Saturday, December 12, 2009

నాకు నీ చెలిమి అనే కలిమిని


అవును నారాయణా నేనేమి కోరగలను

నీ పాదాల చెంత చోటడుగునందునా

మహా జ్ఞానులు మహా భక్తులు అయిన కులశేఖర ఆళ్వారు , పోతన మహాకవి

లాంటి వారు ఇప్పటికే వాటిని ఆశ్రయించి వున్నారు

మరి వారి సరసన చోటు కోరేంతటి వాడనా నేను



నా హృదయం లో నిలచిపోమ్మందునా

గోప కాంతలు నన్ను చూచి ఫక్కున నవ్వుతున్నారు

నిజమే కదా వారికున్న నిష్కళంకమైన అమాయకపు ప్రేమ నాకు లేదు కదా



ఎల్లప్పుడూ నిన్నే తలచు మనసిమ్మందునా

కష్టాలలో తప్ప సుఖాలలో నిన్ను గుర్తించమాయే

అయినా నేనేమి నీ మేనత్త కుంతీ ని కాదు కదా

ఎల్లప్పుడూ మాకు భాధలనే కలిగించు .ఆ విధంగా నైనా ఎల్లప్పుడూ నీ చింతన

చేయగల అదృష్టం మాకు కలుగుతుంది అని ప్రార్ధించ

అంతటి మనో నిబ్బరం మాకు లేదుకదా


అనన్య శరణాగతి కోరుదునా
కలడు కలండను వాడు కలడో లేడో అన్న సంశయమే తప్ప
అందుగలడిందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడన్న

ప్రహ్లాదుని నిశ్చల బుద్ది కాని

నీవే తప్ప ఇహపరంబెరుగనన్న గజేంద్రుని దీక్ష కాని

నాకు లేవు కదా


ప్రేమగా పిలిచి నైవేద్యం స్వీకరించమందునా
మడి ఆచారాలంటూ తర్జన భర్జనలు , వాటిని సక్రమంగా

చేయలేక మనసంతా ఆందోళనలే తక్క

బ్రతుకు తెరువుకోసం మట్టికుండలు చేస్తూ , చేతికంటిన బంకమట్టి తోనే

మట్టిపూలు సమర్పించిన కురువరతి నంబి వలె

ప్రేమ ప్రపత్తులు లేవు కదా


ఇన్ని లేమిలతో సతమవుతున్న నాకు నీ చెలిమి అనే కలిమిని ప్రసాదించి
ఈ జీవన కురుక్షేత్రంలో పార్దుడిని నడపించినటుల నన్ను నడిపించు

నారాయణా శ్రీమన్నారాయణ హరే

No comments: