Sunday, January 12, 2025

సంక్రాంతి

  సంక్రాంతి 


గొబ్బిళ్ళ గుర్రాలు పూంచిన ముగ్గుల రథమెక్కి భానుడుదయించు వేళ 
 హరి కీర్తనల రస గుళికలు  పెదవుల జాలువారుచుండ చిడత చప్పుళ్ల
 హరిదాసుల కోలాహలం  చెవులకింపై ఇల్లాండ్ర దోసిళ్ళ జాలువారిన దయ 
 అక్షయపాత్ర లో పొంగు వేళ  తొంగిచూసే తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి హేల

మినప గారెల ఘుమఘుమ అత్తగారి ఆప్యాయతల అరిసె కొత్త బియ్యపు 
పాల పొంగళ్ళు ఆరగింపుకై వేచి యున్న వేళ మామ మురిపెముగా తెచ్చిన
కొత్త వస్త్రాలతో అలంకరించుకుని అలకలు చూపుతూ ఆలి తో కొత్త అల్లుళ్లు 
భోజనాల కుపక్రమించు వేళ  తొంగిచూసే తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి హేల
 
పట్టు పరికిణి మెరుపుల విరిబోణి హోయలు తుంటరి మనస్సులలో ఆశల
విహంగాలను ఎగరేయు వేళ నింగి కెగసిన పతంగులతో పూబోణుల హృదయా
లలో పాగావేయ నెంచిన కొంటెగాళ్ళ కోణంగి చేష్టలతో పులకరించిన పల్లె పడుచుల
గలగలలు కనువిందు చేయు వేళ   తొంగిచూసే తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి హేల


చురుకు చూపుల చురకత్తులు విసురుతూ వడిగా వడివడిగా
రివ్వున రెక్కలు విదిల్చి ఒక్కుదుటున పైకెగసి ఎదుటిదాని
 ఎదపై ఎగదన్న మిక్కుటమైన రోషంతో పుంజులు రెండు
తలపడు  సమరాంగణమొకవైపు మరోవైపు ఆరుగాలం రైతన్న
తోడుగా శ్రమించి  పంటను ఇంటికి చేర్చిన దొడ్డన్న బసవన్న తరగని
తన చేవ ను బరువులు సులువుగా లాగుతూ జనుల హృదయాలు
కొల్లగొట్టు వేళ తొంగిచూసే తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి హేల


కారాదు తెలుగు పల్లె పై సంక్రాంతి సంబరం గతకాలపు ఘనవైభవమ్ 
ఇరుకు బారిన పల్లె హృదయం తిరిగి కావాలి విశాల హృదయం 
మకర సంక్రాతి సంక్రమణం కావాలి నూతన భావాల సంక్రమణం 

No comments: