Thursday, January 6, 2022

రాధమ్మ

రాధ రెండక్షరాల చిన్ని పదం .  మనసుతో ఆ పదాన్ని నిరంతరం ముడిపెడితే  బ్రమానందపు ఊబి లో చిక్కుకుని కొట్టుమిట్టాడు మనసును పట్టి లాగి బ్రహ్మానందపు అమృత సరస్సులో ఓలలాడించు దివ్యౌషధం.  ఒక్కటే అయిన పరతత్వం తనను తాను అయిదు పరిపూర్ణ రూపాలుగా విభజించుకుంది. ఆ పరతత్వపు మొదటి పరిపూర్ణ రూపమే ఇఛ్ఛ జ్ఞాన క్రియా శక్తి స్వరూపిణి    గణపతి మాత దుర్గ . ఈ తల్లి శివ తత్వాన్ని ఆశ్రయించింది  రెండు  ఐశ్వర్య ప్రధాత అయిన మహాలక్ష్మి . ఈ తల్లీ నారాయణుని ని శక్తి గా మారింది మూడు  జ్ఞాన ప్రదాయిని అయిన సరస్వతి . ఈ తల్లి  బ్రహ్మ శక్తిగా గా  భాసిల్లుతోంది  నాలుగు వేదమాత సావిత్రి . ఈ తల్లి సూర్య మండల మధ్యస్థ గా విరాజిల్లుతుంది ఇక ఐదవ స్వరూపం హ్లాదినీ శక్తీ . పరిపూర్ణ ఆనంద స్వరూపిణి అమ్మ రాధ . శ్రీక్రిష్ణ ప్రేయసి  ప్రతి మనిషి ఆరాటపడేది. ఏ మనిషీ పొందలేనిది అదే ఆనందం. ఈ ఆనందం కోసమే మనిషి పోరాటం. మనుష్యులు పొందే ఆనందాలు తాత్కాలికం . దానిని వెన్నంటే దుఃఖం   ఉంటుంది . ఎలాంటి దుఃఖ స్పర్శ లేని నిజమైన ఆనందం పొందాలంటే ఈ హ్లాదిని శక్తి నే ఆశ్రయించాలి . ఈ హ్లాదిని శక్తి నిత్యం క్రిష్ణుడిని  ఆశ్రయించి ఉంటుంది. పరిపూర్ణమైన ఆనంద స్వరూపమే రాధాకృష్ణులు   రాధ కృష్ణుడి కన్నా పెద్దదని, అతనికి మేనత్త అవుతుందని ఏవో అసంబద్ధమైన వాదనలు చేస్తుంటారు కొందరు .  ఒకటే పరతత్వం.  తనను తాను రెండుగా విభజించుకుంది . ప్రకృతి పురుషుడు   శివపరం గా చెప్పేటప్పుడు  వీరినే కామేశీ కామేశ్వరులంటారు . వారుండే లోకాన్ని చింతా మణి ద్వీపం అంటారు  విష్ణుపరంగా చెప్పినపుడు రాధాకృష్ణుఁలంటారు వారుండే లోకం గోలోక బృందావనం అట్టి పరతత్వమైన  శ్రీకృష్ణుని ఎడమ భాగం నుండి రాధా దేవి ఆవిర్భవించింది . కుడి భాగం నుండి చతుర్భుజుడైన నారాయణుడు  ఉద్భవించారు.  రాధా దేవి యెక్క ఎడమ భాగం నుండి లక్ష్మీ దేవి  ఉద్భవించారు. నారాయణుడు లక్ష్మీ దేవిని స్వీకరించి వైకుంఠ లోకానికి చేరుకున్నారు. రాధాకృష్ణులు  గోలోకవాసులయ్యారు .  ఒకానొక సందర్భంలో రాధా దేవి శ్రీకృష్ణుని నిందిస్తుంటే ఆయన ఆంతరంగిక చెలికాడు అయినా సుదాముడు అనే గోపాలుడు క్రిష్ణ నింద సహించలేక రాధమ్మ న ు క్రిష్ణ వియోగానికి గురికమ్మని శపిస్తే ఆ కారణాన ఆ తల్లి వృషభానుని ఇంట పసిపాప గా ఆవిర్భవించింది.  ఆ రాధమ్మ కోసమే మధుర లో జన్మించిన క్రిష్ణుడు గోకులానికి చేరుకున్నాడు. అక్కడ రాధమ్మ కృష్ణుని రాకకు ఎదురు చూస్తూవుంది.  తల్లి తండ్రులు రాధమ్మకు వివాహ నిశ్చయం చేయగానే రాధాదేవి ఆఇంటిలో రూప లావణ్యాలలో తననే పోలివుండే తన అష్టసఖుల లో  ఒకరిని అక్కడ ఉంచి తాను బృదావనం చేరుకుంది.   అదే సమయంలో కంస దూతగా వచ్చిన అక్రూరుడు కృష్ణుని మధురకు తీసుకెళ్ళటానికి గోకులం చేరుకుంటాడు . ఇదే సరిఅయిన సమయంగా ఎంచి శ్రీకృష్ణుడు కూడా బృందావనమ్ చేరుకోగా చతుర్భుజుడైన నారాయణుడు క్రిష్ణ రూపధారియై మధురకు వెళతారు  ఇక్కడ రాధ గా భావించబడుతున్న రాధాసఖి కి రాయణుడు అనే గోపబాలుడితో వివాహం జరుగుతుంది . ఈ రాయణుడు కృష్ణుని అంశతో జన్మించినట్టివాఁడు . యశోదమ్మ కు సోదరుడు అవుతాడు . ఇది తెలియక రాధ కృష్ణునికి మేనత్త అవుతుందని , కృష్ణుని కన్నా పెద్దదని ఏవో ప్రచారాలు చేస్తుంటారు.  శ్రీమన్నారాయణుడు క్రిష్ణ రూపంలో మధురకు చేరుకొని అక్కడనుండి ఆయన మిగిలిన కథ నడిపితే లక్ష్మీ దేవి రుక్మిణిగా ఆయనను చేరుకుంది .  ఇక ఇక్కడ బృందావనం చేరుకున్న రాధా కృష్ణులు మొదట కలుసుకున్నది కార్తీక పున్నమి పర్వదినాన . అందుకే అది రాస పున్నమిగా ప్రఖ్యాతి చెందినది.  అప్పటినుండి రాధాకృష్ణులు ఆ బృందావన ధామాన్ని విడిచి వెళ్ళలేదు . రాధాకృష్ణుల నిత్య దివ్యరాస లీలా విలాసాలకు వేదిక గా నిలిచింది.  ఆ తల్లి రాధమ్మ పాదాలను ఆశ్రయిస్తే మనకు శ్రీకృష్ణ భక్తిని ప్రసాదిస్తుంది . ఆ తల్లి తండ్రుల దివ్యమైన పాద స్పర్శతో పునీతమైన దివ్యధామం బృందావనం .  అక్కడి గాలి శ్రీకృష్ణుని దివ్యమైన వేణుగాన తరంగాలతో , అక్కడి పూలతలు రాధాకృష్ణుల మేని సౌగంధపు పరిమళాలను అద్దుకొని పులకితమవుతూవుంటాయి  అట్టి ఆ బృందావనాన్ని దర్శిద్దాం . రాధాకృష్ణుల ప్రేమకు పాత్రులమవుదాం . ఆనందమయ జీవన సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం                                 రాధేక్రిష్ణా  రాధేక్రిష్ణా   క్రిష్ణా క్రిష్ణా  రాధే రాధే

No comments: