Friday, January 10, 2025

వాణీ మధురిమ

 వేణుగాన తరంగాల తలపించు అలివేణి

మృదుమధుర మంజుల వాణీ మధురిమ
వీనుల విందు సేయ నీరజాక్షుడు చెవి ఒగ్గి
వినుచుండే నీరజాక్షి కువకవ ఆశ్చర్యచకితుడై

గోపికామధుమక్షిక

 పాదముల తాకిడి తెలియనీయకనే 
మధుపం పద్మపరాగపు మధువు గ్రోలి
నటుల గోపికామధుమక్షిక సర్వాంతర్యామికి 
రహస్యము చెప్పబోవు నెపమున గోవిందపద్మపు  
అధర మధువు గ్రోలు ముచ్చట తీర్చుకునే నేర్పున 

Tuesday, January 7, 2025

జగద్గురు

 సకల విద్యాధిదేవతవు  వినయభావమున

సాందీపుని శిష్యరికం చేసి గురుబావమునకు
గౌరవమద్దినాడవు


సహాధ్యాయి సుధామునికి సమయానుకూలంగా
సకలైశ్వర్యములిచ్చి వినయపూర్వక విద్య విలువ
తెల్పినాడవు

సమరాంగమున సవ్యసాచి ని కార్యోన్ముఖుని
చేసి గీతాచార్యుడవై జగద్గురువై భాసిల్లినాడవు

సదానందా జీతపు పాఠాలు తప్ప జీవన సారం
నేర్పలేక చదువుల గుడులు బడులు గా మిగిలిపోయే

సద్గురునాథా జగన్నాథా జ్ఞాన జ్యోతులు వెలిగించి 
భావితరాల భవిత ను తీర్చిదిద్ద వేగిరమే రమ్ము
 పురుషోత్తమా లక్ష్మీకిరణ్ ప్రియభాంధవా

Thursday, January 2, 2025

ఆనంద సంద్రం

 నిదురించు అత్తకోడళ్ళ జడలు

జతచేసి 

తల్లి దాచిన. 
 వెన్న కోతుల  పాలు
చేసి  కునుకు తీయుచున్న కూతురి మూతికి
కొద్దిగా పూసి  
జతల నడుమ జగడాలు పెట్టి
 ఉట్టిలో కట్టిన పెరుగు నేల పాల్జేసి  
కోపంతో కుతకుతలాడుతున్న గోపికల మోము చూసి  
అ మాయకపు మోముతో నవ్వుచుంటివి జగన్మోహనాకారా జగదానందకారకా .
నీ బాల్యక్రీడా లీలా విలాసపు విన్యాసములు
లక్ష్మీకిరణుల మానసమందిరమందు పదే పదే
మెదలుతూ మా హృది ఆనంద సంద్రం చేయుగాక

Wednesday, January 1, 2025

సాగర కన్యకా

 సాగర కన్యకా 


నీలి కాంతుల కెరటాల  శోభలే 
నీ కురుల అల్లికలో చిక్కుకునే 

అలల పాల నురగల తెల్లదనమే 
నీ పలువరుస మెరుపులై మెరిసే 

ఇసుక తిన్నెల మెత్తదనమే 
నీ మేని మృదుత్వమై మురిసే 

చవులూరించు సాగర ఘోష 
నీ కంఠ ధ్వనిలో చేరి మమ్మలరించే 
 
రూపుదాల్చిన సంద్రపు నిత్య చైతన్యమే 
 నీవు   సాగర సౌరభమా 


Tuesday, December 31, 2024

దేహబృందావని

 యోగంబుల చిక్కనివాడు చిక్కెపో

గోపబాండ్ర అమాయకపు ప్రేమకు
ఆటపాటల యందు ఆలింగన సౌఖ్య
మిచ్చుచూ ఇంచుక భావన చేసిన చాలును
గోపాలుర అదృష్టమును ఉల్లము ఝల్లుమనదే


వ్రతముల దక్కనివాడు వనముల వృత్తాకారపు
బంతులు కట్టి చల్ది అన్నపు విందారగించే శౌచ్యాశౌచ్యముల శోధన చేయక లక్ష్మీకిరణుల 
దేహబృందావని పై ఆటలాడగా అరుదెంచవయా
ఆనంద నిలయా యోగ్యాయోగ్యముల కాలయాపన చేయక

Monday, December 30, 2024

ఆలాపన

 వేణుగాన తరంగాలు  వీనుల తాకిన తోడనే 
తడబడిన హృదయాలతో త్వరపడి పరుగులు 
తీసిరి గోపాంగనలు బృందావని వైపు వడివడిగా 
తామున్న తీరును మరచి వేణుగోపాలుని చేర 

వేణువు ఆలాపన ఆలకించగనే అంబారావముల 
పొదుగుల పాలధారలు పొంగించే యిబ్బడిముబ్బడిగా 
సురభి సంతు ఒద్దికగా గోపాలుని చేతులలో ఒదిగే 
లేగలు గంతులు మాని  ప్రకృతియెల్ల పరవశించే 

నిమిషమైన నిలకడగా నీ వేణుగాన స్వర ఝరులు 
ధ్యానించ నానా విధముల గాలుల తాకిడిలో మది
చెదరుచుండె గోవిందుడా నీ వేణుగాన తరంగాల 
లీనమై ఆహ్లాదమొందు అనుభవమీయవయా లక్ష్మీ కిరణులకు