Thursday, December 3, 2009

ఓ సరోజ పత్ర నేత్రా



కోరి వరించిన భార్య తత్ఫల సంతానం
సంపదలనే మూడు భంధనాలపై మదనుడి
మోహబాణపు తాకిడికి పెంచుకున్న వ్యామోహంతో
జనన , జీవన మరణాలనే మూడు సరస్సులలో పలుమార్లు
మునకలేస్తున్న నాకు ముకుందా నీ భక్తి అనే పడవలో
కొద్ది చోటు కల్పించు

ముకుందా! నీ కడగంటి చూపు తో
పృథ్వి ధూళి రేణువు సమమవ్వును
అనంత జలధి ఒక్క బిందు పరిమాణమయ్యే
బడబాగ్ని చిన్న అగ్నికణం గా గోచరిస్తుంది
ప్రచండమైన వాయువు చిరుగాలి లా ఆహ్లాదపరుస్తుంది
అంచులేరుగని ఆకాశం చిన్న రంధ్రమై చిక్కపడుతుంది
సమస్త దేవతా సమూహం బృంగ సమూహాలను మరిపిస్తుంది
కృష్ణా సమస్తము నీ పాద ధూళి లోనే ఇమిడియున్నది కదా


యాజ్ఞావల్క్యాది మహర్షులచే తెలియజేయబడిన
జరా వ్యాధి మరణాల నుండి ముక్తి కలిగించు
దివ్యోషధం జనులారా మన హృదయాలలో అంతర్జ్యోతి
వలె , కృష్ణ నామం తో ఒప్పారుచున్నది . ఆ నామామృతాన్ని
త్రావి పరమపదం పొందుదాం

దురదృష్టమనే అలలతో కూడిన సంసార సాగరంలో
అటునిటు త్రోయబడుచున్న నరులార! చిరుమాట వినండి
జ్ఞానఫలం కోసం నిష్ఫల యత్నాలు వీడి
ఓం నారాయణా నామజపం తో ముకుందుని పాదాల మోకరిల్లండి

ఎంత అవివేకులము సుమీ !
పురుషోత్తముడు ముల్లోకాలకు అధిపతి
శ్వాసను నియంత్రించిన మాత్రాన అధినుడగునట్టివాడు
స్వయంగా మన చెంతకు రానుండగా ,
తనవన్ని మనకు పంచనుండగా
అధములైనట్టి రాజులను యజమానులను
అల్పమైన కోర్కెల కోసం ఆశ్రయించుచున్నాము


ముకుళిత హస్తాలతో వినమ్రతతో వంగిన శిరస్సుతో
రోమాంచిత దేహంతో గద్గద స్వరంతో కృష్ణ నామాన్ని
పదే పదే స్మరిద్దాం సజల నేత్రాలతో నారాయణుని వేడుకుందాం
ఓ సరోజ పత్ర నేత్రా …..ఎర్ర తామరలను బోలిన నీ పాదద్వయం నుండి
జాలువారు అమృతం సేవించుచు మా జీవనం కొనసాగించు భాగ్యం కలిగించు


(mukunda maala)

1 comment:

durgeswara said...

hari neeve sarvaatmakudavu ......