నల్లని వాడు పద్మ నయనంబులవాడు కృపా రసంబు పై
జల్లెడువాఁడు మౌళి పరి సర్పిత పింఛము వాడు నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మాన ధనంబు దోచెనో
మల్లియలారా మీ పొదల మాటున లేదు గదమ్మ చెప్పరే
శరద్కాలపు వెన్నెల రాత్రులలో గోపాంగనలతో చక్కగా రాసలీల లాడుతున్న నిత్య
చైతన్య మూర్తి యగు శ్రీక్రిష్ణ భగవానుడు ఒక్కసారిగా అదృశ్యమైపోతే ఆయన ఎడబాటు
తట్టుకోలేని ఆ గోపికలు విరహ వేదనతో ఆ వనమంతా సంచరిస్తూ కనబడిన ప్రతి చెట్టుని
పిట్టను పువ్వును తుమ్మెదలను ప్రశ్నిస్తూ తమ అనుంగు చెలికాడి జాడ తెలియక అమితమైన
భాధ చెంది వున్నారు.
వారి భాధ చూసి నా మనసు వేదన చెంది ఎక్కడికి చేరాడో ఈ నల్లనయ్య అని నేను ఈ లోకాన్ని
గమనించటం మొదలు పెట్టా
అందుగలడిందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుడన్న ప్రహ్లాద వాక్యం పై నమ్మకంతో
లోకమంతా కృష్ణుడిని చూడ నెంచితి కానీ అది అంత తేలిక కాదని తేలిపోయింది . మరి ఎక్కడ పట్టాలి ఈ వెన్న దొంగను
గోవిందా గోవిందా అంటూ తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తుం టే ఈడ వున్నాడు నా స్వామి అని పరుగు పరుగున కొండపై కెక్కి చూస్తే ఎక్కడో ఏడు ద్వారాల ఆవల అరమోడ్పు కనులతో
నా పాదాలపై దృష్టి నిల్పమని సూచిస్తూ నిలుచుని వున్న ఆ శ్రీనివాసుని దివ్య తేజస్సు పై
మనసు నిలిపే లోపే వాకిలి వెలికి వచ్చి పడ్డా
ఈయనే అని తెలుస్తుంది కానీ దగ్గరకు చేరేదెలా ఆ పాద పద్మం చూసేదెలా
నీ హృదయ పద్మంలో వున్నాడయా అని చెపుతారు జ్ఞానులు . కళ్ళెదురుగా వున్నా ఆ కమనీయ రూపాన్ని పోల్చుకోలేని అజ్ఞుడను ఎక్కడో లోపల హృదయంలో దాగిన వాడిని పట్టటం యెలా
ఎలా ఎలా అని మధనపడుతున్న సమయంలో పిలిచాడు నా స్వామీ వేగిరమ్మే రా రమ్మని
పండరీపుర ధామానికి
ఇంకేమీ ఆలోచించలా లేచిందే లేడి కి పరుగన్నట్లు పరుగులు తీసితి పురంధరుని పద సన్నిధికి
ఆ ధామం లోపలి అడుగుపెడుతుంటేనే ఒక విధమైన ఆనందపు అనుభూతి . జ్ఞానేశ్వరుడు
ఏకనాధుడు తుకారాం వంటి మహా మహుల పాద స్పర్శతో నేల తల్లి, వారి కీర్తనల తరంగాలతో వాయువు పునీతమైన ప్రాంతమది
ఆ అనుభూతి పొందిన మనసుతో గర్భ గుడిలోకి అడిగిడితి
ఎదురుగా బంగారు వర్ణంతో మెరిసిపోయే వస్త్రం ధరించి, ఆకుపచ్చని తలపాగా తో , ముత్యాల హారాలు మేడలో వేలాడుతుండగా , తెల్లని పట్టు పంచె కట్టి
రాచ ఠీవితో నడుమున రెండు చేతులు పెట్టి ఇట్టిట్టిదని వర్ణించనలవికాని సౌందర్యంతో
కరుణ రసం తో నిండిన కనులు ప్రేమగా నను చూస్తుంటే ,
సంపెగ సౌరభాలను దిక్కరించు అందమైన నాసిక తో అలరారుతూ ,
తదియ నాటి చంద్రుడిలా ఆ ఎర్రని పెదవులపై చిరు దరహాస చంద్రికలు పూయిస్తూ
బోర్లించిన అష్టమి నాటి చంద్రుడిని పోలిన ఆ నుదుటి పై కస్తూరి తిలకాన్ని ధరించి
దయ అనే జలాన్ని అణువణువు నింపుకుని,
నిండుగా జలాన్ని తనలో నింపుకున్న వానాకాలపు దట్టమైన వాన మబ్బురంగు లా మిలమిల మెరిసిపోతున్న దేహంతో
ఆ దివ్య మంగళ రూపాన్ని చూస్తూ తన్మయమైపోయి అలా నిలబడిపోయా
వెంటనే అక్కడే వున్న భగవత్ సేవకుడొకరు నా తలవంచి స్వామి పాదాలపై పెట్టారు
అంతే ఒక్కసారిగా ఎపుడు అనుభవించని చల్లదనమేదో నా నుదిటిపై ఒక్కసారిగా స్పృశించితే
నా చేతులతో ఆ స్వామి పాద పద్మాలను తాకితే ఆ మెత్తదనం
వాటిని వేటితోను పోల్చలేం కానీ అర్ధం చేసుకోవాలంటే కొలనులో విరబూసిన కమలాన్ని ఒక్ కసారి
కనులపై పెట్టుకుంటే ఎంత చల్లగా అనిపిస్తుందో ఆ తామర తూడును తాకితే ఎంత సుతిమెత్తగా
అనిపిస్తుందో అలా
ఓ అద్భుతం
ఏ వైష్ణవ ఆలయానికి వెళ్లినా మనం నారాయణుడి సమీపం చేరలేం దూరం నుండి దర్శించుకోవాల్సిందే . అందుకే తిరుమలలో కొలువైన దయామయుడైన ఆ శ్రీనివాసుడు
తన పాదాలను ఆశ్రయించి ఆనందంగా ఉండమని సూచిస్తూ ఆ పాదాలను ఆశ్రయిస్తే పొందే
ఆనందపు అనుభూతి సారాన్ని అందరికీ అందించటానికై విట్టలుడిగా పాండురంగ నామధేయంతో
ఈ పండరీ పుర క్షేత్రంలో మనకై నిలిచియున్నాడు
విఠల విఠల పాండురంగ జయ జయ
విఠల పాండురంగ
No comments:
Post a Comment