Tuesday, May 7, 2013

హేమాచల నృసింహ

హేమాచల నృసింహ హేమాచల నృసింహ క్షేత్రం వరంగల్ జిల్లా లోని మంగపేట సమీపంలోని మల్లూరు గ్రామంలో ఉన్న హేమాచల శిఖరం మీద చెంచులక్ష్మీ ఆదిలక్ష్మి సమేతుడైన నరసింహ క్షేత్రం భగవంతునిపై ప్రేమ ఉన్న ప్రతిఒక్కరు సందర్శించాల్సిన పవిత్ర ప్రదేశం చుట్టూ అడవులతో అలరారే అందాల దివ్య ధామం . మొదటిసారి హైదరాబాద్ నుండి బయలుదేరి హన్మకొండ చేరుకొని అక్కడనుండి మంగపేట బస్సు ప్రయాణం (హన్మకొండ నుండి భద్రాచలం వెళ్ళే కొన్ని బస్సులు నేరుగా మల్లూరు గుట్ట వెళ్ళే దారి దగ్గర మనలను వదులుతాయి. అక్కడ నుండి 3 కి మీ , ఆటోలు వుంటాయి ,200 అడుగుతారు) ములుగు దాటగానే ఎటూరునాగారం అటవీ ప్రాంతంలోకి అడుగేడతాం . కేవలం బస్సులో వెళుతూ చూసిన మాత్రానికే మనసు ఎంతో ఉల్లాసం గా మారిపోతుంది అలా అందమైన ప్రకృతికి పరవశించి పోతూ హేమాచాలాన్ని చేరుకుంటే అదో ఆద్భుతమైన వనాంచలమ్ మండిపోతున్న ఎండల్లో సైతం కంటికి నిండుగా పచ్చదనం తో ఫరిడవిల్లె అందాల కొండ ఎటుచూసినా ఇనుము ఇటుక తప్ప మరేమీ చూడలేని కనులు కనువిప్పు పొందాయనిపించింది ఆ కొండను చూసి ఆఫీసులో కంప్యూటర్ తెరకి , ఇంటికొచ్చి టీ వీ తెరకు కంటిని అంకితం చేసి సొల్లు ఫోనులకు చెవిని బానిసను చేసి , సంపాదన కోసం బ్రతుకుని బాసులకు తాకట్టు పెట్టి గడిపేస్తున్న ఈ జీవితం ఎంత హేయమైనదో , హేమాచల దర్శనం తెలియచేస్తుంది జీవితం ఎంత గొప్పదో , ఎందుకు పూర్వీకులు పల్లె భారతాన్ని నిర్మించారో , భూమికి భారంగాను జనాభా లెక్కింపుకు భారంగాను తప్ప మరెందుకు కొరగాని మన బస్తీ బ్రతుకులు కొల్పొతున్నదేమిటొ హేమాచల దర్శనం తో తెలిసిపోతుంది అది భగవంతుని లీలా విలాసాలకు ఒక దర్పణం . కొండలో స్వయం వ్యక్తమైన ఆ శ్రీ లక్ష్మి నృసింహుని నాభి ప్రాంతం లలిత లావణ్యమై మెత్తగా మానవుని నాభి వున్నట్లు వుంటుంది అక్కడే పారే చింతామణి జలపాతపు నీరు ఒక్కసారి మన నోటిలో పోసుకుంటే , మనం త్రాగుతున్న జలం గుర్తుకువచ్చి ఇక్కడే ఈ నీరు త్రాగుతూ వుండిపోవాలనిపిస్తుంది పాహి పాహి అరుణాచల శివ శరణు శరణు హేమాచల నృసింహ

Monday, May 6, 2013

అహో అరుణాచలమహో

అరుణాచలం ఆ పరమశివుడు జ్యోతి స్వరూపుడై నిలచిన దివ్య క్షేత్రం అరుణా చలం స్వయంగా సదా శివుడు పార్వతీ మాత , స్కందుడు , వినాయకుని తో కూడి కొండ గా వెలసిన పవిత్ర ప్రదేశం అరుణాచలం పర్వత గుహలో సిద్దయోగి రూపంలో దక్షిణామూర్తి కొలువై ఉన్న గురుక్షేత్రం అరుణాచలం అరుణాచలేశ్వరుడిగా పరమేశ్వరుడు , అపితకుచాంబ గా గౌరి దేవి వెలసిన దివ్యధామం పళని లో స్కంధుడి కి సమానమైన సుబ్రహ్మణ్య క్షేత్రం కాశీలోని వశిష్ట గణపతి కి సరిపోలిన గణపతి క్షేత్రం గిరివాలం అరుణాచల కొండ చుట్టూ (14 కి. మీ ) ప్రదక్షిణ ఇక్కడి గొప్పదైన ఆనవాయితీ ప్రదక్షిణ గా సాగిపోయే మార్గంలో అడుగడుగు అద్భుత మైన పవిత్ర ప్రదేశాలతో నిండి ఉంటుంది అష్ట దిక్పాలకులతో ప్రతిష్టించబడిన శివ లింగ స్వరూపాలతో నిండిన మహా క్షేత్రం (ఇంద్ర , వరుణ , వాయు,యమ,ఈశాన్య,నిర్రుతి,ఆగ్నేయ , సూర్య, చంద్ర, కుబేర లింగాలు) కన్నులకు పండుగా తనివితీరా చూచి తరించి పోగల మహా క్షేత్ర్తం నందీశ్వరుడు పంచ భూత నందులుగా నిలచిన నవ్య క్షేత్రం దూర్వాస , గౌతమ , అగస్త్య మహర్షుల ఆశ్రమాల తో అలరారే ఆనంద ధామం రమణ మహర్షి, శేషాద్రి స్వామి వంటి మహా యోగుల పాద స్పర్సతో పునీతమైన ప్రాంతం శ్రీకాకుళ సమీపం లోని కలువరాయి లో జన్మించి, బెంగాల్ లోని నవద్వీపం లో కల హరి మంటపం నందు జరిగే మహా పండిత సంవాదంలో నాటి పండిత పరిషత్ అధ్యక్షుడు అంబికా దత్తు ని నీవు అమ్మకు దత్త పుత్రుడవు (అంబికా దత్తు) నేను గణపతి ని అంటే అమ్మకు పెద్ద కుమారుడిని నాకన్నా నీవేమి గొప్ప అని హుంకరించి , కావ్యకంట బిరుదు పొందిన కావ్యకంట గణపతి ముని వస్తే తప్ప తన రధం అడుగు ముందుకు పడదని అలిగిన అరుణాచలేశుని భక్త సౌలభ్యం సంతానం లేక విలపిస్తున్న వల్లాల మహారాజును ఊరడించి , తానే పుత్రుడి భాద్యతలైన కర్మకాండల క్రతువులను నిర్వహిస్తానని తెలిపి నేటికి అరుణాచలానికి సమీపంలో ఉన్న వల్లల మహారాజు ఊరికి వెళ్లి ప్రతి వత్సరం శ్రాద్ధ కర్మలు నిర్వహించి రావటమనే అరుణా చలేశుని భక్త వాత్సల్యం వర్ణింప నలవికానివి నేటికి సిద్ద పురుషులు , మహా యోగులు , దేవతలు ప్రతినిత్యం ఆరుణాచలునకు గిరివాలం చేస్తుంటారు . అందుకే గిరివాలం చేసే దారికి ఎడమ వైపున మాత్రమే మనం నడవాల్సి వుంటుంది . ఎందుకంటే కుడి ప్రక్కన వారు వెళుతుంటారు అరుణాచల దేవాలయంలోని పాతాళ లింగం వద్ద వున్నా గుహ అరుణాచల కొండ మధ్య భాగానికి చేరుకుంటుంది అక్కడే వట వృక్షం క్రింద మహా మునులతో కలసి దక్షిణామూర్తి వుంటారు . అది సామాన్య మానవులు చేరలేని ప్రాంతం . కొందరు ప్రయత్నించి పది అడుగులు మించి వేయలేక వేనుతిరిగిపోయారు . సుబ్రహ్మణ్యుని అంశగా భావించే రమణులు కూడా సగం దూరం కన్నా ఎక్కువ ముందుకు వెళ్ళలేక పోయారు అరుణాచలం అగ్ని లింగం అన్న దానికి సాక్షిభూతమ్ గా దేవాలయం లోకి అడుగిడగానే వేడిగా ఉంటుంది తిరిగి మనం బయటకు వచ్చేవరకు అరుణాచలశివ హేమాచలనృసింహా

Monday, February 25, 2013

నిజం నీవు నీడను నేను

నిజం నీవు నీడను నేను నిశ్శభ్దమ్ నేను ఛేదించే వేణు గాన తరంగం నీవు మౌనం నేను ఆహ్లాదం కలిగించే మదుర భాషణ నీవు తీరం నేను నిన్ను తాక ఎగిసిపడే కెరటం నీవు మండించే వడగాల్పు నేను సేద తీర్చు శీతల పవనం నీవు ఉదయ సంధ్యలో భానుని తొలి కిరణం నేను నా స్పర్శ తో వికసించే నవ కమలం నీవు మలి సంధ్యలో చందురుని అమృత కిరణం నేను పరవశించే కలువ బాలవు నీవు ధీర గంభీరంగా సాగే సముద్రుడను నేను నన్ను చేర పరవళ్ళు తొక్కుతూ పారే నిర్మల నది తుంగ వు నీవు మాదురీ మదురిమల గ్రోల పరుగులుతీసే తుమ్మెద ఝూంకారం నేను ఎద మదువుని పంచి హృదయంలో బందీం చే పూబాలవు నీవు తొలకరి చిరు జల్లు నేను నా తాకిడి కి తన్మయత్వం తో నన్నలుముకునే మట్టి గంధపు వాసన నీవు నిన్ను తాక వచ్చు మలయ మారుతం నేను నాలో పరిమళాలు నింపే మల్లి వి నీవు ప్రేమ తాపంతో ఎగసిపడే అలవు నీవు బంధించే గట్టును నేను చిరు గాలి స్పర్శకు చిగురుటాకులా వణికే అధరమ్ నీవు ని అధర స్పర్శ కోరి పెదవుల పై బాగాన నిలిచిన స్వేద బిందువు నేను చిలిపితనం, ప్రేమ కలబోసిన అమాయకపు అల్లరి పిల్లవు నీవు ని అల్లరి నా ఎదలో జన్మ జన్మలకు ఝుల్లరి చేయలని కోరుకునే ప్రేమ పీపాసి ని నేను నిజం నీవు నిన్నంటే నేను

Friday, February 15, 2013

హరి హర ! ఓ చిన్న విన్నపం

హర నాలోని అహంకారాన్ని నీవు స్వీకరించు వినయమనే అమృత బిందువులు నాకు అందించు హరి సంసారమనే సముద్రంలో నీవు విహరించు శాంతం అనే సౌధంలో నన్నుంచు శివ నాలోని మదనుడిని నీవు తీసుకో నీ వైరాగ్య భావన నాకు ఇవ్వు క్రిష్ణ నాలోని అరిషడ్ వర్గమనే ఆరు తలల పాముపై నీవు నాట్యమాడు నీ పాద పద్మముల మకరందం గ్రోలు మనస్సునివ్వు శంభు: అమంగళ మగు ఆలోచనలను హరించు మంగళకరమగు ఆలోచనలను ప్రేరేపించు ధరణీధర సకల జీవులలో నిన్నే కాంచు కనులనివ్వు మా భారం వహించు మమ్మను అనుగ్రహించు

Thursday, February 7, 2013

నీ పాద పద్మముల వైపు నా గమ్యం గమనం

నూనూగు మీసాల నూత్న యవ్వన కాలం నుండి నడి సంధ్యకు కాయం కదిలినా ఊహల సౌందర్య లోకం నుండి అనుభవాల రాపిడిలో కాయం పండినా మనసు మాత్రం పచ్చితనం వీడలేదు పుండరీక వరదా !
అలవికాని ఆలోచనలతో సతమతమవుతూ అందుకోరాని వాటికి ఆరాటపడుతూ ఉహాలోకంలో విహరిస్తూ వాస్తవంలో నిట్టూరుస్తూ నీ ఉనికిని మరచి కల్లోల జగత్తులో కాయం కరిగిపోతున్నది అజామిళోద్దారక ! పూల మకరందం కోసం అర్రులు చాచు తుమ్మేదలవలె దీపపు కాంతుల వైపు పరుగులుతీయు చిమ్మెటల వలే కాంతా కనకాదులకై పరితపిస్తూ శాంతిని విడచి విలపిస్తూ పట్టవలసిన నీ పాదాలు పట్టలేక పతిత తీరాల వైపు పయనిస్తున్నది పురుషోత్తమా ! ఇంతటి కారు చీకటిలో కల్లోల కడలికి ఆవలి వైపున మిరుమిట్లు గొలిపే ఆశా దీపం వెలిగిపోతున్నది తరచి తరచి చూచిన మది కాంచెను కనకపు కాంతులతో లలిత లావణ్య ముగ్ద మనోహరం గా ప్రకాశిస్తున్న నీ పాద పద్మం భక్తి అనే పడవలో నీ నామమనే తెడ్డు ఊతంగా ఇచ్చి నా గమ్యం గమనం నీ వైపుకు త్రిప్పుకో పద్మ నాభుడా !

Wednesday, February 6, 2013

అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు


అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు నును సిగ్గుల ఎరుపెక్కే చెలి చెక్కిలి ఆనవాలు ముద్ద మందారపు మాటున చిక్కేనిదిగో అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు వలపుల గాలం విసిరే నీ వాలు కనుల సోయగం మత్స్యకన్య కంటి మెరుపులో కనబడేనిదిగో అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు ముత్యపు మెరుపుల వరుసను ప్రతిఫలించె నీ నవ్వుల కిలకిలల జాడ గలగలా సాగే సెలయేటి సవ్వడులలో దొరికేనిదిగో
అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు హొయలొలికించె నెచ్చెలి నడక వాన మబ్బుకు మురిసి నాట్యమాడే నెమలి నడకలో దాగేనిదిగో అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు పిరుదులపై నాట్యమాడే నీలి కురుల వలపు పాశం బుస కొట్టే నాగు పడగలో నవ్వేనిదిగో అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు చమట గంధం అలుముకున్న నీ దేహ సౌరభం మల్లెల పరిమళాల లో ఒదిగెనిదిగొ అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు నీ ఆనవాలుకై అచట నిచట వెదికి అలసిన మది నా గుండె గూటిలో ఒదిగిన నిన్ను చూసి సేదతీరేనిదిగో

Tuesday, January 29, 2013

హే క్రిష్ణా

హే క్రిష్ణా నా మనసమనే మడుగులోకి దూకేదెన్నడో కాముడనే కాళిందిని మదించుటెప్పుడొ కాలం కాయం కరిగిపోతున్నవి కాని నా మనసు మాత్రం నీ పాదాలను పట్టలేకున్నది నీవు నిత్యమూ సత్యము అన్న నిజం తెలిసిన అలుసేమో నీ పట్ల ఇవి తాత్కాలికము అశాశ్వతము అనే భయమూ పొతే దొరకవేమొనన్నా బెంగ నిన్ను ఇప్పుడు కాకపొతే ఇంకేపుడైనా పట్టుకొవచ్చులేనన్న అలసత్వం
ఆనందానికి ఆనందపు బ్రాంతి కి తేడా తెలుసుకోలేని మూర్ఖత్వం నీ పాదపద్మపు మకరందం గ్రోలలేని నిస్సార జీవన గమనం లోకి నన్ను నేట్టివేస్తున్నవి క్రిష్ణా నీవు మాత్రం నీ దయావర్షాన్ని నాపై కురిపించాటాన్ని వాయిదా వేయబోకు వెన్నుకు దన్నుగా నిలచిన నీ చైతన్యాన్ని హృదయాన్ని తాకకుండా హృదయ పద్మం వికసించకుండా చేయటంలో కామ సర్పం సఫలమైతే దాని నల్లని గరళం శరీరమంతా వ్యాపించకుండా నల్లనయ్య పాదాలను పట్టుకోవటంలో బుద్ధి విఫలమైనది వ్యాధులతో శరీరం వ్యాకులతతో మనసు సతమతమవుతున్నా మాయతో కప్పబడిన బుధ్ధి నిన్ను స్మరించలేకున్నది నిన్ను వదలి మలిన దేహాలవైపు పరుగులుతీస్తున్నది మాయకు సోదరుడవు మాయాతీతుడవు మాయతో కప్పబడిన మా మనస్సనే యమునలో విహరించు మాయను ఛేదించు ఈ దేహాన్ని బృందావనం చేయి నీ ప్రేరణతో ఉదరం లో ఉద్భవించే అక్షరాలను పారిజాతాలుగా ధరించు ఉపిరి లో వేణుగానాలను ఆస్వాదించు ఉచ్చ్వాస నిశ్వాస లలో ఊయల లూగు నా కంటి పాపలనే కాంతులీను మణులుగా ధరించు నన్నుద్ధరించు ఉద్దవ బాంధవా