Saturday, March 29, 2014

గొవిందా హరి గొవిందా

కంస కౌరవాది దానవుల నిర్మూలించు నెపమున 
వృందావని వీడబోవు చిన్ని కొమరుడు క్రిష్ణుని గని 
తల్లడిల్లే  తల్లి యశోద శోక తప్త హృదయముతో 
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా

నిండు పున్నమి పసిడి కాంతులలో  సుధా రస ధారలు కురిపించు  
లేలేత మావి చిగురువంటి పెదవుల ముద్దాడ , సర్వమెరింగిన వాని
మోవికి మోవి కలిపే గోపిక రహస్యము చెప్పు నెపమున   
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా

ఆహా ఏమి ఈ వింత! అని గో గోవత్స గోప గోపికా సమూహములెల్ల 
ఆశ్చర్యచకితులైయుండ,  అరచేత నిలిపె గోవర్ధన గిరిని, ఇంద్రుని 
మదమణచ ఉపేంద్రుడు నిశ్చలముగా ఏడు రోజులు 
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా

పట్ట శక్యము కాని తనను పట్ట నెంచి, పరుగులు తీయుచు 
అలసిన తల్లి యశోదను చూచి, కరుణ తో చిన్ని తాటి కి 
చిక్కే,రెండు అడుగులతో ముజ్జగములు కొలచినవాడు 
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా 

పాలిచ్చి ప్రాణములు తీయనెంచిన పూతన ప్రాణములు 
హరించి, హరి సందేశమిచ్చే, ఎవ్విధముగా నైన తన స్పర్శ 
పొందిన, దుర్గతులు బాపి సద్గతుల నిచ్చెదనని 
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా

ఆయుధము పట్టనని  యుద్ధము  చేయనని పల్కిన 
ఫల్గుణ సఖుడు,  రధ చక్రము చేబూని భీష్ముని పైకురికే
మహోగ్రమున, భక్తుని గెలిపించి తానోడే 
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా 

రూప రహితమగు పరబ్రహ్మము, పెక్కు రూపులు దాల్చి 
గో గోప సమూహములకు ఎల్లలెరుగని ముదిమి కూర్చే 
ఏడాది పాటు, బ్రహ్మ మాయను మ్రింగి వేయగా 
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా

పిడికెడు అటుకులు పొంది, అష్టైశ్వర్యములు ఇచ్చి ,
ఆదరమున సమ భావము చూపి, సంపదలకన్నా 
ప్రేమాభిమానములే మిన్నయని చాటితివి కదా 
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా

ప్రేమతో చందనాదులు అలమి కురూపి కుబ్జ 
కుందనపు బొమ్మాయే, మురిపెమున మనసే 
పాదార్పితము చేసిన పొందలేనిదేమున్నది 
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా

వలువలు దోచి దేహాభిమానము బాపి, సర్వము
గోవింద మయమన్న నిజమెరుకపరచి, దేహబ్రాంతులు
దరిచేరని రాసక్రీడల రంజింప చేసితివి రమణులను 
 
గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా

No comments: