Monday, March 10, 2025

శ్రీమన్నగర నాయికా

జగత్తును పాలించు శ్రీవత్సాంకితుని వాత్సల్యభావము
లాలించుచున్నది జగదంబిక అలసట హరి దరి చేరనీయక
ఈ లాలన మరీ మరీ కోరెనేమో హరి యశోదయై కౌసల్యయై
కోరి భువికి చేరె భువనేశ్వరి మాతృభావపు మధురిమలు వెదజల్ల 

విశ్వరచనా సృజనలో తలమునకలైన విరంచి వేలుపట్టి ఆడుచున్నది 
విశ్వమాత  విసుగు విరామపు తలంపులేవీ విధాత దరిచేరనీయక

రుద్రుని ప్రళయకాల వీరభద్రుని భుజగ భూషణుని 
సదాశివునిగా లోకముల కీర్తి నొందించ భుజమున
పట్టి వెన్నుతట్టి తల్లితనపు చల్లదనముతో సాంబుని
అణువణువు నింపుచున్నది మాతృమూర్తి లలితాంబిక  
 
అయ్యలగన్న యమ్మ ముగ్గురయ్యల మూలపుటమ్మ
మా మనంబుల నిత్యనివాసినియై ఆనందసంద్రపు అలలపై
మా జీవన నౌక పయనింప చేయుమా శ్రీమన్నగర నాయికా 
లక్ష్మీ కిరణు ప్రియ తనూజా శ్రీరాజరాజేశ్వరీ మాతా 


Sunday, March 9, 2025

రతీపతి జనకుని

 కాళింది మడుగులో కాళిందుని శిరములపై 

నాట్యమాడు చిన్ని శిశువుని గని  దుఃఖపు 
భారమున తల్లడిల్లు గోపాంగనల హృది తేట 
పరచ బృందావన వీధుల చిందేసే చిన్ని క్రిష్ణుడు 

బృందావన వీధుల చిందేసే చిన్నిక్రిష్ణుని గని
పాలిండ్ల పొంగు మధురభావనలతో బరువెక్కిన 
హృదయపు భారము దించనెంచిన గొల్లభామలు 
ఆడిపాడిరి ఆనందనిలయుడగు అచ్యుతుని గూడి 

ఆనందనిలయుడగు అచ్యుతుని  పదరంజీవముల
ఝనత్ క్వణత్ ధ్వనులతో ఉల్లము ఝల్లుమన
పూలతలవోలే అల్లుకొనే గోపీకుంజారావముల్ రతీపతి జనకుని జన్మజన్మల రాగబంధమతిశయించ

Wednesday, March 5, 2025

ఆత్మబంధు

 జనన మరణ చక్రభ్రమణంలో నాది నావారలను 
వ్యామోహపు మకరముల పాల్బడి విలవిలలాడుచును 
నిర్మోహత్వంబు పొందదు  నా మనంబు నీ కృప లేకను
కలిసి తిరిగితిమి కాలచక్రమంతయు దేహదారినై నేను 
ఆత్మలింగమై నీవు  ప్రతి కదలికలో వేదన చెందితి  నేను  
వేడుక చూసితి నీవు ఆటలు చాలిక ఆత్మబంధు నిర్మల 
జ్ఞానమొసగి దయ చూపు దక్షిణా

మూర్తి స్వరూపా  శ్రీకాళహస్తీశ్వరా