Thursday, March 28, 2019

ఎవరీ హనుమ

ఎవరీ హనుమ

హనుమా! పలుక ఓ కమ్మని పదం  
హనుమా! భావింప ఓ సుందర రూపం 
హనుమా ! తలంప ఓ రక్షా కవచం 

ఇంతకూ ఎవరీ హనుమ!

ఎందుకు హనుమ పై మనసుకింత మమకారం ..... 

రామదూత    స్వామి భక్తి పరాయణుడు     భవిష్యద్ బ్రహ్మ  ఇలా ఎవరికీ ఏ భావన నచ్చితే దానికి తగ్గట్లుగా 
హనుమ గూర్చి పలుకుతూఉంటారు 
నిజమే ఎవరాయన నన్ను చాలాకాలం వేధించిన ప్రశ్న .  అమ్మ లలిత దేవి స్వరూపమే తానా అనిపిస్తుంది. అది తెలుసుకోవాలన్న ఆలోచనలకు సమాధానం పెద్దల  ప్రవచనాల రూపంలోనూ , సహస్ర నామ పారాయణా క్రమంలోను సుందరకాండ లో అంతర్లీనంగా దాగిన రహస్యాల ద్వారాను మనకు ఆయన ఎవరో బోధపడుతుంది 
ఒకసారి వాటిని గమనిద్దాం 

ఉత్తర రామాయణం లో పట్టాభిషేకం పూర్తయ్యాక శ్రీరాముడు సీతమాత సమేతుడై  సోదరులతో కలసి కొలువు తీరినపుడు హనుమ స్వామి పాదాల  చెంత ఆసీనుడై ముచ్చట గొలుపు శ్రీరాముని వదనాన్ని చూస్తూ రామ నామ జపంతో తాదాత్మ్యత చెంది వున్న సమయంలో శ్రీరాముడు సభలో ఆశీనులైన మహర్షులను చూస్తూ అడిగిన ప్రశ్న 

తాను  సర్వసమర్థుడైనప్పటికీ,  సుగ్రీవుడు వాలి చేత కొట్టబడి పారిపోతున్నావాలిని నిగ్రహించక  మౌనంగా సుగ్రీవుడిని అనుసరించి వెళ్ళటానికి కారణమేమి ,ఈ  హనుమ గురించి  నాకు తెలుసుకోవాలని వుంది . 
సత్యం మాత్రమే పలికే మహర్షులకు సత్యమే తానైన శ్రీరాముడి ప్రశ్న 

అందుకు బదులుగా అగస్త్యుల వారు పల్కిన సమాధానమిది 

తొల్లిటి పుట్టుక నేక పాద రుద్రుం డిత డంచు గొందఱు బుధుల్ గణియింపుదు రారహస్య మెవ్వం డెఱుఁగున్ జరాచర భవంబు లెఱిఁగిన నీవు దక్కగన్ (కంకంటి పాపరాజు గారు -ఉత్తర రామాయణం)

రుద్రులలో ప్రథముడైన ఏక పాద రుద్రుడే ఈ హనుమ అని కొందరు పెద్దలు చెబుతారు. కానీ ఆ రహస్యం సకల చరాచర జీవుల రహస్యమెరిగిన శ్రీమన్నారాయణుడవు నీకు కాక ఇంకెవరికి తెలుస్తుంది రామా అని బదులిస్తారు అగస్త్యులవారు .

దాని పరమార్ధం ఆ పరమేశ్వరుడే ఈ స్వామి హనుమ .  శివ అంటేనే మంగళకరం అని స్వామి హనుమాన్ స్మరణ తోనే మనకు కలుగుతాయి సర్వమంగళములు 

ఇక శరవణ భవుడైన సుబ్రహ్మణ్యుడి విషయానికొస్తే ఆయన జన్మకు హనుమ జన్మకు సారూప్యతలెన్నో 
శివ శక్తుల  తేజస్సు అగ్నిలో చేరి అక్కడ నుండి గంగమ్మ లో నిలిచి రెల్లుగడ్డి పొదల్లో పడి శరవణభవుడుగా ఉద్భవిస్తే 

అదే శివ తేజస్సు కొంతకాలం అమ్మవారి అనుజ్ఞ ద్వారా అగ్ని చేత సంరక్షింపబడి తరువాత వాయువుకు అందజేయబడితే ఆ తేజస్సు వాయు దేవుని ద్వారా ఫల రూపకంగా అమ్మ  అంజనాదేవి కి అందజేయబడినది

అగ్ని వాయువులు శివుని అష్టమూర్తులలో  ప్రముఖమైనట్టివారు . శివ స్వరూపమే హనుమ హనుమయే శరవణభవుడు 

సిద్ది ప్రదాయకుడు గణపతి . తనను స్మరించి కార్యాలను ఉపక్రమించే వారికి విజయాలు చేకూరుస్తాడు హనుమ.  తమిళనాట సగం హనుమ సగం గణపతి రూపంతో కూడిన స్వరూపానికి ఆరాధన కొన్ని ప్రాంతాలలో కనబడుతుంది 

హనుమ దుస్సాధ్యమైన సాగరాన్ని దాటి ఆవలి తీరం చేరాక ఆయన ఘనకార్యాన్ని మెచ్చుకుంటూ దేవతలు చెప్పిన స్తోత్రమిది 
                               యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ 
                               ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు న సీదతి


ఈ  చెప్పిన ధృతి ర్దృష్టి ర్మతి ర్దాక్ష్యం ఈ గొప్పవైన లక్షణాలు లేదా నామాలుగా వీటిని భావిస్తే లలితా సహస్రంలో  కుమార గణనాదాంభా -  తుష్టి:-పుష్టి -ర్మతి -ర్ధృతిః  అన్న నామాలను గమనిస్తే అమ్మ యొక్క రూపమే స్వామి హనుమ అని విదితమవుతుంది 

స్వామీ హనుమ వానరుడైనప్పటికీ ఎంతో సుందరంగా మనసును ఆకట్టుకుంటారు ఎందుకంటే అందమైన తల్లి ఆ లలితా త్రిపుర సుందరి ప్రతిరూపమే తానూ కనుక . 

ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మికం 
ఈ హనుమ యే బ్రహ్మ విష్ణువు శివుడు          ఈ హనుమ యే అమ్మ  లలితా  త్రిపుర సుందరి 
ఆయనే సకల దేవతా స్వరూపం సకల గుణ నిధానం 

హనుమన్నితి మే స్నానం  హనుమన్నితి మే జపః 
హనుమన్నితి మే ధ్యానం హనుమత్కీర్తనం  సదా   (శ్రీ గంధ మాధనః  )

No comments: