తనపై మక్కువ పెంచుకున్న మగువల
మనంబుల సంతసంబుల సన్నజాజుల
పూయించ రాధాసఖుడాడే రంగోళి ఫల్గుణ
పూర్ణిమనాడు బృందావన వీధులలో వేడుకగా
సహజ పరిమళాల ఒప్పారు ఇష్టసఖి రాధ
కుంతలముల నీలవర్ణ కాంతులే గోపికల
కనురెప్పల కాటుకగా తీర్చిదిద్దే నల్లనయ్య
వృషభానుసుత ముత్తెపు దంత పంక్తి శ్వేత
కాంతులే తెల్లని మల్లియలుగా గోపాంగనల
కొప్పుల చుట్టే కొంటెతనమున క్రిష్ణుడు
ప్రాణసఖి రాధ శశివదనపు పసిడి వర్ణపు
సోయగమే గొల్లభామల మేనిపై చందనపు
పూతగా అద్దె
ఆదరమున
అచ్యుతుడు
కిశోరుని తలపులతో ఎరుపెక్కిన కిశోరీ
గల్లపు మెరుపులే గొల్లకాంతల బుగ్గలపై
కెంపులుగా అలదే యశోదానందనుడు
బృందావనపు యువరాణి చూపుల చల్లదనం
సోకి హరిత వర్ణపు శోభలతో అలరారు ప్రకృతి
పచ్చదనమే గొల్లెతల పైటగా చేసే గరుడ వాహనుడు
క్రిష్ణ ప్రేయసి రాధికా ముక్కెర ధూమల వర్ణపు సొబగులే
గోపికల హస్త భూషణములుగా అలంకరించే నంద నందనుడు
కలువబాల రాధ కంటి కొలను నీలివర్ణపు దయాజలధి
తన కంటిలో నింపుకుని గోపకాంతల దేహమెల్లా తడిపే
రాధారమణుడు సంతత ధారలా ప్రేమ మీరగా
ప్రేమ స్వరూపులు రాధాకృష్ణుల రసరమ్యపు రాస కేళీ
విలాసములే సప్తవర్ణ శోభిత హరివిల్లుల కాంతులై
లక్ష్మీకిరణుల హృదయ బృందావనిలో నిరతము
వెల్లివిరుయుగాక
No comments:
Post a Comment