Saturday, September 12, 2020

కార్తీక పున్నమి ... తూరుపు కాంత నుదిటిన అద్దిన కుంకుమ బొట్టులా   ఆకాశ కాంత కు కాచిన ఎర్రని పండులా అగుపించి క్రమేపి పక్వ దశను దాటి పండిన పండులా పసిమి ఛాయలు సంతరించుకుని మేఘ మండలము అలంకరించుకున్న పసిడి పాపిట బిళ్ల లా తన వెండి వెలుగులతో భూకాంత ను చందురుడు ప్రకాశింప చేయు వేళ చిరుగాలి తాకిడికి కదులాడుతున్న నల్లని పొడుగాటి కురుల ప్రవాహంలా మృదు మదుర సవ్వడులతో సాగిపోతున్న యమునా తీరాన చందనపు పొడిరేణువులా అని మరిపించే విధంగా పరుచుకున్న ఇసుక తిన్నెలు   సమీపాన సువాసనలు వెదజల్లెడి పూలతలతో మనోహరమగు లావణ్యముతో ఒప్పారురంగు రంగుల పూల  మొక్కలతో మధుర రసాలు స్రవించు ఫలాలతో నిండిన వృక్షాలతో కూడిన బృందావని గండు తుమ్మెదల ఝుంకారాలతో , పూబాల ల పరిమళాలను , పండిన ఫలాల యొక్క తీయదనాన్ని తనలో నింపుకుని ఆహ్లాదకరం గా మెల్లగా వీస్తున్న పిల్ల తెమ్మెరలు  అట్టి ఆ బృందావని లో ఓ మందార చెట్టు కింద ఎడమ పాదపు ఎడమ భాగాన  కుడి పాదపు ముని వేళ్ళను నేలకు తాకించి కుడి పాదపు వెనుక భాగాన్ని పైకి ఎత్తి నుంచున్న భంగిమలో ఓ స్ఫురద్రూపిదట్టమైన వానమబ్బు రంగు దేహ కాంతి తో , తలపై నెమలి ఫించం ధరించి , నుదిటిపై  కస్తూరి తిలకం అద్ది , నాసిక పై భాగాన తెల్లని ముత్యమొకటి మెరయుచుండగా పారిజాత సుమ మాలను మెడలో ధరించి ఆకు పచ్చని రత్నాల ఉత్తరీయాన్ని భుజాలపై వేసుకుని కస్తూరి చందనపు పూతతో నిండిన దేహంతో ఒంపుగా నిలబడి పున్నమి పసిడి కాంతులు ఆ దేహాన్ని తాకి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తుండగా  ఎర్రని దొండ పండు వంటి పెదవులపై రెండు అరచేతులతో ఒడుపుగా పట్టిన వేణువు నుంచి సుతారంగా ప్రాణులన్నిటికి ప్రాణాధారమైన వాయువును తన పెదవుల గుండా ఆ వేణువులోకి మృదువుగా పంపుతుంటే  వేణువు నుండి బయటకు వస్తున్న  ఆ వాయు తరంగాలు మధురమైన ధ్వనులుగా మారి ఆ ప్రాంతమంతా  ఆవరిస్తున్నాయి  అతి మధురమైన ఆ ధ్వనులకు ప్రకృతి పరవశించిపోతుండగా ఆ వేణు నాద తరంగాలు  మెల్లగా గోపకులాన్ని తాకాయి ఆ గోపకులంలో   నవ యవ్వనంతో తొణికిసలాడే గోపకాంతల సమూహాలు ......అందులో  కొందరు గోపికలు తమ చీర సొబగుల సౌందర్యాన్ని ఇతర గోపికలతో పంచుకు మురిసిపోతుంటేమరి కొందరు తమ ఆభరణాల తళుకు బెళుకులు ప్రదర్శిస్తూ, మరి కొందరు తమ చేతి కంకణముల సవ్వడులతోను ఇంకొందరు కాలి  అందియల సవ్వడులతోను మరి కొంత మంది గోపికలు కోలాటపు సవ్వడులతోను సందడి చేస్తుండగా మరి కొందరు ముగ్ధలు తమ గాన కౌశలంతో ఆ ప్రాంతాన్ని పునీతం చేస్తున్నారు .ఇంకొందరు  ఇంటి  పనులలో  నిమగ్నులై ఉన్నారు . అట్టి ఆ గోపకాంతల  సమూహపు చెవులను ఆ వేణు నాద తరంగాలు చేరగనే ఒక్కసారిగా వారిలో వూహించని మార్పు . తమ చుట్టూ వున్న ప్రపంచాన్ని మరచి తామున్న స్థితిని మరచి ఒక్క ఉదుటున పరుగు పరుగున ఆ వేణువు  తరంగాలు జనిస్తున్న ఆ వృందావనిలోకి చేరుకున్నారు    అక్కడ ఆ మందారపు చెట్టుకింద తమ కలల రేడు ,  భావించిన మాత్రం చేతనే హృదయాలలో గొప్పదైన ఆనందాన్ని పొంగించేవాడు సాక్షాత్ పర బ్రహ్మమే తానైనట్టివాఁడు  అగు ఆ యశోదా నందనుడు  గోకుల కిశోరం  శ్రీకృష్ణుని మనోజ్ఞమైన దివ్య మంగళ రూపాన్ని చూచి పులకితులై తమను తాము పరిపూర్ణంగా ఆనంద స్వరూపుడగు ఆ పరంధామునకు సమర్పించుకోటానికి సంసిద్దులయ్యారు ఆ అమాయకపు పల్లె పడుచులు నిష్కళంకమైన నిర్మల జ్ఞానానికి ప్రతిరూపాలైన ఆ గోపకాంతలతో రాసలీలకు ఉద్యుక్తుడయ్యాడు అందరి హృదయాలలో ఆత్మగా ప్రకాశించు ఆ పరమాత్మ  రాస లీల  ఇది రెండు మహోన్నత భావాల (మాతృత్వము +పోషకత్వము=వాత్సల్యము  ) కలయిక .  రెండు దేహాల కలయిక కాదు తొమ్మిది రంధ్రాలతో కూడి తొమ్మిది రకాల  మలపదార్ధాలతో నిండిన దేహాల కలయిక ఎలాంటి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు చైతన్యం మాతృత్వం పోషకత్వం లాలిత్యం సౌందర్యం ఈ  భావాల పరస్పర కలయికే రాసలీల అట్టి రాసలీల మానసిక దర్శనం దుఃఖ స్పర్శలేని సుఖానుభూతినిస్తుంది అది నిజమైన రసానుభూతి కలిగిస్తుంది . రాసం  అంటేనే గొప్పదైన ఆనందపు అనుభూతి అని అర్ధం . ఆ ఆనందానికి అవధులు  వుండవు . అట్టి దివ్యమైన ఆనంద స్వరూపుడే శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణునితో సమాగమం కోరటమంటేనే  ఎల్లలు లేని దుఃఖ స్పర్శ లేని పరిపూర్ణ  ఆనందానుభూతి  తో  మమేకమవటమే . అదే మానవ  జీవిత పరమార్ధం అందుకోసమే అత్యంత దుర్లభమైన మానవ జన్మ మనకు లభిస్తుంది మనుషులు తాము తమ కోరికలు నెరవేర్చుకోవటంద్వారా ఆనందం పొందుతున్నామని భ్రమలో వుంటారు . నిజానికి వారు పొందే ఆనందాలు  తాత్కాలికమే కాక వాటి ఫలితం దుఃఖ స్పర్శతో కూడి వుంటుంధి  ఆ గోపికలు ఇహ పరాలను కాదనుకుని కేవలం పరమాత్మ తో సౌఖ్యాన్ని మాత్రమే కోరుకున్నారు  వారికి ఇతరములైన ఏ లోక  విషయాలయందు వారికి ఆసక్తి లేదు. వారి అనురక్తి యందు పరమాత్మ యందు మాత్రమే భయము చేత కంసుడు ,  భక్తి చేత ప్రహ్లాదుడు , స్నేహం చేత అర్జునుడు, సుదాముడు , ఉద్ధవుడు  శత్రుత్వం చేత రావణ కుంభకర్ణ శిశుపాలుడు , కామం చేత గోపికలు  ఆ పరమాత్మ ను పరిపూర్ణం గా తమలో నిలుపుకున్నారు . ఆ  పరంధాముడి ధామాన్ని చేరుకున్నారు మనం కూడా భగవానుడి పట్ల స్వచ్ఛమైన భక్తి భావమో స్నేహ భావమో పెంచుకుని శ్రీకృష్ణుని కరుణా కటాక్షాలకు పాత్రులమవుదాం 

No comments: