Tuesday, November 25, 2025
Friday, November 14, 2025
క్రిష్ణ
నిరంతరముగా క్రిష్ణ నామమును
క్రిష్ణ లీలా మహిమను జపించిన
మాయదుమ్ము కమ్మిన హృదయ
దర్పణం శరత్కాల పూర్ణిమా బింబమగు
ఆ నామం ప్రాపంచికవిషయ బడబాగ్ని కి దగ్ధమవుతున్న హృదయవనాన్ని చల్లార్చు
చల్లని చందనపు వానజల్లు
ఆ నామం, భగవత్ జ్ఞానాన్ని దాచుకున్న కలువ హృదయాన్ని వికసింప చేయుచూ ప్రవహించు చంద్రకాంతి
ఆ నామం, ఓ మనసా నిను
ఆనంద తరంగాలలో లోతుగా మునకలెత్తించు
నిరంతరం క్రిష్ణ నామాన్ని జపిస్తూ,
అడుగడుగునా క్రిష్ణనామ అమృతాన్ని రుచి చూస్తూ,
అలసిపోయిన ఆత్మలకు ఓదార్పు
స్నానం చేయించు క్రిష్ణ నామంలో స్నానం చేస్తూ
ప్రతి క్రిష్ణ నామంలో క్రిష్ణశక్తి నివసిస్తుంది.
కాలాలు నిర్ణయించబడలేదు, ఏ ఆచారాలు అవసరం లేదు క్రిష్ణనామ జపానికి,
ఓ క్రిష్ణా నీ దయ చాలా విశాలమైనది.
Tuesday, September 23, 2025
క్రిష్ణ కథ (శ్రీక్రిష్ణ లీలావిలాస హాస )
క్రిష్ణ కథ (శ్రీక్రిష్ణ లీలావిలాస హాస )
ఎవరి పాదపద్మాలను ఆశ్రయించటం వల్ల శ్రీక్రిష్ణుని పై దృఢమైన భక్తి ఏర్పడుతుందో ఎవరు శ్రీకృష్ణునకు ప్రాణప్రదురాలైన సహోదరియో అట్టి మాయమ్మ దుర్గమ్మకు నమస్కరిస్తూ గొప్పదైన క్రిష్ణ కధ తెలుసుకుందాం
ముందుగా నాకెంతో ఇష్టమైన పూతన మోక్షం లోని రహస్యాలను తెలుసుకుందాం. అందరికీ తెలిసినదే ... పూతన కంసుడి సోదరి . కంసుడు పంపగా గోకులంలో యశోద ఇంటికి వచ్చి అందమైన స్త్రీ రూపం ధరించి కృష్ణుడికి విషపు పాలు ఇవ్వబోగా అయన పాలతో పాటు పూతన ప్రాణాలు కూడా లాగి పూతనను సంహరించాడు. ఇంతవరకూ అందరికి తెలిసినదే.
తరువాత జరిగింది .. ఎప్పుడైతే కృష్ణుడు పూతన ప్రాణాలను బయటకు లాగేశాడో అప్పటివరకూ అందమైన స్త్రీ రూపంలో వున్న పూతన శరీరం అసలు రూపాన్ని పొంది భీకరమైన ఆకారంతో కిందపడిపోయింది. ఆ శరీరాన్ని అక్కడనుండి అతి కష్టం మీద అక్కడ నుండి తీసుకెళ్లి దహనం చేస్తే ఆ కాలుతున్న శరీరం నుండి ఎంతో గొప్పదైన పరిమళాలు వెలువడ్డాయి. అది చూసి గోకులవాసులంతా ఎంతో ఆశ్చర్యపోయారు.
అంతేకాదు అంతకుమించిన ఆశ్చర్యకరమైన సంఘటన ... కృష్ణుని చేత బయటకు లాగబడిన పూతన యొక్క ప్రాణ శక్తి (సూక్ష్మ శరీరం ) దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది. అపుడే అక్కడకు నూఱు చక్రాలు కలిగిన , రత్నములతో నిర్మించబడి , అగ్ని చేత శుద్ధి చేయబడిన వస్త్రములతో అలంకరించబడి, చేతులలో వింజామరలు , దర్పణాలు పట్టుకున్న వేలకొలది శ్రీక్రిష్ణ పార్షదులతో (అనుచరులు) కూడిన ఒక దివ్యరథం క్రిందకు వచ్చింది . అందులోని పార్షదులు ఎంతో భక్తిభావంతో పూతన సూక్ష్మ శరీరాన్ని రథంలో కూర్చుండబెట్టుకుని అత్యంత దుర్లభమైన గోలోకానికి తీసుకెళ్లారు.
దీని వెనుక దాగిన రహస్యం ఏమిటీ ... ఎవరినైనా అడిగితే ఏమని చెబుతారు... శ్రీకృష్ణుని చేత సంహరింపబడినది కనుక ఆమె దుర్గణాలన్నీ పోయి మోక్షం వచ్చింది అని చెబుతారు
కానీ అసలు రహస్యం ... పూతన పూర్వ జన్మలో బలి చక్రవర్తి కుమార్తె. పేరు రత్నమాల. బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నపుడు దానం కోరుతూ అక్కడకు వచ్చిన బాల వటువు వామనుడి ని చూసి, ఈ బాలుడెవ్వరు ... ఇంతటి తేజస్సుతో వెలిగిపోతూ ఇంత సుకుమారంగా వున్నాడు. నాకు కుమారుడిగా పుట్టివుంటే ఒడిలో కూర్చొండబెట్టుకుని ముద్దులాడుతూ పాలు త్రాగించేదాన్ని కదా అని ఆలోచిస్తూ ,
వామనుడిలా వచ్చిన పరమాత్మ పట్ల మాతృభావాన్ని నింపుకుని ఉండిపోయింది .
అందరి హృదయాల్లో తిష్ట వేసుకునే కిట్టయ్యకు ఆ రత్నమాల భావన తెలిసిపోయింది. తన పట్ల మాతృభావపు స్నేహాన్ని ప్రకటించిన రత్నమాల కోరిక తీర్చటానికి ఆమెకు పూతనగా జన్మనిచ్చి ఆమె ఒడిలో చేరి పూతన చేత హృదయపూర్వకంగా ప్రశంసించబడుతూ , ముద్దు చేయబడుతూ , విషపు పాలు అయినప్పటికీ మాతృభావనతో ఇచ్చిన పూతన పాలు త్రాగి ఆమె ముచ్చట తీర్చి తరువాత మోక్షమిచ్చాడు .
ఇలాంటి ఎన్నో దివ్యలీలల విలాస హాసమే శ్రీకృష్ణ కథ
Tuesday, August 5, 2025
ఆర్యా ద్విశతి -గణపతి ధ్యానం
వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్ఠమ్/
కుంకుమ పరాగశోణంకువలయినీజారకోరకాపీడమ్//
మన రోజువారీ దినచర్య మొదలుపెట్టేముందుగణపతిని ధ్యానించి పనులు మొదలుపెట్టుకుంటేఎదురయ్యే ఆటంకాలు తొలగించుకునే మార్గాన్ని ఆయనే నిర్ధేశిస్తారు అందుకే దూర్వాస మహర్షి సైతం కావ్యరచన ఆరంభానికి ముందు హేరంబుడి ధ్యానం చేసారు
ఆయనేముంది త్రిపురాసుర సంహార సమయంలో ఊహించని ఆటంకాలతో ఆలోచనలో పడ్డ పరమశివుడు సైతం అమ్మవారి ప్రేరణతో జరిగిన పొరపాటు తెలుసుకుని గణపతి ధ్యానం చేసి కార్యం సాధించారు
ఆ సమయంలో గణపతి తన యొక్క తత్వాన్ని వేయి నామాలలో శివునకు ఉపదేశించారుఅందులో పేర్కొన్న ఈ నామాలను తెలుసుకుంటేనవగ్రహాలు కూడా గణపతి అంశలే అని తేటతెల్లమవుతుంది...
ఆ నామాలు రాహు మందః(శని) కవి(శుక్ర) జీవః(గురు) బుధ భౌమ(కుజ) శశి రవి
గణపతి ధ్యానం...నవగ్రహధ్యానమే గ్రహదోషాలతో ఇబ్బంది పడేవారు
శ్రీగణేశాయ నమః రాహు మంధః కవి జీవో బుధ భౌమః శశి రవిః శ్రీగణేశాయనమః
అని నిత్యం మననం చేసుకుని ఉపశమనం పొందవచ్చు
గణపతి అంటే చవితి రోజు చదువుకునే పసుపుముద్ద గణపతి మాత్రమే కాదు . ఆయన అనాది అమ్మ వారు ఎప్పటి నుండి వున్నారో అప్పటినుండి మహాగణపతి వున్నారు . ఆయన ప్రాదుర్భవించిన విశేషాన్ని లలితా సహస్రంలో అద్భుతంగా వర్ణిస్తారు
అమ్మవారి నామం... కామేశ్వరముఖాలోకకల్పిత శ్రీగణేశ్వరా ..దీని అర్థం .. అమ్మ వారు చిరునవ్వుతో కామేశ్వరుడి వైపు చూస్తే అందుకు ప్రతిస్పందనగా కామేశ్వరుడు కూడా చిరునవ్వుతో అమ్మ కామేశి ని చూడగా ఒకదానితో నొకటి చేరువైన వారిరువురి చిరునగవుల కాంతి పుంజం ఓంకార రూపంలో కనబడి అది గజముఖుడైన గణపతి గా రూపు దాల్చింది
రాగానే ఏమి చేసాడాయన .... భండాసురుడి ప్రధాన అనుచరుడు ప్రయోగించిన విఘ్నయంత్రం దేవి యొక్క సేన అంతటిని నిస్తేజపరిచి వారు యుద్ధం చేయటానికి విముఖులయ్యేటట్లు చేస్తే ఆ విఘ్నయంత్రాన్ని బ్రద్దలు చేసి దేవీ సేన యొక్క నిస్తేజాన్ని తొలగించి యుద్ధోన్ముఖులను చేశారు అంటే మన విఘ్నాలను తొలగించుటలో అయన ఎంతటి ఘటికుడో ఈ ఘటన తెలియజేస్తుంది (అమ్మవారి తదుపరి నామం :మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్ర ప్రహర్షితా )
అట్టి ఆ మహా గణపతి ని ధ్యానిస్తూ దుర్వాస మహర్షి చేసిన ధ్యాన శ్లోకం ఇది . నిత్య పఠనీయం
దాని భావం : ఎడమ తొడపై కూర్చుని కుడి చేతిని వీపు భాగంనుండి వేసి గణపతిని ఆలింగనం చేసుకునివున్న వల్లభా దేవి (సిద్ద లక్ష్మీ స్వరూపం) తో ఉన్నట్టివాడు కుంకుమ వలే ఎరుపు వర్ణంతో ప్రకాశించువాడు కలువలకు ప్రియుడైన మొలక చంద్రుని (తదియ నాటి చంద్రుని రూపం) సిగలో దాల్చినవాడు అగు గజ వదనునికి నమస్కారం
Saturday, July 19, 2025
ఆహా వర్షం టూ అమ్మో వాన
కాలం మారుతుంది ఋతువులు గతులు తప్పుతున్నాయి మనలానే
తొలకరి చిరుజల్లులతో ఆహ్లాదంగా సాగే ఆషాఢం
శ్రావణ మేఘాలతో గర్జిస్తుంది
బోర్లించిన నిండుకుండలా జోరెత్తాల్సిన శ్రా వణం శరత్కాలపు మేఘంలా తెల్లమొగమేస్తే
పొలంగట్టున రైతన్న బిక్కమొహంతో ఆకాశం కేసి
చూస్తు కూర్చునే పరిస్థితి
అలాంటి వానాకాలపు ఉహా వాస్తవికత మేళవింపుల తాలింపు ఇలా
ఆకాశరాజు హృదయంపై నిలచి నల్లని రంగుతో
మెరయు జవరాలు జలద ప్రేమపొంగు ముత్యాల సరాలై ధారగా జారుతూ
భూమాత ఒడిలో ఏపుగా పెరిగిన మామిడి చెట్టు మొదలు ఆనుకుని కూర్చున్న నా ఎదపై
తలవాల్చిన గువ్వ నుదిటిపై రాలి అరుణిమ వర్ణమద్దుకున్న ఆ ముత్తెపు బిందువుల ధార గువ్వ నాసికాగ్రమున నిలచి ఓ క్షణం నను తేరిపార చూసి ఒక్క ఉదుటన దుమికి అలివేణి
అధరామృతన్ని తనలో యిముడ్చుకుంటూ కొంటెగా నను చూడగా
దాని గర్వమణచ ముందుకు వంగబోతుండగా
గుండె గుభేల్ మనేలా హోరెత్తిన హారన్ల రొద రసమయ ఊహా జగత్తు నుండి మనసును వాస్తవ
ప్రపంచంలోకి ఈడ్చితే
ముందు వెనుకల ఎటుచూసినా కిలోమీటరు పొడవునా ఆగిన వాహనాలు
ముందువాడు కదలటానికి అవకాశం లేదని తెలిసి హారన్ల రొదతో మోతెక్కించె వాహనదారులు
కాళ్ళను తాకుతున్నది వాననీరో...డ్రైనేజీ నీరో తెలియని స్థితి
సెంటిమీటరు సందు దొరికితే చాలు ఎలాగోలా
ట్రాఫిక్ వ్యూహం లోంచి బయటపడాలని ఆతృత పడే టూవీలర్లు
వరదనీరు టైర్లను ముంచెత్తితే దేవుడా కారు ను మాత్రం ముంచెత్తనీవకు అంటూ మనసులో దండాలు పెట్టుకుంటూ బింకంగా కారు నడిపే ఓనర్లు
వీటన్నిటినీ నడమ నావిషయానికొస్తే పొద్దుగాల లేవగానే కమ్ముకున్న కరిమబ్బు చూసి ఆహా వాన దంచేట్టుంది కూసింత సేపు ఆగి వెళదాం అనుకొని అంతలోనే మబ్బులు చీల్చుకుని పెళపెళలాడుతూ వచ్చిన ఎండను చూసి ఉసురుమంటూ ఆఫీసు చేరి
సాయంకాలం ఆఫీసు ముగిసి బయటకురాగానే
అప్పటివరకు తేటగా వున్న ఆకాశం వున్నట్టుండి
నల్లబడి ఉరుములు మెరుపులతో హుంకరిస్తుంటే
చుప్పనాతి వాన అని తిట్టుకుంటూ ఒకవైపు
వానలో తడిసిన అనుభూతి అనుభవిస్తున్న ఆనందం మరోవైపు..
ప్రకృతితో మమేకమవుతూ సహజీవనం చేస్తు సాగిపోతే జీవితం ఆహ్లదభరితమవుతుంది
Monday, July 14, 2025
క్రిష్ణ నామము
నిరంతరముగా
క్రిష్ణ నామమును క్రిష్ణ లీలా మహిమను జపించిన
మాయదుమ్ము కమ్మిన హృదయ దర్పణం శరత్కాల పూర్ణిమా బింబమగు
ఆ నామం ప్రాపంచికవిషయ బడబాగ్ని కి దగ్ధమవుతున్న హృదయవనాన్ని చల్లార్చు చల్లని చందనపు వానజల్లు ఆ నామం, భగవత్ జ్ఞానాన్ని దాచుకున్న కలువ హృదయాన్ని వికసింప చేయుచూ ప్రవహించు చంద్రకాంతి
ఆ నామం, ఓ మనసా నినుఆనంద తరంగాలలో లోతుగా మునకలెత్తించు
నిరంతరం క్రిష్ణ నామాన్ని జపిస్తూ,అడుగడుగునా క్రిష్ణనామ అమృతాన్ని రుచి చూస్తూ,
అలసిపోయిన ఆత్మలకు ఓదార్పు స్నానం చేయించు క్రిష్ణ నామంలో స్నానం చేస్తూ
ప్రతి క్రిష్ణ నామంలో క్రిష్ణశక్తి నివసిస్తుంది.
కాలాలు నిర్ణయించబడలేదు, ఏ ఆచారాలు అవసరం లేదు,
ఓ క్రిష్ణనామ జపానికి,
ఓ క్రిష్ణా నీ దయ చాలా విశాలమైనది.అని పలికెనీ రాధానామ విరహాంతరంగుడు బంగరు వన్నె మెరయు లక్ష్మీనాధుడా చైతన్యమహాప్రభు నిద్రాణమౌ మా క్రిష్ణచైతన్యము మేల్కొలపSaturday, July 5, 2025
విఠల విఠల విఠల
చంద్రభాగా నదీ తరంగాలపై నుండీ వీచే చిరుగాలులు చేయు సవ్వడి...
చంద్రభాగా నదీ జల తరంగాలు చేయు గలగలల సవ్వడి...
.విఠల విఠల విఠల
ఆ గాలులు పీలుస్తూ ఆ జలాలు సేవిస్తూ అక్కడ జీవించే ప్రాణకోటి పలికే
తీయని పదం ...విఠల విఠల విఠల
విఠలా విఠలా అని భక్తజనం నోరారా పిలుస్తూ పరవశించిపోయే
భక్త సులభుడు పుండరీక వరదుడు అయిన పాండురంగడు కొలువైన
పుణ్యధామం ...చంద్రభాగా తీరాన వున్న పండరీపుర క్షేత్రం
ఎందరో భక్త శిఖామణులు పాండురంగని ప్రత్యక్ష దివ్యానుభూతిని పొందారు
అలాంటి వారిలో అగ్రగణ్యులు సమకాలీనులు అయిన నామదేవుడు , జ్ఞాన దేవుడు
నివృత్తి నాథుడు ,సోపాన్ , ముక్తాబాయి , భక్త కబీరు మొదలగువారు
వీరికోవకే చెందిన భక్తురాలు
జనాబాయి . 5 సంవత్సరాల వయసులో ఆషాఢ శుద్ద ఏకాదశి రోజు మొదటిసారి పాండురంగడిని దర్శించి ఆ రూపాన్ని తన హృదయంలో నింపుకున్న మహానుభావురాలు
నామదేవుడిని గురువుగా స్వీకరించి ఆయన సేవ చేసుకుంటూ ఆయన ఇంటిలో
వసతి పొంది నివసిస్తూ వుండేది
ఒకరోజు రాత్రి తుఫాను కి నామదేవుడి ఇంటికప్పు ఎగిరిపోతుంటే , సుదర్శన చక్రాన్ని గొడుగులా పెట్టి విఠలుడు స్వయంగా ఇంటి తాటాకు కప్పు సరి చేస్తూ కూర్చున్నారు
ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన
జనాబాయి దగ్గరకు విఠలుడు వచ్చి చిరునవ్వుతో ఈ నామదేవుడు నా నామం చెప్పకుండా , రోజు నన్ను దర్శించకుండా , నాకు నైవేద్యం పెట్టకుండా క్షణం కూడా ఉండలేదు .
ఈ నామదేవుఁడు చేసే కీర్తనలు వింటుంటే నన్ను నేను మర్చిపోతాను అలాంటి నామదేవుడికి కష్టం వస్తే నేను రాకుండా ఎలా వుంటాను అని చెబుతుంటే ఆయన మాటలని ఆయన రూపాన్ని చూస్తూ అలా తన్మయత్వంతో నిలచిపోయింది
జనాబాయి .
ఆ అలికిడి కి నిదుర లేచిన నామదేవుడు స్వామిని చూసి , స్వామి ఇంత అర్ధరాత్రి వేళ విశ్రాంతి తీసుకోకుండా ఇలా వచ్చారేమిటి అని ప్రశ్నించగా
జనాబాయి చేతి వంట తినాలని కోరికతో వచ్చానని స్వామి బదులిస్తారు
అంతట ఆయన కోరిక మేరకు జనాబాయి వంట పూర్తి చేయగా అందరూ భోజనానికి కూర్చుంటారు. వారికి వడ్డిస్తూ తనలోతాను బాధపడుతుంది జనాబాయి స్వామితో కలసి భోజనం చేయలేకపోతున్నానే అని . ఆ భక్తురాలి ఆంతరంగం గ్రహించిన విఠలుడు నామదేవా నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత భుజిస్తాను . నా ఆహారాన్ని విడిగా పెట్టి వుంచమని చెప్పగా సరేనని నామదేవుడు తన భోజనం ముగించి స్వామి వారి పాదాలను వత్తుతూ వుంటారు. స్వామి నిదుర రాకున్నా నిదుర పోయినట్లు నటిస్తారు . స్వామి నిదురించారని భావించిన నామదేవుడు తానూ నిదురిస్తారు . అలా అందరూ నిదుర పోయాక విఠలుడు లేచి జనాబాయి ని లేపి తనకు ఆహరం వడ్డించమని అడిగి పెట్టించుకుని జానాబాయి ని పక్కన కూర్చుండ బెట్టుకుని తన చేతులతో స్వయంగా జనాబాయికి తినిపిస్తారు
అంతటి అదృష్టవంతురాలు ఆ జానాబాయి అంతటి సులభుడా విఠలుడు
ఆయన రూపం సమ్మోహనాకారం ... అపుడే విరిసిన లేత గులాభీ రెక్కలవంటి పెదవులు .... ఆ పెదవులపై పూచే బొండు మల్లెల వంటి నవ్వులు .... నీటి తుంపరలతో నిండిన కలువల వంటి సజల దయాపూరిత నేత్రాలు ..... అందమైన ఆ ముక్కు ....
దట్టమైన వానమబ్బు లాంటి ఆ మేని ఛాయ
తాకగానే చల్లగా సుతిమెత్తగా తగిలే ఆ పాద పద్మాలు ,...
నడుం మీద చేతులు పెట్టుకుని అందమైన పట్టు పీతాంబరాలు ధరించి ... భుజాలు మీదుగా వచ్చి చేతి మీద అందంగా అమరిన పై వస్త్రం... ఆ ముచ్చటైన తలపాగా ....
ఇంతందం ఈ లోకంలో ఎక్కడైనా వుందా ...
ఈ అందాన్ని ఆస్వాదిస్తుంటే.... ఇంకే అందాన్నైనా మనసు కోరుతుందా
ఆ రూపాన్ని దర్శించాలంటే కావాల్సింది తపన ...ఎలాంటి తపన అంటే...
తొలిసారి ప్రేమలో పడిన యువతీ యువకులు ఒకరినొకరు చూ సుకోవటానికి
ఎంత తపన పడతారో .... ఆ మాత్రం చాలు ...
విఠల విఠల విఠల పాండురంగ విఠల
Subscribe to:
Comments (Atom)
.png)
.png)





