Wednesday, March 26, 2014

గోవింద దామోదర స్తోత్రం (2)

వ్రజ భూమిని వీడ నున్నాడన్న వార్త విన్న 
గోప వనితలు గోవిందుని వియోగ వేదనతో 
రోదించిరి వీధులబడి సిగ్గును విడచి 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 


మణి  పంజరమునున్న చిలుకతో చెప్పించసాగె 
నును సిగ్గులు నగుమోమున కదులాడ గోపిక 
ఆనంద కందా  వ్రజ చంద్ర క్రిష్ణా 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

నిదురోవు గోపబాలకుల జుట్టుకు గోవత్సముల 
తోకలకు జతకట్టు పద్మ నయనంబులవాడి 
చుబుకము పట్టి తల్లి ప్రశ్నించ సాగే 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

గోవత్సముల కాయు కార్యమున కర్రలు చేబూని 
వేకువనే విచ్చేసిన ఇష్ట సఖులగు గోప బాలురు 
పిలవసాగిరి అవ్యయుని అనంతుని ఆత్మీయ భావమున 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

కాళీయుడిని మర్దించ కదంబ వృక్షాగ్రమునుండి
కాళింది మడుగు లోకి దూకిన క్రిష్ణుని   గని 
గోప గొపాంగనలు ఘోల్లుమనిరి భయముతో 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

అక్రూరుని తోడుగా మధుర వీధుల యందు
విల్లోత్సవాలలో కంసుని  చాపమణచ నడుచు 
ముకుందుని చూచి పురజనులు జయద్వానములు పలికే 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

కంసుని దూత రాకతో బృందావని వీడిపోవు 
వసుదేవ సుతులని గని యశోద తల్లడిల్లి 
సొమ్మసిల్లె గృహ మధ్యమున 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

సరోవరమున కాళీయ సర్పముచే చుట్టబడిన 
బాల కృష్ణుని చూసి అసహాయులైన గోపా బాలురు 
నేలను పడి పొర్లిరి పట్టరాని దు:ఖమున 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

అక్రూరుని రధముపై మధురా నగరి వైపు 
సాగిపోవు యదువంశ నాధుని చూసి వగచి 
మరల మరలి రావా యని అడగసాగిరి గోపబాలకులు 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

పూల పానుపు పై పరుండియు చెంత క్రిష్ణుడు లేని 
చింతతో కలువ కనుల నిండా కన్నీటితో నుండె 
గోపిక వనాంతమున వంటరిగా 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

స్వగృహమునకు చేరువైన గోపిక కట్టుబాట్లతో 
కట్టడి చేయు తల్లి తండ్రుల తలంపు రాగా 
విశ్వనాదా ! రక్షించమనె బరువైన హృదయముతో 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

అడవి యందు క్రిష్ణుడున్నాడన్న అభయముతొ 
అర్ధరాత్రి వేళ బృందావని చేరిన గోపిక కన్నయ్య 
కానరాక విలపించే భయముతో వనమున  
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

సుఖాసనమున సేదతీరుతూ నీ నామమలు 
విడువక మరల మరల పలికిన ప్రేమతో 
పొందుదురు నీ సారూప్యము సామాన్యులైనను 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

గోవిందుని వియోగముతో దు:ఖితురాలగు 
నీరజాక్షి రాధను చూసి చలించిన చెలి 
కలువ కనులు కన్నీటి ధారలు స్రవించే 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

మధుర పదార్ధములయందు అమితాసక్తి కల 
నాలుకా  హితము కలిగించు నిజమిదే వినుమా 
 మధుర పదార్ధముల వీడి మధురాక్షరములను భజించు 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా యని 

వేద విదులచె కీర్తించబడే నీ నామములు 
వ్యాధి  నిర్మూలకములనియు సంసార 
తాపత్రయ నాశ బీజములనియు 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా

తండ్రి మాటను ఔదాల్చ అడవుల కేగు 
సీతా లక్ష్మణ సమేత రామచంద్రుని చూసి
తల్లి కౌసల్య శోకముతో తల్లడిల్లే  
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా

దండకారణ్యమున ఒంటరిగానున్న వేళ 
దశ కంటునిచే అపహరణ కు గురైన సీతా మాత 
ఆర్తి తో నిను తప్ప అన్య దైవమును తలచలేదు 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా

రాముని హృది ని నిలుపుకున్న జానకి 
ఆ రాముని వియోగము తాళలేక రోదించే 
రఘునాధా శరణు శరణు యని 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా

దేవ దానవులకు నొక్క రీతిగా సుఖ దు:ఖముల
నొసగు ఓ విష్ణు  రఘువంశ నాధా  శరణు శరణు
అని పరితపించె సీత సముద్ర మధ్యమున 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా  

 మకరి నోట చిక్కి జలముల లోనికి  లాగబడు వేళ 
 బెదరి  కరి బంధు సమూహములెల్ల చేదిరిపోగా 
 గజరాజు మరల మరల తలచే నీవే దిక్కని 
 ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

పుణ్యములొసగు హరి నామముల స్మరించుచూ 
 తొట్టి యందు పడిన పుత్రుని  పురొహితుడగు 
శంఖయుతుని తో కలసి  హంసధ్వజుడు చూచె 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

మనసు యందు నిన్నే నిండుగా నిలుపుకున్న 
ద్రౌపది అరణ్య వాసి అయినను దుర్వాసుని 
ఆహ్వానించే శిష్య సహితముగా భోజనము నకు 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

యోగుల ధ్యానమునకు సైతము చిక్కనివాడు 
చింతలను తొలగించి చింతితముల నిచ్చు పారిజాతము 
నుదుటిన కస్తూరి తో  నీల వర్ణము తో మెరయు వాడు  
 ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా

సంసార కూపమను అగాధమున పడి పతితుడనైతి 
విషయ వాసనలకు చిక్కి మోహందుడ నైతి 
ఓ విష్ణు నను రక్షించు నా చేయి పట్టి నడిపించు 
 ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా
26 నుండి 50 శ్లోకములు 
(పూజ్య లీలా శుక  విరచిత గోవింద దామోదర స్తోత్రం నకు తెలుగు వివరణ )
 
 

No comments: