Thursday, March 13, 2014

గోవింద దామోదర స్తోత్రం (1)

కురు పాండవ సముహ మధ్యమున 
దుశ్శాసన పరాభవితయగు ద్రౌపది 
ఆక్రోసముతో పిలిచే క్రిష్ణా నీవే దిక్కని
ఓ గోవింద ఓ దామోదర ఓ మాధవా 

శ్రీక్రిష్ణ విష్ణు మధు కైటభ సంహారి 
భక్త వత్సలా భగవాన్ మురారి 
కేశవా లొకనాధ నను బ్రోవుమా 
ఓ గోవింద ఓ దామోదర ఓ మాధవా 

వీధుల పాలు పెరుగులమ్మెడి వేళనూ 
ప్రేమ పారవశ్యముతో నిండిన చిత్తము 
కల గోపిక మనంబు మురారి పాదార్పితము చేసే  
ఓ గోవింద ఓ దామోదర ఓ మాధవా 

గింజలతో నిండిన తిరుగలి పిడి మరల 
మరల త్రిప్పు గోపికలు గానము చేసిరి 
జనించిన అనురాగముతో 
ఓ గోవింద ఓ దామోదర ఓ మాధవా 

మణులు పొదిగిన మణికట్టుపై నిలిచిన 
ఎర్రని కెంపు ను పోలిన వంపైన నాసికతో అలరారు 
చిలుకతో కమల నయన పలికేనిలా 
ఓ గోవింద ఓ దామోదర ఓ మాధవా

గృహ గృహమున ప్రతిక్షణము విడువక 
పంజరముల నున్న చిలుకలతో ప్రేమగా 
పునః పునః పలికించసాగిరి గోపాంగనలు 
ఓ గోవింద ఓ దామోదర ఓ మాధవా

శిశువుల నిదురపుచ్చ  ఊయల లూపుతూ
జోల పాడసాగిరి గోపికలు విష్ణు  మహిమలు 
రాగ తాళ మతిశయిల్లగా  
ఓ గోవింద ఓ దామోదర ఓ మాధవా

గుండ్రని నయనముల నటు నిటు సొంపుగా త్రిప్పుతూ 
చూపులన్నీ బలరామానుజుని పై నిలపి  వెన్నముద్దను 
ఆరగించ రా రమ్మని గోపికలు పిలువ సాగిరి 
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా  

రాజహంస నడక వలె నర్తించు నాలుక 
తలచినంతనే చవులూరించు తీయని
నామముల స్మరణలో నిలిచిపోయే 
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా  

ఒడిలో కూర్చుండి పాలు త్రాగుతున్న 
బాలుడైన కమల నాధుని కనులార కాంచి 
పులకిత యగు యశోద నీ దయావర్షంలో తడిసే 
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా  

వ్రజ భూమిలో తోటివారగు గోపబాలకులతో 
ఆటపాటలయందు ఆనందించు ఆ నంద నందనుని 
పిలిచే యశోద కడు  ప్రేమతో 
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా  

పశువుల కట్టు పలుపు తాడుతో రోటి కి
కట్టబడి బిక్కమొగముతొ కోరే యశోదను 
భంధనాలు వదులుచేయమని వెన్నతిన్న గోపాలుడు 
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా  

కంకణములతొ క్రీడించు క్రిష్ణుని కనులను 
అరచేత మూసి కడు  వయ్యారముల గోపిక 
వెన్న ముద్దను చూపి ఆశ పెట్టసాగే 
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా  

గృహముల యందు గోపకాంతలు ఒకచో 
కూడినపుడెల్లను విడువక నీ పుణ్య నామములే 
మరల మరల పలుకుచుండిరి అనురక్తితో 
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా

గో గోప గోపికా జన సమూహము వివశులై వినుచుండ 
మందార వృక్ష మూలమున ముద్దులొలుకు బాల కిశోరుడు 
ఎర్రని పెదవులపై వేణువు నుంచి ఆలపించే కమనీయ గానం 
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా

వెన్నచిలుకుతూ మురిపెమున యశోదా సుతుని 
అల్లరి చేష్టలను పాడుచుండిరి కృతులుగా కవ్వపు 
కంకణపు సవ్వడులకు జతగా ప్రాతః కాలమున గోపికలు 
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా

మేలుకొన్న యశోద గృహమున వెన్నచేయ తలంచియు 
తత్తరపడి సందేహ మనస్కురాలై నిజము పలుక మని 
నిలదీసే మురారిని వెన్న దొంగయగు వెన్నుని 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

ప్రాతః ప్రార్ధనలు ముగించి పెరుగు చిలుకుతూ 
ఉప్పొంగిన ప్రేమతో పాడ సాగిరి హరి గీతములు 
గోపికలు చెలులతో కూడి సుస్వరముల
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

వేకువలో గోపికలచే దాచబడిన వెన్నతో 
నిండిన కుండలను ముక్కలుగా పగులగొట్టి 
కేరింతలాడుతూ చిందులేసే ముకుందుడు 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

ఆట పాటల లీనమై ఆకలి దప్పుల మరచి 
పిలిచినా రా నిరాకరించు క్రిష్ణుని పదే పదే 
పిలిచే యశోద పొంగు మాతృ వాత్సల్యమున 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

శేష శయ్య పై సుఖాసీనుడైన విష్ణుని 
స్తుతించు దేవర్షి సంఘములు పొందే 
నీ అంశారూప మచ్యుతా 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

అరుణోదయ వేళ నిదురను వీడి వేద విధులు
 కావించిన విప్ర వరేణ్యులు వేదాధ్యయనము
ముగిసిన పిమ్మట పలికెదరు నీ నామములు
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

బృందావనమున గోవిందుని వియోగముతో 
పరితపించు రాధ హృదయవేదన చూసి 
చెమరించు కనులతో గోప గోపికలు గానము చేసే  
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

ప్రభాతమున గ్రాసమునకై వెడలిన గోవుల చూసి 
యశోద మృదు మదుర హస్త స్పర్సతో 
గోపాలుని తట్టి నిదుర లేపసాగే 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

వృక్ష మూలములందు ముత్యపు జటల తో 
శాఖముల భక్షణ తో  శోభిల్లు శరీరములు కల 
మునులు జపించు చుండిరి నీ నామములు 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 
 
(పూజ్య లీలా శుక  విరచిత గోవింద దామోదర స్తోత్రం నకు తెలుగు వివరణ తొలి 25 శ్లోకములు )

No comments: