Sunday, June 29, 2025

అంతా క్రిష్ణమయం

 అంతా  క్రిష్ణమయం  నా  ఒడలెల్ల  క్రిష్ణమయం

 
కనుల  నిండుగా  గోవింద  రూపం
నాలుక  పండించే   వాసుదేవ  మంత్రం 
కర్ణముల  కింపయ్యనే  క్రిష్ణ  లీలలు
నాసిక  శ్వాసించే  గోపి  లోలుని  వనమాలికా  గంధం
 
అంతా  క్రిష్ణమయం  నా  ఒడలెల్ల  క్రిష్ణమయం
 
హృదయ  కమలమున  కోరి  నిల్పితి  కమల  నాభుని
కరముల  పురిగొల్పితి  కరి  వరదుని  సేవకు
ఉదరం  వాసమయ్యే  దామోదరునకు
పాదములు  నర్తించే  రాదా  ప్రియ  మురళీ  రవముకు
 
అంతా  క్రిష్ణమయం  నా  ఒడలెల్ల  క్రిష్ణమయం
 
శిరము  నుండి  కొనగోటి  వరకు   నర  నరముల
నలు  చెరగులా  నడుచు  చుండె  నీల  మేఘ  శ్యాముడు
తనువుకు  చైతన్యమై , కార్యములకు  కర్తయై
సుఖ  దుఖంబుల  భోక్తయై    నా  ప్రభువై  నిలిచేనే  గోవిందుడు
 
అంతా  క్రిష్ణమయం  నా  ఒడలెల్ల  క్రిష్ణమయం

Monday, June 23, 2025

వారాహీ నవరాత్రులు

 శ్రీ గణేశాయ నమః 

                              శ్రీ శ్యామలాయై నమః 
                              శ్రీ లలితాయై నమః 
                              శ్రీ వారాహీ దేవ్యై నమః 

ఆషాఢ పాఢ్యమి నుండి ఆషాఢ నవమి వరకు వారాహీ నవరాత్రులుగా ప్రసిద్ది 
వారాహీ స్వరూపం ఉగ్రదేవత గా ప్రసిద్ధి . ఆ అమ్మ వారిని సాధారణంగా గృహాలలో 
పండితుల యొక్క ఆధ్వర్యం లో మాత్రమే పూజించటం ఉత్తమమైన మార్గం . 
ఆ తల్లి ని అందరూ ధ్యానించటానికి అనువుగా దూర్వాస మహర్షి అమ్మ వారి లోకాన్ని అమ్మ వారి రూపాన్ని తానూ దర్శించి మనకు దర్శింప చేశారు . 
 
 ఆయన చూపిన మార్గంలో మనమూ ధ్యానం చేసి అమ్మ వారి కృపకు పాతృలమవుదాం . ముందుగా అమ్మ వారి లోకాన్ని దర్శిద్దాం 
 వారాహీ  దేవి నివశించే లోకం చుట్టూ ఉన్న ప్రాకారం లేలేత పచ్చగడ్డి కాంతులతో
ప్రకాశించు మరకత మణులతో నిర్మితమై ఉంటుంది.     


ఆ ప్రాకారాన్ని ధ్యానించటం ద్వారా స్థిరమైన సంపద శ్రేయస్సు పుష్టి పొందగలం . 

ఆ ప్రాకారం లోపల బంగారు తాటి చెట్ల వనం . ఆ వనం పచ్చని కాంతులతో ప్రకాశిస్తుంది . ఆ వనం లో మరకత మణులతో నిర్మితమై రెప రెప లాడుతున్న 
జెండాలతో కూడిన నివాస గృహంలో 

నూఱు బంగారు స్తంభాలతో కూడిన బంగారు వేదికపై , ఒక బంగారు పీఠం 
ఆ పీఠం పై బంగారు రెక్కలతో కూడిన పద్మం . ఆ పద్మం యొక్క నడిమి భాగాన 
కరుగుతున్న బంగారపు కాంతులతో మెరిసిపోవు కర్ణిక (పూల పుప్పొడి ఉండే ప్రాంతము )

ఆ కర్ణిక పై బిందు ఆవరణం దాని చుట్టూ త్రికోణం దాని చుట్టూ వర్తులాకార ఆవరణం దాని చుట్టూ వేయి దళాలతో కూడిన పద్మం ఆ పద్మం చుట్టూ  రెండు 
వృత్తాకార ఆవరణలు 

ఆ ప్రదేశంలో నూట పది అక్షరాల సమూహంతో సేవించబడు ఆ కలహంసి యగు 
వారాహీ దేవి సంచరిస్తున్నది 
   
ఈ విధంగా అమ్మవారిలోకాన్ని ధ్యానించి ఆ తదుపరి అమ్మ వారి రూపాన్ని దర్శిద్దామిలా 


వరాహ ముఖం తో విరాజిల్లుతూ  పద్మముల  వంటి కనులతో 
ఆ పద్మములకు శత్రువైన చంద్రుని శిరము పై అలంకారంగా 
చేసుకుని  లేత బంగారు కాంతులీను దేహంతో   సంధ్యా సమయపు 
సూర్యుని ఎఱుపు రంగుతో శోభిల్లు వస్త్రములు ధరియించి 

తన  చేతులలో హల (నాగలి ) ముసల (రోకలి) శంఖ ,చక్ర, పాశం,
అంకుశం ధరించి  ఒక చేతితో అభయ ముద్ర ను మరొక చేతితో 
వర ముద్ర ను ప్రదర్శిస్తూ 
సంపూర్ణమైన దయతో నిండిన కనులు కలిగి , సమస్త దేవతా స్త్రీల చేత   అర్చించబడి 
హృదయంపై కుంకుమ కాంతులతో ప్రకాశిస్తూ అతి సుకుమారమైన సన్నని నడుముతో ఆ తల్లి ఒప్పారుతుంటుంది . 

ఆ తల్లి మూఢులకు దూరముగా వుంటూ , ఆర్తులకు శుభములు కలిగించు ఆర్తాలి 
కోరుకున్న కోరికలు ప్రసాదించు వార్తాలి . 
 ఆ అమ్మ వారికి నాలుగు దిక్కులలో ఉన్మత్త భైరవి , స్వప్న భైరవి , తిరస్కరిణి దేవి, కిరిపదా అనే నలుగురు  ప్రధాన శక్తులు వుంటారు 
అలాగే అష్ట భైరవులు , పదిమంది హేతుకులు సంచరిస్తూ వుంటారు . 
అలా ఆ తల్లి పరివారాన్ని తలచుకుని అమ్మ వారిని ద్వాదశ నామాలతో స్మరించుకుంటూ 
ఈ స్తోత్రం తో ధ్యానం చేసుకుందాం 
శ్రీ మాత్రే నమః 
 పంచమీ  
దండనాథా  
సంకేతా   
సమయేశ్వరి 
 సమయసంకేతా 
వారాహీ 
 పోత్రిణీ 
 శివా  
వార్తాలి  
మహాసేనా 
ఆజ్ఞాచక్రేశ్వరి 
 అరిఘ్ని
 శ్రీ మాత్రే నమః  

సదనే తత్ర హరిన్మణి-
-సంఘటితే మండపే శతస్తంభే ।
కార్తస్వరమయపీఠే
కనకమయాంబురుహకర్ణికామధ్యే ॥

బిందుత్రికోణవర్తుల-
-షడస్రవృత్తద్వయాన్వితే చక్రే ।
సంచారిణీ దశోత్తర-
శతార్ణమనురాజకమలకలహంసీ ॥ 

కోలవదనా కుశేశయ-
-నయనా కోకారిమండితశిఖండా ।
సంతప్తకాంచనాభా
సంధ్యారుణచేలసంవృతనితంబా ॥ 

హలముసలశంఖచక్రా-
-ఽంకుశపాశాభయవరస్ఫురితహస్తా ।
కూలంకషానుకంపా
కుంకుమజంబాలితస్తనాభోగా ॥

ధూర్తానామతిదూరా-
-వార్తాశేషావలగ్నకమనీయా ।
ఆర్తాలీశుభదాత్రీ
వార్తాలీ భవతు వాంఛితార్థాయ ॥ 

తస్యాః పరితో దేవీః
స్వప్నేశ్యున్మత్తభైరవీముఖ్యాః ।
ప్రణమత జంభిన్యాద్యాః
భైరవవర్గాంశ్చ హేతుకప్రముఖాన్ ॥ 

Friday, June 20, 2025

యదునందనా

 చిలకరింపుమా దయాజలధి మాపై ఘనశ్యామా
మానస తరంగాల మధురభక్తి మొలకెత్తి మాధవా
సంసారజలధి దాటి మోక్షఫలమొంద ముకుందా
హరిని చేరనివ్వని అరివర్గమును ఛేదించి మురారీ
నిర్మల నిరతిశయ ప్రేమభావనతోడ రాధామాధవా
విశ్వవీక్షణలో సర్వము నిన్ను కాంచ వాసుదేవా
 గోలోకం నుండి  గోకులం చేరితివా యదునందనా





Thursday, June 19, 2025

అక్షరలక్ష్మి

 అత్యద్భుత రమణీయ దీప్తిలక్ష్మీ
అనర్ఘ్యరమణీయ కాంతిలక్ష్మీ

మణిదీప్త విలాసహాసలక్ష్మీ
హృదయరాగ రంజిత మనోజ్ఞలక్ష్మీ

ఆకాశరాజు కంఠహారమౌ హరివిల్లులా
భూకాంత సిగ లో పూచిన హసితచంద్రలక్ష్మీ
అందుకో మీకై అల్లిన అభినందన చందన అక్షరలక్ష్మి

Monday, June 16, 2025

క్రిష్ణ నామము

 క్రిష్ణ  నామము  క్రిష్ణ  నామము
రమ్య  మైనది  క్రిష్ణ  నామము
 


భీతి యై  కంసుడు 
 ప్రీతితో  పార్ధుడు
అంగవించిన  నామము
భక్తి  తోడ  ఉద్దవుడు 
 రక్తి  కూడి  గోపికలు
రమించిన  నామము         \\ క్రిష్ణ  నామము //
 ద్వెషియై  శిశుపాలుడు  
ప్రేమ  మీరగ  రుక్మిణి
సంగవించిన  నామము
వాత్సల్యమున  యశోద  
సోదర  భావంబున  కృష్ణ
చేకొన్న  నామము        \\ క్రిష్ణ  నామము //
 పలుక  పరవశంబై    , 
పలు  రుచుల  సమ్మిళితమై
 లక్ష్మీకిరణుల
జీవన  పయనమున  
తోడు  వచ్చు  నామము  \\ క్రిష్ణ  నామము//

గోవిందా దామోదరా

 కలహమునకు కాలు దువ్వించు కుజుని కట్టడి చేయలేక

కమల సదృశములగు నీపాదముల నాశ్రయించితి సహన
కంకణం కంఠసీమ నిలిపి మృదు వచనములు పలికించవే
లక్ష్మీకిరణు హృదయ నివాసీ  గోవిందా   దామోదరా 

చిరాకు ప్రేరేపించు సౌమ్య రూపుడగు   బుధుని తాళలేక
శాంతము కోరి  నీ పాదముల శరణు  జొచ్చితి  శాంతమూర్తీ
 నీ చూపుల చల్లదనంతో హృది చల్లబరిచి  శాంతత నొసగవే
లక్ష్మీకిరణు హృదయ  నివాసీ  గోవిందా   దామోదరా     

నీ దారి నడవనెంచిన నా పాదములను పెడదారి పట్టించ
సద్గురుడు బృహస్పతి పూనిన వేళ దిక్కుతోచక నీ పాద
పద్మముల పై  దృష్టి నిలిపితి దయాళు నీ దారి చూపవే   
లక్ష్మీకిరణు హృదయ నివాసీ  గోవిందా   దామోదరా 

భాగ్యముల నొసగు భార్గవుడు నను అభాగ్యుడిగా
చేయ నెంచినవేళ శ్రీయ:పతీ నా శిరము శ్రీ కరముల
నిత్య  సేవఁలొందు నీ పాదముల నిలుపు భాగ్యమొసగవే
లక్ష్మీకిరణు హృదయ నివాసీ  గోవిందా   దామోదరా 

చేసిన చేష్టలు ఛాయలా వెన్నంటి ఛాయానందనుడు 
 ప్రతిక్రియల రూపంబున ఇచ్చు ఫలములు పరితపింప
చేయ చల్లని నీ పాదంబుల పడితి  చిత్తస్థైర్య మొసగవె
  లక్ష్మీకిరణు హృదయ నివాసీ  గోవిందా   దామోదరా
  
ఆరోగ్యమొసగు దినకరుడు ప్రతికూల భావనలతో తనువును
తపింపచేయు వేళ తానే నీవని తలచిన మాత్రమున శతకోటి 
సూర్యప్రభల వెలుగు నీ పాదముల పై  నా భావనలు నిలుపవే
  లక్ష్మీకిరణు హృదయ నివాసీ  గోవిందా   దామోదరా  

ఆహ్లాదమిచ్చు చందురుడు మనఃసంద్రమును ఆటుపోట్ల
కల్లోలపరచువేళ విశ్వ మోహనుఁడా మా మనంబుల నీ
పాదరేణువుల స్పర్శతో కదలికలు లేని క్షీరాబ్ధి  చేయవే   
  లక్ష్మీకిరణు హృదయ నివాసీ 

గోవిందా   దామోదరా    

చంచల చపలత్వముల రాహుకేతులు నన్నల్లరి పాల్చేయు వేళ
తిరుమల గిరులపై స్థిరముగా నిలచిన నీ పాదముల   నాశ్రయించితి
నీ నామస్మరణ ఎరుక తప్ప అన్యములేమి కోరని బుధ్ధినొసగుమా
  లక్ష్మీకిరణు హృదయ నివాసీ  గోవిందా   దామోదరా    
 
కమల లోచనా వేన వేల కాంతులు విరజిమ్ము నీ  
కనులు కురిపించు మాపై కారుణ్యామృత బిందువులు 
మము  దహించు కర్మఫలముల కాలాగ్నులు చల్లారగా 
  లక్ష్మీకిరణు హృదయ నివాసీ  గోవిందా   దామోదరా    

 కాలు మడతపడదాయే కనురెప్ప మూత పడదాయే కాలం
 కదిలిపోతున్నా కాయం కదలనీయక కాలచక్రంలో తిరిగాడు  
మా పై  దయావర్ష మనుగ్రహించ నిలచితివా తిరుమలగిరిపై
 లక్ష్మీకిరణు హృదయ నివాసీ  గోవిందా   దామోదరా 

Wednesday, June 11, 2025

ఓ మంజులవాణి

ఓ  యమ్మ ! ని  కుమారుడు ,
మా  యిండ్లను   బాలు  బెరుగు  మననీడమ్మ !
పోయెద  మెక్కడికైనను ,
మా  యన్నల  సురభులాన  మంజులవాణి !
 
ఓ  మంజులవాణి ! మీ  పిల్లవాని  ఆగడాలు  మితి  మిరిపోతున్నాయి
మా  అన్న  నందుని   గోవుల  మీద  ప్రమాణం  చేసి  చెబుతున్నాం
వేరేచటికైనను వెళ్లిపోతాము  అని  గోపికలు  మొర  పెట్టుకున్నారు
యశోదమ్మతో 
 
 
చన్ను  విడిచి  చనుదిట్టటు
నెన్నడు  బోరుగిండ్ల  త్రోవ  నెరుగడు  నేడుం
గన్నులు  దెరవని  మా  యి 
చిన్న    కుమారకుని  రవ్వ  సేయమ్దగునే
 
ఎల్లప్పుడూ  నా  ఒడిలో  నే  వుంటూ  పాలు  త్రగాటమే  తప్ప
ఇరుగు  పొరుగిండ్ల  త్రోవ  కూడా  తెలియని  నా  చిన్ని  కృష్ణుని  మీద
ఇన్ని  అభాండాలు  వేస్తారా  అంటూ  ఆ  యశోద  వారిని  కేకలు  వేస్తుంది
 
ఇది  మనకు  రోజు  నిత్యకృత్యమే  కదా ……..పిల్లలు  అల్లరి  చేయటం
ఇరుగు  పొరుగు  అమ్మలక్కలు  పంచాయితీకి  వస్తే  వారి  మీదే  మనం
అరవటం 
 
కాని  సమస్త  లోకాలకు  పోషకుడైన  ఆ  చిద్విలాసముర్తికి
పేద  గోపకుల  ఇండ్ల  లో  దూరి  కుండలు  పగులగొట్టి  వెన్న  దొంగలించాల్సిన
అవసరమేమిటి
 
తరచి  చూస్తే  తత్వం  భోదపడుతుంది
 
ఇక్కడ  కుండ  ను  మన  దేహం  తో  పోల్చుకోవచ్చు 
 
కుండ  తయారు  కావటానికి  మట్టి ,  నీరు , అగ్ని , గాలి  అవసరం  అలాగే  కుండ
లోపలి  భాగం  శూన్యం  తో  వుంటుంది
మన  శరీరం  కూడా  అవే  ధాతువులతో  నిర్మించబడుతుంది
 
కుండ  పగిలి  మట్టిలో  కలసినట్లే  ఈ  శరీరం  పగిలి  చివరకు  ఆ  మట్టిలోనే  కలసిపోతుంది
 
ఇక  కుండలోని  వెన్నను  మన  మనసుతో  పోల్చుకోవచ్చు
 
వెన్న  ప్రధానం  గా  మూడు  లక్షణాలు  కలిగి  వుంటుంది
అవి  తెలుపుదనం , మృదుత్వం , మదురత్వం
 
మనసు  మూడు  గుణాలను  కలిగి  వుంటుంది . అవి  సత్వ , రాజ తామస  గుణాలు
 సత్వగుణం  తెలుపు  రంగును  కలిగి  వుంటుంది . శాంతం , సత్ప్రవర్తన , సాదు  స్వభావం
ఇవన్ని  సత్వగుణం  లక్షణాలు
అందుకే  తెలుపును  శాంతికి  చిహ్నం  గా  వాడతాం
 
అలాగే  మృదుత్వం ………మ్రుదుత్వమంటే  తేలికగా  కరిగిపోయే  స్వభావం
అది  దయా  గుణానికి  చిహ్నం . ఇతరుల  సమస్యలను  తమవిగా  భావించి
వారి  కష్టాలను  చూసి  కరిగి  వారికి  సహాయం  చేయటానికి  సిద్దపడటం
 
ఇక  వెన్న  యొక్క  చివరి  గుణం ………పరిమళత్వం   తో  కూడిన  మదురమైన  రుచి
 
అది  మనిషి  యొక్క  మాట  తీరుతో  పోల్చవచ్చు  మనం  ఎల్లప్పుడూ
చక్కని  మాట  తీరు  కలిగి , ఇతరులను  నొప్పించక    వుంటే  మనకు  అనేక
స్నేహ  సమూహాలు  ఏర్పడతాయి
 
అట్టి  వారి  హృదయాలలో  ఆ  హృషీకేశుడు   కొలువై  వుంటాడు
 
అట్టి  మనసున్న  వారు  కనుకనే  గోపికల  మనస్సులను  దోచుకున్నాడు
ఆ  మానసచోరుడు
 
మరి  మనం  కూడా  మన  మనస్సులను  నవనీతం  చేసి  ఆ  వెన్న  దొంగకు
దోచిపెడదామా


Friday, May 30, 2025

నింగిలోని జాబిల్లి

 








నింగిలోని జాబిల్లి నేలపైన సిరిమల్లి

ఏటిలోని చేపపిల్ల అడవిలోని జింకపిల్ల
ఆలుచిప్పలో దాగిన ఆణిముత్యం
పూలతేరులో ఒదిగిన కోమలత్వం
పురి విప్పిన మయూరం 
అరవిచ్చిన మందారం
ఉక్కపోతలో తాకే పిల్లతెమ్మర
ఒంటరి నడకలో తుంటరిగా తాకే చిరుజల్లు
కలసి కలబోసి కనులముందు నిలచిన కలువబాలా నీవు నిలచిన తావు లక్ష్మీనివాసం
హసితచంద్రమా' 

Monday, May 19, 2025

అజ్ఞాతవాసి

 


అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు
 నును సిగ్గుల ఎరుపెక్కే చెలి చెక్కిలి ఆనవాలు 
 ముద్ద మందారపు మాటున చిక్కేనిదిగో
 అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 వలపుల గాలం విసిరే నీ వాలు కనుల సోయగం మత్స్యకన్య కంటి మెరుపులో కనబడేనిదిగో 
 అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 ముత్యపు మెరుపుల వరుసను ప్రతిఫలించె నీ
 నవ్వుల కిలకిలల జాడ గలగలా సాగే సెలయేటి సవ్వడులలో దొరికేనిదిగో
అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 హొయలొలికించె నెచ్చెలి నడక వాన మబ్బుకు 
మురిసి నాట్యమాడే నెమలి నడకలో దాగేనిదిగో 
 అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 పిరుదులపై నాట్యమాడే నీలి కురుల వలపు పాశం 
 బుస కొట్టే నాగు పడగలో నవ్వేనిదిగో
 అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 చమట గంధం అలుముకున్న నీ దేహ సౌరభం 
 మల్లెల పరిమళాల లో ఒదిగెనిదిగొ 
 అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 నీ ఆనవాలుకై అచట నిచట వెదికి అలసిన మది నా గుండె గూటిలో ఒదిగిన నిన్ను చూసి సేదతీరేనిదిగో

Saturday, May 17, 2025

ఆర్యా ద్విశతీ

 ఆర్యా ద్విశతీ ఇదొక సర్వోత్కృష్ఠమైన కావ్యం

దీనిని భావన చేయగలిగితే వారి శరీరమే మణిద్వీపం అవుతుంది హృదయం చింతామణి
గృహమవుతుంది వారిలోని చైతన్యమే పరదేవత అవుతుంది
 తలచిన మాత్రం చేతనే మనలను పునీతులను చేయు అత్రీ అనసూయ దంపతుల పుత్రుడు రుద్రాంశ సంభూతుడు క్రోథమే అలంకారంగా గల 
మహర్షీ అగు దూర్వాసుడు తాను దర్శించిన అమ్మ లోకాన్ని అందులోని వివిధ దేవతా శక్తులను వారు నివసించే ప్రదేశ విశేషాలను అద్బుతంగా వివరించిన గ్రంధరాజమే ఆర్యా ద్విశతి
 ఆర్యా ద్విశతి భావన చేసిన వారికి  అంబ సాక్షాత్కరించునని నడిచే దైవంగా ప్రసిద్ధి చెందిన కంచి కామాక్షీ అవతారమే అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వాక్కు
 అట్టి ఆర్యా ద్విశతిని భావనాత్మకంగా వివరించటం  ద్వార నా మనసులో ఆ  మణిద్వీపాన్ని చెరగని విధంగా చిత్రించుకుని తరించే చిరుప్రయత్నమిది

వందసార్లు చదివిన దానికన్నా ఒక్కసారి రాసిన ఫలమెక్కువ కదా
ఈ విధంగా అమ్మ యెక్క లోకపు ధ్యానం నిరంతరం చెసే ప్రయత్నం 

Thursday, May 15, 2025

గీతాచార్యుడు


నాది నావారాలను మోహము వీడి నిస్సంగుడ కమ్ము

ప్రోది ఫలాశ వీడి ఫలవృక్షరాజభంగి ప్రయత్నశీలి కమ్ము
మోది జిహ్వచాంచల్యమణిచి నిస్సంశయ శరణార్ధి
కమ్ము
ఇదియే సుఖజీవన మార్గము సవ్యసాచీ అనె సర్వనిలయుడౌ గీతాచార్యుడు

Tuesday, May 13, 2025

సుందరి గోపిక

 సుందర వనముల హృదయ మందిరమందు  నిలచిన కడు
సుందరుడా బాల ముకుందుని ముద్దుమోవిగని విరహమునా  

సుందరి గోపిక మనసుపూదోటలో విరిసిన రస భావమాలికల 
సుందరమగు అక్షర కూర్పుతో అక్షరుని అభిషేకించసాగె  

Monday, May 12, 2025

పగడపు పెదవుల విల్లు

 పగడపు పెదవుల విల్లు విడిచిన ముత్యాల

పలువరుస చిరునగవు శరములు మదిని గుచ్చ
వజ్రపు తునక మెరయు సంపంగి నాశికా పరిమళాల మనసు మురియ
ప్రేమ కొలనులో విప్పారిన కలువ కనుల విరిచూపుల జల్లులలో మేని తడువ
పూర్ణచంద్రుని తలపించు మోములో పూయు 
నునుసిగ్గు మొగ్గల వెన్నల కాంతుల వర్షధార 
సంతతముగా నను తడపనిమ్ము నెచ్చెలి

Sunday, May 11, 2025

చెంగావి కుసుమ



 కుంకుమ పరాగమలదిన గుండు మల్లియ మోముతో
మక్కువ జలజపు జల్లుల విరియు కనులతో
చక్కని చిరునగవు వెన్నల తడితో మొరయ
పగడపు పెదవులతో
ఎక్కడ పూచెనీ చెంగావి కుసుమ కోమలి కనులెదుట నిలిచెనీ మనోహరీ

Saturday, May 3, 2025

మాధవుని


 కుంతలము మకరందపరిమళ పుష్పమాలిక చుట్టి 

శిఖముపై పంచెవన్నల మయూఖ  పింఛము నిలిపి
పట్టు పీతాంబరము దాల్చి విహంగ వీక్షణ చేయు 
 మాధవునిచేరె శుకములు మామిడని మాధుర్యము గ్రోల


ముద్దు ముద్దు పల్కుల ముదము గూర్చిన 
శుకముల ఖ్యాతి లోకమున ఇనుమడింప
శుకబ్రహ్మపు నోట ఒలికించె మక్కువతోడ
మధురభాగవత సుధారసధార మాధవుండు

Friday, May 2, 2025

మందార మందారా

 

గులాబి రేకుల పెదవుల చిట్టి సున్నుండ చుట్టి
కలువ కనుల మమ కారపు తేనియ జల్లుతూ
 నెలవంక నగుమోము సిగ్గు మల్లియలు పూయ
నీలపు ఛాయ దాల్చి నిలిచె ముంగిట మందారం

Thursday, April 24, 2025

శుకశారీ


 హరికథాసుధ గానము చేయుచూ నొక శుకము
హరినామామృత బిందులేఖనముతో నొక శారీ
హరిత వన తరువుల ఒడిలో సంవాదుచేసె
హరిలీలావిలాసపు మర్మములెల్ల అనురక్తితో

Friday, April 18, 2025

వెన్నెల రేడు


వెన్నెల రేడు చల్లని చూపుల విప్పారిన కలువ వోలె 
వెన్నుని సంకీర్తనామృత తరంగాలు తనువెల్ల తాక
కన్నుల పారవశ్యభావమొలక హరికి కనురెప్పల 
సన్నిధి చేసే హరిణేక్షణ ఇహలోక వీక్షణ మరచి

Tuesday, April 8, 2025

 కలడు కలడనువాడు కలడో లేడో నని సంశయించిన గజరాజ గమనం వీడి 
కలడు కలడనువాడు లేడని చూపు 
తావే లేదని నిశ్చయాత్మక భక్తి చూపిన
ప్రహ్లదుని దారి పట్టిన జీవితంబులు
ఆహ్లదభరితంబులు చేయడే చక్రి

Monday, April 7, 2025

 భక్తాగ్రేసరుడగు భరతుని కూడి రామ పరివారమెల్ల 
అచ్చెరువొందుతూ చూచుచుండిరి  లోకపావని
ప్రేమతో నొసగిన ముత్యాలపేరులో రాముని  పేరుయు 
రూపుఁయు కానక 

తబ్బిబ్బగుచున్న పవనసుతుని 

Saturday, April 5, 2025

కలువల ప్రియుని

 నిర్మలాకాశసౌధంబులో నక్షత్రమాలికాభరణముల్
  దాల్చిన కలువల ప్రియుని కులభూషణుడు బంగరు వేణియపై నిరతమాలపించు ఆనంద గమకములే  విశ్వగమనపు నిర్ధేశకంబులాయే

వెన్నుని పిల్లనగ్రోవి పిలుపుతో  విరిసిన తారకలతో తోయదమండలమెల్ల మెరియ ముకుందుని మోము పై వీచు ఆనందపారవశ్యపు తెమ్మెరలతో కలువలరేడు పసిడి కాంతులీన భావించు లక్ష్మీకిరణుల మానసాకాశంబు వహ్నిమండల వాసినీ విహారస్థలంబాయే

శ్రీమాన్

భగవన్నామ సంకీర్తన అను తపస్సు నందు , వేదములను శాస్త్రములను అధ్యయనం చేయుట  యందు అమితమైన ఆసక్తికలవాడు , తపస్వీ  జ్ఞాన సంపన్నులలో శ్రేష్ఠుడు అయినా నారద మహర్షిని వాల్మీకి ముని పుంగవుడు ఇలా ప్రశ్నించెను
 ఈ లోకంలో ఈ కాలంలో (ప్రశ్న వేసే సమయానికి లోకంలో ఉన్నటువంటి 
1 ) గుణవంతుడు 
2 ) వీర్యవంతుడు (వికారములను జయించినవాడు)
3 ) ధర్మజ్ఞుడు
4 ) కృతజ్ఞుడు
5 ) సత్యవాక్కుడు 
6) దృఢవ్రతుడు ( చేసిన సంకల్పానికి కట్టుబడి వుండేవాడు ) 
7 ) చారిత్రముతో నడుచువాడు ( ఆచార సంప్రదాయములు గౌరవించేవాడు )
 8) సర్వ భూతములకు (జీవులకు) హితము కలిగించువాడు
 9 ) విద్వాంసుడు 
10) సమర్ధుడు 
11) ఏకప్రియదర్శనుడు (ఏ సమయంలో చూసినను మనసుకు ఆహ్లాదం కలిగించువాడు )
 12 ) ఆత్మవంతుడు (ఆత్మజ్ఞానం కలిగినవాడు) 
13 ) జిత క్రోధుడు (కోపాన్ని జయించినవాడు )
14  ) ద్యుతి మంతుడు ( చక్కని కాంతి తో కూడిన రూపలావణ్యములు కలవాడు)  
15 ) అసూయ లేనివాడు  
16) యుద్ధంలో ఎవనికి కోపం కలిగితే దేవతలు కూడా భయపడుదురో  అట్టి నరుడు ఎవ్వరు?పదహారు లక్షణాలు కలిగిన పరిపూర్ణ మానవుడు ఈ సమయంలో ఎవరైనా వున్నారా అని వాల్మీకి మహర్షి ప్రశ్న
దానికి సమాధానంగా నారద మహర్షి ఇక్ష్వాకు వంశమునందు జన్మించినట్టి వాడు ప్రజలందరి మన్ననలు పొందిన రాముడను ప్రభువు కలడు అంటూ రాముని యొక్క లక్షణాలను వివరించసాగిరి
 1) నియతాత్ముడు (అసాధారణమైన దివ్య మంగళ విగ్రహ రూపం కలవాడు)
2) మహా వీర్యుడు (తనను మించిన వీరుడెవ్వడు లేనట్టివాఁడు )
 3) ద్యుతి మంతుడు ( చక్కని కాంతి తో కూడిన రూపలావణ్యములు కలవాడు) 
 4) ధృతిమంతుడు (తన శాసనముకు అధీనమై నడుచు లోకము కలిగి వున్నట్టివాడు )
5 ) వశీ ( తన ఇంద్రియములను తన అధీనంలో వుంచుకున్నవాడు , సర్వ జీవులను  గుణములచేత తన వశం చేసుకున్నవాడు )
6) బుద్ధిమంతుడు (అన్ని విషయములందు పరిపూర్ణ పరిజ్ఞానం కలిగినవాడు )
7) నీతిమంతుడు (సృష్టి ని క్రమ పద్దతిలో నడుపుటకు అవసరమైన నీతి మర్యాద కలిగినవాడు)
8) వాగ్మీ (ప్రశస్తమైన  మంగళకరమైన  సంతోషం కలిగించు వాక్కు కలవాడు)
9) శ్రీమాన్ (శ్రీమంతుడు, సమృద్ధము నిత్యము అయినట్టి సంపద కలిగినవాడు )
10) శత్రు నిబర్హణుడు (బాహ్య మరియు ఆంతరంగిక ( శరీరమునకు మనసుకు ఆపద కలిగించు )శత్రువులను సంహరించినవాడు)
11) విపులాంసుడు (విశాలమైన ఎత్తైన భుజములు యొక్క పై భాగం కలిగినవాడు ; చంకలు ,వక్షస్థలం , కడుపు, ముక్కు, భుజ స్కంధములు , నుదురు ఎవరి యందు విశాలంగా వుండునో వారు ఎల్లప్పుడూ సుఖములు పొందుదురు )
12) మహాబాహు (పొడవైన గొప్ప భుజములు కలవాడు, నున్నని బలమైన మోకాళ్లవరకు విస్తరించు  బాహువులు కలిగినవారు గొప్ప చక్రవర్తి అగును )
 13) కంబుగ్రీవ (శంఖము వంటి మెడ కలవాడు మూడు రేఖలతో విరాజిల్లు అందమైన మెడ  )
14) మహాహనుః ( గొప్ప దవడలు కలవాడు, చక్కని దవడలతో  నున్నవారు ఎల్లప్పుడూ మంచి ఆహరం భుజించగలరు అంతే కాక ఆయువున్నంతవరకు సుఖపడుదురు  )
15) మహోరస్కుడు (విశాలమైన వక్షస్థలం కలిగినవాడు )
16) మహేష్వాసుడు (గొప్ప విల్లు ధరించి యుండు గొప్ప విలుకాడు )
17) గూఢజత్రు: ( కనబడని మూపుల సంధులు (ఎముకలు) కలవాడు ఆరోగ్య చిహ్నం )
18) అరిందమః (శతృవులను పాపములను నశింపచేయువాడు )  
19) ఆజానుబాహు (మోకాళ్ళ వరకూ విస్తరించిన భుజములు కలవాడు )
20) స్సుశిరా  (సమమైన గుండ్రని ఛత్రము వంటి శిరము కలవాడు ; ఏకఛత్రాధిపత్యముతో భూమిని పాలించగల దీర్ఘాయువు కల లక్షణము )
21) స్సులలాట ( మంచి వెడల్పైన నుదురు కలవాడు; రాజ  చిహ్నం)
22) స్సువిక్రమః  ( సుందరమైన నడక కలవాడు ; ఎవరి నడక సింహము వృషభము ఏనుగు పెద్దపులి వీటిని పోలియుండు నో వారు అన్నిటా విజయము పొంది సుఖింతురు )
23) సమ (మిక్కిలి పొడుగు మిక్కిలి పొట్టి కాక వుండువాడు , తొంబదిఆరు అంగుళాల ఎత్తు సార్వభౌమత్వమునకు చిహ్నం )
24) స్సమవిభక్తంగుడు ( ఏ అవయవము ఎంత పరిమాణంలో వుండిన చూచుటకు అందంగా వుండునో ఆయా అవయవములు ఆయా పరిమాణంలో వున్నవాడు ; కనుబొమలు ముక్కు రంధ్రములు కనులు చెవులు పెదవులు చనుమొనలు మోచేతులు చేతి మణికట్టులు మోకాళ్ళు వృషణములు పిరుదులు  చేతులు కాళ్ళు పిరుదుల పైభాగం ఇవి ఎవరికి సమముగా వుండునో అతడు ప్రభువు అగును )
25) స్నిగ్ధవర్ణుడు (మెరుపు వర్ణము కలవాడు ఆకర్షణీయమైన వర్ణం కలవాడు ; కనుల యందలి మెరుపు సౌభాగ్యాన్ని; దంతములు యందలి మెరుపు భోజన సౌఖ్యాన్ని , చర్మము యొక్క మెరుపు శయ్యాసౌఖ్యాన్ని , పాదముల యందలి మెరుపు వాహన సౌఖ్యాన్ని సూచిస్తుంది )
26) ప్రతాపవాన్ ( తేజస్సు తో అలరారువాడు )
27) పీనవక్షుడు ( బలమైన వక్షస్థలం కలవాడు )
28) విశాలాక్షుడు ( తామర రేకులవంటి విశాలమైన కనులు కలవాడు)
29) లక్ష్మీవాన్ ( సర్వాంగ సుందరుడు )
30) శుభ లక్షణః ( సమస్తమైన శుభ లక్షణములు కలవాడు)
31) ధర్మజ్ఞుడు (శరణు కోరిన వారిని వదలని స్వభావం కలవాడు )
32) సత్య సంధుడు  ( ఆడిన మాట తప్పనివాడు )
33) ప్రజలకు హితం చేయుట యందు ఆసక్తి కలవాడు 
34) యశస్వీ ( ఆశ్రయించిన వారిని రక్షించుటలో గొప్ప కీర్తి కలవాడు )
35) జ్ఞానసంపన్నుడు
 36) శుచి (మంగళకరమైన పవిత్రమైన వాటికి కూడా మంగళత్వాన్ని పవిత్రతను చేకూర్చగల పరిశుద్ధమైన నడవడిక కలవాడు)
37) వశ్య ( ఆశ్రయించినవారికి లోబడివుండువాడు )
38 ) స్సమాధిమాన్ ( ఆశ్రయించినవారిని రక్షించు ఆలోచనయే ఆదిగా కలవాడు )
  39) ప్రజాపతి సమ (బ్రహ్మ సమానుడు )
40) శ్రీమాన్ ( శ్రీమంతుడు )
41) ధాత  (సర్వ జీవులను పోషించువాడు )
42) రిపు నిషూదనః  (శత్రువులను సంహరించువాడు)
43) జీవ లోకమును రక్షించువాడు 
44) ధర్మమును రక్షించువాడు 
45) స్వధర్మ రక్షకుడు
46) స్వజనులను రక్షించువాడు
 47) వేద వేదాంగ తత్వజ్ఞుడు 
48) ధనుర్వేదము (విలువిద్య) నందు నిష్ఠ ప్రావీణ్యము కలవాడు
 49) సర్వ శాస్త్రములు యొక్క అర్ధము రహస్యములు తెలిసినవాడు 
50) స్మృతిమంతుడు (జ్ఞానము నందు  మరుపు   లేనివాడు)
51) ప్రతిభావంతుడు 
52) సర్వ లోక ప్రియుడు 
53) సాధువు
 54) అదీనాత్మా ( దైన్యము లేని వాడు )
55) విచక్షణా జ్ఞానము కలవాడు 
56) నదులు సముద్రమును చేరు నట్లు సత్పురుషులచే ఎల్లప్పుడూ పొందబడువాడు 
57) ఆర్యుడు (పూజించదగినవాడు )
58) సర్వ సముడు (అందరిని సమ భావంతో చూచువాడు)
59) సదైక ప్రియ దర్శనుడు ( చూడగానే ప్రియము కలిగించువాడు)
60) సర్వ గుణోపేతుడు (సకల కల్యాణ గుణములు కలవాడు )
61) కౌసల్యానంద వర్ధనుడు ( కౌసల్య యొక్క ఆనందమును పెంపొందించువాడు )
62) సముద్రము వంటి గాంభీర్యము కలవాడు (తనలోని సంపదను సముద్రుడు ఎట్లు బయటకు కనబడనీయకుండునో అట్లే తనలోని భావాలను బయటకు వ్యక్తం కానీయనివాడు ) 
63) హిమవంతునివలె ధైర్యము కలవాడు (వర్షములు పిడుగులతో కొట్టబడుచున్నప్పటికీ గిరులు చలించనట్లు ఆపదలు  చుట్టిముట్టినను ధైర్యము కోల్పోని స్వభావం)
64) విష్ణువుతో సముడైన వీర్యము కలవాడు
65) చంద్రుని వలె చూడగానే ఆహ్లాదం కలిగించువాడు 
66) క్రోథమునందు కాలాగ్ని సముడు 
67) క్షమాగుణంలో పృథ్వి సముడు 
68) త్యాగమునందు కుబేరుని వంటి వాడు 
69) సత్యమునందు అపర ధర్మ దేవత వంటివాడు 
పదహారు లక్షణాలు కల మానవుడి గురించివాల్మీకి మహర్షి అడిగితే  అరువది తొమ్మిది లక్షణాలు కల పరిపూర్ణుడైన శ్రీరాముని చూపించారు నారద మహర్షి  

రాముని చరితం దివ్యమైనట్టిది అట్టి రాముని చరితను తెలిపే నూరు శ్లోకాల సంక్షిప్త రామాయణం నెలకోమారు పారాయణం చేసినా ఊహించని ఉత్పాతాల నుండి రక్షణ దొరుకుతుంది 

Tuesday, April 1, 2025

ముద్దమందారమా

 తూరుపు కాంత సిగలో మురిసే అతసీ పుష్పమే
నీ వదనం
వజ్రపు వెలుగుల వెన్నెల తురక అద్దిన సంపెంగ
సొగసిరి నీ నాశిక
పండిన దొండపండుపై వాలిన చెరకు వింటిలా
ముచ్చట గొలుపు అధరద్వయం
నిర్మల సరోవరమున విరిసిన కలువల వోలే
చల్లని చూపుల మల్లెలు రువ్వే ఆ కనులు
ముద్దమందారమా ముగ్ధ సింధూరమా
చెదిరిపోదు నీ రూపు హసిత చంద్రమా

Monday, March 31, 2025

సదానందుడు

 శిఖమున పింఛము దాల్చి పీతాంబరములు కట్టి
చందనాదులతో మెరయు దేహముతో గోకులాన  
ఆనంద తరంగాల తేలియాడు సదానందుడు 
వేణుగాన తరం

గాల జగతి కి ఆనందలహరులూదే 

పచ్చని పైరు పైటేసిన

 ముడుచుకున్న నుదుటి కమలాన్ని విప్పార్చే
 నులివెచ్చని తొలి పొద్దు కాంతి రేఖలా 
ఇంకిన కనుల కొలనులో అనురాగపు చిరుజల్లులు 
కురిపించే మేఘమాలికలా 
పొడిబారిన పెదవులపై చిరునగవుల తళుకులద్దు 
తారకల మాలికలా 
 వడగాల్పు సెగలకు కమిలిన దేహాన్ని పులకింపచేయు 


చల్లని చిరుగాలి తరగలా 
పచ్చని పైరు పైటేసిన ప్రకృతి కాంతలా మోమున 
మధువులొలుకుచున్నది హసితచంద్రిక  

Sunday, March 30, 2025

యుగాది /ఉగాది

 యుగాది /ఉగాది 


ఉగాది అనగానే ఉగాది పచ్చడి  పంచాంగ శ్రవణం ప్రత్యేకం 
చాలామందికి తమ రాశి ఫలాల గురించి ఆసక్తి అవి ఆశాజనకం గా
లేకపోతే ఆందోళన వుంటాయి 
మాది సింహరాశి మా రాశి  గురించి ఎప్పటి నుండో ఊదరగొట్టేస్తున్నారు 
అష్టమ శని ఇక వీళ్ళ పని ముగిసిపోయినట్లే అని 
నిజంగా అంత భయపడాల్సిన అవసరం వుందా ! కాలం యొక్క ప్రతికూలత 
తగ్గించుకుని అనుకూలత పొందటానికి వున్న కొన్ని తేలిక మార్గాలు తెలుసుకుందాం 
ఈ సంవత్సరానికి అధిపతి సూర్యభగవానుడు . ప్రత్యక్ష నారాయణుడైన సూర్యునకు 
రోజు శ్రీ సూర్యాయ నమః అని  నమస్కరించుకోవటం ఆదిత్య హృదయం చదువుకోవటం ద్వారా కాలం యొక్క అనుకూలత పొందవచ్చు
ఆదిత్య హృదయం చదవటానికి సుమారు 4.నిమిషాల 25 సెకండ్ల కాలం పడుతుంది
సమయం లేదనటం పెద్ద అబద్దం
శ్రీరాముడు సూర్యవంశ సముద్భవుడు
అమ్మ లలిత భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ
అమ్మ లలిత భానుమండలంలో భగమాలినీ శక్తి రూపంలో వుంటుంది
వార్తా పత్రికల్లొ చదువుతుంటాం వేసవి లో....భానుడి భగ భగ అని ఈ తెలుగు నుడికారం వెనుక మర్మం ఇదే

అట్టి ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానునకు నమస్కరించుకోవటం సర్వశ్రేయోదాయకం

అలాగే లలితా సహస్రనామం అనేక నామాల సమాహారంతో కూడుకుని ఉంటుంది 
అలాంటి నామాల సమాహారం ఓ పూలగుత్తివలె ఆహ్లాదకరంగా ద్రాక్ష గుత్తి వలె 
మధురంగా వుంటుంది . ఒక్కో గుత్తి ఒక్కో ఫలాన్ని అందిస్తుంది 

అందులోని ఒక గుత్తి : శ్రీమాత్రే నమః 
భవదావసుధావృష్టి: =సంసారమనెడి దావాగ్ని ని శాంతింపచేయు అమృతవర్ష స్వరూపరాలు 
పాపారణ్యదవానలా =పాపమనెడి అరణ్యమును దహించివేయు దావాగ్ని 
దౌర్భాగ్యతూలవాతూలా=దౌర్భాగ్య
మనెడి దూది ని చెదరగొట్టు సుడిగాలి వంటిది 
జరాధ్వాంతరవిప్రభా  =ముసలితనము యొక్క భాధలను తొలగించు సూర్యకాంతి వంటిది
భాగ్యభ్దిచంద్రికా = భాగ్యములనెడి సముద్రమును పొంగించు వెన్నెల
భక్తచిత్తకేకిఘనాఘనా =భక్తుల మనసనెడి నెమలికి ఆహ్లదమిచ్చు వానమబ్బు వంటిది
రోగపర్వతధంభోలి =రోగములనెడి పర్వతములను ధ్వంసం చేయు వజ్రాయుధం
మృత్యుదారుకుఠారికా =మృత్యువను చెట్టును నరుకు గొడ్డలి వంటిది
శ్రీమాత్రే నమః 
 ఈ నామాలను పదే పదే   మననం చేయటం వలన మనకు కలిగే అష్టకష్టముల నుండి ఉపశమనం కలుగుతుంది
   మనిషి జీవితాన్ని బాగా ప్రభావితం చెసే అవయవం నోరు అది లోపలికి తీసుకునే ఆహారం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యం ప్రభావితమవుతుంది. అది బయటకు పంపే అక్షరం ద్వారా మన జీవన గమనం ప్రభావితమవుతుంది అట్టి నోటిని (పెదవుల నుండి కంఠం వరకు) ఆధారం చేసుకుని వేయి లలితా నామాలను లోకానికి అందించిన వశిన్యాది వాగ్దేవతలు ఉంటారు వీరి నామాలు నిత్యం మననం చేయుట ద్వారా చక్కని ఆరోగ్యం వాక్శుద్ధి దక్కుతాయి.వీరు సాక్షాత్ లలితా దేవి పరిపూర్ణ అవతారములు
శ్రీమాత్రే నమః
 వశిని కామేశ్వరీ మోదినీ విమల అరుణ  జయినీ సర్వేశ్వరీ కౌళినీ  
శ్రీమాత్రే నమః

చైత్రనవరాత్రులు శ్రీరాముని ఆరాధనకు లలితా అమ్మవారి ఆరాధనకు విశేషమైనట్టివి  చైత్రశుక్ల నవమి మధ్యాహ్నం పునర్వసు నక్షత్రంలో 12గంటలకు రాముని పుట్టుక అయితే అర్ధరాత్రి 12గంటలకు మృగశీర్షా నక్షత్రంలో పార్వతీ దేవి జననం  

ఇక శని అంటే ఈరోజు మనం చేసిన కర్మకు కాలం యొక్క  ప్రతిస్పందన అంతే
ఎపుడో మనకు తెలియకుండా జరిగి పోయిన తప్పుల వలన కలిగే ప్రతిచర్యల ముప్పు తగ్గాలంటే పైన చెప్పిన వాటితో పాటు 
వికలాంగులకు పేదలకు ఆహారం అందించటం వీధి కుక్కలకు (ఇంటి యందు కుక్కలు పెంచరాదు  దోషకారకం) ఆహారం నీరు
అందేలా చూడటం గోవులను పోషించటం ఉపయుక్తమైన పనులు

జైశ్రీరామ్

Saturday, March 22, 2025

శంఖుపుష్ప

 శంఖుపుష్ప లతలతో అల్లుకున్న 
చామంతి మోముపై విరిసిన మల్లె 
మొగ్గల చిరునవ్వు చంద్రికలు 
మనసును ముప్పిరిగొన 

అరవిచ్చిన నల్ల కలువ కనుల 
మురిపెపు కాంతులు చామంతి 
మోముపై తళుకులీనుతూ 
మనసును రంజింప 


ఓ హసిత చంద్రికా నీవు నిలచిన
 తావు ఆనంద సరాగాల సంద్రమాయెనే 

Sunday, March 16, 2025

హసిత చంద్రమా

 ఇంద్రనీలమణుల కాంతులతో మెరయు 
కనుల కొలనులో విరిసే ప్రేమ సుమాలు 
మదిని మీట 
మార్గశీర్షోదయాన గులాబీ రెక్కలపై మెరిసే 
మంచుబిదువుల్లా లేత ఎరుపు పెదవుల నడుమ 
పూచే హసిత చంద్రికలు మనసు న  ముప్పిరిగొన 
మరకత కుండలపు కాంతులతో చెంపల కెంపులు 
వింతశోభల మెరియ 
విప్పారిన నవకమలంలా ఆ వదనం హృదిలో 
చిత్రించుకుపోయెనే

హసిత చంద్రమా 

జగమంతయు జగన్నాధుని

 నిర్మల సరోవరంబున ప్రతిబింబించు కలువలరేడు
రూపు  కని కోటిచంద్ర ప్రభాసమానమైన గోపికామానస చోరుడని బ్రమసి మకరందపు మాధుర్యము కొరకు బ్రమించు బ్రమరము వలే
పరవశమొంది సరోవర కమలపు రెక్కపై వాలె
  జగమంతయు జగన్నాధుని కాంచు గోపికాబృంగమొకటి

Saturday, March 15, 2025

శ్రీరంగపతీ

 వేడుక తోడ గోపకులమంతయు అద్దిన 
రంగుల తో నేలకు దిగివచ్చిన హరివిల్లాయని 
ముచ్చటగొలుపు మోముతో హరి కడు విలాసముతో 
ఢమ్ ఢమ్ ఢమ్ యనుచు చేసిన ఢమరుక ధ్వనులతో 
గోపాంగనల గుండెలు ఝల్లుమన మోములు ఎరుపెక్కే 
కంసాదుల గుండెలు దడ దడలాడే మోములు నల్లబడే 
ఇంద్రాదుల గుండెలు ఉప్పొంగ మోములు తెల్లబడే 
ప్రకృతి కాంత  పులకింతలతో   ఆకుపచ్చని కాంతులీనే 
 సంబరపు ధ్వనులతో అంబరం నీలివర్ణపు సొబగులద్దుకునే  
ఢమ ఢమ సవ్వడులు సోకి భగభగ లాడు భానుడు పసిడి కాంతుల 
సోముడాయే 
ఏడు రంగుల పూబాలలు ఎదను విచ్చి సువాసనలు వెదజల్లుతూ 
బాల క్రిష్ణుని మురిపించే 
జీవితమే రంగులమయం శ్రీరంగపతీ నీవు తోడుంటే 

ఆనంద రస గుళికలు

 పరుగులెడుతున్నది మధుర ఫలమని 
పక్షులు భ్రమింప 

కదులుచున్నది మకరందపు తుట్టెయా 
యని తుమ్మెదలు తృళ్లిపడ 

ఈ సుందర కుసుమమే లోకాల పుష్పించేనో  
యని పుష్ప బాలలు సిగ్గుచెంద 

ఈ సుకుమారుని పాదమెంతటి సుతిమెత్తనో యని 
లేలేత గరిక అచ్చెరువొంద 

కలువ కనుల సూర్య తేజపు  కాంతులీన  

లేలేత పగడపు పెదవులపై ఆనందపు రస 


గుళికలు జాలువార 

బృందావన వీధుల తిరుగాడు ముగ్ధమనోహర 
బాలముకుందుని గని ప్రౌఢగోపికల వలువలు 
వదులాయే 

చిన్ని క్రిష్ణా నీ ఈ రూపం మా హృదిలో స్థిరపడి 
 కడలి అలల వలే ఎగసిపడే మా చిత్తంబులకు 
కుదురుతనం కూర్చుగాక 

Friday, March 14, 2025

రంగోళి

       



తనపై  మక్కువ పెంచుకున్న మగువల 
మనంబుల సంతసంబుల సన్నజాజుల 
పూయించ రాధాసఖుడాడే రంగోళి ఫల్గుణ 
పూర్ణిమనాడు బృందావన వీధులలో వేడుకగా 

సహజ పరిమళాల ఒప్పారు ఇష్టసఖి రాధ 
కుంతలముల నీలవర్ణ కాంతులే  గోపికల 
కనురెప్పల కాటుకగా తీర్చిదిద్దే నల్లనయ్య 

వృషభానుసుత ముత్తెపు దంత పంక్తి శ్వేత 
కాంతులే తెల్లని మల్లియలుగా గోపాంగనల 
కొప్పుల చుట్టే కొంటెతనమున క్రిష్ణుడు 

ప్రాణసఖి రాధ శశివదనపు పసిడి వర్ణపు 
సోయగమే గొల్లభామల మేనిపై చందనపు 
పూతగా అద్దె  ఆదరమున  అచ్యుతుడు

కిశోరుని తలపులతో ఎరుపెక్కిన కిశోరీ 
గల్లపు మెరుపులే  గొల్లకాంతల బుగ్గలపై 
కెంపులుగా అలదే యశోదానందనుడు 

బృందావనపు యువరాణి చూపుల చల్లదనం
సోకి  హరిత వర్ణపు శోభలతో అలరారు ప్రకృతి 
 పచ్చదనమే గొల్లెతల పైటగా చేసే గరుడ వాహనుడు 

క్రిష్ణ ప్రేయసి రాధికా ముక్కెర ధూమల వర్ణపు సొబగులే 
గోపికల హస్త భూషణములుగా అలంకరించే నంద నందనుడు 

కలువబాల రాధ కంటి కొలను నీలివర్ణపు దయాజలధి 
తన కంటిలో నింపుకుని గోపకాంతల దేహమెల్లా తడిపే
రాధారమణుడు సంతత ధారలా ప్రేమ మీరగా  

ప్రేమ స్వరూపులు రాధాకృష్ణుల రసరమ్యపు రాస కేళీ 
విలాసములే   సప్తవర్ణ శోభిత హరివిల్లుల కాంతులై 
 లక్ష్మీకిరణుల హృదయ బృందావనిలో  నిరతము 
వెల్లివిరుయుగాక 

Thursday, March 13, 2025

నిత్యహోళీ


జగముల క్షేమంబు కోరి గొంతున 
గరళము దాచిన గోపీశ్వరునకు 
రాధేశ్వరుడొనరించె రసరమ్యపు 
రంగుల అభిషేకంబు కన్నుల పండువగా 
 పన్నగ భూషణుడౌ పశుపతిని పసుపు ధారల పరవశింప చెసే 
 వెండికొండల కైలాసవాసునకు తెల్లని విరజాజుల తోరణము కట్టే 
దిగంబరునకు నీలి వర్ణపు నీరవముల అంబరము లద్దే తాండవమాడు రుద్రునకు రక్తవర్ణపు రుద్రాక్షువుల మాలలద్దే 
మంగళకరుడగు ముక్కంటికి ఆకుపచ్చని పకృతికాంత సొబగులద్దే 
 శాంతమే తానైన సాంబునకు కాషాయాంబరపు కమలాల మాల తొడిగే 
హరిహరుల కలయికయే సప్తవర్ణాల హరివిల్లై 
లోకంబుల నిత్యహోళీ కేళి సంబరంబులాయే

Monday, March 10, 2025

శ్రీమన్నగర నాయికా

జగత్తును పాలించు శ్రీవత్సాంకితుని వాత్సల్యభావము
లాలించుచున్నది జగదంబిక అలసట హరి దరి చేరనీయక
ఈ లాలన మరీ మరీ కోరెనేమో హరి యశోదయై కౌసల్యయై
కోరి భువికి చేరె భువనేశ్వరి మాతృభావపు మధురిమలు వెదజల్ల 

విశ్వరచనా సృజనలో తలమునకలైన విరంచి వేలుపట్టి ఆడుచున్నది 
విశ్వమాత  విసుగు విరామపు తలంపులేవీ విధాత దరిచేరనీయక

రుద్రుని ప్రళయకాల వీరభద్రుని భుజగ భూషణుని 
సదాశివునిగా లోకముల కీర్తి నొందించ భుజమున
పట్టి వెన్నుతట్టి తల్లితనపు చల్లదనముతో సాంబుని
అణువణువు నింపుచున్నది మాతృమూర్తి లలితాంబిక  
 
అయ్యలగన్న యమ్మ ముగ్గురయ్యల మూలపుటమ్మ
మా మనంబుల నిత్యనివాసినియై ఆనందసంద్రపు అలలపై
మా జీవన నౌక పయనింప చేయుమా శ్రీమన్నగర నాయికా 
లక్ష్మీ కిరణు ప్రియ తనూజా శ్రీరాజరాజేశ్వరీ మాతా 


Sunday, March 9, 2025

రతీపతి జనకుని

 కాళింది మడుగులో కాళిందుని శిరములపై 

నాట్యమాడు చిన్ని శిశువుని గని  దుఃఖపు 
భారమున తల్లడిల్లు గోపాంగనల హృది తేట 
పరచ బృందావన వీధుల చిందేసే చిన్ని క్రిష్ణుడు 

బృందావన వీధుల చిందేసే చిన్నిక్రిష్ణుని గని
పాలిండ్ల పొంగు మధురభావనలతో బరువెక్కిన 
హృదయపు భారము దించనెంచిన గొల్లభామలు 
ఆడిపాడిరి ఆనందనిలయుడగు అచ్యుతుని గూడి 

ఆనందనిలయుడగు అచ్యుతుని  పదరంజీవముల
ఝనత్ క్వణత్ ధ్వనులతో ఉల్లము ఝల్లుమన
పూలతలవోలే అల్లుకొనే గోపీకుంజారావముల్ రతీపతి జనకుని జన్మజన్మల రాగబంధమతిశయించ

Wednesday, March 5, 2025

ఆత్మబంధు

 జనన మరణ చక్రభ్రమణంలో నాది నావారలను 
వ్యామోహపు మకరముల పాల్బడి విలవిలలాడుచును 
నిర్మోహత్వంబు పొందదు  నా మనంబు నీ కృప లేకను
కలిసి తిరిగితిమి కాలచక్రమంతయు దేహదారినై నేను 
ఆత్మలింగమై నీవు  ప్రతి కదలికలో వేదన చెందితి  నేను  
వేడుక చూసితి నీవు ఆటలు చాలిక ఆత్మబంధు నిర్మల 
జ్ఞానమొసగి దయ చూపు దక్షిణా

మూర్తి స్వరూపా  శ్రీకాళహస్తీశ్వరా 

Saturday, February 15, 2025

పద్మసుందరీ ప్రియుని

 




పంకజాక్షుని పాద పంకజ నాట్యవిలాసముల రేగిన 
పృధివీపంకజ పరాగం గోపికాంగానల మేని గంధమై మెరియ      

పుండరీకవరదుని కాలి అందియల  మువ్వల సవ్వడులు 

గోపికారమణుల హృదయము రాగరంజితము చేయ 
 
పద్మనాభుని హృదయసీమపై నాట్యమాడు జాజీ చంపక మల్లికాదుల 
అలమిన చెమటగంధపు విరిజల్లులు అంగనామణుల అధరసుధలై విరియ 

పూర్ణసోముని మోముతో ముద్దు గొలుపు నల్లనయ్య ఆధారాలపై పూచిన 
చిరు నగవు కెంపులు లలనామణుల నునుబుగ్గ సిగ్గుమొగ్గలై అరయ 

పద్మసుందరీ ప్రియుని సుందర నాట్యవిలాసములు లక్ష్మీ కిరణుల 
హృదయబృందావనిలో నిరతము సందడి చేయుగాక 

Thursday, February 13, 2025

నవద్వీప సుధాకరా

 చైతన్య కృష్ణచైతన్యో గౌరంగో ద్విజనాయకః 

యతీనం దండినాత్ చైవ న్యాసినాద్ చ శిరోమణిః

 రక్తంబరధరః శ్రీమాన్ నవద్వీప-సుధాకరః 
ప్రేమభక్తి ప్రసాదశ్చైవ శ్రీశచీ నందన స్తథా 
ద్వాదశైతాని  నమాని త్రి-సంధ్యం యః పఠన్ నరః  
తస్య వాంచ-సుసిద్ధిః స్యాత్ భక్తిః శ్రీల పదాంబుజే

చైతన్య : జీవ శక్తి ప్రదా
కృష్ణ చైతన్యా : సర్వ ఆకర్షణా సర్వశక్తిప్రదా 
గౌరంగా : సుందరమైన శరీరం కలిగినట్టి వారు 
ద్విజ నాయక : బ్రహ్మణులకు నాయకుడు 
యతీనాం శిరోమణీ : యతులలో (స్వేచ్ఛగా చరించు వారు) శ్రేష్ఠుడు
దండినాం శిరోమణీ : దండధారులలో శ్రేష్ఠుడు
న్యాసినాద్ శిరోమణీ : సర్వమును త్యజించినవారిలో శ్రేష్ఠుడు
రక్తామ్భారధర : ఎర్రని వస్త్రములు ధరించినవారు 
శ్రీమాన్ :  సర్వోత్కృష్టుడైన ఐశ్వర్యవంతుడు 
నవద్వీప సుధాకరా : నవద్వీపం లో అమృతాన్ని పంచేవారు 
ప్రేమభక్తి ప్రదా : పారవశ్యంతో కూడిన ప్రేమపూర్వక భక్తి ప్రసాదించువారు 
శ్రీశచీ నందన : శచీ దేవి యొక్క ప్రియమైన పుత్రుడు 
 

ఓ ముద్దబంతి

 బంతి ఓ ముద్దబంతి

రవివర్మకే అందని

నా మనసు కు అందిన ఒకే ఒక అందానివో

రవి చూడని

నే కాంచిన కాంచన శిల్పానివో

బ్రమరం చేరని

నా చూపులు తాకిన పుష్ప


మాలికవో

ఎవరివో నీవెవరివో

దివిలోని తారకవో

భువి పైని పూబాలికవో

సాగరమందున స్వాతిముత్యానివో

సమిరంలో సుగంధాలు నింపు సన్నజాజివో

ఆకాశాన సప్తవర్ణాల హరివిల్లువో

అచలాగ్రాన ప్రకాశించు రత్న రాశివో

తూరుపు దిక్కున అరుణారుణిమ వర్ణానివో

పడమటి సంద్యారాగానివో

కవి హృదయాన కావ్య కన్యకవో

చిత్రకారుడి కుంచెలో ఒదిగిన సజీవ సౌందర్య మూర్తివో

నివెవరైతేనేం

నిన్ను ప్రేమించటం మాత్రమే తెలిసిన ఈ సామాన్యుడి

గుండె చప్పుడు నీవు

ఆలోచనల ఆది నీవు

ఆనందాల ప్రోది నీవు

ఊపిరి నీవు

 బంతి  ఓ ముద్దబంతి

 

నిజం నీవు
నీడను నేను

Tuesday, February 11, 2025

విచలితం

 నల్లని  పొడుగైన  ఉంగరాలు  తిరిగిన  ఆ   చిన్ని  కృష్ణుని

కేశాలు  తల్లి  యశోదకు  నయనానందకరం  కాగా
వాటిని  నెమలి  పింఛం  తోను , సువాసనలు  వేదజల్లేడు పూలతోను
అలంకరించి  మురిసిపోతున్నది
 
నవమి  నాటి  చంద్రుని  పోలిన  విశాలమైన  కృష్ణుని  ఫాల  భాగం
బ్రమరాలను  ఆకర్షింపచేయుచున్న  పూల  వలె , చిరుగాలికి  
నుదుటి  పైకి  జారిన ముంగురులతో  గోపికలకు  ముద్దుగొల్పుచున్నది .

 
కృష్ణుని   అధరామృతాన్ని  నింపుకున్న  వేణు  గానం  సమస్త  జీవకోటికి
చైతన్యం  కలిగిస్తున్నది
 
ఆ  లావణ్యమైన  కృష్ణుని  ముఖారవిందం   గోపికల  మనస్సులను
మదనుని  వలపు  బాణాల  తాకిడికి  చలించిపోతున్న  ప్రేమికుల  మనోరధం
వలె  విచలితం  చేస్తున్నది


మురళీవిలాస  ముగ్ధ  ముఖామ్బుజంతో  విరాజిల్లు  చిన్ని  కృష్ణుని
ముఖ  సౌందర్యాన్ని  వీక్షిస్తూ  ముల్లోకాలు  కూడా  అద్బుత  ఆశ్చర్యాలకు
లోనవుతున్నాయి
 
ఎర్రని  దొందపండ్ల  వంటి  లేత  పెదవులపై  మురళి  ని  అటునిటు  విలాసంగా  తిప్పుతూ విశాలమైన  విలోచనాలలో  మదుర  భావనలు  పలికిస్తూ  గోపికలతో  ముచ్చటిస్తున్న  తీరును  చూసి  పరవశులవని    వారెవరైనా  వుంటారా
 
అట్టి  కృష్ణుని  సౌందర్యాన్ని  చూడజాలని  కనులు  నెమలి  పించముపై  అందంగా  తీర్చబడిన  కనులవలె  ఎంత  సుందరములైనప్పటికి  వ్యర్ధములే  కదా

ఓ దేహధారీ

 గెలుపోటములు పట్టని విరాగి

బూడిద ధారణలో మురియు భైరాగి
కడుపే కైలాసంబుగా నర్తించు కామారి
పుక్కిలి వారణాశి గా నెంచి విహరించు 
విశ్వనాధుడు
తానున్న తావు శివం
తాను విడచిన తావు శవం
తోడు రమ్మని అడుగుటెందుకు ఓ దేహధారీ
కనుగొనలేవా నీవే తానైన లింగరూపి ని


Friday, February 7, 2025

మురళీవిలాస


 నల్లని  పొడుగైన  ఉంగరాలు  తిరిగిన  ఆ   చిన్ని  కృష్ణుని

కేశాలు  తల్లి  యశోదకు  నయనానందకరం  కాగా
వాటిని  నెమలి  పింఛం  తోను , సువాసనలు  వేదజల్లేడు పూలతోను
అలంకరించి  మురిసిపోతున్నది
 
నవమి  నాటి  చంద్రుని  పోలిన  విశాలమైన  కృష్ణుని  ఫాల  భాగం
బ్రమరాలను  ఆకర్షింపచేయుచున్న  పూల  వలె , చిరుగాలికి  
నుదుటి  పైకి  జారిన ముంగురులతో  గోపికలకు  ముద్దుగొల్పుచున్నది .

 
కృష్ణుని   అధరామృతాన్ని  నింపుకున్న  వేణు  గానం  సమస్త  జీవకోటికి
చైతన్యం  కలిగిస్తున్నది
 
లలితా  లావణ్యమైన  కృష్ణుని  ముఖారవిందం   గోపికల  మనస్సులను
మదనుని  వలపు  బాణాల  తాకిడికి  చలించిపోతున్న  ప్రేమికుల  మనోరధం
వలె  విచలితం  చేస్తున్నది


మురళీవిలాస  ముగ్ధ  ముఖామ్బుజంతో  విరాజిల్లు  చిన్ని  కృష్ణుని
ముఖ  సౌందర్యాన్ని  వీక్షిస్తూ  ముల్లోకాలు  కూడా  అద్బుత  ఆశ్చర్యాలకు
లోనవుతున్నాయి
 
ఎర్రని  దొందపండ్ల  వంటి  లేత  పెదవులపై  మురళి  ని  అటునిటు  విలాసంగా  తిప్పుతూ విశాలమైన  విలోచనాలలో  మదుర  భావనలు  పలికిస్తూ  గోపికలతో  ముచ్చటిస్తున్న  తీరును  చూసి  పరవశులవని    వారెవరైనా  వుంటారా
 
అట్టి  కృష్ణుని  సౌందర్యాన్ని  చూడజాలని  కనులు  నెమలి  పించముపై  అందంగా  తీర్చబడిన  కనులవలె  ఎంత  సుందరములైనప్పటికి  వ్యర్ధములే  కదా