Sunday, March 16, 2025

హసిత చంద్రమా

 ఇంద్రనీలమణుల కాంతులతో మెరయు 
కనుల కొలనులో విరిసే ప్రేమ సుమాలు 
మదిని మీట 
మార్గశీర్షోదయాన గులాబీ రెక్కలపై మెరిసే 
మంచుబిదువుల్లా లేత ఎరుపు పెదవుల నడుమ 
పూచే హసిత చంద్రికలు మనసు న  ముప్పిరిగొన 
మరకత కుండలపు కాంతులతో చెంపల కెంపులు 
వింతశోభల మెరియ 
విప్పారిన నవకమలంలా ఆ వదనం హృదిలో 
చిత్రించుకుపోయెనే

హసిత చంద్రమా 

జగమంతయు జగన్నాధుని

 నిర్మల సరోవరంబున ప్రతిబింబించు కలువలరేడు
రూపు  కని కోటిచంద్ర ప్రభాసమానమైన గోపికామానస చోరుడని బ్రమసి మకరందపు మాధుర్యము కొరకు బ్రమించు బ్రమరము వలే
పరవశమొంది సరోవర కమలపు రెక్కపై వాలె
  జగమంతయు జగన్నాధుని కాంచు గోపికాబృంగమొకటి

Saturday, March 15, 2025

శ్రీరంగపతీ

 వేడుక తోడ గోపకులమంతయు అద్దిన 
రంగుల తో నేలకు దిగివచ్చిన హరివిల్లాయని 
ముచ్చటగొలుపు మోముతో హరి కడు విలాసముతో 
ఢమ్ ఢమ్ ఢమ్ యనుచు చేసిన ఢమరుక ధ్వనులతో 
గోపాంగనల గుండెలు ఝల్లుమన మోములు ఎరుపెక్కే 
కంసాదుల గుండెలు దడ దడలాడే మోములు నల్లబడే 
ఇంద్రాదుల గుండెలు ఉప్పొంగ మోములు తెల్లబడే 
ప్రకృతి కాంత  పులకింతలతో   ఆకుపచ్చని కాంతులీనే 
 సంబరపు ధ్వనులతో అంబరం నీలివర్ణపు సొబగులద్దుకునే  
ఢమ ఢమ సవ్వడులు సోకి భగభగ లాడు భానుడు పసిడి కాంతుల 
సోముడాయే 
ఏడు రంగుల పూబాలలు ఎదను విచ్చి సువాసనలు వెదజల్లుతూ 
బాల క్రిష్ణుని మురిపించే 
జీవితమే రంగులమయం శ్రీరంగపతీ నీవు తోడుంటే 

ఆనంద రస గుళికలు

 పరుగులెడుతున్నది మధుర ఫలమని 
పక్షులు భ్రమింప 

కదులుచున్నది మకరందపు తుట్టెయా 
యని తుమ్మెదలు తృళ్లిపడ 

ఈ సుందర కుసుమమే లోకాల పుష్పించేనో  
యని పుష్ప బాలలు సిగ్గుచెంద 

ఈ సుకుమారుని పాదమెంతటి సుతిమెత్తనో యని 
లేలేత గరిక అచ్చెరువొంద 

కలువ కనుల సూర్య తేజపు  కాంతులీన  

లేలేత పగడపు పెదవులపై ఆనందపు రస 


గుళికలు జాలువార 

బృందావన వీధుల తిరుగాడు ముగ్ధమనోహర 
బాలముకుందుని గని ప్రౌఢగోపికల వలువలు 
వదులాయే 

చిన్ని క్రిష్ణా నీ ఈ రూపం మా హృదిలో స్థిరపడి 
 కడలి అలల వలే ఎగసిపడే మా చిత్తంబులకు 
కుదురుతనం కూర్చుగాక 

Friday, March 14, 2025

రంగోళి

       



తనపై  మక్కువ పెంచుకున్న మగువల 
మనంబుల సంతసంబుల సన్నజాజుల 
పూయించ రాధాసఖుడాడే రంగోళి ఫల్గుణ 
పూర్ణిమనాడు బృందావన వీధులలో వేడుకగా 

సహజ పరిమళాల ఒప్పారు ఇష్టసఖి రాధ 
కుంతలముల నీలవర్ణ కాంతులే  గోపికల 
కనురెప్పల కాటుకగా తీర్చిదిద్దే నల్లనయ్య 

వృషభానుసుత ముత్తెపు దంత పంక్తి శ్వేత 
కాంతులే తెల్లని మల్లియలుగా గోపాంగనల 
కొప్పుల చుట్టే కొంటెతనమున క్రిష్ణుడు 

ప్రాణసఖి రాధ శశివదనపు పసిడి వర్ణపు 
సోయగమే గొల్లభామల మేనిపై చందనపు 
పూతగా అద్దె  ఆదరమున  అచ్యుతుడు

కిశోరుని తలపులతో ఎరుపెక్కిన కిశోరీ 
గల్లపు మెరుపులే  గొల్లకాంతల బుగ్గలపై 
కెంపులుగా అలదే యశోదానందనుడు 

బృందావనపు యువరాణి చూపుల చల్లదనం
సోకి  హరిత వర్ణపు శోభలతో అలరారు ప్రకృతి 
 పచ్చదనమే గొల్లెతల పైటగా చేసే గరుడ వాహనుడు 

క్రిష్ణ ప్రేయసి రాధికా ముక్కెర ధూమల వర్ణపు సొబగులే 
గోపికల హస్త భూషణములుగా అలంకరించే నంద నందనుడు 

కలువబాల రాధ కంటి కొలను నీలివర్ణపు దయాజలధి 
తన కంటిలో నింపుకుని గోపకాంతల దేహమెల్లా తడిపే
రాధారమణుడు సంతత ధారలా ప్రేమ మీరగా  

ప్రేమ స్వరూపులు రాధాకృష్ణుల రసరమ్యపు రాస కేళీ 
విలాసములే   సప్తవర్ణ శోభిత హరివిల్లుల కాంతులై 
 లక్ష్మీకిరణుల హృదయ బృందావనిలో  నిరతము 
వెల్లివిరుయుగాక 

Thursday, March 13, 2025

నిత్యహోళీ


జగముల క్షేమంబు కోరి గొంతున 
గరళము దాచిన గోపీశ్వరునకు 
రాధేశ్వరుడొనరించె రసరమ్యపు 
రంగుల అభిషేకంబు కన్నుల పండువగా 
 పన్నగ భూషణుడౌ పశుపతిని పసుపు ధారల పరవశింప చెసే 
 వెండికొండల కైలాసవాసునకు తెల్లని విరజాజుల తోరణము కట్టే 
దిగంబరునకు నీలి వర్ణపు నీరవముల అంబరము లద్దే తాండవమాడు రుద్రునకు రక్తవర్ణపు రుద్రాక్షువుల మాలలద్దే 
మంగళకరుడగు ముక్కంటికి ఆకుపచ్చని పకృతికాంత సొబగులద్దే 
 శాంతమే తానైన సాంబునకు కాషాయాంబరపు కమలాల మాల తొడిగే 
హరిహరుల కలయికయే సప్తవర్ణాల హరివిల్లై 
లోకంబుల నిత్యహోళీ కేళి సంబరంబులాయే

Monday, March 10, 2025

శ్రీమన్నగర నాయికా

జగత్తును పాలించు శ్రీవత్సాంకితుని వాత్సల్యభావము
లాలించుచున్నది జగదంబిక అలసట హరి దరి చేరనీయక
ఈ లాలన మరీ మరీ కోరెనేమో హరి యశోదయై కౌసల్యయై
కోరి భువికి చేరె భువనేశ్వరి మాతృభావపు మధురిమలు వెదజల్ల 

విశ్వరచనా సృజనలో తలమునకలైన విరంచి వేలుపట్టి ఆడుచున్నది 
విశ్వమాత  విసుగు విరామపు తలంపులేవీ విధాత దరిచేరనీయక

రుద్రుని ప్రళయకాల వీరభద్రుని భుజగ భూషణుని 
సదాశివునిగా లోకముల కీర్తి నొందించ భుజమున
పట్టి వెన్నుతట్టి తల్లితనపు చల్లదనముతో సాంబుని
అణువణువు నింపుచున్నది మాతృమూర్తి లలితాంబిక  
 
అయ్యలగన్న యమ్మ ముగ్గురయ్యల మూలపుటమ్మ
మా మనంబుల నిత్యనివాసినియై ఆనందసంద్రపు అలలపై
మా జీవన నౌక పయనింప చేయుమా శ్రీమన్నగర నాయికా 
లక్ష్మీ కిరణు ప్రియ తనూజా శ్రీరాజరాజేశ్వరీ మాతా