Thursday, January 30, 2025

సఖ్యభావమున

 గుక్కపట్టిన గోపబాలకుని కంట నీరు గని కలత

చెందిన కలువ కనుల చిన్ని శిశువు చిట్టి చేతుల
చెలికాని చుబుకము పట్టి కంటి చెమ్మ తుడిచి వూరడించే ఎంత భాగ్యమో ఈ గోపకులది




యోగములకు యోగులకు చిక్కని పరబ్రహ్మము
చిక్కె గోపకులకు సఖ్యభావమున రోహిణీకార్తెపు మలయ సమీరంలా శోకముల బాపు ఆత్మబంధు వీతడు లక్ష్మీకిరణల పాలి కులదైవమీతడు

Wednesday, January 29, 2025

 పాల కడలి పై పవళించు పన్నగ శయనుడు 
పాల కుండల దూరి దాగుడు మూత లాడుచు 
తల్లి యశోదకు ముదము గూర్చే భక్త సులభుడన్న  
పెద్దల మాటకు పూనికనిస్తూ పృథ్వి పై ఆటలాడే 

లేత చిగురు పెదవుల హసిత చంద్రికలు పూయ
 కమలపు కనులలో ఆనంద పరాగములు చిలక 
కోమల హస్తముల పాల కుండల దూరనేంచే విశ్వమే 
తానైన విఠలుడు తల్లి యశోదకు   ముదము గూర్చ 

Saturday, January 25, 2025

మనోహరీ

 మనోహరీ

చిరుగాలి తరగల తాకిడికి అలల వలే
కదులాడు కురుల సమూహం
ఎగసి పడే మందాకినీ జలతరంగాల జోరును
ఒడిసి పట్టిన శివుని జటాజుటంలా 
నా మనసు అలలను కొప్పున పట్టి శిరాగ్రమున 
రాణివలే నిలచి హోయల అలలను జాలువార్చుచుండే

సూదంటు చూపుల సందమామ నా అంతరంగమున కలువకొలనులను వికసింప చెసే

గుండెగూటిలో గూడుకట్టిన అనురాగ బంధం విరహాగ్ని వేడిమికి తేనియ పెదవులపై తెరలు
తెరలుగా వెల్లువత్తే

ఫాలాక్షుని ప్రేమభావ వీచికయెకటి నేలకు చేరిన
నెలవంకలా మెరియుచుండే ఈ మనోహరి

అహో
సహజ పరిమళాల నొప్పారు నిగనిగల నల్లని కేశపాశముల కొప్పు కాముని పూలశరముల కుప్ప వలే ఒప్పారుచుండే
పడతి  ఫాలభాగము ఫాలాక్షుని త్రిశూల కాంతులతో   సింధూర వర్ణ శోభను పొందె
కోమలి నల్లకలువ కనుల కోరచూపుల శరముల పరంపర హృదయవీణ ను మీటుచుండె
సంపంగి సొబగుల నాశిక పుటముల లేత ఎరుపుకాంతులు ఎదను గిల్లుచుండె
అలివేణి ప్రేమాధరాల తేనియలు మేఘమాలికలై కమ్మేయుచుండే
ఎర్రమందారమంటి ముగ్ధ మేని ముద్దాడుతూ సిగ్గుమెగ్గలై ఎర్రబారె రుద్రాక్షువులు.          ముక్కంటి మెచ్చిన మనోహరీ నీ రూపం చేయుచుండె మదిలో ఆనందతాండవం

మధుర క్షణం

 నిరంతర ఆలోచన ప్రవాహములే నీ అలంకారపు

 పుష్పమాలికలూ  
ఉచ్ఛ్వాస నిశ్వాసములే ముత్తెపు  ఊయల పందిరి 
భావోద్వేగములే నీ మృష్టాన్న భోజనంబు 

మము కప్పిఉంచు మాయ యే నీ పట్టు పీతాంబరములు 
కనులను ఆకర్షించు విలాసములే నీ రూప లావణ్యములు 
వీనులకు విందు చేయు వాక్ప్రవాహములే నీ మువ్వల సవ్వడులు 
కష్టముల కడలియే పాల సముద్రమని  చేయు కర్మలే నీదు  సేవలని    
మంచి చెడుల వేదన విడచి కలడో లేడో నన్న వూగిసలాట వీడి 
ఈ దేహమే బృందావనమని మా మది యే  నీదు మందిరమని 
నవ ద్వారములే నిను చేరు   నవ విధభక్తిమార్గములని భావన చేసి  
హృదయ పద్మమే ఆత్మ స్వరూపుడగు రాధాకృష్ణుల ఆసనమని 
ఎరుకతోడ నిను కాంచు కనులను ఈ లక్ష్మీకిరణులకొసగి ఊపిరి 
తీయు ప్రతిక్షణం ఓ మధుర క్షణం గా అనుభూతి పొందు 
అదృష్టమీయవయా  సాంద్రానందా  సదానందా 

Wednesday, January 15, 2025

కమల నయనా

 అరమోడ్పు కనుల కురియు ఆనందరస ధార

మా హృదిని మీట
పగడపు పెదవుల అలరు బంగరు వేణియ సుధా
రస ధార మా వీనులవిందు చేయ
దట్టపువానమబ్బు దేహఛాయ కురిపించు దయా
జలధి మా మేని తడుప
నళినాక్షు నిండైన రూపంబు లక్ష్మీకిరణుల గుండె
గూటిలో నిరతము నిలవ నీ కృప చూపవే కమల నయనా

గోపికాబృంగ

 గోపికాబృంగ హృదయకమలాలలో

శృంగారలహరులు మీటు నళినాక్షు
నగుమోము వేణునాద తరంగాలు
లక్ష్మీకిరణు హృదయఫలకం పై సంతత
దయారస ధారలు కురిపింప మా చిగురు
టధరములపై పూయు చిరునగవుపూల
మాలలతో నల్లనయ్య కంఠసీమ కావలింతుము

Monday, January 13, 2025

 సిరులమాలచ్చి కంఠసీమను అలంకరించు బాహువులకు 

చల్ది మూటను తగిలించి సర్వ జీవుల పోషించు గోవిందుడు 
ప్రభాతమున గోవత్సముల పోషణార్థము గోపాలురతో కూడి 
కాననములకేగా వడివడిగా నడువసాగె చెలికాండ్ర చేర  

Sunday, January 12, 2025

సంక్రాంతి

  సంక్రాంతి 


గొబ్బిళ్ళ గుర్రాలు పూంచిన ముగ్గుల రథమెక్కి భానుడుదయించు వేళ 
 హరి కీర్తనల రస గుళికలు  పెదవుల జాలువారుచుండ చిడత చప్పుళ్ల
 హరిదాసుల కోలాహలం  చెవులకింపై ఇల్లాండ్ర దోసిళ్ళ జాలువారిన దయ 
 అక్షయపాత్ర లో పొంగు వేళ  తొంగిచూసే తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి హేల

మినప గారెల ఘుమఘుమ అత్తగారి ఆప్యాయతల అరిసె కొత్త బియ్యపు 
పాల పొంగళ్ళు ఆరగింపుకై వేచి యున్న వేళ మామ మురిపెముగా తెచ్చిన
కొత్త వస్త్రాలతో అలంకరించుకుని అలకలు చూపుతూ ఆలి తో కొత్త అల్లుళ్లు 
భోజనాల కుపక్రమించు వేళ  తొంగిచూసే తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి హేల
 
పట్టు పరికిణి మెరుపుల విరిబోణి హోయలు తుంటరి మనస్సులలో ఆశల
విహంగాలను ఎగరేయు వేళ నింగి కెగసిన పతంగులతో పూబోణుల హృదయా
లలో పాగావేయ నెంచిన కొంటెగాళ్ళ కోణంగి చేష్టలతో పులకరించిన పల్లె పడుచుల
గలగలలు కనువిందు చేయు వేళ   తొంగిచూసే తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి హేల


చురుకు చూపుల చురకత్తులు విసురుతూ వడిగా వడివడిగా
రివ్వున రెక్కలు విదిల్చి ఒక్కుదుటున పైకెగసి ఎదుటిదాని
 ఎదపై ఎగదన్న మిక్కుటమైన రోషంతో పుంజులు రెండు
తలపడు  సమరాంగణమొకవైపు మరోవైపు ఆరుగాలం రైతన్న
తోడుగా శ్రమించి  పంటను ఇంటికి చేర్చిన దొడ్డన్న బసవన్న తరగని
తన చేవ ను బరువులు సులువుగా లాగుతూ జనుల హృదయాలు
కొల్లగొట్టు వేళ తొంగిచూసే తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి హేల


కారాదు తెలుగు పల్లె పై సంక్రాంతి సంబరం గతకాలపు ఘనవైభవమ్ 
ఇరుకు బారిన పల్లె హృదయం తిరిగి కావాలి విశాల హృదయం 
మకర సంక్రాతి సంక్రమణం కావాలి నూతన భావాల సంక్రమణం 

Friday, January 10, 2025

వాణీ మధురిమ

 వేణుగాన తరంగాల తలపించు అలివేణి

మృదుమధుర మంజుల వాణీ మధురిమ
వీనుల విందు సేయ నీరజాక్షుడు చెవి ఒగ్గి
వినుచుండే నీరజాక్షి కువకవ ఆశ్చర్యచకితుడై

గోపికామధుమక్షిక

 పాదముల తాకిడి తెలియనీయకనే 
మధుపం పద్మపరాగపు మధువు గ్రోలి
నటుల గోపికామధుమక్షిక సర్వాంతర్యామికి 
రహస్యము చెప్పబోవు నెపమున గోవిందపద్మపు  
అధర మధువు గ్రోలు ముచ్చట తీర్చుకునే నేర్పున 

Tuesday, January 7, 2025

జగద్గురు

 సకల విద్యాధిదేవతవు  వినయభావమున

సాందీపుని శిష్యరికం చేసి గురుబావమునకు
గౌరవమద్దినాడవు


సహాధ్యాయి సుధామునికి సమయానుకూలంగా
సకలైశ్వర్యములిచ్చి వినయపూర్వక విద్య విలువ
తెల్పినాడవు

సమరాంగమున సవ్యసాచి ని కార్యోన్ముఖుని
చేసి గీతాచార్యుడవై జగద్గురువై భాసిల్లినాడవు

సదానందా జీతపు పాఠాలు తప్ప జీవన సారం
నేర్పలేక చదువుల గుడులు బడులు గా మిగిలిపోయే

సద్గురునాథా జగన్నాథా జ్ఞాన జ్యోతులు వెలిగించి 
భావితరాల భవిత ను తీర్చిదిద్ద వేగిరమే రమ్ము
 పురుషోత్తమా లక్ష్మీకిరణ్ ప్రియభాంధవా

Thursday, January 2, 2025

ఆనంద సంద్రం

 నిదురించు అత్తకోడళ్ళ జడలు

జతచేసి 

తల్లి దాచిన. 
 వెన్న కోతుల  పాలు
చేసి  కునుకు తీయుచున్న కూతురి మూతికి
కొద్దిగా పూసి  
జతల నడుమ జగడాలు పెట్టి
 ఉట్టిలో కట్టిన పెరుగు నేల పాల్జేసి  
కోపంతో కుతకుతలాడుతున్న గోపికల మోము చూసి  
అ మాయకపు మోముతో నవ్వుచుంటివి జగన్మోహనాకారా జగదానందకారకా .
నీ బాల్యక్రీడా లీలా విలాసపు విన్యాసములు
లక్ష్మీకిరణుల మానసమందిరమందు పదే పదే
మెదలుతూ మా హృది ఆనంద సంద్రం చేయుగాక

Wednesday, January 1, 2025

సాగర కన్యకా

 సాగర కన్యకా 


నీలి కాంతుల కెరటాల  శోభలే 
నీ కురుల అల్లికలో చిక్కుకునే 

అలల పాల నురగల తెల్లదనమే 
నీ పలువరుస మెరుపులై మెరిసే 

ఇసుక తిన్నెల మెత్తదనమే 
నీ మేని మృదుత్వమై మురిసే 

చవులూరించు సాగర ఘోష 
నీ కంఠ ధ్వనిలో చేరి మమ్మలరించే 
 
రూపుదాల్చిన సంద్రపు నిత్య చైతన్యమే 
 నీవు   సాగర సౌరభమా