Thursday, November 21, 2024

గోపికా గీతం

పల్లెపడుచులైన గోపికలను జ్ఞానుల సరసన చేర్చిన స్తోత్రం ఇది ఎంతో లోతైన తాత్విక భావనలతో నిండిన విరహ గీతం గోపికలు కృష్ణుడితో రాసలీల లాడుతున్నవేళ ఆ గోపికల్లో చిన్నపాటి అహకారం కలిగింది . కృష్ణుడికి నేనే అత్యంత ప్రియమైన దానను , క్రిష్ణుడు కేవలం నాతోనే వున్నాడు అన్న భావనకు లోనయ్యారు అది గ్రహించిన కృష్ణుడు వారి అహకారం తొలగించాలని నిర్ణయించుకుని ఒక్కసారిగా అందరి వద్ద నుండి అదృశ్యమైపోయాడు క్రిష్ణుడు మాయమవగానే కృష్ణ వియోగంతో దుఃఖితులైన గోపికలు ఆ బృందావనిలో ప్రతి చెట్టును పుట్టను పువ్వును తీగను కనబడిన వాటినన్నంటిని కృష్ణుడి గురించి వాకబు చేస్తూ చేసిన విరహ గీతమే గోపికాగీతం.  ఈ స్థితిలో గోపికల వేదన గురించి పోతన చెప్పిన అందమైన పద్యం ఒకటి విందాం నల్లని వాడు  పద్మ నయనంబులవాడు కృపా రసంబు పై జల్లెడువాఁడు మౌళి పరి సర్పిత పింఛము వాడు నవ్వు రా జిల్లెడు మోము వాడొకడు చెల్వల మాన ధనంబు దోచెనో మల్లియలారా మీ పొదల మాటున లేదు గదమ్మ చెప్పరే ఇంతకూ ఈ గోపికలెవ్వరు . ఎందుకింత ప్రాముఖ్యత వారికి అంటే వారి జన్మ రహస్యం తెలుసుకుందాం శ్రీరాముడు వనవాసానికి బయలుదేరి అడవులలో మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ సాగుతూ శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళతారు . శరభంగుడు ఆయన కుమారుడు గొప్ప రామభక్తులు . శరభంగుడు అంటే అయన పేరులోనే వుంది . శరములను భంగం చేసినవాడు . ఏమి శరములు అవి అంటే మన్మధుని బాణములు అంటే కామ వికారాలను జయించినవాడు అంత గొప్ప మహర్షి అయన అటువంటి ఆ మహర్షికి అక్కడ వున్న గొప్ప గొప్ప ఋషి పరివారానికి శ్రీరాముడిని చూడగానే ఒక్కసారిగా మనసు చలించింది . శ్రీరాముడి అందం అంటే సాధారణమా మరి సాక్షాత్ లలితా త్రిపురసుందరి అవతారం ఆ సౌందర్యం అసామాన్యం అద్వితీయం అందుకే పుంసాం మోహనరూపాయ అంటారు ఆయన సౌందర్యం చూసి ధీరోదాత్తులైన పురుషులుకూడా మోహితులయ్యారు . ఆ మహర్షుల మనసులో ఒక్క క్షణం జనించిన  భగవంతుని పట్ల కలిగిన ఆ మోహమే వారు గోపికలు గా జన్మించటానికి కారణమయ్యింది . అందుకే గోపికలు మనసంతా క్రిష్ణుని రూపంతో నిండిపోయింది అందుకే గోపికల భక్తి అత్యంత మధుర ప్రేమ భక్తి గా ప్రసిద్ధి చెందింది 1. జయము నీకు ముకుందా ! నీ యొక్క పుట్టుక చేత వ్రజభూమి మిక్కిలి పవిత్రమైనది మరియు శోభాయ మానమైనది . తల్లి అగు లక్ష్మీదేవి సైతం ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్నది . ఓ దయాస్వరూపమా ఈ గోపికలందరూ నీ వారు నీవే ప్రాణం గా బ్రతుకుతున్నవారు . ప్రతి చోట నీకొరకే వారు వెదుకుచుంటిరి . కనుక నీ దయా వర్షం కురిపించు నీ దర్శన భాగ్యం కలిగించు 2 ఓ సురత్  నాధ్ ! (ఓ ప్రియమైన పతి ) వరములు ప్రసాదించువాడా మేము నీ వెల లేని దాసీలం సాటిలేని  నీ ప్రకాశమానమైన నీ కంటి చూపులతో మమ్ములను చంపివేస్తున్నావు . ఆ కనుల సౌందర్యం చూసి వసంతకాలంలో నిర్మలమైన సరస్సులలో ప్రపంచమంతటి చేత ప్రస్తుతింపబడే సుకుమారులైన కమలములు సైతం తమ అందం పట్ల భ్రమలు తొ లగి గర్వభంగం చెందుతున్నాయి . ఈ లోకంలో ప్రేమపూర్వక చూపులతో చంపితే హత్యగా భావించరా ? 3  ఓ పురుషరత్నమా ! నీవు అనేకమార్లు గోపీ జన పరివారాన్ని మృత్యువు నుండి రక్షించావు . కాళింది చేత విషమయమయిన యమునాజలాలను శుద్ధం చేసావు. కొండచిలువ రూపంలో వచ్చిన అఘాసురుడి నుండీ ఇంద్రుడు కురిపించిన కుంభ వృష్టి నుండి పిడుగులా నుండి , పెనుగాలి  రూపంలో వచ్చిన తృణావర్తుడు నుండి , ఎద్దు రూపంలో వచ్చిన  అరిష్టాసురుడిని  మాయ పుత్రుడైన వ్యోమాసురుడిని సంహరించి మము రక్షించితివి 4 నీవు కేవలం యశోదా నందనుడివి మాత్రమే కాదు . సర్వ జీవులలో ప్రకాశించు అంతరాత్మవు . ఓ శాశ్వతమైన సత్య స్వరూపుడా  సృష్టికర్త అగు బ్రహ్మ ప్రార్ధన మేర విశ్వ రక్షణకై యదు వంశంలో ఆవిర్భవించితివి 5 ఓ వృష్ణి వంశ ప్రదీపకా ! ఓ ప్రియమైన ఆప్తుడా !   ఎవరు పద్మములవంటి నీ పాదములను ఆశ్రయించెదరో వారి యొక్క సంసార దుఃఖములను తొలగించి భయ రహితులను చేసెదవు . ఓ ప్రియుడా ! సర్వ శుభములు కలిగించువాడా ! అత్యంత అనురాగంతో తల్లి అగు మహాలక్షి చేత సదా పట్టుకొనబడి యుండు పద్మముల వంటి నీ అరచేతులను మా శిరస్సులపై వుంచుము 6 వ్రజనివాసుల యొక్క ఆర్తి ని తొలగించువాడా ! గొప్ప శౌర్యవంతుడా నీ చిరునవ్వు చాలు నీ ప్రియమైన వారి గర్వాన్ని తొలగించుటకు . ప్రియమైన స్నేహితుడా మము మీయొక్క సేవకులు గా అంగీకరించండి మేము మీపాదాలను పూర్ణంగా ఆశ్రయించివుంటిమి . చూడచక్కని  పద్మం వంటి నీ ముఖ కమలపు దర్శన భాగ్యం కలిగించు 7  మేత మేయుటకు బయలుదేరిన గోమాతలను అనుసరించినట్టివి మహాలక్ష్మి చేత ఆపేక్షగా ఆశ్రయించబడినట్టివి ఫణిరాజగు కాళిందిని తలలపై అందంగా నర్తించినట్టివి అగు నీ పద్మం వంటి పాదాన్ని ఆశ్రయించి నమస్కరించిన వారి పాపాలు తొలిగిపోవును . ఓ ప్రభూ అట్టి నీ పాదపద్మమును మా హృదయం పై పెట్టినచో మమ్ములను దహించు కోరికలు సమసిపోవును మా గుండెల్లో నిండుగా వున్న దుఃఖములు తొలిగిపోవును 8 ఓ కమలపు కనులవాడా ! అత్యంత తీయని మధురమైన విన్నంతనే మంత్రముగ్ధులను చేయు నీ మాటలు వినరాక దిగ్బ్రాంతి చెందితిమి . జ్ఞానులు సైతం ఒక్కసారి నీ మాటలను విన్నంతనే వాటికోసం దేనినైనా త్యజించెదరు ఓ నాయకుడా! అమృత ప్రవాహాం వంటి మధుర ధ్వనులు పలికించు నీ  గొంతు విని నీకు విశ్వాసపాత్రులమైన  గోపికలం నీ ప్రేమలో పడితిమి . దివ్యమైన నీ అధర సుధలు అందించి మాకు జీవన భాగ్యం ప్రసాదించు 9 ఓ దేవా విరహ వేదనతో భాదపడు జీవులకు దివ్యమైన లీలలతో కూడిన నీ కథలు జీవితాన్ని ఆశను కలిగించు అమృత స్వరూపం వంటివి జ్ఞానులు నీ పట్ల భక్తి కల కవులు నీ లీలలను గానం చేయుచున్నారు వాటిని విన్నంతనే అన్ని దుఃఖములు తొలగిపోయి పాపములు నశించి అనేక మంగళములు కలిగించును . నీ లీలలను చదివిన వారు  దయా హృదయులై విశ్వమునకు మేలు శుభము కలిగించుదురు 10 ఓ దేవా కనువిందు చేయు నీ చిరునవ్వు  ఆకర్షించు నీ రూపం అందమైన నీ నడక  దయ తో కూడి పవిత్రమైన ప్రేమ భావనలు ప్రసరించు నీ చూపులు వీటిని ధ్యానం చేయువారు నీ ప్రేమకు పాత్రులగుదురు. నీవు ఏకాంతంగా రహస్య ప్రదేశాలలో మాతో పలికిన మధుర సంభాషణలు  మా హృదయాల తో నీవు ఆడిన ఆటలు పదే పదే నిన్ను గుర్తు చేస్తూ నిను మరువనీయకున్నవి . ఓ మాయావీ  ఈ జ్ఞాపకాలు నిను చూడాలన్న కోరికను బలీయం చేయుచున్నవి. కానీ నీవు కానరాక మా హృదయాలు బరువెక్కుచున్నవి  11 ఓ ప్రియమైన ప్రభూ ! ఉదయ సంధ్యలో  గోవులను అడవి లో మేతకు తోలుకెళ్ళునపుడు ఆ దారులలోని రాళ్లు పదునైన పచ్చిక చిగురులు గడ్డి వీటి వలన అత్యంత సుకుమారములు ఎర్రని తామరల బోలు నీ పాదపద్మములు పొందు నొప్పి ని తలచుకున్నప్పుడల్లా మా మనసులు బాధతో తల్లడిల్లుచున్నవి  12 ఓ ప్రియమైన నాయకుడా ! సాయం సంధ్యలో గోవులను ఇంటికి తోలుకొస్తూన్నపుడు లేగల పదఘట్టనలకు ఎగసిపడే ఎర్రని ధూళిచేత కప్పబడి మరింత ఎరుపెక్కిన పద్మంలాంటి నీ మోము నీల నీలి వర్ణపు కాంతులతో ఉంగరాలు తిరిగిన   లయబద్దంగా కదులాడుచున్న ముంగురులుతో అలరారు నీ నుదురు ఇట్టి అతి సుకుమారమైన నీ వదనం పదే పదే మాకు చూపుచు  నడయాడుచున్నపుడు మా హృదయాలలో తీవ్రమైన ప్రేమ భావనలు రేకెత్తిస్తున్నది  13 ఓ అత్యంత ప్రియాతి ప్రియమైనవాడా ! మా మనస్సుల్లోని వేదన తొలిగించువాడా ! నీ పద్మం వంటి పాదం తనను శరణుజొచ్చిన వారి కోరికలు తీర్చుచున్నది ఈ ధరణి కి గొప్ప ఆభరణమై ప్రకాశిస్తున్నది  బ్రహ్మ యొక్క పూజలు అందుకొనుచున్నది ధ్యానించు వారి ఉపద్రవములు తొలిగించుచున్నది అట్టి ఆ పద్మము వంటి పాదమును మా హృదయాలపై పెట్టుము  14 ఓ ప్రియమైనవాడా ! నీ అధరామృతం మాలో నీతో దివ్యమైన ఐక్యతాభావాన్ని పెంపొందించి నీయొక్క ఎడబాటు వలన కలిగే అన్ని దుఃఖాలను తొలగించును అమృతం నిండిన నీ పెదవులను తాకిన వేణువు  నాదాలను అమృతస్వరాలుగా  మార్చుచున్నది. ఎవరైనా ఒక్కసారి అయినా ఆ అమృతాన్ని చవిచూస్తే ఇతరములైన అన్ని బంధాలు కోరికలను మరచిపోదురు . ఓ ప్రియసఖుడా ఒక్కసారి నీ అధరామృతం మాకు అందించు  15 ఓ ప్రియా సఖుడా పగటి