Saturday, December 12, 2009
పండు వెన్నెల వలె , పాంచజన్యపు తెల్లదనం వలె
కృష్ణా నీ పాదధూళి తో పునీతమైన
శిరము జ్ఞానదీపమై ప్రకాశించుచున్నది
హరిని కాంచిన కనులు మాయ పొరలు వీడి
తారలవలె కాంతులీనుతున్నవి
మాధవుని చరణారవిందాలపై లగ్నమైన మది
పండు వెన్నెల వలె , పాంచజన్యపు తెల్లదనం వలె స్వచ్ఛమై ఉన్నది
నారాయణుని గుణగణాల కీర్తన తో తడిసిన నాలుక
సుధారస ధారలు కురిపించుచున్నది
ఓ నాలుకా ! కేశవుని కీర్తనలు ఆలాపించు
ఓ మనసా ! మురారి స్మరణలో మునకలేయుము
ఓ చేతులారా ! శ్రీధరుని సేవలో నిమగ్నమవ్వుడు
ఓ చెవులారా ! అచ్యుతుని లీలలను ఆలకింపుడు
ఓ కనులార ! కృష్ణుని సౌందర్య వీక్షణలో రెప్పపాటు మరచిపోండి
ఓ పాదములారా ! ఎల్లప్పుడూ హరి ఆలయమునకే నను గోనిపొండి
ఓ నాశికా ! ముకుందుని పాద ద్వయంపై నిలచిన పవిత్ర తులసి సువాసనలను
ఆస్వాదించు
ఓ శిరమా ! అధోక్షజుని పాదాల ముందు మోకరిల్లు
ముకుందా ! నీ పాదస్మరణ లేని
పవిత్ర నామ ఉచ్చారణ అడవిలో రోదన వంటిది
వేదకార్యాల నిర్వహణ శారీరిక శ్రమను మాత్రమే మిగుల్చును
యజ్ఞాయాగాదులు బూడిదలో నేయి కలిపిన చందము
పుణ్యనది స్నానం గజస్నానం వలె నిష్ఫలము
కనుక నారాయణా నీకు జయము జయము
మురారి పాదాలకు పీటమైనట్టి నా మదిని
మన్మధుడా ! వీడి మరలి పొమ్ము
హరుని కంటిచుపులో కాలిపోయిన నీకు
హరి చక్రపు మహోగ్ర తీక్ష్ణత తెలియకున్నది
శేషతల్పం పై పవళించు నారాయణుడు మాధవుడు
దేవకీ దేవి ముద్దుబిడ్డ దేవతా సముహలచే
నిత్యం కొలవబడువాడు సుదర్శన చక్రమును
సారంగమను వింటిని ధరించినట్టివాడు
లీలచే జగత్తును ఆడించువాడు జగత్ప్రభువు
శ్రీధరుడు గోవిందుడు అగు హరి స్మరణ మనసా
ఎన్నటికి మరువకు . స్థిరంగా హరిని సేవించుటకన్నను
నీకు మేలు కలిగించు దారి మరేదిలేదు
మాధవా ! నీ పాదపద్మాలపై నమ్మిక లేనివారి వైపు
నా చూపులు తిప్పనివ్వకు
నీ కమనీయ గాధా విశేషాలు తప్ప ఇతరములేవి నా చెవి చేరనియకు
నిన్ను గూర్చిన ఆలోచన లేనివారి తలంపు నాకు రానీయకు
నీ సేవా భాగ్యమునుండి ఎన్ని జన్మలెత్తినా నను దూరం చేయకు
-- (mukunda maala)
ఓం నమో భగవతే వాసుదేవాయ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment