బంగారురంగు పానీయంతో నిండి వున్న అందమైన గ్లాసులు
చుట్టూ కోలాహలం
అంతలోనే ఎగసిపడిన ఆనందంతో
ఒరేయ్ ఇన్నేళ్ళు ఏమైపోయావురా ఓ కేక
నామాలు తెల్సుకోవటానికి ఒక నిమిషం సమయం పట్టినా
రూపాలు పోల్చుకోవటానికి అట్టే సమయం పట్టలేదు
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ……..5 వ తరగతి నుండి పదోతరగతి వరకు
కలసి చదివిన బాలసన్యాసులు
అవునుమరి గురుకులం ………తాడికొండ గురుకుల బాలుర విద్యాలయం
అప్పటి క్లాస్ మేట్స్ ఇప్పుడు ఇలా
సుమారు 20 సంవత్సరాల తరువాత
అవును …………..
సరిగా మే 9, 1990…………
ఒక వైపు తుఫాన్ కుదిపేస్తుంది
మరోవైపు ……..జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం విడుదల
ఈరెంటిని మించిన ఉత్కంట ……… మా పదో తరగతి ఫలితాల ప్రకటన
ఒక్కసారి అలా కనుల ముందర కదులాడింది నాటి దృశ్యం
అప్పటివరకు కలసి వున్నబాలసన్యాసులు ……..వేరు వేరు
రహదారుల వెంబడి పయనమైపోయిన క్షణం
ఆనాటి సన్యాసులే నేడు కళ్ళ ముందు కదులాడుతున్న దృశ్యం
ఒక్కొక్కరిని పోల్చుకుందామా
ఇంతటి తెల్లని దీపపుకాంతిలో కూడా నిగనిగలాడుతున్న నల్లని నగుమోమువాడు
పరిమి (పేరు బత్తుల గంగాధరమైన పరిమోడిగానే ప్రసిద్ది ..పెద పరిమి వీడి ఊరి పేరు )
ఇప్పుడు డ్రిల్లు పంతులు (అప్పట్లో మంచి ఖోఖో ఆటగాడు లెండి అంతకన్నా పెద్ద పోకిరి )
మత్తు వదలరా నిదుర మత్తు వదలరా అంటూ శ్రావ్యం గా నిదురులేపబోతే
ఎవడురా వాడేవడురా నన్ను నిదురలేపే దమ్ములెవడికి వచ్చేరా అంటూ
భీకరంగా బూతులు పలికే భాను ప్రకాశం కదా వీడు
అన్నం ……..అప్పుడు ఎంతగా వుడికించినా వుడకని గింజ
కాని ఇప్పుడు అనేక గింజలను వుడికిస్తున్న ఓ జ్ఞానదీపం
(అన్నం శ్రీనివాసరావు ……..అందరు అన్నం అన్నం అనేవారు …….పాపం వుడుక్కునేవాడు
ఇదేం ఇంటిపెరురా అని
కాని ఇప్పుడు ………..ఇన్నేళ్ళ తరువాత మరలా ఆ పిలుపు విని చెవులలో అమృత వర్షం కురిసిన భావన
చదువులో బాగా వెనుకబడి ఉండేవాడు ………కాని జీవిత పాటాలు బాగా వంటపట్టిన తరువాత తనను తాను సంస్కరించుకుని లెక్చరర్ అయ్యాడు )
ఇలా చెప్పుకుంటూపొతే చాలా చిరాకేస్తుంది చదివేవాళ్ళకు
ఇలా నాటి స్నేహితులు సుమారు 20 మంది ఒక చోట చేరి గంతులేస్తుంటే
స్నేహితుడా స్నేహితుడా చిన్ననాటి స్నేహితుడా
అని పాడుకుంటూ
--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA