వానొచ్చే వరదొచ్చె గోదారి పొంగల్లే భావాల వరదొచ్చే
ఇంకా గ్రీష్మం ముగియకముందే వర్షఋతువు సందడి మొదలయ్యింది
భానుడి భగ భగ లతో బీటలు పడిన నేల నింగి నుండి జాలువారిన నీటి ధారలతో
పులకించి మట్టి గంధపు వాసనలు వెదజల్లగా ఆ పరిమళాలు నా ముక్కు పుటాలు
సోకి మనసును మా వూరి వైపు చిన్న నాటి తీపి జ్ఞాపకాలవైపు పరుగులు పెట్టించింది
మేఘం నిండితే జలధారలు కురుస్తాయి
మనసు నిండితే భావాల మాలికలు పూస్తాయి
అందుకే ఆ రెండు ఎపుడు నిండుగా ఉండాలి అపుడే మన జీవితం పచ్చగా చల్లగా వుంటుంది
మా వూరు మంత్రిపాలెం ... ఇంటి ఎదురుగా ఓ చెరువు దానికి ఓ పేరు రావారి చెరువు (రావి అనే ఇంటి పేరు గల వారి చెరువు) దానికున్న గుర్తింపు మనకు లేకపోయే
ఆ చెరువు ఒడ్డున ఇంటికి పర్లాoగు దూరంలో చదువుల గుడి మా బడి
ఆ బడి కి ఎదురుగా ఓ డాబా ఇల్లు పెరటిలో జామ చెట్టు చెట్టుకింద మంచినీటి చేతిపంపు
ఇంతే అయితే ఆ ఇంటిని గుర్తుంచుకునే విశేషమే ముందంటారా
అదే మరి చెప్పేది ...... తొలి వలపే తీయనిది నా ఫస్ట్ క్రష్
బూరెల్లాంటి బుగ్గలతో కొంచెం తెలుపు కొంచెం ఎరుపు కలిసిన మేని కాంతులతో
అపుడెపుడో కొన్ని దశాబ్దాల క్రితం చూశాం ఇప్పుడెలా వుందో .......
వానాకాలంలో బడికి వెళ్ళేటపుడు దారిలో వాళ్ళ ఇంటి దగ్గరలో రోడ్డు మీద గుంతలు వాటిలో
వాన నీరు నిలిచివుంటే ఆ నీటిలో చిందులేస్తూ ఆనందించిన క్షణాలు
ఇక వర్షం పడుతున్నప్పుడు చూరు లో నుండి (తాటాకు గడ్డితో వేసిన ఇంటి కప్పు) జారుతున్న
నీటి బిందువులను అరచేతిలో ఒడిసిపడుతూ ప్రేయసి నవ్వుల్లో జాలువారుతున్న ముత్యాలు అరచేతిలో సవ్వడి చేస్తున్నట్లుగా మురిసి పోయిన ఆ క్షణాలు
వసారాలో వాలు కుర్చీ వేసుకుని వేయించిన వేరుశనగ పప్పుల్లో ఉప్పు కారం దట్టించి నోటిలోకి ఎగరేసుకుంటూ ధాటిగా కురుస్తున్న వాన చినుకుల చప్పుళ్లలో చెలి అడుగుల సవ్వడులు వింటూ మనసు కేరింతలు కొడుతున్న ఆ క్షణాలు
దట్టంగా అలిమిన నల్లని వాన మబ్బు చాటు తెల్లగా మెరిసిపోతూ సన్నని మెరుపు కాంతలు
ఓ క్షణకాలం అలా పలకరించిపోతే విరిసి విరియని ప్రేమకాంత పెదవుల నడుమ సన్నని ముత్యాల పలువరుసపై విరిసిన చిరు దరహాస చంద్రికలు నా మనసున పూచిన ఆ క్షణాలు
ఇంతలోనే ఓ పిడుగుపాటు .... ఉలికి పాటు ముసురుకున్న భావాల మేఘాలను చెరి పివేస్తూ ..... పెళ్ళాం పిలుపు ను గుర్తుకు చేస్తూ
(పాపము శమించబడుగాక భార్య భగవంతుడిచ్చిన వరం ఇంటికి మహారాణి ఎదో కూసింత హాస్యం కోసం అనటమే తప్ప ... మరేం ఉద్దేశ్యం లేదు)
ఏది ఏమైనా ఆ రోజులు మునుముందిక రావేమిరా
నేను మారలేదు నా భావుకత చావలేదు
కాలం మారిపోతే నేరం నాదేల తండ్రి నారాయణా
హే క్రిష్ణా ఈ పట్టణ వాసం భారం వదిలించి ప్రకృతి ఒడిలో పల్లెసీమలో స్వేచ్ఛ విహారం చేయు
అదృష్టమిప్పించవయా