Saturday, July 19, 2025

ఆహా వర్షం టూ అమ్మో వాన

 కాలం మారుతుంది ఋతువులు గతులు తప్పుతున్నాయి మనలానే 

తొలకరి చిరుజల్లులతో ఆహ్లాదంగా సాగే ఆషాఢం
శ్రావణ మేఘాలతో గర్జిస్తుంది 

బోర్లించిన నిండుకుండలా జోరెత్తాల్సిన శ్రావణం శరత్కాలపు మేఘంలా తెల్లమొగమేస్తే

పొలంగట్టున రైతన్న బిక్కమొహంతో ఆకాశం కేసి 
చూస్తు కూర్చునే పరిస్థితి
అలాంటి వానాకాలపు ఉహా వాస్తవికత మేళవింపుల తాలింపు ఇలా
ఆకాశరాజు హృదయంపై నిలచి నల్లని రంగుతో
మెరయు జవరాలు జలద ప్రేమపొంగు ముత్యాల సరాలై ధారగా జారుతూ

భూమాత ఒడిలో ఏపుగా పెరిగిన మామిడి చెట్టు మొదలు ఆనుకుని కూర్చున్న నా ఎదపై
తలవాల్చిన గువ్వ నుదిటిపై రాలి అరుణిమ వర్ణమద్దుకున్న ఆ ముత్తెపు బిందువుల ధార గువ్వ నాసికాగ్రమున నిలచి ఓ క్షణం నను తేరిపార చూసి ఒక్క ఉదుటన దుమికి అలివేణి
అధరామృతన్ని తనలో యిముడ్చుకుంటూ కొంటెగా నను చూడగా
దాని గర్వమణచ ముందుకు వంగబోతుండగా

గుండె గుభేల్ మనేలా హోరెత్తిన హారన్ల రొద రసమయ ఊహా జగత్తు నుండి మనసును వాస్తవ
ప్రపంచంలోకి ఈడ్చితే 

ముందు వెనుకల ఎటుచూసినా కిలోమీటరు పొడవునా ఆగిన వాహనాలు
ముందువాడు కదలటానికి అవకాశం లేదని తెలిసి హారన్ల రొదతో మోతెక్కించె వాహనదారులు
కాళ్ళను తాకుతున్నది వాననీరో...డ్రైనేజీ నీరో తెలియని స్థితి
సెంటిమీటరు సందు దొరికితే చాలు ఎలాగోలా 
ట్రాఫిక్ వ్యూహం లోంచి బయటపడాలని ఆతృత పడే టూవీలర్లు

వరదనీరు టైర్లను ముంచెత్తితే దేవుడా కారు ను మాత్రం ముంచెత్తనీవకు అంటూ మనసులో దండాలు పెట్టుకుంటూ బింకంగా కారు నడిపే ఓనర్లు


వీటన్నిటినీ నడమ నావిషయానికొస్తే పొద్దుగాల లేవగానే కమ్ముకున్న కరిమబ్బు చూసి ఆహా వాన దంచేట్టుంది కూసింత సేపు ఆగి వెళదాం అనుకొని అంతలోనే మబ్బులు చీల్చుకుని పెళపెళలాడుతూ వచ్చిన ఎండను చూసి ఉసురుమంటూ ఆఫీసు చేరి 
సాయంకాలం ఆఫీసు ముగిసి బయటకురాగానే
అప్పటివరకు తేటగా వున్న ఆకాశం వున్నట్టుండి 
నల్లబడి ఉరుములు మెరుపులతో హుంకరిస్తుంటే
చుప్పనాతి వాన అని తిట్టుకుంటూ ఒకవైపు
వానలో తడిసిన అనుభూతి  అనుభవిస్తున్న ఆనందం మరోవైపు..

ప్రకృతితో మమేకమవుతూ సహజీవనం చేస్తు సాగిపోతే జీవితం ఆహ్లదభరితమవుతుంది
ప్రకృతిని ధ్వంసం చేసుకుంటూసాగితే వ్యధాభరితమవుతుంది

No comments: