Friday, December 24, 2021

సమయంలేదు మిత్రమా !  ఆధ్యాత్మిక వ్యవసాయమా ?     దుఃఖ సాగరపు ఈదులాటా ?

జాతీయ రైతు దినోత్సవం ఈ పోస్ట్ మా గ్రూప్ లో చూసాక నా మనో క్షేత్రం లో మొలకెత్తిన ఆలోచనా పిలకలు ఇవి  మండే ఎండలకు గొంతెండి బీటలు వారిన భూమితల్లి  తొలకరి జల్లుల తడిసి పరిమళించి  పూయించే మట్టి గంధపు వాసన తో పరవశించిన మనస్సులు ఉత్సాహంతో ఉరకలు వేసే ఎడ్లకు నాగళ్లు కట్టి దుక్కి దున్ని నేలతల్లిని వ్యవసాయానికి సిద్ధం చేసే ఆ కాలం  తీయని  నీటిని కడుపునిండా నింపుకుని దుక్కబడిన నేలతల్లి గుండె తడపటానికి పరుగులు తీసే పంట కాలువల ప్రవాహం  నిండుగా మొలకెత్తిన నారుమడుల ఒడుపుగా పొలమంతా నాటే కలువ కనుల కోమలుల కోలాహలం  చిత్తడి గా మారి కాళ్లు జారేలా వుండే పొలం గట్లపై సరదాగా సాగిపోతూ ఏ సీమ తుమ్మ చెట్టు నీడనో కూర్చుని ఎర్రని అల్లపచ్చడి ముద్ద ఆవురావురమంటూ తింటూ పంట కాలువ నీళ్లు తాగి తృప్తిగా తేన్చిన ఆ కాలం   ఏపుగా పెరిగి బంగారు రంగు కంకులతో  పచ్చని ఆ చేలు భూమాతకు బంగారు అంచు ఆకుపచ్చని చీర పెట్టి మురిసే రైతు బిడ్డల ఆనందానికి ప్రతిరూపాలు    వయ్యారి భామలు గలగల సందడి చేస్తూ  పంట కోత కోస్తుంటే ... గుండె కోత కోస్తూ మదనుడు మదిలో సందడి చేస్తుంటే ...   కుప్ప నూర్చి ధాన్యపు రాశుల పోగుచేస్తూ రైతుల ఇండ్లలో పొంగే పొంగళ్ళు  అదో  అద్భుతమైన లోకం . ఆ లోకం పేరు పల్లెటూరు  ఈ కాలంలో ఎక్కడా కనరాని నాటి ఆనందాల హోరు పల్లెటూరు  ఆ పల్లె జీవితపు గుభాళింపులు బాగుగా తెలిసినవాడు . దాని గొప్పదనం మనకు అర్ధం అయ్యేలా చెయ్యాలనే ఆ గోవిందుడు పుట్టి పుట్టగానే పట్నం వీడి పల్లెను చేరాడు  వ్యక్తిగత స్వాతంత్రానికి , ప్రకృతి తో మమేకమైన  స్వేచ్ఛాయుత జీవన విధానానికి , కుటుంబ భాంధవ్యాలకు , మనో వికాసానికి  ఆలవాలం వ్యవసాయ దారుని జీవితం.  దానిని  ధ్వంసం చేసుకుని చాలా దూరం వచ్చేశాం ... వాస్తవికతకు భ్రమకు కు తేడా తెలియనంత ఇక వెనక కు వెళ్ళటం బహుశా దుస్సాధ్యం  ఇక మిగిలిన చివరి అవకాశం  మన మనస్సనే క్షేత్రాన్ని సానుకూల దృక్పధం అనే నాగలి తో  దున్నుతూ  మన మనస్సులలో ద్వేష బీజాలు మొలవటానికి కారణమయ్యే కలుపు మొక్కల  ఆలోచనలను ను తొలగించుకుని భగవన్ నామాలనే విత్తనాలు చల్లటం మొదలుపెడితే భగవత్ భక్తి అనే అమృత పుష్పం చిగురులు తొడుగుతుంది . అది ఆనందపు మకరందపు జల్లులతో మన తనువెల్లా తడిపి జీవితాన్ని సార్ధకం చేస్తుంది  సమయంలేదు మిత్రమా !  ఆధ్యాత్మిక వ్యవసాయమా ?     దుఃఖ సాగరపు ఈదులాటా ?