Friday, July 7, 2023
అర్ధశత వసంతాలు
అర్ధశత వసంతాలు అనగానే రాతి కట్టడాలకు ప్రాణం లేని సంస్థలకు గోల్డెన్ జూబ్లీ అంటూ ఉత్సవాలు చేస్తారు
అదే మనిషి పూర్తి చేసుకుంటే పెద్దవాడివైపోతున్నావంటూ ముసలితనానికి చేరువవుతున్నట్లు చులకన
కట్టడాలు సంస్థలు పాతబడుతున్నా అందులోకి ఎప్పటికప్పుడు కొత్తవారు వస్తుంటారు
అలాగే శరీరం పాతబడుతున్నా లోపలి మనసు నిత్య యవ్వన రసోద్వేగహేల లో తెలియాడుతూనే వుంటుదిగా
ఆలోచనల ప్రవాహమూ ఎప్పుడూ కొత్తగానే ఉంటుందిగా . నిన్నటి ఆలోచన ఈరోజువుండదు ఈనాటి ఆలోచన రేపటికి నిలవదు
అర్ధశత శరత్కాల పూర్ణచంద్రోదయాలను చూసిన వయసు గర్విద్దాం రాబోయే కాలాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం
గడచిన కాలపు స్మృతులను నెమరువేసుకుంటూ భవిష్యద్ గమనంలోకి సాగిపోదాం ఓసారి వెనుతిరిగి ఇన్నేళ్ల జీవితకాలంలో
సంపాదించినదేమిటని ఆలోకనం చేస్తే ...
ప్రతి మనిషికి జీవన గమనాన్ని నిర్ధేశించటానికి ఓ సద్గురు అత్యావశ్యకం . కానీ ఈ కాలంలో సద్గురువులు దొరకటం దుర్లభం .
మరి ఎలా .. ఈ అన్వేషణలో నే అర్ధం చేసుకున్నది... మన జీవితమే మన గురువు . అంతకు మించిన గురువు లేరుగాక లేరు
ప్రతి రోజూ మన జీవితం సాగుతున్న విధానాన్ని పరిశీలంచుకుంటే అది నేర్పని పాఠం లేదు .
ఆ పాఠాన్ని వంటబట్టించుకుని తగిన మార్పులు చేసుకుంటూ ముందుకుసాగితే అంతకుమించి కావాల్సింది ఏమి లేదు
అలాగే జీవితం నిర్మల నదీతుంగా ప్రవాహంలా ప్రశాంతంగా సాగిపోవాలంటే మనిషి వినయ స్వభావం అలంకారంగా చేసుకోవాలి
ఎవరు సహనశీలత కలిగివుంటారో వారే వినయవంతులు కాగలరు
సహన స్వభావం వుండాలంటే మనిషికి సరి అయిన జ్ఞానం కలిగివుండాలి జ్ఞానం అబ్బాలంటే శ్రద్ద ఆవశ్యకం . ఎవరు శ్రద్ధాళువో
వాడే జ్ఞానవంతుడు కాగలడు
ఇన్నాళ్లకు నాకు కలిగిన జ్ఞానోదయం ఇది . శ్రద్ద వినయం జీవన గమనమనే గురువు ఈ మూడు కలిగివున్నవాడే ఐశ్వర్యవంతుడు
వాడే జీవితాన్ని పూర్ణంగా అనుభవించగలడు
ఇకనైనా ఈ మూడింటితో నాజీవితాన్ని పరిపుష్టం చేసుకోవటమే యాభైయ్యేవొడి చేరువలో నే నిర్ధేశించుకున్న గమ్యం
Monday, March 20, 2023
పిల్లలు
పిల్లలు
మల్లెల పరిమళాలు వెదజల్లు పక్క పక్క కాదు
పసిపాపల మూత్రం తో తడిసినదే పక్క కాని.... ఆర్యోక్తి
అది ఇంట పిల్లల కుండే ప్రాధాన్యత
బహుశా శ్రీరాముడను పేర నరుడిగా నడయాడిన నారాయణుడు సైతం
బాల విన్యాసాలలోని మధురానుభూతి తెలసి తిరిగి కృష్ణుడిగా దిగి వచ్చి
బాల్యంలోని మాధుర్యాన్ని అనుభవించిన వైనం వర్ణించనలవి కానట్టిది
అజ్ఞాని నైన నాకే అపుడపుడు సాలోచనగా పరికిస్తే సాయం సంధ్యలో
చెంగు చెంగున ఎగురుతూ , తటాలున ఆగుతూ కేరింతలతో సాగి పోవు
గోవత్సముల పద ఘట్టనలో రేగిన ఎర్రని ధూళి దట్టమైన వాన మబ్బు వంటి దేహచ్చాయను
కమ్ముకొనగా ఓ వింత ఎర్రని కాంతితో మెరయు, పసుపు పచ్చని పంచె కట్టి నడుముకు
బిగించిన తలపాగాలో వేణువు దూర్చి , తలపై నెమలి పించం అలంకరించి గోపబాలుర చేతులతో చేతులు కలిపి నడయాడు గోపాల బాల కృష్ణుని రూపం అబ్బ ఎంత ముద్దోస్తుందో ..........
ఇక సుజ్ఞానులైతే ఎంత గొప్పగా దర్శించి పులకించిపొయారొ పోతన గారి భాగవతం
లీలాశుకుల కృష్ణ కర్ణామృతం లాంటివి చూస్తే తెలుస్తుంది
అందుకే అంటారు భగవానుడు శిశువులలో తేజిల్లుతుంటాడని
అలాంటి బాలకుడొకడు నట్టింట పారాడుచుండగా చూసిన తండ్రి హృదయం
పొంగి పోతుంది
లేలేత తమలపాకు వంటి చిన్ని పాదాలతో గుండెలపై తన్నుతుంటే కలిగే తదాత్మ్యత సరిపోక
ముఖం మీదకు చేర్చుకుంటాడు పాదాలను అక్కడ కూడ తన్నమని
మరి అంతగా మురిపించే ముద్దు బాలకుడొకడు వుండాలని అందరు తపిస్తుంటే
నాకెందుకు ఆ ఆలోచన కూడా స్పురించదు
నేను జడుడనా ! నాకు స్పందనలు లేవా ?
ఆలి గగ్గోలు పెడుతున్నా, పెద్దలు పోరు పెడుతున్న
చెల్లి పనికట్టుకు ప్రశ్నిస్తున్న చిరకాల మిత్రుడు పదే పదే రొద పెడుతున్న
నాకెందుకు లేరు అన్న చింత కాని ఇక రారా అన్న ఆందోళన కాని మనసును తాకటం లేదు
అది బండ బారిందా లేక వివేకమెరుగని మూర్ఖపు స్థితిలో నేనున్నానా
ఆలోచనలు స్వయంకల్పితాలు వాటిని మనిషి సృజించలేడు
ఆవి ఆత్మచే సంకల్పించ బడతాయి ఆత్మ భగవత్ స్వరూపం
ఇదే విషయం వెంకటరామన్ గా పిలవబడి శరీరపు కదలికలు ఆగిన స్థితిలో కూడా
ఆలోచనలు ప్రసరించటం స్వయంగా అనుభవించి ఆత్మ వేరు శరీరం వేరు అని గ్రహించి
భగవాన్ రమణులుగా ప్రసిద్దులైన రమణ మహర్షి జీవితం మనకు తెలియ చేస్తుంది
అదే అనుభూతిని నేను రెండు సార్లు పొందాను . శరీరం పూర్తిగా చచ్చుబడి అణుమాత్రమైన కదపలేని స్థితిలో ...... నా మనసు మరణం సమీపిస్తున్నదా అని తనను తానూ ప్రశ్నించుకుని శ్రీరామ నామాన్ని స్మరించిన సందర్బం రెండు సార్లు అనుభవించాను
మరి నేనెందుకు అటు రమణుల వలే గొప్పగా ఆలోచించి ఉన్నత స్థితిని పొందలేకపోయాను
మరి అలాంటి స్థితి అనారోగ్యం వల్ల కలిగిందా అయితే నొప్పిని అనుభవించాల్సిన స్థితిలో
రామ నామ స్పురణ ఎలా కలిగింది
ఇంతటి ఆలోచనలు కలిగించే నారాయణుడు పిల్లలు గూర్చిన కనీసపు ఆలోచన కూడా
నాలో ఎందుకు రేకెత్తించటం లేదు
అంటే పూర్వ జన్మ వాసనా బలం ఏదైనా నను వెన్నాడుతుందా
అప్పటి పాపఫలం ఇప్పుడు ఈ రీతిన బదులు తీర్చుకుంటున్దా
కాదు అనుకుంటే ఒకే ఇంట జన్మించిన ముగ్గురు కు చెందిన సంతానంలో ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు గా సంతాన లేమి తో సతమతమవటం కాకతాళీయమా యాద్రుశ్చికమా
మరి ఇటువంటి స్థితిని నరుడైన వైద్యుడు తప్పించగలడా (మిగిలిన ఇద్దరు ఎందుకు ఇంకా ఫలితం పొందలేకపోయారు)
వైద్యో నారాయణో హరి మరి నారాయణుడే తప్పించాగాలడా మరి అందుకు ఆయన సంకల్పిస్తాడా
ఒక వేళ పిల్లలు పిల్లలన్నను వారికి సంక్రమించే ఆలోచనా స్థితి లేదా ఆరోగ్యం మన నుండి రావాల్సిందే కదా
అంటే సోమరితనం చిరాకు ఇటువంటి లక్షణాలతో పుట్టే వాడు తనను తాను ఉద్దరించుకొగలడా
మనకు సంతోషాన్ని ఇవ్వగలడా
ఏమో నాకేమి పాలు పోనీ స్థితి ఎటు వైపుకు నా పయనం .....
ఏమిటి నా ముందున్న కర్తవ్యమ్ .......
దామోదరుడా నీదే భారమిక
గుండెలపై సుతిమెత్తగా తన్నినా గుండె పోటు తెప్పించినా గురువాయూరప్ప
త్వమేవ శరణం మమ శంఖపాణే
Thursday, January 6, 2022
రాధమ్మ
రాధ రెండక్షరాల చిన్ని పదం .
మనసుతో ఆ పదాన్ని నిరంతరం ముడిపెడితే బ్రమానందపు ఊబి లో చిక్కుకుని
కొట్టుమిట్టాడు మనసును పట్టి లాగి బ్రహ్మానందపు అమృత సరస్సులో ఓలలాడించు దివ్యౌషధం.
ఒక్కటే అయిన పరతత్వం తనను తాను అయిదు పరిపూర్ణ రూపాలుగా విభజించుకుంది.
ఆ పరతత్వపు మొదటి పరిపూర్ణ రూపమే ఇఛ్ఛ జ్ఞాన క్రియా శక్తి స్వరూపిణి గణపతి మాత దుర్గ . ఈ తల్లి శివ తత్వాన్ని ఆశ్రయించింది
రెండు ఐశ్వర్య ప్రధాత అయిన మహాలక్ష్మి . ఈ తల్లీ నారాయణుని ని శక్తి గా మారింది
మూడు జ్ఞాన ప్రదాయిని అయిన సరస్వతి . ఈ తల్లి బ్రహ్మ శక్తిగా గా భాసిల్లుతోంది
నాలుగు వేదమాత సావిత్రి . ఈ తల్లి సూర్య మండల మధ్యస్థ గా విరాజిల్లుతుంది
ఇక ఐదవ స్వరూపం హ్లాదినీ శక్తీ . పరిపూర్ణ ఆనంద స్వరూపిణి అమ్మ రాధ . శ్రీక్రిష్ణ ప్రేయసి
ప్రతి మనిషి ఆరాటపడేది. ఏ మనిషీ పొందలేనిది అదే ఆనందం. ఈ ఆనందం కోసమే మనిషి పోరాటం.
మనుష్యులు పొందే ఆనందాలు తాత్కాలికం . దానిని వెన్నంటే దుఃఖం ఉంటుంది .
ఎలాంటి దుఃఖ స్పర్శ లేని నిజమైన ఆనందం పొందాలంటే ఈ హ్లాదిని శక్తి నే ఆశ్రయించాలి .
ఈ హ్లాదిని శక్తి నిత్యం క్రిష్ణుడిని ఆశ్రయించి ఉంటుంది. పరిపూర్ణమైన ఆనంద స్వరూపమే రాధాకృష్ణులు
రాధ కృష్ణుడి కన్నా పెద్దదని, అతనికి మేనత్త అవుతుందని ఏవో అసంబద్ధమైన వాదనలు చేస్తుంటారు కొందరు .
ఒకటే పరతత్వం. తనను తాను రెండుగా విభజించుకుంది . ప్రకృతి పురుషుడు శివపరం గా చెప్పేటప్పుడు వీరినే కామేశీ కామేశ్వరులంటారు .
వారుండే లోకాన్ని చింతా మణి ద్వీపం అంటారు విష్ణుపరంగా చెప్పినపుడు రాధాకృష్ణుఁలంటారు వారుండే లోకం గోలోక బృందావనం అట్టి పరతత్వమైన
శ్రీకృష్ణుని ఎడమ భాగం నుండి రాధా దేవి ఆవిర్భవించింది . కుడి భాగం నుండి చతుర్భుజుడైన నారాయణుడు ఉద్భవించారు.
రాధా దేవి యెక్క ఎడమ భాగం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించారు. నారాయణుడు లక్ష్మీ దేవిని స్వీకరించి వైకుంఠ లోకానికి చేరుకున్నారు.
రాధాకృష్ణులు గోలోకవాసులయ్యారు .
ఒకానొక సందర్భంలో రాధా దేవి శ్రీకృష్ణుని నిందిస్తుంటే ఆయన ఆంతరంగిక చెలికాడు అయినా సుదాముడు అనే గోపాలుడు క్రిష్ణ నింద సహించలేక రాధమ్మ న
ు క్రిష్ణ వియోగానికి గురికమ్మని శపిస్తే ఆ కారణాన ఆ తల్లి వృషభానుని ఇంట పసిపాప గా ఆవిర్భవించింది.
ఆ రాధమ్మ కోసమే మధుర లో జన్మించిన క్రిష్ణుడు గోకులానికి చేరుకున్నాడు. అక్కడ రాధమ్మ కృష్ణుని రాకకు ఎదురు చూస్తూవుంది.
తల్లి తండ్రులు రాధమ్మకు వివాహ నిశ్చయం చేయగానే రాధాదేవి ఆఇంటిలో రూప లావణ్యాలలో తననే పోలివుండే తన అష్టసఖుల లో ఒకరిని అక్కడ ఉంచి తాను బృదావనం చేరుకుంది.
అదే సమయంలో కంస దూతగా వచ్చిన అక్రూరుడు కృష్ణుని మధురకు తీసుకెళ్ళటానికి గోకులం చేరుకుంటాడు .
ఇదే సరిఅయిన సమయంగా ఎంచి శ్రీకృష్ణుడు కూడా బృందావనమ్ చేరుకోగా చతుర్భుజుడైన నారాయణుడు క్రిష్ణ రూపధారియై మధురకు వెళతారు
ఇక్కడ రాధ గా భావించబడుతున్న రాధాసఖి కి రాయణుడు అనే గోపబాలుడితో వివాహం జరుగుతుంది . ఈ రాయణుడు కృష్ణుని అంశతో జన్మించినట్టివాఁడు .
యశోదమ్మ కు సోదరుడు అవుతాడు . ఇది తెలియక రాధ కృష్ణునికి మేనత్త అవుతుందని , కృష్ణుని కన్నా పెద్దదని ఏవో ప్రచారాలు చేస్తుంటారు.
శ్రీమన్నారాయణుడు క్రిష్ణ రూపంలో మధురకు చేరుకొని అక్కడనుండి ఆయన మిగిలిన కథ నడిపితే లక్ష్మీ దేవి రుక్మిణిగా ఆయనను చేరుకుంది .
ఇక ఇక్కడ బృందావనం చేరుకున్న రాధా కృష్ణులు మొదట కలుసుకున్నది కార్తీక పున్నమి పర్వదినాన . అందుకే అది రాస పున్నమిగా ప్రఖ్యాతి చెందినది.
అప్పటినుండి రాధాకృష్ణులు ఆ బృందావన ధామాన్ని విడిచి వెళ్ళలేదు . రాధాకృష్ణుల నిత్య దివ్యరాస లీలా విలాసాలకు వేదిక గా నిలిచింది.
ఆ తల్లి రాధమ్మ పాదాలను ఆశ్రయిస్తే మనకు శ్రీకృష్ణ భక్తిని ప్రసాదిస్తుంది . ఆ తల్లి తండ్రుల దివ్యమైన పాద స్పర్శతో పునీతమైన దివ్యధామం బృందావనం .
అక్కడి గాలి శ్రీకృష్ణుని దివ్యమైన వేణుగాన తరంగాలతో , అక్కడి పూలతలు రాధాకృష్ణుల మేని సౌగంధపు పరిమళాలను అద్దుకొని పులకితమవుతూవుంటాయి
అట్టి ఆ బృందావనాన్ని దర్శిద్దాం . రాధాకృష్ణుల ప్రేమకు పాత్రులమవుదాం . ఆనందమయ జీవన సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం
రాధేక్రిష్ణా రాధేక్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా రాధే రాధే
Friday, December 24, 2021
సమయంలేదు మిత్రమా ! ఆధ్యాత్మిక వ్యవసాయమా ? దుఃఖ సాగరపు ఈదులాటా ?
