Saturday, January 30, 2010

నీలిమేఘ శ్యామా …..


నీలిమేఘ శ్యామా …..

 

కృష్ణుడి పేరు …………దట్టమైన నల్లమబ్బు వంటి వర్ణం కలవాడా

 ఏమిటి  మేఘానికి  భగవంతుడికి  సంబంధం  

 

నీటితో  నిండియున్న మబ్బు నల్లగా వుంటుంది . అది  తనలోని నీటి ధారలను

వర్షించగానే తెల్లగా తేలిపోతుంది . ఇక ఇవ్వటానికి నాదగ్గర ఏమి లేదే  అని

వెలవెలబోతుంది

 అలాగే భగవంతుడు  కూడా  …..మేఘంలో  నీరు ఉన్నట్లే  కృష్ణుడిలోను  

కృపాజలం నిండుగా  వుంటుంది . ఆయన కూడా మనపై  దయావర్షాన్ని కురిపిస్తాడు

 

 మేఘం కొండలలో వర్షిస్తుంది . అక్కడ  కురిస్తేనే ఆ నీరు

నదిగా మారి మనకు ప్రయోజనం కలిగిస్తుంది

 అందుకే  కృపాజలనిది  వెంకటనాధుడు  ఏడుకొండలపై కొలువుండి  మనపై

తన దయావర్షం కురిపిస్తున్నాడు

 
 భక్తులు  రెండు  రకాలు ……

ఏదైనా  ప్రత్యేకమైన కోరికలతో భగవంతునకు నమస్కరించేవారు

ఎటువంటి  కోరికలు కోరకుండానే నమస్కరించుకునేవారు

 వీరిలో ఎవరు తెలివైనవారు  ? ఎ  కోరికలు కోరని వారు

మన  పరిజ్ఞానం  ఎంత ? మనకు నిజంగా ఏది అవసరమో  మనకు  తెలుసునా

మనం  కోరే  కోరిక  నిజంగా  మనకు  పూర్ణానందం  కలిగిస్తుందా

 అదే  మనమేమి  కోరకుంటే మనకు ఏది అవసరమో తనే నిర్ణయించుకుని

వెంకటనాధుడు  మనపై  దయావర్షం  కురిపిస్తాడు

 అదే  మనం  కోరుకుంటే  అంత  వరకే  ఇచ్చి , అయ్యో  వీడికి  ఎంతో  ఇద్దామనుకున్నాను  

కాని  నాకింతే  చాలని అంటున్నాడే  అని నీరు వెలసిన మేఘం లా ఆ  దయాసముద్రుడు

వెలవెల బోతాడు

మరి మనం ఆయన కృపాజలంలో సంపూర్ణంగా తడిసి ముద్దయ్యేందుకు ప్రయత్నిద్దామా !

(పెద్దల అనుగ్రహభాషణల ఆధారంగా)


--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


Monday, January 25, 2010

ఇవి కావా నీ ఆనవాళ్ళు

శుక్లపక్షపు చవితి నాటి చంద్రరేఖ
పున్నమి నాటి పండువెన్నెల
ఇవి కావా నీ ఆనవాళ్ళు
 
మార్గశిరోదయాన  గులాబి బుగ్గపై నిలచిన మంచుముత్యం    
మంచు పరదాలను చీల్చుకుని నులి వెచ్చగా తాకే పసిడికిరణం 
ఇవి  కావా నీ ఆనవాళ్ళు
 
చైత్ర కాలపు చమట గంధాన్ని చిదిమే మల్లెల పరిమళం
వుడికించే వేడిమిలో  ఊరించే మామిడి  మాధుర్యం
ఇవి కావా నీ ఆనవాళ్ళు
 
వసంతోదయాన  కోకిల  కుహుకుహులు
లేలేత చిగుళ్ళతో పరవసింపచేయు ప్రకృతి పచ్చదనం  
ఇవి  కావా  నీ  ఆనవాళ్ళు
 
ఝురి విప్పిన మబ్బు తునకకు ప్రతిగా పురి విప్పిన  మయూరపు  సోయగం
కొండవాలున  జాలువారుతున్న జలకన్య  జాణతనం
ఇవి  కావా  నీ  ఆనవాళ్ళు

--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


Monday, January 11, 2010

అసలేం జరుగుతుంది-2

అసలేం జరుగుతుంది-2
రింగులు తిరుగుతున్న పొగల తెరలు

బంగారురంగు పానీయంతో నిండి వున్న అందమైన గ్లాసులు

చుట్టూ  కోలాహలం

 

అంతలోనే ఎగసిపడిన ఆనందంతో

 ఒరేయ్ ఇన్నేళ్ళు  ఏమైపోయావురా  ఓ  కేక

 నామాలు తెల్సుకోవటానికి ఒక నిమిషం సమయం పట్టినా

రూపాలు పోల్చుకోవటానికి అట్టే సమయం  పట్టలేదు

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు   ……..5 వ  తరగతి నుండి పదోతరగతి వరకు

కలసి చదివిన బాలసన్యాసులు

అవునుమరి  గురుకులం ………తాడికొండ గురుకుల బాలుర విద్యాలయం

 అప్పటి  క్లాస్ మేట్స్   ఇప్పుడు  ఇలా  

సుమారు  20 సంవత్సరాల  తరువాత

అవును …………..

సరిగా  మే  9, 1990…………

 

ఒక వైపు తుఫాన్ కుదిపేస్తుంది

 మరోవైపు ……..జగదేకవీరుడు  అతిలోక సుందరి  చిత్రం విడుదల

 ఈరెంటిని  మించిన  ఉత్కంట  ……… మా  పదో తరగతి ఫలితాల ప్రకటన

 ఒక్కసారి అలా  కనుల ముందర కదులాడింది నాటి దృశ్యం

 

అప్పటివరకు  కలసి వున్నబాలసన్యాసులు ……..వేరు వేరు

రహదారుల వెంబడి  పయనమైపోయిన  క్షణం

ఆనాటి  సన్యాసులే  నేడు కళ్ళ  ముందు  కదులాడుతున్న  దృశ్యం

 

ఒక్కొక్కరిని  పోల్చుకుందామా  

అప్పట్లో  పేర్లు షార్ట్ కట్ లో పాపులర్ …..ఆంగ్లపు పొడి పొడి  అక్షరాల్లో లేదంటే ఇంటిపేరు
టి కే బి ; గుంటుపల్లి ; డి యల్ యమ్ ఆర్   ఇలా......   

 

ఇంతటి తెల్లని దీపపుకాంతిలో  కూడా నిగనిగలాడుతున్న నల్లని నగుమోమువాడు

పరిమి  (పేరు  బత్తుల గంగాధరమైన పరిమోడిగానే  ప్రసిద్ది ..పెద పరిమి వీడి ఊరి పేరు )

ఇప్పుడు  డ్రిల్లు  పంతులు  (అప్పట్లో  మంచి  ఖోఖో  ఆటగాడు  లెండి అంతకన్నా పెద్ద పోకిరి )

 

మత్తు వదలరా నిదుర మత్తు వదలరా అంటూ శ్రావ్యం గా  నిదురులేపబోతే

 ఎవడురా వాడేవడురా  నన్ను నిదురలేపే దమ్ములెవడికి  వచ్చేరా  అంటూ

భీకరంగా బూతులు పలికే  భాను ప్రకాశం కదా  వీడు

 

అన్నం ……..అప్పుడు ఎంతగా వుడికించినా వుడకని గింజ

కాని ఇప్పుడు అనేక  గింజలను వుడికిస్తున్న  ఓ  జ్ఞానదీపం

(అన్నం శ్రీనివాసరావు ……..అందరు అన్నం  అన్నం అనేవారు …….పాపం  వుడుక్కునేవాడు

ఇదేం  ఇంటిపెరురా  అని

కాని ఇప్పుడు ………..ఇన్నేళ్ళ తరువాత మరలా ఆ పిలుపు విని చెవులలో అమృత వర్షం కురిసిన  భావన

చదువులో బాగా వెనుకబడి ఉండేవాడు ………కాని జీవిత పాటాలు బాగా వంటపట్టిన తరువాత  తనను తాను సంస్కరించుకుని లెక్చరర్ అయ్యాడు )

 

ఇలా చెప్పుకుంటూపొతే  చాలా చిరాకేస్తుంది చదివేవాళ్ళకు

 

ఇలా  నాటి  స్నేహితులు సుమారు 20 మంది  ఒక చోట చేరి గంతులేస్తుంటే

 స్నేహితుడా  స్నేహితుడా  చిన్ననాటి స్నేహితుడా

అని  పాడుకుంటూ

చెప్పాల్సింది ఇంకావుంది కాని నాకే చెప్పే ఓపిక లేదు ప్రస్తుతానికి
ఇక నా గురించి మీరడగరాదు      నే చెప్పరాదు
 


--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


Monday, January 4, 2010

ఏమి జరుగుతుందిక్కడ …………అసలేం జరుగుతుంది


ఆదివారం …జనవరి  3,2010 తెల్లవారుజాము   5.00 గంటలు

హయత్ నగర్  

ఆదివారమంటేనే కొంచెం బద్ధకం మనసును  ఆవరిస్తుంది

అల్లాంటిది చలిపులి బయట గర్జిస్తుంటే

దుప్పటి ముసుగులో వెచ్చని రక్షణకోరుకునే దేహం అంత తేలికగా

ఎలా బయటకు వస్తుంది

 

అటుదొర్లి ఇటుదొర్లి ముడుచుకుని మొత్తం మీద లే లేరా వెధవాయ్ అంటూ

మనసు పెడుతున్న ఘోషకు పుల్ స్టాప్  పెట్టేసి చక చకా స్నానాది  కార్యక్రమాలు ముగించుకుని  ,
 చల్లబడుతున్న దేహానికి అరచేతుల రాపిడిలో పుట్టిన వేడిమి

అందిస్తూ ………బస్ స్టాండ్ చేరుకొని అప్పటికే కదలటానికి సిద్దం గా వున్న  విజయవాడ

 బస్ ఎక్కి కూర్చున్న

  

 చలికాలపు ఉదయం ఎక్కడికీ అత్యవసర పయనం

 శీతల పవనాలు వణుకు పుట్టిస్తుంటే మనసులో బ్రమిస్తున్న ఆలోచనాతరంగాలు

కాల చక్రాన్ని కొన్ని యేండ్ల వెనుకకు పరిగేట్టిస్తుంది

 

కొన్ని  సంగతులు …………. మనసు  పొరల మరుగున పడిపోయిన కొన్ని

సంగతులు గుర్తుకొస్తున్నాయి

 ఎప్పుడో  20 సంవత్సరాలకు ముందున్న  6 వసంతాల కాలంలో  (1985 to 1990)

పుష్పించిన స్నేహ కుసుమాలను ఏరికుర్చుకునే ప్రయత్నం ఇన్నేళ్ళ తరువాత

చేయటం  ….కడు విచిత్రం

 ఆ  కుసుమాలు మరుగున పడినప్పటికీ వడలకపోవటం బహు విచిత్రం

 అలా ఆలోచనలలో మునిగివున్న మనసు కాలచక్రం పరుగెడుతున్న వేగంలో

బస్సు చక్రాన్ని పరుగేట్టించని వాహనచోదకుడిని తిట్టుకుంటూ చుట్టుపరికించి

చూసేసరికి విజయవాడ సరిహద్దుకు చేరుకున్నాం అప్పటికి సమయం మధ్యాహ్నం 12 గంటలు

 హమ్మయ్య ….ఇంకో గంటలో గుంటూరు కు చేరుకుంటాం

గుంటూరు …………..నాకెంతో ప్రియమైన వూరు

నా జన్మస్తలం వున్న జిల్లాగానే కాక , నా జీవనగమనంలో అధిక కాలం గడిపిన వూరు …….గుంటూరు  

 మనం ఎదురుచూస్తున్న ఘడియ రాబోతుందని మురిసే సమయానికే వెంచేస్తాయి వూహించని మలుపులు

 అప్పటిదాకా పరుగెడుతున్న బస్సుచక్రం ఒక్కసారిగా ఆగిపోయింది .ఇంకా 10 కి  మీ

దూరం వుంది . కనుచూపుకు అందనంత దూరం నుండే వాహనాలు నిలిచిపోయివున్నాయి

 

వెంటనే గుర్తుకు వచ్చాడు  మన్మధుడు

సోనాలి బెంద్రే  కోసం నాగార్జున పరుగెత్తిన విధమే ఇప్పుడు మన ముందున్న మార్గం  

 

ఆటోలు తిరిగే ఆవకాశం లేదు . ఎడ్ల బండ్లు సినిమాలకే పరిమితం

ఈదుదామంటే కాలువ లేదు …మనకు ఈత రాదు

మిగిలింది కాలి నడక

వాహనాల బారులను దాటుకుంటూ నారాయణా నాకేమిటీ పరీచ్చ అనుకుంటూ నడుస్తున్నంతలో  బహుశా  నా  ప్రశ్నకు  బదులివ్వ  దలచాడేమో  , ఒక యువకుడు నవ్వుకుంటూ నా పక్కన నిలిచి తన మోపెడ్ మీద చోటిచ్చి చిట్టినగర్ లో దించాడు  

 (మనకు  ఎటువంటి సమస్య ఎదురైనా అందుకు ఇతరులనో లేక మనలనో  నిందించుకోకుండా  

ఆ  నిందేదో నారాయణుడిపై మోపి అంతా మంచే జరుగుతుందని పదే పదే చెప్పుకుంటే

ఆ సమస్య ఖచ్చితంగా  60% పరిష్కారమవుతుంది మనకు  మానసిక వత్తిడి తగ్గుతుంది )

 సరే  అక్కడినుండి గుంటూరు చేరుకొని మన  పయనపు ఆఖరి మజిలి చేరుకునే సరికి

సరిగ్గా 2 గంటలు

 సుకుమారి నుదుటి మీద సింధూరం లా చక్కని పేరు  హోటల్  సింధూరి

 

చిన్నగా తలుపు తెరచి చూస్తే

 

ఏమి జరుగుతుందిక్కడ …………అసలేం  జరుగుతుంది

 

తరువాత  చెప్పుకుందాం ………కాసేపు  

 

విశ్రాంతి


--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA