Saturday, November 23, 2024

కలల బంధీ

సంసార కూపపు చీకటికొట్టంలొ నావారలను బంధపు వలువ 
దాల్చి భాధ్యత ల సంకెళ్ళలో బంధీనైతీ మకరి నోట చిక్కిన 
కరి కి ముక్తి నిచ్చినట్లు సంసారపు మకరి నొటపడి సతమతమౌ
నను నీ బాహుబంధనాలలో బంధీనై ఆనందపారవశ్యమున 
ఓలలాడు గోపిక ను చేయవయా ముకుందా


 నీ కలువ కనుల కొలను లో కమలంలా విరియాలని 
 తామరల మకరందం గోలు మధుపం లా నీ అధరసుధలు
 గ్రోలు గోపితుమ్మెద కావాలని మల్లియల పరిమళాలు 
నింపుకుని పరవశించు పిల్లగాలి తెమ్మెరలా పారిజాత 
పరిమళాలతొ ఓప్పారు నీ దేహ సౌరభాన్ని నాతనువెల్లా
 నిలుపుకునే నీ గోపికను కావాలని 

 నీ పెదవుల తీయదనాన్ని నింపుకుని ప్రకృతినెల్ల
 పరవశింప చేయు వేణునాద తరంగాల్లా నా ఆలోచనలన్నీ
 నీ ఊహల తేనె తుంపరలతో నిండి నా తనువెల్లా వెల్లువలా
 నీ ప్రేమ మధువులతో నిండాలని కలల బంధీనై క్రిష్ణా!

 పగలనక రేయనకా నీ పిలుపుకై వేచివుంటి 
 సంసారపు సంకెళ్ళు తెంచి నీ భక్తిపాశాలతో
 నను బంధించు అమృతాబ్ధి పుత్రి ప్రియవల్లభా

Thursday, November 21, 2024

గోపికా గీతం

పల్లెపడుచులైన గోపికలను జ్ఞానుల సరసన చేర్చిన స్తోత్రం ఇది ఎంతో లోతైన తాత్విక భావనలతో నిండిన విరహ గీతం గోపికలు కృష్ణుడితో రాసలీల లాడుతున్నవేళ ఆ గోపికల్లో చిన్నపాటి అహకారం కలిగింది . కృష్ణుడికి నేనే అత్యంత ప్రియమైన దానను , క్రిష్ణుడు కేవలం నాతోనే వున్నాడు అన్న భావనకు లోనయ్యారు అది గ్రహించిన కృష్ణుడు వారి అహకారం తొలగించాలని నిర్ణయించుకుని ఒక్కసారిగా అందరి వద్ద నుండి అదృశ్యమైపోయాడు క్రిష్ణుడు మాయమవగానే కృష్ణ వియోగంతో దుఃఖితులైన గోపికలు ఆ బృందావనిలో ప్రతి చెట్టును పుట్టను పువ్వును తీగను కనబడిన వాటినన్నంటిని కృష్ణుడి గురించి వాకబు చేస్తూ చేసిన విరహ గీతమే గోపికాగీతం.  ఈ స్థితిలో గోపికల వేదన గురించి పోతన చెప్పిన అందమైన పద్యం ఒకటి విందాం నల్లని వాడు  పద్మ నయనంబులవాడు కృపా రసంబు పై జల్లెడువాఁడు మౌళి పరి సర్పిత పింఛము వాడు నవ్వు రా జిల్లెడు మోము వాడొకడు చెల్వల మాన ధనంబు దోచెనో మల్లియలారా మీ పొదల మాటున లేదు గదమ్మ చెప్పరే ఇంతకూ ఈ గోపికలెవ్వరు . ఎందుకింత ప్రాముఖ్యత వారికి అంటే వారి జన్మ రహస్యం తెలుసుకుందాం శ్రీరాముడు వనవాసానికి బయలుదేరి అడవులలో మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ సాగుతూ శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళతారు . శరభంగుడు ఆయన కుమారుడు గొప్ప రామభక్తులు . శరభంగుడు అంటే అయన పేరులోనే వుంది . శరములను భంగం చేసినవాడు . ఏమి శరములు అవి అంటే మన్మధుని బాణములు అంటే కామ వికారాలను జయించినవాడు అంత గొప్ప మహర్షి అయన అటువంటి ఆ మహర్షికి అక్కడ వున్న గొప్ప గొప్ప ఋషి పరివారానికి శ్రీరాముడిని చూడగానే ఒక్కసారిగా మనసు చలించింది . శ్రీరాముడి అందం అంటే సాధారణమా మరి సాక్షాత్ లలితా త్రిపురసుందరి అవతారం ఆ సౌందర్యం అసామాన్యం అద్వితీయం అందుకే పుంసాం మోహనరూపాయ అంటారు ఆయన సౌందర్యం చూసి ధీరోదాత్తులైన పురుషులుకూడా మోహితులయ్యారు . ఆ మహర్షుల మనసులో ఒక్క క్షణం జనించిన  భగవంతుని పట్ల కలిగిన ఆ మోహమే వారు గోపికలు గా జన్మించటానికి కారణమయ్యింది . అందుకే గోపికలు మనసంతా క్రిష్ణుని రూపంతో నిండిపోయింది అందుకే గోపికల భక్తి అత్యంత మధుర ప్రేమ భక్తి గా ప్రసిద్ధి చెందింది 1. జయము నీకు ముకుందా ! నీ యొక్క పుట్టుక చేత వ్రజభూమి మిక్కిలి పవిత్రమైనది మరియు శోభాయ మానమైనది . తల్లి అగు లక్ష్మీదేవి సైతం ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్నది . ఓ దయాస్వరూపమా ఈ గోపికలందరూ నీ వారు నీవే ప్రాణం గా బ్రతుకుతున్నవారు . ప్రతి చోట నీకొరకే వారు వెదుకుచుంటిరి . కనుక నీ దయా వర్షం కురిపించు నీ దర్శన భాగ్యం కలిగించు 2 ఓ సురత్  నాధ్ ! (ఓ ప్రియమైన పతి ) వరములు ప్రసాదించువాడా మేము నీ వెల లేని దాసీలం సాటిలేని  నీ ప్రకాశమానమైన నీ కంటి చూపులతో మమ్ములను చంపివేస్తున్నావు . ఆ కనుల సౌందర్యం చూసి వసంతకాలంలో నిర్మలమైన సరస్సులలో ప్రపంచమంతటి చేత ప్రస్తుతింపబడే సుకుమారులైన కమలములు సైతం తమ అందం పట్ల భ్రమలు తొ లగి గర్వభంగం చెందుతున్నాయి . ఈ లోకంలో ప్రేమపూర్వక చూపులతో చంపితే హత్యగా భావించరా ? 3  ఓ పురుషరత్నమా ! నీవు అనేకమార్లు గోపీ జన పరివారాన్ని మృత్యువు నుండి రక్షించావు . కాళింది చేత విషమయమయిన యమునాజలాలను శుద్ధం చేసావు. కొండచిలువ రూపంలో వచ్చిన అఘాసురుడి నుండీ ఇంద్రుడు కురిపించిన కుంభ వృష్టి నుండి పిడుగులా నుండి , పెనుగాలి  రూపంలో వచ్చిన తృణావర్తుడు నుండి , ఎద్దు రూపంలో వచ్చిన  అరిష్టాసురుడిని  మాయ పుత్రుడైన వ్యోమాసురుడిని సంహరించి మము రక్షించితివి 4 నీవు కేవలం యశోదా నందనుడివి మాత్రమే కాదు . సర్వ జీవులలో ప్రకాశించు అంతరాత్మవు . ఓ శాశ్వతమైన సత్య స్వరూపుడా  సృష్టికర్త అగు బ్రహ్మ ప్రార్ధన మేర విశ్వ రక్షణకై యదు వంశంలో ఆవిర్భవించితివి 5 ఓ వృష్ణి వంశ ప్రదీపకా ! ఓ ప్రియమైన ఆప్తుడా !   ఎవరు పద్మములవంటి నీ పాదములను ఆశ్రయించెదరో వారి యొక్క సంసార దుఃఖములను తొలగించి భయ రహితులను చేసెదవు . ఓ ప్రియుడా ! సర్వ శుభములు కలిగించువాడా ! అత్యంత అనురాగంతో తల్లి అగు మహాలక్షి చేత సదా పట్టుకొనబడి యుండు పద్మముల వంటి నీ అరచేతులను మా శిరస్సులపై వుంచుము 6 వ్రజనివాసుల యొక్క ఆర్తి ని తొలగించువాడా ! గొప్ప శౌర్యవంతుడా నీ చిరునవ్వు చాలు నీ ప్రియమైన వారి గర్వాన్ని తొలగించుటకు . ప్రియమైన స్నేహితుడా మము మీయొక్క సేవకులు గా అంగీకరించండి మేము మీపాదాలను పూర్ణంగా ఆశ్రయించివుంటిమి . చూడచక్కని  పద్మం వంటి నీ ముఖ కమలపు దర్శన భాగ్యం కలిగించు 7  మేత మేయుటకు బయలుదేరిన గోమాతలను అనుసరించినట్టివి మహాలక్ష్మి చేత ఆపేక్షగా ఆశ్రయించబడినట్టివి ఫణిరాజగు కాళిందిని తలలపై అందంగా నర్తించినట్టివి అగు నీ పద్మం వంటి పాదాన్ని ఆశ్రయించి నమస్కరించిన వారి పాపాలు తొలిగిపోవును . ఓ ప్రభూ అట్టి నీ పాదపద్మమును మా హృదయం పై పెట్టినచో మమ్ములను దహించు కోరికలు సమసిపోవును మా గుండెల్లో నిండుగా వున్న దుఃఖములు తొలిగిపోవును 8 ఓ కమలపు కనులవాడా ! అత్యంత తీయని మధురమైన విన్నంతనే మంత్రముగ్ధులను చేయు నీ మాటలు వినరాక దిగ్బ్రాంతి చెందితిమి . జ్ఞానులు సైతం ఒక్కసారి నీ మాటలను విన్నంతనే వాటికోసం దేనినైనా త్యజించెదరు ఓ నాయకుడా! అమృత ప్రవాహాం వంటి మధుర ధ్వనులు పలికించు నీ  గొంతు విని నీకు విశ్వాసపాత్రులమైన  గోపికలం నీ ప్రేమలో పడితిమి . దివ్యమైన నీ అధర సుధలు అందించి మాకు జీవన భాగ్యం ప్రసాదించు 9 ఓ దేవా విరహ వేదనతో భాదపడు జీవులకు దివ్యమైన లీలలతో కూడిన నీ కథలు జీవితాన్ని ఆశను కలిగించు అమృత స్వరూపం వంటివి జ్ఞానులు నీ పట్ల భక్తి కల కవులు నీ లీలలను గానం చేయుచున్నారు వాటిని విన్నంతనే అన్ని దుఃఖములు తొలగిపోయి పాపములు నశించి అనేక మంగళములు కలిగించును . నీ లీలలను చదివిన వారు  దయా హృదయులై విశ్వమునకు మేలు శుభము కలిగించుదురు 10 ఓ దేవా కనువిందు చేయు నీ చిరునవ్వు  ఆకర్షించు నీ రూపం అందమైన నీ నడక  దయ తో కూడి పవిత్రమైన ప్రేమ భావనలు ప్రసరించు నీ చూపులు వీటిని ధ్యానం చేయువారు నీ ప్రేమకు పాత్రులగుదురు. నీవు ఏకాంతంగా రహస్య ప్రదేశాలలో మాతో పలికిన మధుర సంభాషణలు  మా హృదయాల తో నీవు ఆడిన ఆటలు పదే పదే నిన్ను గుర్తు చేస్తూ నిను మరువనీయకున్నవి . ఓ మాయావీ  ఈ జ్ఞాపకాలు నిను చూడాలన్న కోరికను బలీయం చేయుచున్నవి. కానీ నీవు కానరాక మా హృదయాలు బరువెక్కుచున్నవి  11 ఓ ప్రియమైన ప్రభూ ! ఉదయ సంధ్యలో  గోవులను అడవి లో మేతకు తోలుకెళ్ళునపుడు ఆ దారులలోని రాళ్లు పదునైన పచ్చిక చిగురులు గడ్డి వీటి వలన అత్యంత సుకుమారములు ఎర్రని తామరల బోలు నీ పాదపద్మములు పొందు నొప్పి ని తలచుకున్నప్పుడల్లా మా మనసులు బాధతో తల్లడిల్లుచున్నవి  12 ఓ ప్రియమైన నాయకుడా ! సాయం సంధ్యలో గోవులను ఇంటికి తోలుకొస్తూన్నపుడు లేగల పదఘట్టనలకు ఎగసిపడే ఎర్రని ధూళిచేత కప్పబడి మరింత ఎరుపెక్కిన పద్మంలాంటి నీ మోము నీల నీలి వర్ణపు కాంతులతో ఉంగరాలు తిరిగిన   లయబద్దంగా కదులాడుచున్న ముంగురులుతో అలరారు నీ నుదురు ఇట్టి అతి సుకుమారమైన నీ వదనం పదే పదే మాకు చూపుచు  నడయాడుచున్నపుడు మా హృదయాలలో తీవ్రమైన ప్రేమ భావనలు రేకెత్తిస్తున్నది  13 ఓ అత్యంత ప్రియాతి ప్రియమైనవాడా ! మా మనస్సుల్లోని వేదన తొలిగించువాడా ! నీ పద్మం వంటి పాదం తనను శరణుజొచ్చిన వారి కోరికలు తీర్చుచున్నది ఈ ధరణి కి గొప్ప ఆభరణమై ప్రకాశిస్తున్నది  బ్రహ్మ యొక్క పూజలు అందుకొనుచున్నది ధ్యానించు వారి ఉపద్రవములు తొలిగించుచున్నది అట్టి ఆ పద్మము వంటి పాదమును మా హృదయాలపై పెట్టుము  14 ఓ ప్రియమైనవాడా ! నీ అధరామృతం మాలో నీతో దివ్యమైన ఐక్యతాభావాన్ని పెంపొందించి నీయొక్క ఎడబాటు వలన కలిగే అన్ని దుఃఖాలను తొలగించును అమృతం నిండిన నీ పెదవులను తాకిన వేణువు  నాదాలను అమృతస్వరాలుగా  మార్చుచున్నది. ఎవరైనా ఒక్కసారి అయినా ఆ అమృతాన్ని చవిచూస్తే ఇతరములైన అన్ని బంధాలు కోరికలను మరచిపోదురు . ఓ ప్రియసఖుడా ఒక్కసారి నీ అధరామృతం మాకు అందించు  15 ఓ ప్రియా సఖుడా పగటి సమయాన నీవు అడవికి వెళ్ళినపుడు  నిను కానని ప్రతి నిమిషం ఒక యుగంలా గడుస్తున్నది . సాయంసమయాన నీవు తిరిగి వచ్చువేళ ఉంగరాలు తిరిగిన నీలి ముంగురులతో ముద్దుగారు నీ మోము చూచువేళ తరచుగా పడు కనురెప్ప పాటు మమ్ములను కలవరపాటుకు గురి చేస్తున్నది . ఈ   కనురెప్పల సృష్టికర్త ఎంత కఠినమైన మనసు కలవాడో కదా  16 ఓ అచ్యుతా ! మా భర్తల పుత్రుల బంధువుల శాసనాలను బంధాలను తెంచుకుని నీ చెంతకు వచ్చితిమి . మా హృదయాంతరాల్లోని ఆలోచనలు నీకు పూర్తిగా తెలుసు . నీ దివ్యమైన వేణుగానానికి పరవశులమై ఇక్కడకు వచ్చితిమి ఓ మాయావి ! ఇంత చీకటివేళ ఈ అబలల సమూహాన్ని ఒంటరిగా వదిలి నీవు తప్ప వేరెవరు వెళ్ళగలరు  17 ఓ ప్రియసఖుడా ! నీవు మాతో రహస్యంగా ముచ్చట్లాడు సమయాన ప్రేమతో మమ్ములను చూసే ఆ చూపులు , మా హృదయాలను రంజింపచేయు అందమైన నీ చిరునవ్వు , సిరులతల్లి శాశ్వత నివాసమైన విశాలమైన నీ వక్షస్థలం మాకు పదే పదే గుర్తుకు వచ్చి నిను చూడాలనే మా కోరికను ద్విగుణీకృతం చేసి నిను కానలేక మా హృదయాలు బరువెక్కుచున్నవి  18 ఓ ప్రియసఖుడా నీ దర్శనం వ్రజనివాసుల యొక్క అన్ని దుఃఖాలను తొలగిస్తుంది  సమస్త విశ్వానికి ఎనలేని శుభాలను చేకూరుస్తోంది . నిన్ను మాత్రమే కోరుకునే మా హృదయాలు నిను కానక భాదతో విలవిలలాడుతున్నాయి కనుక దయతో మంగళకరమైన నీ దివ్య స్వరూప సందర్శనమనే ఔషధాన్ని కొద్దిగా మాకు ప్రసాదించు నీ ప్రియతముల దుఃఖాన్ని తొలగించు  19 ఓ దేవా కమలపు రెక్కల కన్నా ఎంతో కోమలము  సుకుమారము అయిన నీ పాదాన్ని అంతే సున్నితంగా ఎంతో జాగురూకతతో మా హృదయాలపై పెట్టుకొనుచున్నాము . అట్టి సుకుమారమైన పాదాలతో ఎట్టి రక్షణ లేకుండా ముళ్ళు రాళ్లు రప్పలతో నిండిన అడవి దారులలో నీవు తిరుగాడుచుంటే అది తలచుకుని ఎంతో వ్యాకులతకు లోనై తెలివితప్పుచున్నాము . ఓ ప్రియసఖుడా ! మా జీవితాలు నీకొరకు మాత్రమే  మేము నీ కొరకు మాత్రమే జీవిస్తున్నాము మేము కేవలం నీ వారము  శుక మహర్షి చెప్పుచున్నాడు . ఓ పరీక్షిత్ మహారాజా ! ఈ విధంగా కృష్ణుడితో వియోగం చెందిన గోపికలు తీవ్రమైన దుఃఖంతో వణుకుతున్న స్వరంతో కృష్ణుడిని చూడాలన్న బలీయమైన కోరికతో ఎన్నో విధాలైన పలుకులు పలుకుతూ తిరుగాడుచున్నారు  ఈ విధంగా దుఃఖితులై తిరుగాడుచు గోపికలు పలికిన పలు వాక్యములు విని ,శౌర్యవంశ శిరోమణి , మన్మథునికే ఆశ్చర్యకలిగించేంత అందమైన రూపంతో ఆకర్షించు చిరునవ్వు కూడిన మోముతో, పట్టు పీతాంబరములు, మెడలో వనమాలను ధరించి అందరి హృదయాలను మథించు మోహనకారుడగు శ్రీక్రిష్ణుడు గోపికల ఎదుట ప్రత్యక్షమాయెను  స్వచ్ఛమైన భక్తుల హృదయమే నేను నా స్వచ్ఛమైన భక్తులే నా హృదయం : శ్రీక్రిష్ణ వచనం 

Tuesday, November 12, 2024

పచ్చదనమే పచ్చదనమే

వెన్నెల గూళ్ళ వంటి కనులు గులాబీ రెక్కల పెదవుల జాలువారు ముద్దు ముద్దు మాటల కలికి కులుకుల చిలక మోము గరుడ పచ్చపూసల సరాల తో తీర్చన శంఖం లాంటి కంఠం మట్టిగంధపు వాసనలతో మైమరపించు పచ్చని పైరు సమూహాల్లా బాహుమూలాలు పాల సెలయేరు ల పుట్టిల్లులై వృక్షసమూహపు తోరణాలతో అలంకృతమై ఓప్పారు పచ్చపసిడి చనుదోయిద్వయం ఆకాశరాజు చిరు జల్లుల ప్రేమ పూర్వక పలకరింపుకు ప్రతిగా పులకరించి పరవశించిన ప్రకృతి కాంత తొడిగిన లేత చిగురుటాకు పచ్చ చీరలా శోభిల్లు జఘనం కదలివచ్చు శాకంబరీ నీకు దాసోహం

Thursday, November 7, 2024

హసిత చంద్రిక

ఉదయ సంధ్యారాగపు లేత ఎరుపుకాంతుల /అధరాకాశపు మబ్బుతునకల నడుమ భానుడి/ వెలుగురేఖల్లా కోటి తారకల తళుకు బెళుకుల్లా /కోటి చంద్రుల వెన్నెల చల్లదనంలా/ చేరవచ్చే నను నీ దరహాసచంద్రికలు హసిత చంద్రికా // అలివేణి అరవిచ్చిన మందారపు అధరాల/ నడుమ మురిసే ముత్యపు సరాగాలు /మల్లెల పరిమళాలతో అద్దిన చిరుగాలి తునకలవలే /వలె నను పరవశింప చేసే నీ దరహాసచంద్రికలు హసిత చంద్రికా// కలనైనా వీడిపోవు ఆ నవ్వుల దివ్వెలు / కలకాలం నిలచిపోవు గుండె గూటిలో / జన్మాలు మారినా వాడని నిత్యమల్లెలే / నీ దరహాసచంద్రికలు హసిత చంద్రికా//

Sunday, November 3, 2024

దామోదర లీల   

                       కార్తీకం లో ఉదయపు సంధ్యలో నారాయణుడిని క్రిష్ణా గోవిందా దామోదరా అని నోరారా కీర్తించాలి పదే పదే స్మరించాలి సాయంసంధ్యలో ఓం నమస్తే అస్తు  భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమాన్ మహాదేవాయ నమః అంటూ గంగా జలాలతో అభిషేకం చేసిన భావన చేయాలి . భవానీ భావనాగమ్యా అంటారు కదా భావన చాలు చేసిన ఫలం పొందేయవచ్చు . హడావిడులు  అవసరం లేదు కార్తీకాన్ని కార్తీక దామోదర మాసం గా వ్యవహరిస్తారు అందుకు గల కారణం తెలుసుకుని క్రిష్ణుని ఈ లీలను ధ్యానిస్తూ నిత్యం  దామోదరా అని స్మరిస్తూ వుంటే మన బంధనాలు తొలగిపోతాయి  బృందావనంలో ఒకసారి కృష్ణుడిని ఒడిలో పెట్టుకుని యశోదమ్మ పాలిస్తున్నది అదే సమయంలో పక్కనే పొయ్యి మీద వున్న కుండలోని పాలు పొంగిపోతున్నాయి అది గమనించిన యశోదమ్మ క్రిష్ణుడిని పక్కన పెట్టి పొయ్యి దగ్గరకు పరుగెత్తింది 
పూర్తిగా పాలు తాగకుండానే తనను పక్కన పెట్టిన యశోదమ్మ మీద బాగా కోపం వచ్చింది క్రిష్ణుడికి ఆ కోపంతో తన పెదవిని తానే కొరుక్కుంటూ గుండ్రాయి తీసుకుని పక్కనే వున్నా పెరుగు కుండలను పగుల గొట్టి అక్కడ నుండి వెళ్ళిపోయాడు (జగత్తునంతటిని పాలించే తనకు పాలిచ్చే మహద్భాగ్యం కలిగిన యశోదమ్మ దానిని గమనించకుండా లౌకికమైన విషయాసక్తితో కుండలోని పాలకోసం పరిగెత్తిందని క్రిష్ణయ్య ఉక్రోషం )  వెనక్కి వచ్చిన యశోదమ్మ పగిలిన పెరుగు కుండలను చూసి నవ్వుకుని క్రిష్ణుడెక్కడ వున్నాడా అని వెతుకుతుంటే ఓ గోపిక ఇంట్లో రోలు తిరగవేసి దాని పై నుంచుని ఉట్టిలోని వెన్న తీసి కోతికి తినిపిస్తున్న క్రిష్ణయ్య ను చూడగానే పట్టరాని కోపం వచ్చింది యశోదమ్మకు  ఎన్ని సార్లు గోపకాంతలు కృష్ణుడి మీద పిర్యాదులు చేసినా నమ్మని యశోద ఇపుడు కళ్లారా చూసేటప్పటికి కోపంతో చిన్న కర్రను తీసుకుని క్రిష్ణుడి వద్దకు వెళ్ళబోతే భయపడిన క్రిష్ణుడు పరుగు లంకించుకున్నాడు . క్రిష్ణుడు ముందు... యశోదమ్మ వెనుక ఈ పరుగును చుట్టూ గోపకులం ఆకాశాన దేవ ముని గణ సమూహం ఉత్సుకతతో చూస్తున్నారు ఏమి జరగబోతుందా అని 
యశోదమ్మ మనసంతా క్రిష్ణుడితోనే నిండిపోయింది ఎలా అయినా పట్టుకోవాలని . జగత్తు అంతా అక్కడ ఇక్కడ అని లేక అంతా తానై నిండిన వాడిని, ఆ రహస్యం తెలిసినా  మహర్షులు దేవతలు సైతం పెట్టుకోలేని వాడిని పట్టుకోవాలని మనసంతా ఆ రూపే నింపుకుని పల్లె పడుచు యశోదమ్మ పరుగులు పెడుతుంది (ఇది అర్ధం చేసుకుంటే భగవంతుడిని ఎలా పట్టుకోవాలో తెలుస్తుంది) ఒక్కసారి వెనుతిరిగి చూసాడు కృష్ణుడు . చెమటలు కారుతూ ఆయాసంతో రొప్పుతూ దేహంపైన వస్త్రం జారిపోతున్నా గమనించక  తననే పట్టుకోవాలని వెంటబడుతున్న తల్లిని చూడగానే జాలితో నిండిపోయింది హృదయం . అంతే పరుగు ఆపి నిలబడిపోయాడు . పరుగు పరుగున వచ్చి అల్లరి పిల్లవాడిని పట్టుకుని పట్టుబడ్డాడని అలసట మరచి మురిసిపోయింది తల్లి తనకు తానుగా పట్టుబడ్డ దేవదేవుని భక్త కారుణ్యం చూసి పూలవాన కురిపించారు దేవతలు   క్రిష్ణుడు పట్టుబడ్డాడు యశోదమ్మ పట్టుకుంది అంతటితో అవ్వదుగా పట్టుకున్నవాడిని కుదురుగా కూర్చోబెట్టాలికదా . నిరంతర చలనశీలత కలిగినవాడిని కుదురుగా కూర్చోబెట్టాలి అంటే కట్టేయాలి ఇపుడు యశోదమ్మ అల్లరి పిల్లడు అయిన క్రిష్ణుడిని రోటికి తాడుతో కట్టటానికి ప్రయత్నిస్తుంటే ఆ తాడు రెండు అంగుళాలు తక్కువయ్యింది . ఇంకో తాడు తీసుకుని ఈ తాడు తో జత చేసి కట్టటానికి ప్రయత్నిస్తే అపుడు రెండు అంగుళాలు తక్కువ అయ్యింది . అలా ఎన్ని తాళ్లు జత చేసినా రెండు అంగుళాలు తగ్గుతూనే వుంది అయినా యశోదమ్మ ప్రయత్నం ఆపటం లేదు 
మళ్ళీ తల్లి ని చూసాడు క్రిష్ణుడు చెమటలు కక్కుతూ పైట జారిపోతూ ముక్కుపుటాలు ఎరుపెక్కి అలసివున్న తల్లి మోము చూసి జాలితో కట్టుబడ్డాడు ధామము అంటే లోకాలు . అన్ని లోకాలను తన ఉదరంలో కలిగివున్నవాడు కనుక దామోదరుడు అన్నారు కాదు సర్వ జగత్తును తన ఉదరంలో నిలుపుకున్న క్రిష్ణుడు తల్లి యశోదమ్మ చేత ధామము (అంటే ఇంకో అర్ధం తాడు) తో కట్టబడ్డాడు కనుక దామోదరుడన్నారు  ఇక్కడ చెప్పిన రెండు అంగుళాలే నేను అన్న అహంకారం , నాది అన్న వ్యామోహపుమమకారం ఈ రెంటిని వదిలినవారే హృదయంలో భగవంతుడిని స్థిరంగా నిలుపుకోగలరు  ఇక క్రిష్ణుడి ని రోటికి కట్టిన యశోదమ్మ నిశ్చింతగా లోపలికి వెళ్ళింది. అమ్మ అటువెళ్ళగానే అందరిని మోహపు బంధనాల్లో బంధించే ఆ మాయాస్వరూపం అమ్మ చేత బంధింపబడి లేని ఏడుపుని నటిస్తూ రోటిని లాక్కుని పాకుతూ ఇంటి ఆవరణలో సంవత్సరాలనుండి వున్న మద్ది చెట్ల జంట మధ్యనుండి ముందుకు వెళ్లగా ఆ రోటి తాకిడికి ఆ చెట్లు కూలి\అందుండి ఇద్దరు గంధర్వులు బయటకువచ్చి కృష్ణుడికి నమస్కరించి వెళ్లిపోయారు 
వారిరువురు కుబేరుని పుత్రులైన నలకూబరుడు ,మణిగ్రీవుడు. పెద్దలను గౌరవించని కారణాన నారదుని చే శాపగ్రస్తులై క్రిష్ణుని కారణాన శాప బంధనాలు తెంచుకున్నారు  కూలిన మద్ది చెట్లను వాటి మధ్య వున్న బాలకృష్ణుని చూసి గోకులమంతా ఆశ్చర్యచకితులైరి . యశోదమ్మ తనవలనే కృష్ణునికి ఇంత ఆపద కలిగిందని దుఃఖ పడుచుండగా నంద మహారాజు క్రిష్ణుని బంధనాలు విప్పి గుండెలకు హత్తుకున్నాడు  అందరిని మోహ బంధనాలలో బంధించు జగన్నాటకసూత్రధారిని తల్లి యశోదమ్మ బంధిస్తే అందరి బంధనాలు తెంపి మోక్షమిచ్చు ముకుందుని బంధనాలను నందుడు విడదీశాడు  మనం ఆ యశోదానందులమై రోజు ఈ అద్భుతమైన లీలను స్మరిస్తూ గోవిందా దామోదరా మాధవా అని కీర్తిద్దాం  

Saturday, October 26, 2024

అహో

అహో సహజ పరిమళాల నొప్పారు నిగనిగల నల్లని కేశపాశముల కొప్పు కాముని పూలశరముల కుప్ప వలే ఒప్పారుచుండే పడతి ఫాలభాగము ఫాలాక్షుని త్రిశూల కాంతులతో సింధూర వర్ణ శోభను పొందె కోమలి నల్లకలువ కనుల కోరచూపుల శరముల పరంపర హృదయవీణ ను మీటుచుండె సంపంగి సొబగుల నాశిక పుటముల లేత ఎరుపుకాంతులు ఎదను గిల్లుచుండె అలివేణి ప్రేమాధరాల తేనియలు మేఘమాలికలై కమ్మేయుచుండే ఎర్రమందారమంటి ముగ్ధ మేని ముద్దాడుతూ సిగ్గుమెగ్గలై ఎర్రబారె రుద్రాక్షువులు. ముక్కంటి మెచ్చిన మనోహరీ నీ రూపం చేయుచుండె మదిలో ఆనందతాండవం

Saturday, October 12, 2024

పులిహోర

నమ్మకమనే నూనెలో ప్రేమ పూర్వక పలకరింపుల పోపు వేసి కమ్మని భావాల కరివేపాకు కలిపి అలిగిన వేళ మనసు పలికించు ఎండు మిరప ఘాటును తగిలించి బంగారు వన్నె నిగ నిగ ల మేని చాయను పొసుపు పొడిగా అద్ది చిలిపి ఊహల చింత పులుపులో నానిన ఆత్మీయతల అన్నపు పలుకులలో మనసులో పొంగు ఆప్యాయత అరచేతిలో అమృత బిందువు కాగా కలిపి కలబోసి నీవందించిన పులిహోర రుచి ఏమని వర్ణించను అము జన్మ జన్మలకు నీ ప్రేమామృత ధారలలొ తడిసి ముద్దవ్వాలని తపించటం తప్ప