Monday, March 10, 2025

శ్రీమన్నగర నాయికా

జగత్తును పాలించు శ్రీవత్సాంకితుని వాత్సల్యభావము
లాలించుచున్నది జగదంబిక అలసట హరి దరి చేరనీయక
ఈ లాలన మరీ మరీ కోరెనేమో హరి యశోదయై కౌసల్యయై
కోరి భువికి చేరె భువనేశ్వరి మాతృభావపు మధురిమలు వెదజల్ల 

విశ్వరచనా సృజనలో తలమునకలైన విరంచి వేలుపట్టి ఆడుచున్నది 
విశ్వమాత  విసుగు విరామపు తలంపులేవీ విధాత దరిచేరనీయక

రుద్రుని ప్రళయకాల వీరభద్రుని భుజగ భూషణుని 
సదాశివునిగా లోకముల కీర్తి నొందించ భుజమున
పట్టి వెన్నుతట్టి తల్లితనపు చల్లదనముతో సాంబుని
అణువణువు నింపుచున్నది మాతృమూర్తి లలితాంబిక  
 
అయ్యలగన్న యమ్మ ముగ్గురయ్యల మూలపుటమ్మ
మా మనంబుల నిత్యనివాసినియై ఆనందసంద్రపు అలలపై
మా జీవన నౌక పయనింప చేయుమా శ్రీమన్నగర నాయికా 
లక్ష్మీ కిరణు ప్రియ తనూజా శ్రీరాజరాజేశ్వరీ మాతా 


No comments: