Sunday, November 3, 2024

దామోదర లీల   

                       కార్తీకం లో ఉదయపు సంధ్యలో నారాయణుడిని క్రిష్ణా గోవిందా దామోదరా అని నోరారా కీర్తించాలి పదే పదే స్మరించాలి సాయంసంధ్యలో ఓం నమస్తే అస్తు  భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమాన్ మహాదేవాయ నమః అంటూ గంగా జలాలతో అభిషేకం చేసిన భావన చేయాలి . భవానీ భావనాగమ్యా అంటారు కదా భావన చాలు చేసిన ఫలం పొందేయవచ్చు . హడావిడులు  అవసరం లేదు కార్తీకాన్ని కార్తీక దామోదర మాసం గా వ్యవహరిస్తారు అందుకు గల కారణం తెలుసుకుని క్రిష్ణుని ఈ లీలను ధ్యానిస్తూ నిత్యం  దామోదరా అని స్మరిస్తూ వుంటే మన బంధనాలు తొలగిపోతాయి  బృందావనంలో ఒకసారి కృష్ణుడిని ఒడిలో పెట్టుకుని యశోదమ్మ పాలిస్తున్నది అదే సమయంలో పక్కనే పొయ్యి మీద వున్న కుండలోని పాలు పొంగిపోతున్నాయి అది గమనించిన యశోదమ్మ క్రిష్ణుడిని పక్కన పెట్టి పొయ్యి దగ్గరకు పరుగెత్తింది 
పూర్తిగా పాలు తాగకుండానే తనను పక్కన పెట్టిన యశోదమ్మ మీద బాగా కోపం వచ్చింది క్రిష్ణుడికి ఆ కోపంతో తన పెదవిని తానే కొరుక్కుంటూ గుండ్రాయి తీసుకుని పక్కనే వున్నా పెరుగు కుండలను పగుల గొట్టి అక్కడ నుండి వెళ్ళిపోయాడు (జగత్తునంతటిని పాలించే తనకు పాలిచ్చే మహద్భాగ్యం కలిగిన యశోదమ్మ దానిని గమనించకుండా లౌకికమైన విషయాసక్తితో కుండలోని పాలకోసం పరిగెత్తిందని క్రిష్ణయ్య ఉక్రోషం )  వెనక్కి వచ్చిన యశోదమ్మ పగిలిన పెరుగు కుండలను చూసి నవ్వుకుని క్రిష్ణుడెక్కడ వున్నాడా అని వెతుకుతుంటే ఓ గోపిక ఇంట్లో రోలు తిరగవేసి దాని పై నుంచుని ఉట్టిలోని వెన్న తీసి కోతికి తినిపిస్తున్న క్రిష్ణయ్య ను చూడగానే పట్టరాని కోపం వచ్చింది యశోదమ్మకు  ఎన్ని సార్లు గోపకాంతలు కృష్ణుడి మీద పిర్యాదులు చేసినా నమ్మని యశోద ఇపుడు కళ్లారా చూసేటప్పటికి కోపంతో చిన్న కర్రను తీసుకుని క్రిష్ణుడి వద్దకు వెళ్ళబోతే భయపడిన క్రిష్ణుడు పరుగు లంకించుకున్నాడు . క్రిష్ణుడు ముందు... యశోదమ్మ వెనుక ఈ పరుగును చుట్టూ గోపకులం ఆకాశాన దేవ ముని గణ సమూహం ఉత్సుకతతో చూస్తున్నారు ఏమి జరగబోతుందా అని 
యశోదమ్మ మనసంతా క్రిష్ణుడితోనే నిండిపోయింది ఎలా అయినా పట్టుకోవాలని . జగత్తు అంతా అక్కడ ఇక్కడ అని లేక అంతా తానై నిండిన వాడిని, ఆ రహస్యం తెలిసినా  మహర్షులు దేవతలు సైతం పెట్టుకోలేని వాడిని పట్టుకోవాలని మనసంతా ఆ రూపే నింపుకుని పల్లె పడుచు యశోదమ్మ పరుగులు పెడుతుంది (ఇది అర్ధం చేసుకుంటే భగవంతుడిని ఎలా పట్టుకోవాలో తెలుస్తుంది) ఒక్కసారి వెనుతిరిగి చూసాడు కృష్ణుడు . చెమటలు కారుతూ ఆయాసంతో రొప్పుతూ దేహంపైన వస్త్రం జారిపోతున్నా గమనించక  తననే పట్టుకోవాలని వెంటబడుతున్న తల్లిని చూడగానే