Thursday, February 26, 2026

శ్రీక్రిష్ణ కథ (శ్రీక్రిష్ణ లీలావిలాస హాస ) ధేనుకాసురవధ

 



బాలక్రిష్ణుడు చేసిన మరొక లీల ధేనుకాసుర వధ. ఒకరోజు బలరాముడు గోపబాలురుతో కలసి ఆడుకోవటానికి బాలక్రిష్ణుడు వనాలకు వెళతారు. అక్కడ బాగా పండిన తాటి పండ్లతో కూడిన తాళవనం (తాటి చెట్ల) వుంది. అవి చూసేసరికి గోపబాలురకు నోరూరి ఆకలి గుర్తుకు వస్తుంది. అంతలోనే వనాన్ని రక్షించే ధేనుకాసురుడు (గాడిద రూపంలో వున్న) గుర్తొచ్చి భయంతో వెనుకడుగు వేస్తారు.   

అంతలోనే తమ వెనుక వున్న వెన్నుని చూసి ధైర్యం తెచ్చుకుని ఇలా వేడుకొంటారు. క్రిష్ణా మాకు ఆకలిగా ఉన్నది. పండ్లను తినాలని కోరిక ఉంది అని చెప్పగా, భయపడకుండా వెళ్లి తినండి నేను మీకు ఎలాంటి ఆపద రానివ్వనని అభయమిస్తారు. వెంటనే గోపాలురు  తాటిచెట్లను వూపుతుండగా ఆగ్రహించిన ధేనుకాసురుడు వారి వద్దకు రాబోతుండగా  భయపడిపోయిన గోపబాలురు 

క్రిష్ణా ! కరుణానిధీ మము రక్షింప వేగిరమే రా 

సంకర్షణా! దానవుని బారినుండి మము రక్షించు   

క్రిష్ణా ! క్రిష్ణా ! హరీ మురారీ గోవిందా దామోదరా దీనబంధూ 

గోపీశా  గోపేశా  అనంతా నారాయణా భవ సాగరమందు మము రక్షించు  రక్షించు 

భయము నందు అభయము నందు , శుభ అశుభములందు , సుఖ దుఃఖములందు నీవు తప్ప శరణు ఇచ్చువారు వేరెవ్వరూ లేరు దీననాథా     

మాధవా భవసాగరమందు మము రక్షించుము మము రక్షించుము 
గుణసాగరా! శ్రీక్రిష్ణా!   జయము జయము  నీవే భక్తులకు ఏకైక బంధువు 

మేము అత్యంత భయము చెంది వున్నాము రక్షించు రక్షించు 

దానవుడు మృత్యువు వలే మము సమీపించుచున్నాడు అతనిని సంహరించి దేవతల బలదర్పములను పెంపొందించుము  

 

( ఇక్కడ గోపబాలురు భగవానుని పట్ల నమ్మిక కలిగిన మనం . తాటి చెట్ల వనం మనలను ఆకర్షించు లౌకిక విషయాల గుంపు . ధేనుకుడు మనలోని వ్యామోహాన్ని రెచ్చగొట్టు అసురీ శక్తి . దేవతలు అంటే మనలో అణిగివున్న సద్గుణాలు. మన మనసు కోరికల సుడిలో చిక్కుకుని తీవ్రమైన వ్యాకులత చెందినపుడు గోపాలుర యొక్క ప్రార్ధన మనం చేస్తే చిరాకు తొలగి ప్రసన్నతా భావాన్ని ఇస్తారు పరమాత్మ )

ఇలా గోపాలురు వేడుకోగానే శ్రీక్రిష్ణుడు బలరాముడితో కలసి గోపబాలకుల వద్దకు వచ్చి, బలరామా నీవు బాలురని  తీసుకుని దూరంగా వెళ్ళు . ధేనుకుడు మహాబలశాలి యగు బలి చక్రవర్తి కుమారుడైన సాహసికుడు. ఇతనిని నేను సంహరించెదనని పలికెను

వారు ప్రక్కకు వెళ్ళగానే శ్రీక్రిష్ణుడు ధేనుకుడిని సమీపించగా , ధేనుకుడు నోరు పెద్దగా తెరచి కృష్ణుడిని మింగివేయగా , కడుపులోకి వెళ్లిన క్రిష్ణుని దివ్య తేజస్సు తాళలేక ధేనుకాసురిడి లోపలి భాగాలన్నీ కాలిపోతాయి . తట్టుకోలేని ధేనుకుడు వెంటనే కృష్ణుడిని  బయటకు కక్కివేస్తాడు. మరణస్థితి లోకి చేరుకున్న ధేనుకుడు క్రిష్ణుడి స్పర్శ తగలగానే , తన గతం గుర్తుకు వచ్చి  ఎదురుగా వున్నది సాక్షాత్  శ్రీకృష్ణపరమాత్మయేనని గుర్తించి ఆయనను స్తుతించి శరణువేడతాడు. తనను సంహరించి దేహం నుండి ముక్తి కలిగించమని కోరగా , తన శరణు కోరిన తన భక్తుడిని సంహరించటానికి క్రిష్ణుడు తటపటాయిస్తుంటే ఇలా అయితే తనకు ముక్తి లభించదని తెలుసుకున్న ధేనుకుడు శతృభావంతోనే భగవంతుడిని పొందాలని నిర్ణయించుకున్నవాడై భీకరాకృతి దాల్చి కృష్ణుడిపైకి దూసుకురాగా వెంటనే  క్రిష్ణుడు సుదర్శన చక్రంతో ధేనుకుడిని సంహరిస్తాడు . మరణించిన ధేనుకుడి శరీరంలోనుండి వంద సూర్యుల కాంతి తో సమానమైన తేజస్సు బయటకు వచ్చి క్రిష్ణుని పాదాలలో లీనమవుతుంది. అట్టి ధేనుకుడు చేసిన క్రిష్ణ స్తోత్రాన్ని ధేనుకుని గత చరిత్రను తెలుసుకుందాం .



ధేనుకుడు బలి చక్రవర్తి కుమారుడైన సాహసికుడు.  చక్కని రూపలావణ్యములు కలవాడు. యుద్దంలో దేవతలను ఓడించి గంధమాదన పర్వతప్రాంతం గుండా వెళుతున్నపుడు, అక్కడ విహరించు తిలోత్తమ అనే అప్సరస  అతని సౌందర్యాన్ని చూసి మోహితురాలై తన కోరిక తెలుపగా అతడు కూడా తిలోత్తమ అందానికి ముగ్ధుడై ఆమె ప్రేమకు అంగీకారం తెలుపుతాడు. అలా వాళ్ళిద్దరూ అక్కడ కామకేళిలో ఆనందం పొందుతుంటారు.

  ప్రాంతంలోనే దూర్వాస మహర్షి శ్రీక్రిష్ణ పాదధ్యానంలో ఉంటారు. మహర్షి ఉనికిని పట్టించుకోకుండా వీరిద్దరూ తమ ఇచ్ఛానుసారంగా ప్రవర్తించటంచేత దూర్వాసుని యొక్క ధ్యానభంగమై తన ఎదురుగా లజ్జావిహీనులై ప్రవర్తించు వారిరువురును చూసి కోపించినవాడై కామకేళి యందు లజ్జ లేకుండా ప్రవర్తించు జీవులు పశువులు, అందులోను అత్యంత లజ్జావిహీనంగా ప్రవర్తించేది గాడిద కనుక నీవు గాడిదగా పుట్టమని సాహసికుని, దేవకాంతవైయుండి అసురుడికై ఆశ పడితివి కనుక అసుర కన్యగా పుట్టమని తిలోత్తమను శపించారు మహర్షి.

తెలివి తెచ్చుకున్న వారిద్దరూ మహర్షి పాదాలపైబడి శరణు కోరగా మహర్షి దయతో సాహసికా నీవు ఇంతకాలం చేసిన భగవంతుని ఆరాధన నీకు తోడుగా వుంటుంది పరమాత్మను దర్శించి ఆయనచేత సంహరింపబడి గోలోకాన్ని చేరతావని వరమిచ్చారు.

తిలోత్తమను నీవు బాణాసురుని కుమార్తె అగు ఉషగా జన్మించి శ్రీక్రిష్ణుని మనుమడగు అనిరుధ్ధుని కౌగిలి స్పర్శతో పవిత్రురాలివై అసుర శరీరం పోయి తిరిగి దేవలోకం చేరతావని ఆశీర్వదించి పంపుతారు.

ఇది ధేనుకుడి జన్మరహసం. శ్రీక్రిష్ణుని గుర్తించాక ఆయన చేతిలో మరణించబోయే ముందు ఆయన చేసిన స్తోత్రం, ( మహాభక్తుడు స్తోత్రం చేసినది సంస్కృతం లో అయినప్పటికీ, ఇదంతా రాయుటకు కారణం గాడిద తనను తాను ఉధ్ధరించుకోవటానికి కాబట్టి, గాడిదకు నా మాతృభాష మాత్రమే తెలుసు కాబట్టి, గాడిద ప్రేమించే శ్రీక్రిష్ణునకు నా మాతృభాష కూడా వచ్చు కాబట్టి మాతృభాష లోనే చెప్పబడుతుంది భావన చేయటానికి అనువుగా. అంతే కాక ఇది యధాతధ భావ వివరణయే కాని సొంతతెలివి కొంచెం కూడా వాడలేదు గమనించగలరు)

  క్రిష్ణా! నీ అంశయగు వామన రూపమున నా తండ్రి యాగశాల చేరి భిక్షకోరి రాజ్యము సంపదలు హరించితివి

 

బలి యొక్క అనన్యసామాన్యభక్తికి లొంగినవాడవై మాకు సుతల లోకాన్ని ప్రసాదించితివి

 

మహావీరా! సర్వేశా! భక్తవత్సలా! త్వరతిముగా నను సంహరించు పాపిని శాపవశమున గార్థభమైతిని

 దూర్వాస మహర్షి శాపవశమున నాకిట్టి హీన జన్మ దొరికినది నా మృత్యువు నీ చేతనే జరుగునని మహర్షి వరమిచ్చెను

 జగన్నాధా! పదహారు కోణములు కలిగి తీక్షణమైన తేజస్సు కల చక్రముతో నను సంహరించి సద్భక్తి మోక్షము ప్రసాదించు

 నీ అంశయగు వరాహ రూపమున భూమిని చక్కగా ఉద్ధరించితివి, నాథా! హిరణ్యాక్షుని వధించి వేదములను రక్షించితివి

 ప్రహ్లాదుని అనుగ్రహించుటకు దేవతల రక్షించుటకు నీవే నీ పూర్ణావతారమైన నృసింహునిగా హిరణ్యకశిపుని వధించితివి 

 దయానిధీ! నీ అంశయౌ మత్స్య రూపమున వేదములను ఉద్ధరించి మను చక్రవర్తికి సుజ్ఞానం

 ఇచ్చి దేవతలను విప్రులను రక్షించితివి

 సృష్టి కొరకు నీ అంశతో ఆదిశేషునకు ఆధారభూతమగు ఆదికూర్మమైతివి

సహస్రనయనుడా! నీ అంశతో భూమికి ఆధారమైన ఆదిశేషుడవైతివి

 సాగరముపై సేతువు నిర్మించి దశకంధరుని సంహరించి జానకినుద్ధరించిన దశరధనందనుడగు రాముడవు నీవే

 పృథ్వీనాథా! నీ కళచే జమదగ్ని పుతృడైన పరుశురామునిగా ఇరువదిఒక్కమార్లు భూమిని క్షత్రియరహితము చేసితివి

 నీఅంశచే ధర్మునకు నరనారాయణ ఋషులుగా జన్మించి లోకమున ధర్మమును ప్రకాశింపచేసితివి

  ఇపుడు ఈసమయమున సర్వావతారములకు జీవము సనాతనము అయిన పరిపూర్ణ పరమాత్మయగు శ్రీక్రిష్ణునిగా ఆవిర్భవించితివి

 నీవు యశోదకు జీవనము నిత్యుడవు నందుని ఆనందము వృద్ధిచేయువాడవు

గోపికలకు ప్రాణాధికదేవుడవు రాధకు ప్రాణాధిక ప్రియుడవు

 వసుదేవ సుతుడవు శాంతుడవు దేవకీదుఃఖ నిర్మూలకుడవు

అయోనిసంభవుడవు శ్రీమాన్ భూభారం తొలగించినవాడవు

 కృపానిథీ! పూతనకు మాతృస్థానం ఇచ్చితివి

బకుడకు కేసికి ప్రలంబునకు నాకునూ మోక్షమిచ్చువాడవు

 స్వేచ్ఛామయుడవు గుణాతీతుడవు భక్తుల భయము రూపుమాపువాడవు

  ప్రభూ! గార్ధభజన్మనుండి ముక్తి కలిగించి భవసాగరం దాటించు

నేను మూర్ఖుడనైననూ నీభక్తుడిపుతృడిని వేగిరమే నను ఉద్ధరించు

 వేదములు బ్రహ్మాదిదేవతలు మునీంద్రులు నిను నుతింపలేరు అట్లుండ మూఢుడు నిన్నేమని పొగడగలడు ముందు నేను అసురుడను ఇపుడు గాడిదను కరుణాసాగరా జన్మరాహిత్యమిమ్ము

 బ్రహ్మచే స్తుతించబడు నిన్ను నేడొక గాడిద స్తుతించుటకు ప్రయత్నిస్తున్నది.

సచ్చిదానందసరూపుడవైన నీవు యోగ్యులందు అయోగ్యులందు సమభావం కలిగిఉందువు కనుక నా ప్రయత్నం చూసి నను పరిహసించకుము

  

ధేనుకుడు చేసిన స్తుతి నిత్యం శ్రద్ధగా భావన చేయువారు శ్రీక్రిష్ణపార్షదులు అయ్యెదరు.

No comments: