Friday, December 18, 2009

హృదయ మధ్యమున పద్మపత్రంలో

ఓ మనసా ! నారాయణుని కీర్తించు

ఓ శిరమా ! ఆయన పాదాల మోకరిల్లు

ఓ హస్తములార ! ప్రేమతో అంజలి ఘటింపుడు  

ఓ ఆత్మా! పుండరీకాక్షుడు నాగాచలం పై

శయనించివున్నవాడు , పురుషోత్తముడు

పరమసత్యమైనట్టి  నారాయణుని శరణాగతి కోరుము

 

ప్రభు జనార్ధనుని లీలామయగాధలు విను తరుణాన

దేహం రోమాంచితం కానిచో , నయనాలు ఆనంద

భాష్పములనే సుమాలను రాల్చకున్నచో మనసు  పరవసించకున్నచో

అట్టి  నా జీవితం  వ్యర్ధమే కదా

 

ఈ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది

కండరాలు అరిగి నొప్పికి గురి అవుతాయి

ఏదో ఒకరోజు పండుటాకులా రాలిపోతుంది

ఓ  అమాయకుడా ! నయం చేయలేని నానా రకాల మందుల

వెదుకులాట మానుకో  దివ్యమైన అమృతమయమైన  

శ్రీకృష్ణ  నామౌషధాన్ని  మనసారా  త్రాగుము

 

 మనుష్యులెంత  చిత్రమైనవారు

అమృతాన్ని వదిలి  విషాన్ని  పానం చేస్తున్నారు

నారాయణ నామస్మరణ  మాని  నానారకముల

వ్యర్ధ పలుకులను ఆసక్తి  తో  చెప్పుచున్నారు

 
బంధు మిత్రులు  నన్ను  త్యజించినారు

పెద్దలు గురువులు  నన్ను నిరాకరించినారు

అయినప్పటికీ  పరమానందా  గోవిందా  !

నీవే  నాకు  జీవితము

 

ఓ  మనుజులారా ! ఎలుగెత్తి  సత్యం  చాటుతున్న

ఎవరు అనుదినం  రణం లోను మరణం లోను

ముకుందా  నరసింహా  జనార్ధనా  అని  నిరంతరం

ధ్యానిస్తువుంటారో  వారు  తమ  స్వకోర్కెల  గూర్చి

చింతించటం  రాయి  వలె  ఎండుచెక్క  వలె  వ్యర్ధం

 

చేతులెత్తి  బలమైన  గొంతుకతో  చెబుతున్న

ఎవరు  నల్లని  గరళము  వంటి  జీవితము  నుండి

తప్పించుకోజూస్తారో   అట్టి  జ్ఞానులు  ఈ  భవసాగరాన్ని

తిరస్కరించుటకు నిత్యం  ఓం నమో నారాయణాయ  అను 
 మంత్రం వినటమే  తగిన  ఔషధం  

 

ఎట్టి  కారణం చేతనైనను  ఒక్క  నిమిషమైనను

కృష్ణుని  దివ్య పాదారవిందాల స్మరణ మానిన

అట్టి  క్షణమే  ప్రియ మిత్రుల బంధువుల గురువుల

పిల్లల ఆక్షేపణలతోను, నీచపు ఆలోచనల విహారంతోను

గాలి వార్తలతోను మనసు  విష పూరితమగును  

కనుక  కృష్ణా  నీ  ప్రేమామృతం  చాలు

 

కృష్ణుడు జగద్గురువు  కృష్ణుడు  సర్వలోక రక్షకుడు

కనుక ఎల్లప్పుడూ కృష్ణుని పాదాలని ఆశ్రయించేదను  

లోకం లోని మన శత్రువులను నిర్జించి కృష్ణుడు మనలను  

కాపాడును .కృష్ణా  నీకు నమస్కారము

కృష్ణుని నుండే అన్ని  జగములు పుట్టుచున్నవి

జగములన్నియు  క్రిష్ణునిలోనే  ఇమిడియున్నవి

కృష్ణా ! నేను  నీ  దాసుడను

ఎల్లప్పుడూ  నా  రక్షణాభారం వహించు

 

హే  గోపాలక  ,హే  కృపా జలనిదే ,హే  సింధు కన్యా పతే
హే  కంసాంతక  ,హే  గజేంద్ర  కరుణాపారీణా , హే  మాధవ
హే  రామానుజ  ,హే  జగత్త్రయ గురో  ,హే  పుండరీకాక్ష

హే  గోపీజన వల్లభా  నాకు  తెలుసు నీవు తక్క వేరెవ్వరు లేరు

కనుక ఎల్లప్పుడూ నన్ను రక్షించు

 

క్షీర సాగరుని కుమార్తె నీ అర్ధాంగి

ముల్లోకాలు సృష్టించు బ్రహ్మ నీ కుమారుడు

నిన్ను గూర్చిన స్తుతులే  పవిత్ర వేదాలు

సకల దేవతా సమూహము నీ సేవక పరివారము

ముక్తి  నోసగుటయే నీవు  ఆడు  ఆట

దేవకీ  నీ  తల్లి

శత్రువులకు అభేద్యుడగు అర్జునుడు నీ మిత్రుడు

ఇంత  మాత్రమే నాకు తెలుసు  ( నీవు తప్ప తెలుసుకోదగినది వేరేది  లేదు కదా )

 

 ముకుందునకు  ప్రణమిల్లుటయే  శిరస్సు యొక్క ఉత్తమ కర్తవ్యము

పూవులతో అర్చించుటయే  ప్రాణశ్వాస యొక్క  కర్తవ్యము

దామోదరుని  తత్వ చింతనమే మనసు యొక్క  కర్తవ్యము

కేశవుని కీర్తనమే  వాక్కు యొక్క  కర్తవ్యము

 

ఓం నమో నారాయణా అని స్మరించినంత మాత్రాన

పాపులు కూడా ఉద్దరించబడుతున్నారు  . అట్టిది

పూర్వ  జన్మలలో  ఎన్నడు  నారాయణుని  నామ స్మరణ  

చేయకుంటినేమో  ఇప్పుడు  గర్భావాసపు  దుఖాన్ని భరించవలసివచ్చే


హృదయ మధ్యమున  పద్మపత్రంలో  

అవ్యయుడు అనంతుడు అయిన విష్ణువు ని నిలిపి

సదా ధ్యానించు వారలకు సకల భయాలు

తొలగి విష్ణుపదం సన్నిహితమవుతున్నది

 

ఓ  హరీ ! ఓ పురుషోత్తమా ! ఓ విష్ణు

నీవు దయా సముద్రుడవు

పాపులకు మరల మరల ఈ  భవసాగరమే  గతి అగుచున్నది

నీ దయావర్షం  నాపై కురిపించి

నన్ను ఉద్దరించు ముకుందా

  

పాల కడలిలో అలల తుంపరలు దేహాన్ని తాకుతూ

నీలాకాశాన తారకలు వలె మెరుయుచుండగా

శేషతల్పం మీద సుఖాసీనుడవైన  మాధవా

మధుసంహారీ నీకివే నా మనఃపూర్వక  ప్రణామములు

 
కృష్ణ  కృష్ణ  అన్న నామాలు చాలు  

జీవిత కర్మఫలాలు దూరంగా నెట్టి వేయబడటానికి

ముకుందుడి  పై ఎనలేని ప్రేమభావమున్న

సిరి సంపదలు  మోక్ష ద్వారం  అందుబాటులో వుంటాయి

 

నా  మిత్రులు జ్ఞాన మూర్తులు

కవిత్వ సామ్రాజ్యంలో రారాజులు

ద్విజోత్తములు . నేను కులశేఖర చక్రవర్తి  ని

ఈ  పద్య  కుసుమాలు  పద్మాక్షుని  చరణాంబుజములకు  

భక్తి ప్రపత్తులతో  సమర్పితం



--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


1 comment:

Lion King said...

mantripalem near repalle ? ??