Monday, March 20, 2023

పిల్లలు

పిల్లలు మల్లెల పరిమళాలు వెదజల్లు పక్క పక్క కాదు పసిపాపల మూత్రం తో తడిసినదే పక్క కాని.... ఆర్యోక్తి అది ఇంట పిల్లల కుండే ప్రాధాన్యత బహుశా శ్రీరాముడను పేర  నరుడిగా  నడయాడిన  నారాయణుడు సైతం బాల విన్యాసాలలోని మధురానుభూతి  తెలసి తిరిగి కృష్ణుడిగా దిగి వచ్చి బాల్యంలోని మాధుర్యాన్ని అనుభవించిన వైనం వర్ణించనలవి కానట్టిది అజ్ఞాని నైన నాకే అపుడపుడు సాలోచనగా పరికిస్తే సాయం సంధ్యలో చెంగు చెంగున ఎగురుతూ , తటాలున ఆగుతూ  కేరింతలతో సాగి పోవు గోవత్సముల పద ఘట్టనలో రేగిన ఎర్రని ధూళి  దట్టమైన వాన మబ్బు వంటి దేహచ్చాయను కమ్ముకొనగా ఓ వింత ఎర్రని కాంతితో మెరయు, పసుపు పచ్చని పంచె కట్టి నడుముకు బిగించిన తలపాగాలో వేణువు దూర్చి , తలపై నెమలి పించం అలంకరించి గోపబాలుర చేతులతో చేతులు కలిపి నడయాడు గోపాల బాల కృష్ణుని రూపం అబ్బ ఎంత ముద్దోస్తుందో ..........  ఇక సుజ్ఞానులైతే ఎంత గొప్పగా దర్శించి పులకించిపొయారొ పోతన గారి భాగవతం లీలాశుకుల కృష్ణ కర్ణామృతం లాంటివి చూస్తే తెలుస్తుంది            అందుకే అంటారు భగవానుడు శిశువులలో తేజిల్లుతుంటాడని అలాంటి బాలకుడొకడు నట్టింట పారాడుచుండగా చూసిన తండ్రి హృదయం పొంగి పోతుంది  లేలేత తమలపాకు వంటి  చిన్ని పాదాలతో గుండెలపై తన్నుతుంటే కలిగే తదాత్మ్యత  సరిపోక ముఖం మీదకు చేర్చుకుంటాడు పాదాలను అక్కడ కూడ  తన్నమని మరి అంతగా మురిపించే ముద్దు బాలకుడొకడు వుండాలని అందరు తపిస్తుంటే నాకెందుకు ఆ ఆలోచన కూడా స్పురించదు నేను జడుడనా ! నాకు స్పందనలు లేవా ? ఆలి గగ్గోలు పెడుతున్నా, పెద్దలు పోరు పెడుతున్న చెల్లి పనికట్టుకు ప్రశ్నిస్తున్న చిరకాల మిత్రుడు పదే పదే రొద పెడుతున్న నాకెందుకు లేరు అన్న చింత కాని ఇక రారా అన్న ఆందోళన కాని మనసును తాకటం లేదు అది బండ బారిందా  లేక వివేకమెరుగని మూర్ఖపు స్థితిలో నేనున్నానా  ఆలోచనలు స్వయంకల్పితాలు వాటిని మనిషి సృజించలేడు ఆవి ఆత్మచే సంకల్పించ బడతాయి ఆత్మ భగవత్ స్వరూపం ఇదే  విషయం వెంకటరామన్ గా పిలవబడి శరీరపు కదలికలు ఆగిన స్థితిలో  కూడా ఆలోచనలు ప్రసరించటం స్వయంగా అనుభవించి ఆత్మ వేరు శరీరం వేరు అని గ్రహించి భగవాన్ రమణులుగా ప్రసిద్దులైన రమణ మహర్షి జీవితం మనకు తెలియ చేస్తుంది అదే అనుభూతిని నేను రెండు సార్లు పొందాను . శరీరం పూర్తిగా చచ్చుబడి అణుమాత్రమైన కదపలేని స్థితిలో ......  నా మనసు మరణం సమీపిస్తున్నదా అని తనను తానూ ప్రశ్నించుకుని శ్రీరామ నామాన్ని  స్మరించిన సందర్బం రెండు సార్లు అనుభవించాను మరి నేనెందుకు అటు రమణుల వలే గొప్పగా ఆలోచించి ఉన్నత స్థితిని పొందలేకపోయాను మరి అలాంటి స్థితి అనారోగ్యం వల్ల కలిగిందా అయితే నొప్పిని అనుభవించాల్సిన స్థితిలో రామ నామ స్పురణ ఎలా కలిగింది ఇంతటి ఆలోచనలు కలిగించే నారాయణుడు పిల్లలు గూర్చిన కనీసపు ఆలోచన కూడా నాలో ఎందుకు రేకెత్తించటం లేదు  అంటే పూర్వ జన్మ వాసనా బలం ఏదైనా నను వెన్నాడుతుందా అప్పటి పాపఫలం ఇప్పుడు ఈ రీతిన బదులు తీర్చుకుంటున్దా  కాదు అనుకుంటే ఒకే ఇంట జన్మించిన ముగ్గురు కు చెందిన సంతానంలో ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు గా సంతాన లేమి తో సతమతమవటం కాకతాళీయమా యాద్రుశ్చికమా మరి ఇటువంటి స్థితిని నరుడైన వైద్యుడు తప్పించగలడా (మిగిలిన ఇద్దరు ఎందుకు ఇంకా ఫలితం పొందలేకపోయారు) వైద్యో నారాయణో హరి మరి నారాయణుడే తప్పించాగాలడా మరి అందుకు ఆయన సంకల్పిస్తాడా ఒక వేళ పిల్లలు పిల్లలన్నను వారికి సంక్రమించే ఆలోచనా స్థితి లేదా ఆరోగ్యం మన నుండి రావాల్సిందే కదా అంటే సోమరితనం చిరాకు ఇటువంటి లక్షణాలతో పుట్టే వాడు తనను తాను ఉద్దరించుకొగలడా మనకు సంతోషాన్ని ఇవ్వగలడా ఏమో నాకేమి పాలు పోనీ స్థితి ఎటు వైపుకు నా పయనం ..... ఏమిటి నా ముందున్న కర్తవ్యమ్ ....... దామోదరుడా నీదే భారమిక     గుండెలపై సుతిమెత్తగా తన్నినా గుండె పోటు తెప్పించినా   గురువాయూరప్ప త్వమేవ శరణం మమ శంఖపాణే

No comments: