చంద్రభాగా నదీ తరంగాలపై నుండీ వీచే చిరుగాలులు చేయు సవ్వడి...
చంద్రభాగా నదీ జల తరంగాలు చేయు గలగలల సవ్వడి...
.విఠల విఠల విఠల
ఆ గాలులు పీలుస్తూ ఆ జలాలు సేవిస్తూ అక్కడ జీవించే ప్రాణకోటి పలికే
తీయని పదం ...విఠల విఠల విఠల
విఠలా విఠలా అని భక్తజనం నోరారా పిలుస్తూ పరవశించిపోయే
భక్త సులభుడు పుండరీక వరదుడు అయిన పాండురంగడు కొలువైన
పుణ్యధామం ...చంద్రభాగా తీరాన వున్న పండరీపుర క్షేత్రం
ఎందరో భక్త శిఖామణులు పాండురంగని ప్రత్యక్ష దివ్యానుభూతిని పొందారు
అలాంటి వారిలో అగ్రగణ్యులు సమకాలీనులు అయిన నామదేవుడు , జ్ఞాన దేవుడు
నివృత్తి నాథుడు ,సోపాన్ , ముక్తాబాయి , భక్త కబీరు మొదలగువారు
వీరికోవకే చెందిన భక్తురాలు
జనాబాయి . 5 సంవత్సరాల వయసులో ఆషాఢ శుద్ద ఏకాదశి రోజు మొదటిసారి పాండురంగడిని దర్శించి ఆ రూపాన్ని తన హృదయంలో నింపుకున్న మహానుభావురాలు
నామదేవుడిని గురువుగా స్వీకరించి ఆయన సేవ చేసుకుంటూ ఆయన ఇంటిలో
వసతి పొంది నివసిస్తూ వుండేది
ఒకరోజు రాత్రి తుఫాను కి నామదేవుడి ఇంటికప్పు ఎగిరిపోతుంటే , సుదర్శన చక్రాన్ని గొడుగులా పెట్టి విఠలుడు స్వయంగా ఇంటి తాటాకు కప్పు సరి చేస్తూ కూర్చున్నారు
ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన
జనాబాయి దగ్గరకు విఠలుడు వచ్చి చిరునవ్వుతో ఈ నామదేవుడు నా నామం చెప్పకుండా , రోజు నన్ను దర్శించకుండా , నాకు నైవేద్యం పెట్టకుండా క్షణం కూడా ఉండలేదు .
ఈ నామదేవుఁడు చేసే కీర్తనలు వింటుంటే నన్ను నేను మర్చిపోతాను అలాంటి నామదేవుడికి కష్టం వస్తే నేను రాకుండా ఎలా వుంటాను అని చెబుతుంటే ఆయన మాటలని ఆయన రూపాన్ని చూస్తూ అలా తన్మయత్వంతో నిలచిపోయింది
జనాబాయి .
ఆ అలికిడి కి నిదుర లేచిన నామదేవుడు స్వామిని చూసి , స్వామి ఇంత అర్ధరాత్రి వేళ విశ్రాంతి తీసుకోకుండా ఇలా వచ్చారేమిటి అని ప్రశ్నించగా
జనాబాయి చేతి వంట తినాలని కోరికతో వచ్చానని స్వామి బదులిస్తారు
అంతట ఆయన కోరిక మేరకు జనాబాయి వంట పూర్తి చేయగా అందరూ భోజనానికి కూర్చుంటారు. వారికి వడ్డిస్తూ తనలోతాను బాధపడుతుంది జనాబాయి స్వామితో కలసి భోజనం చేయలేకపోతున్నానే అని . ఆ భక్తురాలి ఆంతరంగం గ్రహించిన విఠలుడు నామదేవా నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత భుజిస్తాను . నా ఆహారాన్ని విడిగా పెట్టి వుంచమని చెప్పగా సరేనని నామదేవుడు తన భోజనం ముగించి స్వామి వారి పాదాలను వత్తుతూ వుంటారు. స్వామి నిదుర రాకున్నా నిదుర పోయినట్లు నటిస్తారు . స్వామి నిదురించారని భావించిన నామదేవుడు తానూ నిదురిస్తారు . అలా అందరూ నిదుర పోయాక విఠలుడు లేచి జనాబాయి ని లేపి తనకు ఆహరం వడ్డించమని అడిగి పెట్టించుకుని జానాబాయి ని పక్కన కూర్చుండ బెట్టుకుని తన చేతులతో స్వయంగా జనాబాయికి తినిపిస్తారు
అంతటి అదృష్టవంతురాలు ఆ జానాబాయి అంతటి సులభుడా విఠలుడు
ఆయన రూపం సమ్మోహనాకారం ... అపుడే విరిసిన లేత గులాభీ రెక్కలవంటి పెదవులు .... ఆ పెదవులపై పూచే బొండు మల్లెల వంటి నవ్వులు .... నీటి తుంపరలతో నిండిన కలువల వంటి సజల దయాపూరిత నేత్రాలు ..... అందమైన ఆ ముక్కు ....
దట్టమైన వానమబ్బు లాంటి ఆ మేని ఛాయ
తాకగానే చల్లగా సుతిమెత్తగా తగిలే ఆ పాద పద్మాలు ,...
నడుం మీద చేతులు పెట్టుకుని అందమైన పట్టు పీతాంబరాలు ధరించి ... భుజాలు మీదుగా వచ్చి చేతి మీద అందంగా అమరిన పై వస్త్రం... ఆ ముచ్చటైన తలపాగా ....
ఇంతందం ఈ లోకంలో ఎక్కడైనా వుందా ...
ఈ అందాన్ని ఆస్వాదిస్తుంటే.... ఇంకే అందాన్నైనా మనసు కోరుతుందా
ఆ రూపాన్ని దర్శించాలంటే కావాల్సింది తపన ...ఎలాంటి తపన అంటే...
తొలిసారి ప్రేమలో పడిన యువతీ యువకులు ఒకరినొకరు చూ సుకోవటానికి
ఎంత తపన పడతారో .... ఆ మాత్రం చాలు ...
విఠల విఠల విఠల పాండురంగ విఠల
No comments:
Post a Comment