జాతీయ రైతు దినోత్సవం ఈ పోస్ట్ మా గ్రూప్ లో చూసాక నా మనో క్షేత్రం లో మొలకెత్తిన ఆలోచనా పిలకలు ఇవి
మండే ఎండలకు గొంతెండి బీటలు వారిన భూమితల్లి తొలకరి జల్లుల తడిసి పరిమళించి పూయించే మట్టి గంధపు వాసన తో పరవశించిన మనస్సులు
ఉత్సాహంతో ఉరకలు వేసే ఎడ్లకు నాగళ్లు కట్టి దుక్కి దున్ని నేలతల్లిని వ్యవసాయానికి సిద్ధం చేసే ఆ కాలం
తీయని నీటిని కడుపునిండా నింపుకుని దుక్కబడిన నేలతల్లి గుండె తడపటానికి పరుగులు తీసే పంట కాలువల ప్రవాహం
నిండుగా మొలకెత్తిన నారుమడుల ఒడుపుగా పొలమంతా నాటే కలువ కనుల కోమలుల కోలాహలం
చిత్తడి గా మారి కాళ్లు జారేలా వుండే పొలం గట్లపై సరదాగా సాగిపోతూ ఏ సీమ తుమ్మ చెట్టు నీడనో కూర్చుని ఎర్రని అల్లపచ్చడి ముద్ద
ఆవురావురమంటూ తింటూ పంట కాలువ నీళ్లు తాగి తృప్తిగా తేన్చిన ఆ కాలం
ఏపుగా పెరిగి బంగారు రంగు కంకులతో పచ్చని ఆ చేలు భూమాతకు
బంగారు అంచు ఆకుపచ్చని చీర పెట్టి మురిసే రైతు బిడ్డల ఆనందానికి ప్రతిరూపాలు
వయ్యారి భామలు గలగల సందడి చేస్తూ పంట కోత కోస్తుంటే ... గుండె కోత కోస్తూ మదనుడు మదిలో సందడి చేస్తుంటే ...
కుప్ప నూర్చి ధాన్యపు రాశుల పోగుచేస్తూ రైతుల ఇండ్లలో పొంగే పొంగళ్ళు
అదో అద్భుతమైన లోకం . ఆ లోకం పేరు పల్లెటూరు
ఈ కాలంలో ఎక్కడా కనరాని నాటి ఆనందాల హోరు పల్లెటూరు
ఆ పల్లె జీవితపు గుభాళింపులు బాగుగా తెలిసినవాడు . దాని గొప్పదనం మనకు అర్ధం అయ్యేలా చెయ్యాలనే
ఆ గోవిందుడు పుట్టి పుట్టగానే పట్నం వీడి పల్లెను చేరాడు
వ్యక్తిగత స్వాతంత్రానికి , ప్రకృతి తో మమేకమైన స్వేచ్ఛాయుత జీవన విధానానికి , కుటుంబ భాంధవ్యాలకు ,
మనో వికాసానికి ఆలవాలం వ్యవసాయ దారుని జీవితం.
దానిని ధ్వంసం చేసుకుని చాలా దూరం వచ్చేశాం ... వాస్తవికతకు భ్రమకు కు తేడా తెలియనంత
ఇక వెనక కు వెళ్ళటం బహుశా దుస్సాధ్యం
ఇక మిగిలిన చివరి అవకాశం
మన మనస్సనే క్షేత్రాన్ని సానుకూల దృక్పధం అనే నాగలి తో దున్నుతూ మన మనస్సులలో ద్వేష బీజాలు మొలవటానికి కారణమయ్యే
కలుపు మొక్కల ఆలోచనలను ను తొలగించుకుని భగవన్ నామాలనే విత్తనాలు చల్లటం మొదలుపెడితే భగవత్ భక్తి అనే అమృత పుష్పం
చిగురులు తొడుగుతుంది . అది ఆనందపు మకరందపు జల్లులతో మన తనువెల్లా తడిపి జీవితాన్ని సార్ధకం చేస్తుంది
సమయంలేదు మిత్రమా ! ఆధ్యాత్మిక వ్యవసాయమా ? దుఃఖ సాగరపు ఈదులాటా ?
Saturday, September 12, 2020
కార్తీక పున్నమి ... తూరుపు కాంత నుదిటిన అద్దిన కుంకుమ బొట్టులా
ఆకాశ కాంత కు కాచిన ఎర్రని పండులా అగుపించి క్రమేపి పక్వ దశను
దాటి పండిన పండులా పసిమి ఛాయలు సంతరించుకుని మేఘ మండలము
అలంకరించుకున్న పసిడి పాపిట బిళ్ల లా తన వెండి వెలుగులతో భూకాంత
ను చందురుడు ప్రకాశింప చేయు వేళ
చిరుగాలి తాకిడికి కదులాడుతున్న నల్లని పొడుగాటి కురుల ప్రవాహంలా మృదు మదుర సవ్వడులతో సాగిపోతున్న యమునా తీరాన చందనపు పొడిరేణువులా అని మరిపించే విధంగా పరుచుకున్న ఇసుక తిన్నెలు
సమీపాన సువాసనలు వెదజల్లెడి పూలతలతో మనోహరమగు లావణ్యముతో ఒప్పారురంగు రంగుల పూల మొక్కలతో మధుర రసాలు స్రవించు ఫలాలతో నిండిన వృక్షాలతో కూడిన బృందావని
గండు తుమ్మెదల ఝుంకారాలతో , పూబాల ల పరిమళాలను , పండిన ఫలాల యొక్క తీయదనాన్ని తనలో నింపుకుని ఆహ్లాదకరం గా మెల్లగా వీస్తున్న పిల్ల తెమ్మెరలు
అట్టి ఆ బృందావని లో ఓ మందార చెట్టు కింద ఎడమ పాదపు ఎడమ భాగాన కుడి పాదపు ముని వేళ్ళను నేలకు తాకించి కుడి పాదపు వెనుక భాగాన్ని పైకి ఎత్తి నుంచున్న భంగిమలో ఓ స్ఫురద్రూపిదట్టమైన వానమబ్బు రంగు దేహ కాంతి తో , తలపై నెమలి ఫించం ధరించి , నుదిటిపై
కస్తూరి తిలకం అద్ది , నాసిక పై భాగాన తెల్లని ముత్యమొకటి మెరయుచుండగా పారిజాత సుమ మాలను మెడలో ధరించి ఆకు పచ్చని రత్నాల ఉత్తరీయాన్ని భుజాలపై వేసుకుని కస్తూరి చందనపు పూతతో నిండిన దేహంతో ఒంపుగా నిలబడి పున్నమి పసిడి కాంతులు ఆ దేహాన్ని తాకి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తుండగా
ఎర్రని దొండ పండు వంటి పెదవులపై రెండు అరచేతులతో ఒడుపుగా పట్టిన వేణువు నుంచి సుతారంగా ప్రాణులన్నిటికి ప్రాణాధారమైన వాయువును తన పెదవుల గుండా ఆ వేణువులోకి మృదువుగా పంపుతుంటే వేణువు నుండి బయటకు వస్తున్న ఆ వాయు తరంగాలు మధురమైన ధ్వనులుగా మారి ఆ ప్రాంతమంతా ఆవరిస్తున్నాయి అతి మధురమైన ఆ ధ్వనులకు ప్రకృతి పరవశించిపోతుండగా ఆ వేణు నాద తరంగాలు
మెల్లగా గోపకులాన్ని తాకాయి ఆ గోపకులంలో నవ యవ్వనంతో తొణికిసలాడే గోపకాంతల సమూహాలు ......అందులో
కొందరు గోపికలు తమ చీర సొబగుల సౌందర్యాన్ని ఇతర గోపికలతో పంచుకు మురిసిపోతుంటేమరి కొందరు తమ ఆభరణాల తళుకు బెళుకులు ప్రదర్శిస్తూ, మరి కొందరు తమ చేతి కంకణముల సవ్వడులతోను ఇంకొందరు కాలి అందియల సవ్వడులతోను మరి కొంత మంది గోపికలు కోలాటపు సవ్వడులతోను సందడి చేస్తుండగా మరి కొందరు ముగ్ధలు తమ గాన కౌశలంతో ఆ ప్రాంతాన్ని పునీతం చేస్తున్నారు .ఇంకొందరు ఇంటి పనులలో నిమగ్నులై ఉన్నారు . అట్టి ఆ గోపకాంతల సమూహపు చెవులను ఆ వేణు నాద తరంగాలు చేరగనే ఒక్కసారిగా వారిలో వూహించని మార్పు . తమ చుట్టూ వున్న ప్రపంచాన్ని మరచి తామున్న స్థితిని మరచి ఒక్క ఉదుటున పరుగు పరుగున ఆ వేణువు తరంగాలు జనిస్తున్న ఆ వృందావనిలోకి చేరుకున్నారు
అక్కడ ఆ మందారపు చెట్టుకింద తమ కలల రేడు , భావించిన మాత్రం చేతనే హృదయాలలో గొప్పదైన ఆనందాన్ని పొంగించేవాడు సాక్షాత్ పర బ్రహ్మమే తానైనట్టివాఁడు
అగు ఆ యశోదా నందనుడు గోకుల కిశోరం శ్రీకృష్ణుని మనోజ్ఞమైన దివ్య మంగళ రూపాన్ని చూచి పులకితులై తమను తాము పరిపూర్ణంగా ఆనంద స్వరూపుడగు ఆ పరంధామునకు సమర్పించుకోటానికి సంసిద్దులయ్యారు ఆ అమాయకపు పల్లె పడుచులు నిష్కళంకమైన నిర్మల జ్ఞానానికి ప్రతిరూపాలైన ఆ గోపకాంతలతో రాసలీలకు ఉద్యుక్తుడయ్యాడు అందరి హృదయాలలో ఆత్మగా ప్రకాశించు ఆ పరమాత్మ
రాస లీల ఇది రెండు మహోన్నత భావాల (మాతృత్వము +పోషకత్వము=వాత్సల్యము ) కలయిక . రెండు దేహాల కలయిక కాదు
తొమ్మిది రంధ్రాలతో కూడి తొమ్మిది రకాల మలపదార్ధాలతో నిండిన దేహాల కలయిక ఎలాంటి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు
చైతన్యం మాతృత్వం పోషకత్వం లాలిత్యం సౌందర్యం ఈ భావాల పరస్పర కలయికే రాసలీల అట్టి రాసలీల మానసిక దర్శనం దుఃఖ స్పర్శలేని సుఖానుభూతినిస్తుంది అది నిజమైన రసానుభూతి
కలిగిస్తుంది . రాసం అంటేనే గొప్పదైన ఆనందపు అనుభూతి అని అర్ధం . ఆ ఆనందానికి అవధులు వుండవు . అట్టి దివ్యమైన ఆనంద స్వరూపుడే శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణునితో సమాగమం కోరటమంటేనే ఎల్లలు లేని దుఃఖ స్పర్శ లేని పరిపూర్ణ ఆనందానుభూతి
తో మమేకమవటమే . అదే మానవ జీవిత పరమార్ధం అందుకోసమే అత్యంత దుర్లభమైన మానవ జన్మ మనకు లభిస్తుంది మనుషులు తాము తమ కోరికలు నెరవేర్చుకోవటంద్వారా ఆనందం పొందుతున్నామని భ్రమలో వుంటారు . నిజానికి వారు పొందే ఆనందాలు తాత్కాలికమే కాక వాటి ఫలితం దుఃఖ స్పర్శతో కూడి వుంటుంధి ఆ గోపికలు ఇహ పరాలను కాదనుకుని కేవలం పరమాత్మ తో సౌఖ్యాన్ని మాత్రమే కోరుకున్నారు వారికి ఇతరములైన ఏ లోక విషయాలయందు వారికి ఆసక్తి లేదు. వారి అనురక్తి యందు పరమాత్మ యందు మాత్రమే
భయము చేత కంసుడు , భక్తి చేత ప్రహ్లాదుడు , స్నేహం చేత అర్జునుడు, సుదాముడు , ఉద్ధవుడు
శత్రుత్వం చేత రావణ కుంభకర్ణ శిశుపాలుడు , కామం చేత గోపికలు ఆ పరమాత్మ ను పరిపూర్ణం గా తమలో నిలుపుకున్నారు . ఆ పరంధాముడి ధామాన్ని చేరుకున్నారు మనం కూడా భగవానుడి పట్ల స్వచ్ఛమైన భక్తి భావమో స్నేహ భావమో పెంచుకుని శ్రీకృష్ణుని కరుణా కటాక్షాలకు పాత్రులమవుదాం
Monday, August 10, 2020
అలల ఒడిలో
జీవితంలో మొదటిసారి అయ్యో అనిపించింది చదువులో సాధించిన మార్కుల విషయంలో వాటి గురించి ఆలోచించటం అదే మొదటిసారి అదే చివరిసారి కూడా
డిగ్రీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాక , మేనేజ్మెంట్ అకౌంటెన్సీ లో వంద మార్కులు వచ్చాక ,కాస్ట్ అకౌంటెన్సీ లో కూడా వంద వస్తాయనుకున్న తీరా చూస్తే 80 మాత్రమే వచ్చాయి మొదటిసారి మనసు చివుక్కుమంది ఏమైయ్యుంటుంది వ్రాసిన కాస్ట్ అకౌంటెన్సీ పేపర్ ఓసారి జ్ఞాపకం చేసుకుంటే , ఆరోజు ఎదో బాలయ్య మూవీ కి వెళ్లాలన్న హడావుడి లో సమయం ఇంకా చాలా మిగిలి వుండగానే ఆన్సర్ పేపర్ సబ్మిట్ చేసి వెళ్ళిపోవటం తప్పు ఎక్కడ జరిగిందా అని ఆలోచిస్తే ప్రాసెస్ కాస్టింగ్ లో ఒక ప్రాసెస్ నుండి మరొక ప్రాసెస్ కి ఓపెనింగ్ బాలన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయటం మరచితిమి వెంటనే పెదవులపై ఒక చిరునవ్వు . మనసులోని దిగులు మటుమాయం చదువుల కాలం ముగిసింది. జీవితపు పరీక్షా కాలం మొదలైంది
గుంటూరు లోనే ఆడిటర్ పున్నయ్య చౌదరి గారి ఆఫీస్ లో చేరటం , ఆడిట్ పనుల మీద ఊళ్ళు పట్టుకు తిరగటం
ఆ క్రమంలో మొదటిసారి హైదరాబాద్ రావటం జరిగింది . నాతో వుండే సీనియర్ మిత్రుడు సాయంత్రం అవ్వగానే ట్యాంకుబండ్ వద్దకు తీసుకు వచ్చేవాడు . అక్కడ వీచే మురికి గాలుల వాసనకు ముక్కులు ఉక్కిరి బిక్కిరి ఐతే , ఆ ప్రాంతం చుట్టూ షికారుకు తిరిగే మనుషులను చూసి మనసు ఉక్కిరి బిక్కిరి అయ్యింది అపుడే నిర్ణయించా ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ రాకూడదని . (హతవిధీ! భగవానుడు తన్నిన తన్నుకు ఎగిరొచ్చిపడి భాగ్యనగరంలో పడితి )
అక్కడ షికారు ముగియగానే చిక్కడపల్లి లో కమ్మని భోజనం ఆరగించి అటునుండి ఆటే మహేశ్వరీ థియేటర్ కి ...... దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే భాష రాదు కానీ అద్భుతంగా నటించిన షారుఖ్ కాజోల్ ల ఉత్సాహభరితమైన ప్రణయగీతం వరుసగా ఏడురోజులు సెకండ్ షో కి వెళ్ళటం ఇసుమంతైనా విసుగనిపించకపోవటం
ఆ తరువాత పయనం విశాఖపట్టణం . ఆఫీస్ పని ముగియగానే సాయంత్రాలు సాగర తీరంలో ఇసుక తిన్నెలపై సేద తీరుతూ ఎగసి పడే అలలు చూస్తూ వేడి వేడి మిక్చర్ ఆరగిస్తూ, నిశీధివేళ సముద్రుడి ఘోష హృదయంలో సుడులు తిరుగుతుంటే వచ్చే కిక్కు ఏ ఆర్ రహ్మాన్ బీట్ ఇస్తుందా ఇళయరాజా సంగీతమిస్తుందా చేతిలోని ఐస్ క్రీం కరిగిపోతుంది కాళ్ళ కింద ఇసుక అలల తాకిడికి కదిలిపోతుంది కాలం గడచిపోతుంది కానీ సముద్రుడి ఘోషలో లీనమైన మనస్సు మాత్రం వెనుకకు రాదు అదే సముద్రుడి గొప్పతనం ఆర్కే బీచ్ రోడ్ నుండి ఋషి కొండ మీదుగా సాగర తీరం వెంబడి భీమిలి బీచ్ వరకు ఉల్లాసంగాబైక్ మీద సాగిపోతుంటే అదొ సరదా ... మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది బైక్ మీద భామ అయితే లేదు కానీ ఆ జర్నీ ఇచ్చే కిక్కుంది రుషికొండ సమీపంలో సరుగుడు చెట్ల తోట పక్కనే బీచ్ చాలా అందంగా వుంటుంది . మాతో వచ్చినవాళ్లు , ఇక్కడి బ్రాంచ్ మేనేజర్ ,స్టాఫ్ కలసి ఆ తోటలో మందు, ముక్క పెట్టుకుని పేక
ఆడుతుంటే నేనలా సాగరపు ఒద్దు చేరుకున్నా
అక్కడ ఆ సాగరంలో నున్నని నల్లని శిలలు నా మనసు ని ఆకర్షించాయి . వెళ్లి ఆ శిలల పై కూర్చున్నా . ఒక్కో అల అలా వచ్చి ఇలా ఈ రాళ్లను సుతారంగా తాకి వెళుతుంటే ప్రేయసి పాదాలను తాకి మురిసిపోయే ప్రేమికుడి అంతరంగంలా ఆ అలల తరంగాలు నా మనసును హత్తుకున్నాయి
సమయం గడుస్తున్నకొద్దీ అలల వేగం కొద్ది కొద్దిగా పెరగసాగింది . సుతారంగా శిలలను తాకి వెనుకకు మరలిన అలలు రెట్టించిన ఉత్సాహంతో ,ప్రేయసి పాదాలు ముద్దాడి మురిసిన ప్రియుడు మరింత ప్రేమగా ప్రియురాలి నుదురు ముద్దాడ వేగిర పడినట్లుగా కడువేగంతో ఎగసిపడుతూ వచ్చి ఆ శిలల శిఖరాన్ని తాకసాగాయి
అప్పటివరకు ఆ అలల తడి నా పాదాల వరకే పరిమితం కాగా , సమయం గడుస్తున్న కొద్దీ , పొద్దు గుంకుతున్న వేళ ఆకాశంలో రాబోయే చందురుని కోసం ఆశగా ఎదురుచూస్తూఆ చందురుని అందుకోవాలని ఆబగా ఎగిరెగిరిపడుతున్న అలల ఝడి క్రమక్రమంగా నా మోకాళ్ళను దాటి నా నుదురు తాకుతుంటే ఆ అలల తరంగాలతో మమేకమైన నా ఆలోచనా తరంగాలు కదిలిపోతున్న కాలాన్ని గాని రాబోతున్న ప్రమాదాన్ని గాని గుర్తించే మెలుకువ లో లేదు
ఇంతలో పెద్దగా సముద్రుడి ఘోషను కూడా దాటుకుని ఆ తరంగాలతో లీనమైన నా మనసును
కుదుపుకు గురి చేస్తూ పెద్దగా అరుపులు ఏమిటా అని వెనుకకు తిరిగితే ఒడ్డున నిలబడి మా వాళ్ళు పెద్దగా అరుస్తున్నారు బయటకు రా రమ్మని , అపుడు అర్ధమైంది నేనొచ్చి చాలా సమయం గడిచిపోయిందని అలల వేగం క్రమేపి ప్రమాదకరంగా మారుతుందని . ఒడ్డుకు వచ్చి చూస్తే వాళ్ళ ముఖాల్లో ఆందోళన ... ఏమున్నదబ్బా వాళ్ళు వాళ్లకిష్టమైన పేకాటలో మునిగిపోయారు ,నేనేమో నాకు ఇష్టుడైన సముద్రుడితో మమేకమై పోయాను
సముద్రం అదొక అద్భుతం . సముద్రుడి అలలకు మనిషి ఆలోచనలకు అలుపు లేదు నిరంతరం అవి సాగుతూనే ఉంటాయి . సాగర గర్భంలా మనిషి మనసు కూడా లోతు తెలియనిదే . సముద్రాన్ని పోలినదే మన మెదడు కూడా . రెంటికి ఉన్న గొప్ప లక్షణం దృశ్య రూపకం గా చూడగలగటం . నీటికి తన చుట్టూ జరుగుతున్న సంఘటనలను తనలో నిక్షిప్తం చేసుకునే శక్తి వుంది అదే విధంగా మన మెదడు కూడా తన ఊహకు అందిన విషయానికి దృశ్య రూపం ఇవ్వగలదు అంతేనా లక్ష్మీమ్ క్షీర సముద్రరాజ తనయాం అని కీర్తిస్తాం , జయ జనని సుధా సముద్రాంత రుధ్యన్మణి ద్వీప సంరూఢ అంటారు అమ్మ శ్యామలను అదేవిధంగా మన మనస్సనెడి సముద్రంలో అమ్మను చూస్తాం
అందుకే సముద్రుడిని చూస్తే అంతలా ప్రేమలో పడతాం ... తనివి తీరలేదు నా మనసు నిండలేదు ఏనాటి బంధమో సాగరమా మనది .....
Tuesday, June 30, 2020
విఠల విఠల
నల్లని వాడు పద్మ నయనంబులవాడు కృపా రసంబు పై
జల్లెడువాఁడు మౌళి పరి సర్పిత పింఛము వాడు నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మాన ధనంబు దోచెనో
మల్లియలారా మీ పొదల మాటున లేదు గదమ్మ చెప్పరే
శరద్కాలపు వెన్నెల రాత్రులలో గోపాంగనలతో చక్కగా రాసలీల లాడుతున్న నిత్య
చైతన్య మూర్తి యగు శ్రీక్రిష్ణ భగవానుడు ఒక్కసారిగా అదృశ్యమైపోతే ఆయన ఎడబాటు
తట్టుకోలేని ఆ గోపికలు విరహ వేదనతో ఆ వనమంతా సంచరిస్తూ కనబడిన ప్రతి చెట్టుని
పిట్టను పువ్వును తుమ్మెదలను ప్రశ్నిస్తూ తమ అనుంగు చెలికాడి జాడ తెలియక అమితమైన
భాధ చెంది వున్నారు.
వారి భాధ చూసి నా మనసు వేదన చెంది ఎక్కడికి చేరాడో ఈ నల్లనయ్య అని నేను ఈ లోకాన్ని
గమనించటం మొదలు పెట్టా
అందుగలడిందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుడన్న ప్రహ్లాద వాక్యం పై నమ్మకంతో
లోకమంతా కృష్ణుడిని చూడ నెంచితి కానీ అది అంత తేలిక కాదని తేలిపోయింది . మరి ఎక్కడ పట్టాలి ఈ వెన్న దొంగను
గోవిందా గోవిందా అంటూ తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తుం టే ఈడ వున్నాడు నా స్వామి అని పరుగు పరుగున కొండపై కెక్కి చూస్తే ఎక్కడో ఏడు ద్వారాల ఆవల అరమోడ్పు కనులతో
నా పాదాలపై దృష్టి నిల్పమని సూచిస్తూ నిలుచుని వున్న ఆ శ్రీనివాసుని దివ్య తేజస్సు పై
మనసు నిలిపే లోపే వాకిలి వెలికి వచ్చి పడ్డా
ఈయనే అని తెలుస్తుంది కానీ దగ్గరకు చేరేదెలా ఆ పాద పద్మం చూసేదెలా
నీ హృదయ పద్మంలో వున్నాడయా అని చెపుతారు జ్ఞానులు . కళ్ళెదురుగా వున్నా ఆ కమనీయ రూపాన్ని పోల్చుకోలేని అజ్ఞుడను ఎక్కడో లోపల హృదయంలో దాగిన వాడిని పట్టటం యెలా
ఎలా ఎలా అని మధనపడుతున్న సమయంలో పిలిచాడు నా స్వామీ వేగిరమ్మే రా రమ్మని
పండరీపుర ధామానికి
ఇంకేమీ ఆలోచించలా లేచిందే లేడి కి పరుగన్నట్లు పరుగులు తీసితి పురంధరుని పద సన్నిధికి
ఆ ధామం లోపలి అడుగుపెడుతుంటేనే ఒక విధమైన ఆనందపు అనుభూతి . జ్ఞానేశ్వరుడు
ఏకనాధుడు తుకారాం వంటి మహా మహుల పాద స్పర్శతో నేల తల్లి, వారి కీర్తనల తరంగాలతో వాయువు పునీతమైన ప్రాంతమది
ఆ అనుభూతి పొందిన మనసుతో గర్భ గుడిలోకి అడిగిడితి
ఎదురుగా బంగారు వర్ణంతో మెరిసిపోయే వస్త్రం ధరించి, ఆకుపచ్చని తలపాగా తో , ముత్యాల హారాలు మేడలో వేలాడుతుండగా , తెల్లని పట్టు పంచె కట్టి
రాచ ఠీవితో నడుమున రెండు చేతులు పెట్టి ఇట్టిట్టిదని వర్ణించనలవికాని సౌందర్యంతో
కరుణ రసం తో నిండిన కనులు ప్రేమగా నను చూస్తుంటే ,
సంపెగ సౌరభాలను దిక్కరించు అందమైన నాసిక తో అలరారుతూ ,
తదియ నాటి చంద్రుడిలా ఆ ఎర్రని పెదవులపై చిరు దరహాస చంద్రికలు పూయిస్తూ
బోర్లించిన అష్టమి నాటి చంద్రుడిని పోలిన ఆ నుదుటి పై కస్తూరి తిలకాన్ని ధరించి
దయ అనే జలాన్ని అణువణువు నింపుకుని,
నిండుగా జలాన్ని తనలో నింపుకున్న వానాకాలపు దట్టమైన వాన మబ్బురంగు లా మిలమిల మెరిసిపోతున్న దేహంతో
ఆ దివ్య మంగళ రూపాన్ని చూస్తూ తన్మయమైపోయి అలా నిలబడిపోయా
వెంటనే అక్కడే వున్న భగవత్ సేవకుడొకరు నా తలవంచి స్వామి పాదాలపై పెట్టారు
అంతే ఒక్కసారిగా ఎపుడు అనుభవించని చల్లదనమేదో నా నుదిటిపై ఒక్కసారిగా స్పృశించితే
నా చేతులతో ఆ స్వామి పాద పద్మాలను తాకితే ఆ మెత్తదనం
వాటిని వేటితోను పోల్చలేం కానీ అర్ధం చేసుకోవాలంటే కొలనులో విరబూసిన కమలాన్ని ఒక్ కసారి
కనులపై పెట్టుకుంటే ఎంత చల్లగా అనిపిస్తుందో ఆ తామర తూడును తాకితే ఎంత సుతిమెత్తగా
అనిపిస్తుందో అలా
ఓ అద్భుతం
ఏ వైష్ణవ ఆలయానికి వెళ్లినా మనం నారాయణుడి సమీపం చేరలేం దూరం నుండి దర్శించుకోవాల్సిందే . అందుకే తిరుమలలో కొలువైన దయామయుడైన ఆ శ్రీనివాసుడు
తన పాదాలను ఆశ్రయించి ఆనందంగా ఉండమని సూచిస్తూ ఆ పాదాలను ఆశ్రయిస్తే పొందే
ఆనందపు అనుభూతి సారాన్ని అందరికీ అందించటానికై విట్టలుడిగా పాండురంగ నామధేయంతో
ఈ పండరీ పుర క్షేత్రంలో మనకై నిలిచియున్నాడు
విఠల విఠల పాండురంగ జయ జయ
విఠల పాండురంగ
Subscribe to:
Posts (Atom)