భగవద్గీతా సారమైన సప్త శ్లోక సంగ్రహం
ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ |
యఃప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్ || 1
భగవానుడు చెప్పుచున్నారు
పరమేశ్వరుడినైన నన్ను స్మరిస్తూ, ఓం కారమును జపిస్తూ, శరీరము నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమ గతిని పొందును.
స్థానే హృషీకేశ! తవ ప్రకీర్త్యా, జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ |
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి, సర్వే సమస్యంతి చ సిద్ధసంఘాః || 2
అర్జునుడు పలికెను : హే హృషీకేశా (ఇంద్రియములకు అధిపతి), సమస్త జగత్తు నిన్ను కీర్తించుచూ ఆనందహర్షములతో ఉన్నది, మరియు నీ పట్ల ప్రేమతో నిండిపొయినది. ఇది సముచితమే. రాక్షసులు భయముతో భీతిల్లి నీ నుండి దూరముగా అన్ని దిక్కులలో పారిపోవుతున్నారు మరియు ఎంతో మంది సిద్ధగణములు నీకు ప్రణమిల్లుతున్నారు.
భగవాన్ ఉవాచ :
సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖమ్ |
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి || 3
సర్వత్రా ఆయన చేతులు, పాదములు, కన్నులు, శిరస్సులు, మరియు ముఖములు ఉన్నాయి. ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశాలలో ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు.
కవిం పురాణమనుశాసితారమణోరణీయాంసమనుస్మరేద్యః |
సర్వస్య ధాతారమచింత్యరూపం, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ || 4
భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహాకందని దివ్య స్వరూపం కలవాడు; ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకీ అతీతుడు. ఎవరైతే మరణ సమయంలో, యోగ అభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో, ప్రాణములను కనుబొమల మధ్యే నిలిపి, నిశ్చలంగా దివ్య మంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో, వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు.
ఊర్ధ్వమూలమధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ || 5
వేదములే ఆకులు గా కలిగిన రావి (అశ్వత్థ ) చెట్టు యొక్క
వేరు భాగం పైకి, శాఖలు కిందకు వేలాడుతూ నిత్యం వృద్ధి
చెందుతూ చిరాయువు తో వుంటుంది దీనిని అర్ధం చేసుకున్నవారు
మాత్రమే వేదాలను తెలుసుకొనగలరు
సర్వస్య చాహం హృది సన్నివిష్టో, మత్తః స్మృతిర్‌జ్ఞానమపోహనంచ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో, వేదాంతకృద్వేదవిదేవ చాహమ్ || 6
నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను, నా నుండే జ్ఞాపకశక్తి, జ్ఞానము, మరియు విస్మృతి (మర్చిపోవుట) కలుగుతాయి. అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే, వేదాంత రచయితను నేనే, మరియు వేదముల అర్థమును తెలిసినవాడను నేనే.
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి యుక్వై మాత్మానం మత్పరాయణః || 7
ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయటం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి.
|| ఇతి శ్రీ మద్భగవద్గీతానూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం
యోగశస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే సప్తశ్లోకీ గీతా ||