శుక్లపక్షపు చవితి నాటి చంద్రరేఖ
పున్నమి నాటి పండువెన్నెల
ఇవి కావా నీ ఆనవాళ్ళు
మార్గశిరోదయాన గులాబి బుగ్గపై నిలచిన మంచుముత్యం
మంచు పరదాలను చీల్చుకుని నులి వెచ్చగా తాకే పసిడికిరణం
ఇవి కావా నీ ఆనవాళ్ళు
చైత్ర కాలపు చమట గంధాన్ని చిదిమే మల్లెల పరిమళం
వుడికించే వేడిమిలో ఊరించే మామిడి మాధుర్యం
ఇవి కావా నీ ఆనవాళ్ళు
వసంతోదయాన కోకిల కుహుకుహులు
లేలేత చిగుళ్ళతో పరవసింపచేయు ప్రకృతి పచ్చదనం
ఇవి కావా నీ ఆనవాళ్ళు
ఝురి విప్పిన మబ్బు తునకకు ప్రతిగా పురి విప్పిన మయూరపు సోయగం
కొండవాలున జాలువారుతున్న జలకన్య జాణతనం
ఇవి కావా నీ ఆనవాళ్ళు
--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA
No comments:
Post a Comment