Tuesday, November 12, 2024
పచ్చదనమే పచ్చదనమే
వెన్నెల గూళ్ళ వంటి కనులు
గులాబీ రెక్కల పెదవుల జాలువారు
ముద్దు ముద్దు మాటల కలికి కులుకుల
చిలక మోము
గరుడ పచ్చపూసల సరాల తో తీర్చన
శంఖం లాంటి కంఠం
మట్టిగంధపు వాసనలతో మైమరపించు
పచ్చని పైరు సమూహాల్లా బాహుమూలాలు
పాల సెలయేరు ల పుట్టిల్లులై వృక్షసమూహపు
తోరణాలతో అలంకృతమై ఓప్పారు పచ్చపసిడి
చనుదోయిద్వయం
ఆకాశరాజు చిరు జల్లుల ప్రేమ పూర్వక పలకరింపుకు ప్రతిగా పులకరించి పరవశించిన ప్రకృతి కాంత తొడిగిన లేత చిగురుటాకు పచ్చ చీరలా శోభిల్లు జఘనం
కదలివచ్చు శాకంబరీ నీకు దాసోహం
Thursday, November 7, 2024
హసిత చంద్రిక
ఉదయ సంధ్యారాగపు లేత ఎరుపుకాంతుల /అధరాకాశపు మబ్బుతునకల నడుమ భానుడి/
వెలుగురేఖల్లా కోటి తారకల తళుకు బెళుకుల్లా /కోటి చంద్రుల వెన్నెల చల్లదనంలా/
చేరవచ్చే నను నీ దరహాసచంద్రికలు హసిత చంద్రికా // అలివేణి అరవిచ్చిన మందారపు అధరాల/
నడుమ మురిసే ముత్యపు సరాగాలు /మల్లెల పరిమళాలతో అద్దిన చిరుగాలి తునకలవలే /వలె నను
పరవశింప చేసే నీ దరహాసచంద్రికలు హసిత చంద్రికా//
కలనైనా వీడిపోవు ఆ నవ్వుల దివ్వెలు /
కలకాలం నిలచిపోవు గుండె గూటిలో /
జన్మాలు మారినా వాడని నిత్యమల్లెలే /
నీ దరహాసచంద్రికలు హసిత చంద్రికా//
Sunday, November 3, 2024
దామోదర లీల
కార్తీకం లో ఉదయపు సంధ్యలో నారాయణుడిని క్రిష్ణా గోవిందా దామోదరా అని నోరారా కీర్తించాలి పదే పదే స్మరించాలి సాయంసంధ్యలో ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమాన్ మహాదేవాయ నమః అంటూ గంగా జలాలతో అభిషేకం చేసిన భావన చేయాలి . భవానీ భావనాగమ్యా అంటారు కదా భావన చాలు చేసిన ఫలం పొందేయవచ్చు . హడావిడులు
అవసరం లేదు కార్తీకాన్ని కార్తీక దామోదర మాసం గా వ్యవహరిస్తారు అందుకు గల కారణం తెలుసుకుని క్రిష్ణుని ఈ లీలను ధ్యానిస్తూ నిత్యం దామోదరా అని స్మరిస్తూ వుంటే మన బంధనాలు తొలగిపోతాయి
బృందావనంలో ఒకసారి కృష్ణుడిని ఒడిలో పెట్టుకుని యశోదమ్మ పాలిస్తున్నది అదే సమయంలో పక్కనే పొయ్యి మీద వున్న కుండలోని పాలు పొంగిపోతున్నాయి అది గమనించిన యశోదమ్మ క్రిష్ణుడిని పక్కన పెట్టి పొయ్యి దగ్గరకు పరుగెత్తింది
పూర్తిగా పాలు తాగకుండానే తనను పక్కన పెట్టిన యశోదమ్మ మీద బాగా కోపం వచ్చింది క్రిష్ణుడికి ఆ కోపంతో తన పెదవిని తానే కొరుక్కుంటూ గుండ్రాయి తీసుకుని పక్కనే వున్నా పెరుగు కుండలను పగుల గొట్టి అక్కడ నుండి వెళ్ళిపోయాడు (జగత్తునంతటిని పాలించే తనకు పాలిచ్చే మహద్భాగ్యం కలిగిన యశోదమ్మ దానిని గమనించకుండా లౌకికమైన విషయాసక్తితో కుండలోని పాలకోసం పరిగెత్తిందని క్రిష్ణయ్య ఉక్రోషం )
వెనక్కి వచ్చిన యశోదమ్మ పగిలిన పెరుగు కుండలను చూసి నవ్వుకుని క్రిష్ణుడెక్కడ వున్నాడా అని వెతుకుతుంటే ఓ గోపిక ఇంట్లో రోలు తిరగవేసి దాని పై నుంచుని ఉట్టిలోని వెన్న తీసి కోతికి తినిపిస్తున్న క్రిష్ణయ్య ను చూడగానే పట్టరాని కోపం వచ్చింది యశోదమ్మకు
ఎన్ని సార్లు గోపకాంతలు కృష్ణుడి మీద పిర్యాదులు చేసినా నమ్మని యశోద ఇపుడు కళ్లారా చూసేటప్పటికి కోపంతో చిన్న కర్రను తీసుకుని క్రిష్ణుడి వద్దకు వెళ్ళబోతే భయపడిన క్రిష్ణుడు పరుగు లంకించుకున్నాడు . క్రిష్ణుడు ముందు... యశోదమ్మ వెనుక ఈ పరుగును చుట్టూ గోపకులం ఆకాశాన దేవ ముని గణ సమూహం ఉత్సుకతతో చూస్తున్నారు ఏమి జరగబోతుందా అని
యశోదమ్మ మనసంతా క్రిష్ణుడితోనే నిండిపోయింది ఎలా అయినా పట్టుకోవాలని . జగత్తు అంతా అక్కడ ఇక్కడ అని లేక అంతా తానై నిండిన వాడిని, ఆ రహస్యం తెలిసినా మహర్షులు దేవతలు సైతం పెట్టుకోలేని వాడిని పట్టుకోవాలని మనసంతా ఆ రూపే నింపుకుని పల్లె పడుచు యశోదమ్మ పరుగులు పెడుతుంది (ఇది అర్ధం చేసుకుంటే భగవంతుడిని ఎలా పట్టుకోవాలో తెలుస్తుంది)
ఒక్కసారి వెనుతిరిగి చూసాడు కృష్ణుడు . చెమటలు కారుతూ ఆయాసంతో రొప్పుతూ దేహంపైన వస్త్రం జారిపోతున్నా గమనించక తననే పట్టుకోవాలని వెంటబడుతున్న తల్లిని చూడగానే జాలితో నిండిపోయింది హృదయం . అంతే పరుగు ఆపి నిలబడిపోయాడు . పరుగు పరుగున వచ్చి అల్లరి పిల్లవాడిని పట్టుకుని పట్టుబడ్డాడని అలసట మరచి మురిసిపోయింది తల్లి తనకు తానుగా పట్టుబడ్డ దేవదేవుని భక్త కారుణ్యం చూసి పూలవాన కురిపించారు దేవతలు
క్రిష్ణుడు పట్టుబడ్డాడు యశోదమ్మ పట్టుకుంది అంతటితో అవ్వదుగా పట్టుకున్నవాడిని కుదురుగా కూర్చోబెట్టాలికదా . నిరంతర చలనశీలత కలిగినవాడిని కుదురుగా కూర్చోబెట్టాలి అంటే కట్టేయాలి ఇపుడు యశోదమ్మ అల్లరి పిల్లడు అయిన క్రిష్ణుడిని రోటికి తాడుతో కట్టటానికి ప్రయత్నిస్తుంటే ఆ తాడు రెండు అంగుళాలు తక్కువయ్యింది . ఇంకో తాడు తీసుకుని ఈ తాడు తో జత చేసి కట్టటానికి ప్రయత్నిస్తే అపుడు రెండు అంగుళాలు తక్కువ అయ్యింది . అలా ఎన్ని తాళ్లు జత చేసినా రెండు అంగుళాలు తగ్గుతూనే వుంది అయినా యశోదమ్మ ప్రయత్నం ఆపటం లేదు
మళ్ళీ తల్లి ని చూసాడు క్రిష్ణుడు చెమటలు కక్కుతూ పైట జారిపోతూ ముక్కుపుటాలు ఎరుపెక్కి అలసివున్న తల్లి మోము చూసి జాలితో కట్టుబడ్డాడు ధామము అంటే లోకాలు . అన్ని లోకాలను తన ఉదరంలో కలిగివున్నవాడు కనుక దామోదరుడు అన్నారు కాదు సర్వ జగత్తును తన ఉదరంలో నిలుపుకున్న క్రిష్ణుడు తల్లి యశోదమ్మ చేత ధామము (అంటే ఇంకో అర్ధం తాడు) తో కట్టబడ్డాడు కనుక దామోదరుడన్నారు
ఇక్కడ చెప్పిన రెండు అంగుళాలే నేను అన్న అహంకారం , నాది అన్న వ్యామోహపుమమకారం ఈ రెంటిని వదిలినవారే హృదయంలో భగవంతుడిని స్థిరంగా నిలుపుకోగలరు
ఇక క్రిష్ణుడి ని రోటికి కట్టిన యశోదమ్మ నిశ్చింతగా లోపలికి వెళ్ళింది. అమ్మ అటువెళ్ళగానే అందరిని మోహపు బంధనాల్లో బంధించే ఆ మాయాస్వరూపం అమ్మ చేత బంధింపబడి లేని ఏడుపుని నటిస్తూ రోటిని లాక్కుని పాకుతూ ఇంటి ఆవరణలో సంవత్సరాలనుండి వున్న మద్ది చెట్ల జంట మధ్యనుండి ముందుకు వెళ్లగా ఆ రోటి తాకిడికి ఆ చెట్లు కూలి\అందుండి ఇద్దరు గంధర్వులు బయటకువచ్చి కృష్ణుడికి నమస్కరించి వెళ్లిపోయారు
వారిరువురు కుబేరుని పుత్రులైన నలకూబరుడు ,మణిగ్రీవుడు. పెద్దలను గౌరవించని కారణాన నారదుని చే శాపగ్రస్తులై క్రిష్ణుని కారణాన శాప బంధనాలు తెంచుకున్నారు
కూలిన మద్ది చెట్లను వాటి మధ్య వున్న బాలకృష్ణుని చూసి గోకులమంతా ఆశ్చర్యచకితులైరి . యశోదమ్మ తనవలనే కృష్ణునికి ఇంత ఆపద కలిగిందని దుఃఖ పడుచుండగా నంద మహారాజు క్రిష్ణుని బంధనాలు విప్పి గుండెలకు హత్తుకున్నాడు
అందరిని మోహ బంధనాలలో బంధించు జగన్నాటకసూత్రధారిని తల్లి యశోదమ్మ బంధిస్తే అందరి బంధనాలు తెంపి మోక్షమిచ్చు ముకుందుని బంధనాలను నందుడు విడదీశాడు
మనం ఆ యశోదానందులమై రోజు ఈ అద్భుతమైన లీలను స్మరిస్తూ గోవిందా దామోదరా మాధవా అని కీర్తిద్దాం
Saturday, October 26, 2024
అహో
అహో
సహజ పరిమళాల నొప్పారు నిగనిగల నల్లని కేశపాశముల కొప్పు కాముని పూలశరముల కుప్ప వలే ఒప్పారుచుండే
పడతి ఫాలభాగము ఫాలాక్షుని త్రిశూల కాంతులతో సింధూర వర్ణ శోభను పొందె
కోమలి నల్లకలువ కనుల కోరచూపుల శరముల పరంపర హృదయవీణ ను మీటుచుండె
సంపంగి సొబగుల నాశిక పుటముల లేత ఎరుపుకాంతులు ఎదను గిల్లుచుండె
అలివేణి ప్రేమాధరాల తేనియలు మేఘమాలికలై కమ్మేయుచుండే
ఎర్రమందారమంటి ముగ్ధ మేని ముద్దాడుతూ సిగ్గుమెగ్గలై ఎర్రబారె రుద్రాక్షువులు.
ముక్కంటి మెచ్చిన మనోహరీ నీ రూపం చేయుచుండె మదిలో ఆనందతాండవం
Saturday, October 12, 2024
పులిహోర
నమ్మకమనే నూనెలో
ప్రేమ పూర్వక పలకరింపుల పోపు వేసి
కమ్మని భావాల కరివేపాకు కలిపి
అలిగిన వేళ మనసు పలికించు
ఎండు మిరప ఘాటును తగిలించి
బంగారు వన్నె నిగ నిగ ల మేని చాయను
పొసుపు పొడిగా అద్ది
చిలిపి ఊహల చింత పులుపులో
నానిన ఆత్మీయతల అన్నపు పలుకులలో
మనసులో పొంగు ఆప్యాయత అరచేతిలో
అమృత బిందువు కాగా కలిపి కలబోసి
నీవందించిన పులిహోర రుచి ఏమని వర్ణించను
అము జన్మ జన్మలకు నీ ప్రేమామృత
ధారలలొ తడిసి ముద్దవ్వాలని తపించటం తప్ప
నీలి వర్ణపు సోయగం
నీలి వర్ణపు సోయగం
నీలి కాంతుల పంచె కట్టిన ఆకాశరాజు చూసి
భూకాంత బుగ్గపై పూచిన నును సిగ్గు మొగ్గలు
నీలి వర్ణపు మయూరములై హొయలొలికించిన
ముచ్చటతోడ దట్టమైన నల్లమబ్బు తునకల
మరులు గొని గగనాధీశుడు ప్రేమ జల్లుల
విరులు కురిపించగా చిరుజల్లుల తాకిడితో
ఎద పొంగిన వసుధ మేని గంధపు సువాసనల
మురిసిన మయూరం పురివిప్పి కప్పిన ఆకు పచ్చని
శోభలతో కీంకారపు ధ్వనులతో ఆవని పరవశించే
గగన సీమయే పురుషుడు
భూమాతయే ప్రకృతి కాంత
ఇరువురి ప్రేమపూర్వక సమాగమమే
విశ్వమున శోభిల్లు లక్ష్మీ కళ
Friday, October 4, 2024
దేవీ నారాయణీయం దశకం -2
1. అసురుల యుద్ధంలో ఓడించి సంబరాలలో మునిగిన దేవతలు విజయ చిహ్నంగా యజ్ఞం చేయదలచి పరమ శివుని బ్రహ్మను తోడుగా చేసుకొని యజ్ఞ పురుషుడు అడ్డులేని శౌర్యం కల విష్ణువు చెంతకు బయలుదేరిరి
2 బలమైన పదునైన వింటి నారి తో బిగించబడిన విల్లు పై తన చుబుకం నుంచి నిద్రావశుడై వున్న విష్ణువు ను ఆశ్చర్యంతో చూస్తూ వుండిపోయిరి మంచి నిద్రలో వున్నవారిని నిదురలేపుట పాపమని తలచి మౌనంగా చేస్తూ వుండిపోయిరి
3 బ్రహ్మ మాయచే కల్పింపబడిన తెల్ల చీమల కొండ వలన కలిగిన చిరాకుతో విష్ణువు తన చుబుకాన్ని వింటినారి కి బలంగా నొక్కటం చేత తెగిన వింటినారి వంపుగా వున్నా వింటి ని ఒక్క ఒడుపున నిటారుగా చేయటం చేత ఆ విల్లు వేగంగా విష్ణువు యొక్క కంఠాన్ని తాకటం చేత ఆయన శిరస్సు తెగిపడింది
4. దేవతలందరు చూచుచుండఁగా ముర అను రాక్షసుని సంహరించిన మురారి శిరస్సు ఎగిరి వెళ్లి సముద్రమునందు పడినది. విషణ్ణ వదనంతో నిశ్చేష్టితులై హాహా కారాలు చేస్తూ దేవతలు విచారంలో మునిగిపోయారు
5 విష్ణువు యొక్క తల పడటం చూసి ఇది ఎలా జరిగింది ఎవరు చేశారు అని తమలో తాము చర్చించుకుంటున్న దేవతలతో బ్రహ్మ కారణం లేకుండా ఎట్టి కార్యము జరుగదు . విధి ఎంతో బలీయమైనది కదా అని పలికెను
6 కరుణార్ధ్ర చిత్తము కలిగి బ్రహ్మాండ సృష్టి అంతకు కారణభూతురాలైన దేవిని ధ్యానించండి . సర్వగుణములు కలిగినట్టిది ఏ గుణములు అంటనట్టిది సర్వ కార్యములు నిర్వర్తించుటలో సర్వ సమర్థురాలగు ఆ తల్లి అవసరమైన కార్యాన్ని నిర్వర్తిస్తుంది అని బ్రహ్మ పలికెను
7 ఈ విధంగా బ్రహ్మ చే ప్రోత్సహించబడిన దేవతలు వేదములు దేవి ని స్తుతించిరి సంతోషం పొందిన దేవి ఆకాశమున నిలిచి దేవా సమూహమును చూస్తూ ఈ విధంగా పలికెను... ఈ విధంగా పడివున్న హరి వలన మీకు సర్వ శుభములు కలుగును
8 హయగ్రీవుడను బలవంతుడగు రాక్షసుడు నానుండి వరములు పొందినవాడై భయము వీడి వేదములను మునులను పీడించుచున్నాడు . నామ రూపములలో తనను పోలిన (గుఱ్ఱము శిరసు కలిగి హయగ్రీవుడను పేరు కల ) వాడి చేతిలోనేమరణం పొందుదునన్న వరం కోరెను
9 విధి వశాత్తు విష్ణువు యొక్క శిరము తెగిపడినది . తలలేని హరి శరీరమునకు గుఱ్ఱపు శిరస్సు అతికించినచో మురారి హయగ్రీవ నామధేయుడై హయగ్రీవుడను అసురుడిని వేగంగా సంహరింపగలడు
10 ఈ విధంగా తెలిపి దేవి అదృశ్యరాలాయెను . వెంటనే త్వష్ట గుర్రపు శిరస్సును మురారి దేహమునకు అనుసంధించెను . దేవతలందరు ఉల్లాసముతో చూస్తుండగా హయాననుడగు శ్రీహరి ప్రాదుర్భవించెను
11 ఓ దేవి నీయొక్క ఆశీస్సులతో హయ వదనుడైన మురారి రణమునందు హయగ్రీవుడను రాక్షసుని సంహరించెను . జగత్తునకు సర్వ మంగళములు కలిగించు ఓ దేవి ఎల్లప్పుడూ నా శిరముపై నీ దయా వర్షం కురిపించు
Subscribe to:
Posts (Atom)