సమయాన నీవు అడవికి వెళ్ళినపుడు  నిను కానని ప్రతి నిమిషం ఒక యుగంలా గడుస్తున్నది . సాయంసమయాన నీవు తిరిగి వచ్చువేళ ఉంగరాలు తిరిగిన నీలి ముంగురులతో ముద్దుగారు నీ మోము చూచువేళ తరచుగా పడు కనురెప్ప పాటు మమ్ములను కలవరపాటుకు గురి చేస్తున్నది . ఈ   కనురెప్పల సృష్టికర్త ఎంత కఠినమైన మనసు కలవాడో కదా  16 ఓ అచ్యుతా ! మా భర్తల పుత్రుల బంధువుల శాసనాలను బంధాలను తెంచుకుని నీ చెంతకు వచ్చితిమి . మా హృదయాంతరాల్లోని ఆలోచనలు నీకు పూర్తిగా తెలుసు . నీ దివ్యమైన వేణుగానానికి పరవశులమై ఇక్కడకు వచ్చితిమి ఓ మాయావి ! ఇంత చీకటివేళ ఈ అబలల సమూహాన్ని ఒంటరిగా వదిలి నీవు తప్ప వేరెవరు వెళ్ళగలరు  17 ఓ ప్రియసఖుడా ! నీవు మాతో రహస్యంగా ముచ్చట్లాడు సమయాన ప్రేమతో మమ్ములను చూసే ఆ చూపులు , మా హృదయాలను రంజింపచేయు అందమైన నీ చిరునవ్వు , సిరులతల్లి శాశ్వత నివాసమైన విశాలమైన నీ వక్షస్థలం మాకు పదే పదే గుర్తుకు వచ్చి నిను చూడాలనే మా కోరికను ద్విగుణీకృతం చేసి నిను కానలేక మా హృదయాలు బరువెక్కుచున్నవి  18 ఓ ప్రియసఖుడా నీ దర్శనం వ్రజనివాసుల యొక్క అన్ని దుఃఖాలను తొలగిస్తుంది  సమస్త విశ్వానికి ఎనలేని శుభాలను చేకూరుస్తోంది . నిన్ను మాత్రమే కోరుకునే మా హృదయాలు నిను కానక భాదతో విలవిలలాడుతున్నాయి కనుక దయతో మంగళకరమైన నీ దివ్య స్వరూప సందర్శనమనే ఔషధాన్ని కొద్దిగా మాకు ప్రసాదించు నీ ప్రియతముల దుఃఖాన్ని తొలగించు  19 ఓ దేవా కమలపు రెక్కల కన్నా ఎంతో కోమలము  సుకుమారము అయిన నీ పాదాన్ని అంతే సున్నితంగా ఎంతో జాగురూకతతో మా హృదయాలపై పెట్టుకొనుచున్నాము . అట్టి సుకుమారమైన పాదాలతో ఎట్టి రక్షణ లేకుండా ముళ్ళు రాళ్లు రప్పలతో నిండిన అడవి దారులలో నీవు తిరుగాడుచుంటే అది తలచుకుని ఎంతో వ్యాకులతకు లోనై తెలివితప్పుచున్నాము . ఓ ప్రియసఖుడా ! మా జీవితాలు నీకొరకు మాత్రమే  మేము నీ కొరకు మాత్రమే జీవిస్తున్నాము మేము కేవలం నీ వారము  శుక మహర్షి చెప్పుచున్నాడు . ఓ పరీక్షిత్ మహారాజా ! ఈ విధంగా కృష్ణుడితో వియోగం చెందిన గోపికలు తీవ్రమైన దుఃఖంతో వణుకుతున్న స్వరంతో కృష్ణుడిని చూడాలన్న బలీయమైన కోరికతో ఎన్నో విధాలైన పలుకులు పలుకుతూ తిరుగాడుచున్నారు  ఈ విధంగా దుఃఖితులై తిరుగాడుచు గోపికలు పలికిన పలు వాక్యములు విని ,శౌర్యవంశ శిరోమణి , మన్మథునికే ఆశ్చర్యకలిగించేంత అందమైన రూపంతో ఆకర్షించు చిరునవ్వు కూడిన మోముతో, పట్టు పీతాంబరములు, మెడలో వనమాలను ధరించి అందరి హృదయాలను మథించు మోహనకారుడగు శ్రీక్రిష్ణుడు గోపికల ఎదుట ప్రత్యక్షమాయెను  స్వచ్ఛమైన భక్తుల హృదయమే నేను నా స్వచ్ఛమైన భక్తులే నా హృదయం : శ్రీక్రిష్ణ వచనం 

No comments: