా
సంధ్యారుణచేలసంవృతనితంబా ॥ 

హలముసలశంఖచక్రా-
-ఽంకుశపాశాభయవరస్ఫురితహస్తా ।
కూలంకషానుకంపా
కుంకుమజంబాలితస్తనాభోగా ॥

ధూర్తానామతిదూరా-
-వార్తాశేషావలగ్నకమనీయా ।
ఆర్తాలీశుభదాత్రీ
వార్తాలీ భవతు వాంఛితార్థాయ ॥ 

తస్యాః పరితో దేవీః
స్వప్నేశ్యున్మత్తభైరవీముఖ్యాః ।
ప్రణమత జంభిన్యాద్యాః
భైరవవర్గాంశ్చ హేతుకప్రముఖాన్ ॥ 

Friday, June 20, 2025

యదునందనా

 చిలకరింపుమా దయాజలధి మాపై ఘనశ్యామా
మానస తరంగాల మధురభక్తి మొలకెత్తి మాధవా
సంసారజలధి దాటి మోక్షఫలమొంద ముకుందా
హరిని చేరనివ్వని అరివర్గమును ఛేదించి మురారీ
నిర్మల నిరతిశయ ప్రేమభావనతోడ రాధామాధవా
విశ్వవీక్షణలో సర్వము నిన్ను కాంచ వాసుదేవా
 గోలోకం నుండి  గోకులం చేరితివా యదునందనా





Thursday, June 19, 2025

అక్షరలక్ష్మి

 అత్యద్భుత రమణీయ దీప్తిలక్ష్మీ
అనర్ఘ్యరమణీయ కాంతిలక్ష్మీ

మణిదీప్త విలాసహాసలక్ష్మీ
హృదయరాగ రంజిత మనోజ్ఞలక్ష్మీ

ఆకాశరాజు కంఠహారమౌ హరివిల్లులా
భూకాంత సిగ లో పూచిన హసితచంద్రలక్ష్మీ
అందుకో మీకై అల్లిన అభినందన చందన అక్షరలక్ష్మి

Monday, June 16, 2025

క్రిష్ణ నామము

 క్రిష్ణ  నామము  క్రిష్ణ  నామము
రమ్య  మైనది  క్రిష్ణ  నామము
 


భీతి యై  కంసుడు 
 ప్రీతితో  పార్ధుడు
అంగవించిన  నామము
భక్తి  తోడ  ఉద్దవుడు 
 రక్తి  కూడి  గోపికలు
రమించిన  నామము         \\ క్రిష్ణ  నామము //
 ద్వెషియై  శిశుపాలుడు  
ప్రేమ  మీరగ  రుక్మిణి
సంగవించిన  నామము
వాత్సల్యమున  యశోద  
సోదర  భావంబున  కృష్ణ
చేకొన్న  నామము        \\ క్రిష్ణ  నామము //
 పలుక  పరవశంబై    , 
పలు  రుచుల  సమ్మిళితమై
 లక్ష్మీకిరణుల
జీవన  పయనమున  
తోడు  వచ్చు  నామము  \\ క్రిష్ణ  నామము//

గోవిందా దామోదరా

 కలహమునకు కాలు దువ్వించు కుజుని కట్టడి చేయలేక

కమల సదృశములగు నీపాదముల నాశ్రయించితి సహన
కంకణం కంఠసీమ నిలిపి మృదు వచనములు పలికించవే
లక్ష్మీకిరణు హృదయ నివాసీ  గోవిందా   దామోదరా 

చిరాకు ప్రేరేపించు సౌమ్య రూపుడగు   బుధుని తాళలేక
శాంతము కోరి  నీ పాదముల శరణు  జొచ్చితి  శాంతమూర్తీ
 నీ చూపుల చల్లదనంతో హృది చల్లబరిచి  శాంతత నొసగవే
లక్ష్మీకిరణు హృదయ  నివాసీ  గోవిందా   దామోదరా     

నీ దారి నడవనెంచిన నా పాదములను పెడదారి పట్టించ
సద్గురుడు బృహస్పతి పూనిన వేళ దిక్కుతోచక నీ పాద
పద్మముల పై  దృష్టి నిలిపితి దయాళు నీ దారి చూపవే   
లక్ష్మీకిరణు హృదయ నివాసీ  గోవిందా   దామోదరా 

భాగ్యముల నొసగు భార్గవుడు నను అభాగ్యుడిగా
చేయ నెంచినవేళ శ్రీయ:పతీ నా శిరము శ్రీ కరముల
నిత్య  సేవఁలొందు నీ పాదముల నిలుపు భాగ్యమొసగవే
లక్ష్మీకిరణు హృదయ నివాసీ  గోవిందా   దామోదరా 

చేసిన చేష్టలు ఛాయలా వెన్నంటి ఛాయానందనుడు 
 ప్రతిక్రియల రూపంబున ఇచ్చు ఫలములు పరితపింప
చేయ చల్లని నీ పాదంబుల పడితి  చిత్తస్థైర్య మొసగవె
  లక్ష్మీకిరణు హృదయ నివాసీ  గోవిందా   దామోదరా
  
ఆరోగ్యమొసగు దినకరుడు ప్రతికూల భావనలతో తనువును
తపింపచేయు వేళ తానే నీవని తలచిన మాత్రమున శతకోటి 
సూర్యప్రభల వెలుగు నీ పాదముల పై  నా భావనలు నిలుపవే
  లక్ష్మీకిరణు హృదయ నివాసీ  గోవిందా   దామోదరా  

ఆహ్లాదమిచ్చు చందురుడు మనఃసంద్రమును ఆటుపోట్ల
కల్లోలపరచువేళ విశ్వ మోహనుఁడా మా మనంబుల నీ
పాదరేణువుల స్పర్శతో కదలికలు లేని క్షీరాబ్ధి  చేయవే   
  లక్ష్మీకిరణు హృదయ నివాసీ 

గోవిందా   దామోదరా    

చంచల చపలత్వముల రాహుకేతులు నన్నల్లరి పాల్చేయు వేళ
తిరుమల గిరులపై స్థిరముగా నిలచిన నీ పాదముల   నాశ్రయించితి
నీ నామస్మరణ ఎరుక తప్ప అన్యములేమి కోరని బుధ్ధినొసగుమా
  లక్ష్మీకిరణు హృదయ నివాసీ  గోవిందా   దామోదరా    
 
కమల లోచనా వేన వేల కాంతులు విరజిమ్ము నీ  
కనులు కురిపించు మాపై కారుణ్యామృత బిందువులు 
మము  దహించు కర్మఫలముల కాలాగ్నులు చల్లారగా 
  లక్ష్మీకిరణు హృదయ నివాసీ  గోవిందా   దామోదరా    

 కాలు మడతపడదాయే కనురెప్ప మూత పడదాయే కాలం
 కదిలిపోతున్నా కాయం కదలనీయక కాలచక్రంలో తిరిగాడు  
మా పై  దయావర్ష మనుగ్రహించ నిలచితివా తిరుమలగిరిపై
 లక్ష్మీకిరణు హృదయ నివాసీ  గోవిందా   దామోదరా 

Wednesday, June 11, 2025

ఓ మంజులవాణి

ఓ  యమ్మ ! ని  కుమారుడు ,
మా  యిండ్లను   బాలు  బెరుగు  మననీడమ్మ !
పోయెద  మెక్కడికైనను ,
మా  యన్నల  సురభులాన  మంజులవాణి !
 
ఓ  మంజులవాణి ! మీ  పిల్లవాని  ఆగడాలు  మితి  మిరిపోతున్నాయి
మా  అన్న  నందుని   గోవుల  మీద  ప్రమాణం  చేసి  చెబుతున్నాం
వేరేచటికైనను వెళ్లిపోతాము  అని  గోపికలు  మొర  పెట్టుకున్నారు
యశోదమ్మతో 
 
 
చన్ను  విడిచి  చనుదిట్టటు
నెన్నడు  బోరుగిండ్ల  త్రోవ  నెరుగడు  నేడుం
గన్నులు  దెరవని  మా  యి 
చిన్న    కుమారకుని  రవ్వ  సేయమ్దగునే
 
ఎల్లప్పుడూ  నా  ఒడిలో  నే  వుంటూ  పాలు  త్రగాటమే  తప్ప
ఇరుగు  పొరుగిండ్ల  త్రోవ  కూడా  తెలియని  నా  చిన్ని  కృష్ణుని  మీద
ఇన్ని  అభాండాలు  వేస్తారా  అంటూ  ఆ  యశోద  వారిని  కేకలు  వేస్తుంది
 
ఇది  మనకు  రోజు  నిత్యకృత్యమే  కదా ……..పిల్లలు  అల్లరి  చేయటం
ఇరుగు  పొరుగు  అమ్మలక్కలు  పంచాయితీకి  వస్తే  వారి  మీదే  మనం
అరవటం 
 
కాని  సమస్త  లోకాలకు  పోషకుడైన  ఆ  చిద్విలాసముర్తికి
పేద  గోపకుల  ఇండ్ల  లో  దూరి  కుండలు  పగులగొట్టి  వెన్న  దొంగలించాల్సిన
అవసరమేమిటి
 
తరచి  చూస్తే  తత్వం  భోదపడుతుంది
 
ఇక్కడ  కుండ  ను  మన  దేహం  తో  పోల్చుకోవచ్చు 
 
కుండ  తయారు  కావటానికి  మట్టి ,  నీరు , అగ్ని , గాలి  అవసరం  అలాగే  కుండ
లోపలి  భాగం  శూన్యం  తో  వుంటుంది
మన  శరీరం  కూడా  అవే  ధాతువులతో  నిర్మించబడుతుంది
 
కుండ  పగిలి  మట్టిలో  కలసినట్లే  ఈ  శరీరం  పగిలి  చివరకు  ఆ  మట్టిలోనే  కలసిపోతుంది
 
ఇక  కుండలోని  వెన్నను  మన  మనసుతో  పోల్చుకోవచ్చు
 
వెన్న  ప్రధానం  గా  మూడు  లక్షణాలు  కలిగి  వుంటుంది
అవి  తెలుపుదనం , మృదుత్వం , మదురత్వం
 
మనసు  మూడు  గుణాలను  కలిగి  వుంటుంది . అవి  సత్వ , రాజ తామస  గుణాలు
 సత్వగుణం  తెలుపు  రంగును  కలిగి  వుంటుంది . శాంతం , సత్ప్రవర్తన , సాదు  స్వభావం
ఇవన్ని  సత్వగుణం  లక్షణాలు
అందుకే  తెలుపును  శాంతికి  చిహ్నం  గా  వాడతాం
 
అలాగే  మృదుత్వం ………మ్రుదుత్వమంటే  తేలికగా  కరిగిపోయే  స్వభావం
అది  దయా  గుణానికి  చిహ్నం . ఇతరుల  సమస్యలను  తమవిగా  భావించి
వారి  కష్టాలను  చూసి  కరిగి  వారికి  సహాయం  చేయటానికి  సిద్దపడటం
 
ఇక  వెన్న  యొక్క  చివరి  గుణం ………పరిమళత్వం   తో  కూడిన  మదురమైన  రుచి
 
అది  మనిషి  యొక్క  మాట  తీరుతో  పోల్చవచ్చు  మనం  ఎల్లప్పుడూ
చక్కని  మాట  తీరు  కలిగి , ఇతరులను  నొప్పించక    వుంటే  మనకు  అనేక
స్నేహ  సమూహాలు  ఏర్పడతాయి
 
అట్టి  వారి  హృదయాలలో  ఆ  హృషీకేశుడు   కొలువై  వుంటాడు
 
అట్టి  మనసున్న  వారు  కనుకనే  గోపికల  మనస్సులను  దోచుకున్నాడు
ఆ  మానసచోరుడు
 
మరి  మనం  కూడా  మన  మనస్సులను  నవనీతం  చేసి  ఆ  వెన్న  దొంగకు
దోచిపెడదామా