జాలితో నిండిపోయింది హృదయం . అంతే పరుగు ఆపి నిలబడిపోయాడు . పరుగు పరుగున వచ్చి అల్లరి పిల్లవాడిని పట్టుకుని పట్టుబడ్డాడని అలసట మరచి మురిసిపోయింది తల్లి తనకు తానుగా పట్టుబడ్డ దేవదేవుని భక్త కారుణ్యం చూసి పూలవాన కురిపించారు దేవతలు   క్రిష్ణుడు పట్టుబడ్డాడు యశోదమ్మ పట్టుకుంది అంతటితో అవ్వదుగా పట్టుకున్నవాడిని కుదురుగా కూర్చోబెట్టాలికదా . నిరంతర చలనశీలత కలిగినవాడిని కుదురుగా కూర్చోబెట్టాలి అంటే కట్టేయాలి ఇపుడు యశోదమ్మ అల్లరి పిల్లడు అయిన క్రిష్ణుడిని రోటికి తాడుతో కట్టటానికి ప్రయత్నిస్తుంటే ఆ తాడు రెండు అంగుళాలు తక్కువయ్యింది . ఇంకో తాడు తీసుకుని ఈ తాడు తో జత చేసి కట్టటానికి ప్రయత్నిస్తే అపుడు రెండు అంగుళాలు తక్కువ అయ్యింది . అలా ఎన్ని తాళ్లు జత చేసినా రెండు అంగుళాలు తగ్గుతూనే వుంది అయినా యశోదమ్మ ప్రయత్నం ఆపటం లేదు 
మళ్ళీ తల్లి ని చూసాడు క్రిష్ణుడు చెమటలు కక్కుతూ పైట జారిపోతూ ముక్కుపుటాలు ఎరుపెక్కి అలసివున్న తల్లి మోము చూసి జాలితో కట్టుబడ్డాడు ధామము అంటే లోకాలు . అన్ని లోకాలను తన ఉదరంలో కలిగివున్నవాడు కనుక దామోదరుడు అన్నారు కాదు సర్వ జగత్తును తన ఉదరంలో నిలుపుకున్న క్రిష్ణుడు తల్లి యశోదమ్మ చేత ధామము (అంటే ఇంకో అర్ధం తాడు) తో కట్టబడ్డాడు కనుక దామోదరుడన్నారు  ఇక్కడ చెప్పిన రెండు అంగుళాలే నేను అన్న అహంకారం , నాది అన్న వ్యామోహపుమమకారం ఈ రెంటిని వదిలినవారే హృదయంలో భగవంతుడిని స్థిరంగా నిలుపుకోగలరు  ఇక క్రిష్ణుడి ని రోటికి కట్టిన యశోదమ్మ నిశ్చింతగా లోపలికి వెళ్ళింది. అమ్మ అటువెళ్ళగానే అందరిని మోహపు బంధనాల్లో బంధించే ఆ మాయాస్వరూపం అమ్మ చేత బంధింపబడి లేని ఏడుపుని నటిస్తూ రోటిని లాక్కుని పాకుతూ ఇంటి ఆవరణలో సంవత్సరాలనుండి వున్న మద్ది చెట్ల జంట మధ్యనుండి ముందుకు వెళ్లగా ఆ రోటి తాకిడికి ఆ చెట్లు కూలి\అందుండి ఇద్దరు గంధర్వులు బయటకువచ్చి కృష్ణుడికి నమస్కరించి వెళ్లిపోయారు 
వారిరువురు కుబేరుని పుత్రులైన నలకూబరుడు ,మణిగ్రీవుడు. పెద్దలను గౌరవించని కారణాన నారదుని చే శాపగ్రస్తులై క్రిష్ణుని కారణాన శాప బంధనాలు తెంచుకున్నారు  కూలిన మద్ది చెట్లను వాటి మధ్య వున్న బాలకృష్ణుని చూసి గోకులమంతా ఆశ్చర్యచకితులైరి . యశోదమ్మ తనవలనే కృష్ణునికి ఇంత ఆపద కలిగిందని దుఃఖ పడుచుండగా నంద మహారాజు క్రిష్ణుని బంధనాలు విప్పి గుండెలకు హత్తుకున్నాడు  అందరిని మోహ బంధనాలలో బంధించు జగన్నాటకసూత్రధారిని తల్లి యశోదమ్మ బంధిస్తే అందరి బంధనాలు తెంపి మోక్షమిచ్చు ముకుందుని బంధనాలను నందుడు విడదీశాడు  మనం ఆ యశోదానందులమై రోజు ఈ అద్భుతమైన లీలను స్మరిస్తూ గోవిందా దామోదరా మాధవా అని కీర్తిద్దాం  

No comments: