Tuesday, September 23, 2025

క్రిష్ణ కథ (శ్రీక్రిష్ణ లీలావిలాస హాస )

 క్రిష్ణ కథ  (శ్రీక్రిష్ణ లీలావిలాస హాస )



ఎవరి పాదపద్మాలను ఆశ్రయించటం వల్ల శ్రీక్రిష్ణుని పై దృఢమైన భక్తి ఏర్పడుతుందో ఎవరు శ్రీకృష్ణునకు ప్రాణప్రదురాలైన సహోదరియో అట్టి మాయమ్మ  దుర్గమ్మకు  నమస్కరిస్తూ గొప్పదైన క్రిష్ణ కధ తెలుసుకుందాం

ముందుగా నాకెంతో ఇష్టమైన పూతన మోక్షం లోని రహస్యాలను తెలుసుకుందాం.  అందరికీ తెలిసినదే ... పూతన కంసుడి సోదరి . కంసుడు పంపగా గోకులంలో  యశోద ఇంటికి వచ్చి అందమైన స్త్రీ రూపం ధరించి కృష్ణుడికి విషపు పాలు ఇవ్వబోగా అయన పాలతో పాటు పూతన ప్రాణాలు కూడా లాగి పూతనను సంహరించాడు. ఇంతవరకూ అందరికి తెలిసినదే.

తరువాత జరిగింది .. ఎప్పుడైతే కృష్ణుడు పూతన ప్రాణాలను బయటకు లాగేశాడో అప్పటివరకూ అందమైన స్త్రీ రూపంలో వున్న  పూతన శరీరం అసలు రూపాన్ని పొంది భీకరమైన ఆకారంతో కిందపడిపోయింది. ఆ శరీరాన్ని అక్కడనుండి అతి కష్టం మీద అక్కడ నుండి తీసుకెళ్లి దహనం చేస్తే ఆ కాలుతున్న శరీరం నుండి  ఎంతో గొప్పదైన పరిమళాలు వెలువడ్డాయి. అది చూసి గోకులవాసులంతా ఎంతో ఆశ్చర్యపోయారు.
 అంతేకాదు అంతకుమించిన ఆశ్చర్యకరమైన సంఘటన ... కృష్ణుని చేత బయటకు లాగబడిన పూతన యొక్క ప్రాణ శక్తి (సూక్ష్మ శరీరం ) దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది. అపుడే అక్కడకు   నూఱు చక్రాలు కలిగిన , రత్నములతో నిర్మించబడి , అగ్ని చేత శుద్ధి చేయబడిన వస్త్రములతో అలంకరించబడి,  చేతులలో వింజామరలు , దర్పణాలు  పట్టుకున్న వేలకొలది శ్రీక్రిష్ణ పార్షదులతో (అనుచరులు)  కూడిన ఒక దివ్యరథం క్రిందకు వచ్చింది . అందులోని పార్షదులు ఎంతో భక్తిభావంతో పూతన సూక్ష్మ శరీరాన్ని రథంలో కూర్చుండబెట్టుకుని  అత్యంత దుర్లభమైన గోలోకానికి తీసుకెళ్లారు.

దీని వెనుక దాగిన రహస్యం ఏమిటీ ... ఎవరినైనా అడిగితే ఏమని చెబుతారు... శ్రీకృష్ణుని చేత సంహరింపబడినది కనుక ఆమె దుర్గణాలన్నీ పోయి మోక్షం వచ్చింది అని చెబుతారు

కానీ అసలు రహస్యం ... పూతన పూర్వ జన్మలో బలి చక్రవర్తి కుమార్తె. పేరు రత్నమాల. బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నపుడు దానం కోరుతూ అక్కడకు వచ్చిన బాల వటువు వామనుడి ని చూసి, ఈ బాలుడెవ్వరు ... ఇంతటి తేజస్సుతో వెలిగిపోతూ ఇంత సుకుమారంగా వున్నాడు. నాకు కుమారుడిగా పుట్టివుంటే ఒడిలో కూర్చొండబెట్టుకుని ముద్దులాడుతూ పాలు త్రాగించేదాన్ని కదా అని ఆలోచిస్తూ ,
  వామనుడిలా వచ్చిన పరమాత్మ పట్ల మాతృభావాన్ని నింపుకుని ఉండిపోయింది .
అందరి హృదయాల్లో తిష్ట వేసుకునే కిట్టయ్యకు ఆ రత్నమాల భావన తెలిసిపోయింది. తన పట్ల మాతృభావపు స్నేహాన్ని ప్రకటించిన రత్నమాల కోరిక తీర్చటానికి ఆమెకు పూతనగా జన్మనిచ్చి ఆమె ఒడిలో చేరి పూతన చేత హృదయపూర్వకంగా  ప్రశంసించబడుతూ , ముద్దు చేయబడుతూ ,  విషపు పాలు అయినప్పటికీ మాతృభావనతో ఇచ్చిన పూతన పాలు త్రాగి ఆమె ముచ్చట తీర్చి తరువాత మోక్షమిచ్చాడు .
ఇలాంటి ఎన్నో దివ్యలీలల విలాస హాసమే శ్రీకృష్ణ కథ 

No comments: