Saturday, January 30, 2010

నీలిమేఘ శ్యామా …..


నీలిమేఘ శ్యామా …..

 

కృష్ణుడి పేరు …………దట్టమైన నల్లమబ్బు వంటి వర్ణం కలవాడా

 ఏమిటి  మేఘానికి  భగవంతుడికి  సంబంధం  

 

నీటితో  నిండియున్న మబ్బు నల్లగా వుంటుంది . అది  తనలోని నీటి ధారలను

వర్షించగానే తెల్లగా తేలిపోతుంది . ఇక ఇవ్వటానికి నాదగ్గర ఏమి లేదే  అని

వెలవెలబోతుంది

 అలాగే భగవంతుడు  కూడా  …..మేఘంలో  నీరు ఉన్నట్లే  కృష్ణుడిలోను  

కృపాజలం నిండుగా  వుంటుంది . ఆయన కూడా మనపై  దయావర్షాన్ని కురిపిస్తాడు

 

 మేఘం కొండలలో వర్షిస్తుంది . అక్కడ  కురిస్తేనే ఆ నీరు

నదిగా మారి మనకు ప్రయోజనం కలిగిస్తుంది

 అందుకే  కృపాజలనిది  వెంకటనాధుడు  ఏడుకొండలపై కొలువుండి  మనపై

తన దయావర్షం కురిపిస్తున్నాడు

 
 భక్తులు  రెండు  రకాలు ……

ఏదైనా  ప్రత్యేకమైన కోరికలతో భగవంతునకు నమస్కరించేవారు

ఎటువంటి  కోరికలు కోరకుండానే నమస్కరించుకునేవారు

 వీరిలో ఎవరు తెలివైనవారు  ? ఎ  కోరికలు కోరని వారు

మన  పరిజ్ఞానం  ఎంత ? మనకు నిజంగా ఏది అవసరమో  మనకు  తెలుసునా

మనం  కోరే  కోరిక  నిజంగా  మనకు  పూర్ణానందం  కలిగిస్తుందా

 అదే  మనమేమి  కోరకుంటే మనకు ఏది అవసరమో తనే నిర్ణయించుకుని

వెంకటనాధుడు  మనపై  దయావర్షం  కురిపిస్తాడు

 అదే  మనం  కోరుకుంటే  అంత  వరకే  ఇచ్చి , అయ్యో  వీడికి  ఎంతో  ఇద్దామనుకున్నాను  

కాని  నాకింతే  చాలని అంటున్నాడే  అని నీరు వెలసిన మేఘం లా ఆ  దయాసముద్రుడు

వెలవెల బోతాడు

మరి మనం ఆయన కృపాజలంలో సంపూర్ణంగా తడిసి ముద్దయ్యేందుకు ప్రయత్నిద్దామా !

(పెద్దల అనుగ్రహభాషణల ఆధారంగా)


--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


Monday, January 25, 2010

ఇవి కావా నీ ఆనవాళ్ళు

శుక్లపక్షపు చవితి నాటి చంద్రరేఖ
పున్నమి నాటి పండువెన్నెల
ఇవి కావా నీ ఆనవాళ్ళు
 
మార్గశిరోదయాన  గులాబి బుగ్గపై నిలచిన మంచుముత్యం    
మంచు పరదాలను చీల్చుకుని నులి వెచ్చగా తాకే పసిడికిరణం 
ఇవి  కావా నీ ఆనవాళ్ళు
 
చైత్ర కాలపు చమట గంధాన్ని చిదిమే మల్లెల పరిమళం
వుడికించే వేడిమిలో  ఊరించే మామిడి  మాధుర్యం
ఇవి కావా నీ ఆనవాళ్ళు
 
వసంతోదయాన  కోకిల  కుహుకుహులు
లేలేత చిగుళ్ళతో పరవసింపచేయు ప్రకృతి పచ్చదనం  
ఇవి  కావా  నీ  ఆనవాళ్ళు
 
ఝురి విప్పిన మబ్బు తునకకు ప్రతిగా పురి విప్పిన  మయూరపు  సోయగం
కొండవాలున  జాలువారుతున్న జలకన్య  జాణతనం
ఇవి  కావా  నీ  ఆనవాళ్ళు

--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


Monday, January 11, 2010

అసలేం జరుగుతుంది-2

అసలేం జరుగుతుంది-2
రింగులు తిరుగుతున్న పొగల తెరలు

బంగారురంగు పానీయంతో నిండి వున్న అందమైన గ్లాసులు

చుట్టూ  కోలాహలం

 

అంతలోనే ఎగసిపడిన ఆనందంతో

 ఒరేయ్ ఇన్నేళ్ళు  ఏమైపోయావురా  ఓ  కేక

 నామాలు తెల్సుకోవటానికి ఒక నిమిషం సమయం పట్టినా

రూపాలు పోల్చుకోవటానికి అట్టే సమయం  పట్టలేదు

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు   ……..5 వ  తరగతి నుండి పదోతరగతి వరకు

కలసి చదివిన బాలసన్యాసులు

అవునుమరి  గురుకులం ………తాడికొండ గురుకుల బాలుర విద్యాలయం

 అప్పటి  క్లాస్ మేట్స్   ఇప్పుడు  ఇలా  

సుమారు  20 సంవత్సరాల  తరువాత

అవును …………..

సరిగా  మే  9, 1990…………

 

ఒక వైపు తుఫాన్ కుదిపేస్తుంది

 మరోవైపు ……..జగదేకవీరుడు  అతిలోక సుందరి  చిత్రం విడుదల

 ఈరెంటిని  మించిన  ఉత్కంట  ……… మా  పదో తరగతి ఫలితాల ప్రకటన

 ఒక్కసారి అలా  కనుల ముందర కదులాడింది నాటి దృశ్యం

 

అప్పటివరకు  కలసి వున్నబాలసన్యాసులు ……..వేరు వేరు

రహదారుల వెంబడి  పయనమైపోయిన  క్షణం

ఆనాటి  సన్యాసులే  నేడు కళ్ళ  ముందు  కదులాడుతున్న  దృశ్యం

 

ఒక్కొక్కరిని  పోల్చుకుందామా  

అప్పట్లో  పేర్లు షార్ట్ కట్ లో పాపులర్ …..ఆంగ్లపు పొడి పొడి  అక్షరాల్లో లేదంటే ఇంటిపేరు
టి కే బి ; గుంటుపల్లి ; డి యల్ యమ్ ఆర్   ఇలా......   

 

ఇంతటి తెల్లని దీపపుకాంతిలో  కూడా నిగనిగలాడుతున్న నల్లని నగుమోమువాడు

పరిమి  (పేరు  బత్తుల గంగాధరమైన పరిమోడిగానే  ప్రసిద్ది ..పెద పరిమి వీడి ఊరి పేరు )

ఇప్పుడు  డ్రిల్లు  పంతులు  (అప్పట్లో  మంచి  ఖోఖో  ఆటగాడు  లెండి అంతకన్నా పెద్ద పోకిరి )

 

మత్తు వదలరా నిదుర మత్తు వదలరా అంటూ శ్రావ్యం గా  నిదురులేపబోతే

 ఎవడురా వాడేవడురా  నన్ను నిదురలేపే దమ్ములెవడికి  వచ్చేరా  అంటూ

భీకరంగా బూతులు పలికే  భాను ప్రకాశం కదా  వీడు

 

అన్నం ……..అప్పుడు ఎంతగా వుడికించినా వుడకని గింజ

కాని ఇప్పుడు అనేక  గింజలను వుడికిస్తున్న  ఓ  జ్ఞానదీపం

(అన్నం శ్రీనివాసరావు ……..అందరు అన్నం  అన్నం అనేవారు …….పాపం  వుడుక్కునేవాడు

ఇదేం  ఇంటిపెరురా  అని

కాని ఇప్పుడు ………..ఇన్నేళ్ళ తరువాత మరలా ఆ పిలుపు విని చెవులలో అమృత వర్షం కురిసిన  భావన

చదువులో బాగా వెనుకబడి ఉండేవాడు ………కాని జీవిత పాటాలు బాగా వంటపట్టిన తరువాత  తనను తాను సంస్కరించుకుని లెక్చరర్ అయ్యాడు )

 

ఇలా చెప్పుకుంటూపొతే  చాలా చిరాకేస్తుంది చదివేవాళ్ళకు

 

ఇలా  నాటి  స్నేహితులు సుమారు 20 మంది  ఒక చోట చేరి గంతులేస్తుంటే

 స్నేహితుడా  స్నేహితుడా  చిన్ననాటి స్నేహితుడా

అని  పాడుకుంటూ

చెప్పాల్సింది ఇంకావుంది కాని నాకే చెప్పే ఓపిక లేదు ప్రస్తుతానికి
ఇక నా గురించి మీరడగరాదు      నే చెప్పరాదు
 


--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


Monday, January 4, 2010

ఏమి జరుగుతుందిక్కడ …………అసలేం జరుగుతుంది


ఆదివారం …జనవరి  3,2010 తెల్లవారుజాము   5.00 గంటలు

హయత్ నగర్  

ఆదివారమంటేనే కొంచెం బద్ధకం మనసును  ఆవరిస్తుంది

అల్లాంటిది చలిపులి బయట గర్జిస్తుంటే

దుప్పటి ముసుగులో వెచ్చని రక్షణకోరుకునే దేహం అంత తేలికగా

ఎలా బయటకు వస్తుంది

 

అటుదొర్లి ఇటుదొర్లి ముడుచుకుని మొత్తం మీద లే లేరా వెధవాయ్ అంటూ

మనసు పెడుతున్న ఘోషకు పుల్ స్టాప్  పెట్టేసి చక చకా స్నానాది  కార్యక్రమాలు ముగించుకుని  ,
 చల్లబడుతున్న దేహానికి అరచేతుల రాపిడిలో పుట్టిన వేడిమి

అందిస్తూ ………బస్ స్టాండ్ చేరుకొని అప్పటికే కదలటానికి సిద్దం గా వున్న  విజయవాడ

 బస్ ఎక్కి కూర్చున్న

  

 చలికాలపు ఉదయం ఎక్కడికీ అత్యవసర పయనం

 శీతల పవనాలు వణుకు పుట్టిస్తుంటే మనసులో బ్రమిస్తున్న ఆలోచనాతరంగాలు

కాల చక్రాన్ని కొన్ని యేండ్ల వెనుకకు పరిగేట్టిస్తుంది

 

కొన్ని  సంగతులు …………. మనసు  పొరల మరుగున పడిపోయిన కొన్ని

సంగతులు గుర్తుకొస్తున్నాయి

 ఎప్పుడో  20 సంవత్సరాలకు ముందున్న  6 వసంతాల కాలంలో  (1985 to 1990)

పుష్పించిన స్నేహ కుసుమాలను ఏరికుర్చుకునే ప్రయత్నం ఇన్నేళ్ళ తరువాత

చేయటం  ….కడు విచిత్రం

 ఆ  కుసుమాలు మరుగున పడినప్పటికీ వడలకపోవటం బహు విచిత్రం

 అలా ఆలోచనలలో మునిగివున్న మనసు కాలచక్రం పరుగెడుతున్న వేగంలో

బస్సు చక్రాన్ని పరుగేట్టించని వాహనచోదకుడిని తిట్టుకుంటూ చుట్టుపరికించి

చూసేసరికి విజయవాడ సరిహద్దుకు చేరుకున్నాం అప్పటికి సమయం మధ్యాహ్నం 12 గంటలు

 హమ్మయ్య ….ఇంకో గంటలో గుంటూరు కు చేరుకుంటాం

గుంటూరు …………..నాకెంతో ప్రియమైన వూరు

నా జన్మస్తలం వున్న జిల్లాగానే కాక , నా జీవనగమనంలో అధిక కాలం గడిపిన వూరు …….గుంటూరు  

 మనం ఎదురుచూస్తున్న ఘడియ రాబోతుందని మురిసే సమయానికే వెంచేస్తాయి వూహించని మలుపులు

 అప్పటిదాకా పరుగెడుతున్న బస్సుచక్రం ఒక్కసారిగా ఆగిపోయింది .ఇంకా 10 కి  మీ

దూరం వుంది . కనుచూపుకు అందనంత దూరం నుండే వాహనాలు నిలిచిపోయివున్నాయి

 

వెంటనే గుర్తుకు వచ్చాడు  మన్మధుడు

సోనాలి బెంద్రే  కోసం నాగార్జున పరుగెత్తిన విధమే ఇప్పుడు మన ముందున్న మార్గం  

 

ఆటోలు తిరిగే ఆవకాశం లేదు . ఎడ్ల బండ్లు సినిమాలకే పరిమితం

ఈదుదామంటే కాలువ లేదు …మనకు ఈత రాదు

మిగిలింది కాలి నడక

వాహనాల బారులను దాటుకుంటూ నారాయణా నాకేమిటీ పరీచ్చ అనుకుంటూ నడుస్తున్నంతలో  బహుశా  నా  ప్రశ్నకు  బదులివ్వ  దలచాడేమో  , ఒక యువకుడు నవ్వుకుంటూ నా పక్కన నిలిచి తన మోపెడ్ మీద చోటిచ్చి చిట్టినగర్ లో దించాడు  

 (మనకు  ఎటువంటి సమస్య ఎదురైనా అందుకు ఇతరులనో లేక మనలనో  నిందించుకోకుండా  

ఆ  నిందేదో నారాయణుడిపై మోపి అంతా మంచే జరుగుతుందని పదే పదే చెప్పుకుంటే

ఆ సమస్య ఖచ్చితంగా  60% పరిష్కారమవుతుంది మనకు  మానసిక వత్తిడి తగ్గుతుంది )

 సరే  అక్కడినుండి గుంటూరు చేరుకొని మన  పయనపు ఆఖరి మజిలి చేరుకునే సరికి

సరిగ్గా 2 గంటలు

 సుకుమారి నుదుటి మీద సింధూరం లా చక్కని పేరు  హోటల్  సింధూరి

 

చిన్నగా తలుపు తెరచి చూస్తే

 

ఏమి జరుగుతుందిక్కడ …………అసలేం  జరుగుతుంది

 

తరువాత  చెప్పుకుందాం ………కాసేపు  

 

విశ్రాంతి


--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


Tuesday, December 29, 2009

దట్టమైన వానమబ్బు వంటి దేహఛాయతో  కూడి ,చక్కని మంచి గంధపు పూతతో అద్దబడి , పీతాంబరములను ధరించిన కృష్ణుడు తులసీమాలను ధరించి ఆటలయందు కదులాడుచున్న  రత్న కుండలాల కాంతితో ప్రకాశిస్తున్న చెక్కిళ్లతో శుక్లపక్షపు చవితి నాటి  చంద్రరేఖను  మరిపించు  చిరునగవుతో  రాధతో కూడియున్న ముగ్ధ మనోహరులగు గోపకాంతల నడుమ విలాసవంతుడై

వెలిగిపోవుచున్నాడు

  

ఒక గోపిక మోహ పారవశ్యం తో ఎగసిపడుతున్న తన ఎదను కృష్ణుని దేహానికి

అదిమిపట్టి మిక్కిలి ప్రేమతో కృష్ణుని వేణుగానానికి అనుగుణంగా హెచ్చుస్వరంతో

పంచమరాగం లో రాగాలాపన చేయుచున్నది

 

విలాసవంతంగా అటునిటు త్రిప్పుతూ శృంగార సరసోల్లాస భావనలను పలికిస్తున్న కనులతో కూడిన

మదనుడిని జనిమ్పచేస్తున్న  కృష్ణుని ముఖసౌందర్యాన్ని చూసి ఆశ్చర్యంతో నిశ్చేష్ట అయిన ఒక  ముగ్ధ  మదురమైన తేనెను చిందించు నవకమలం వంటి కృష్ణుని ముఖకమలాన్నే  ధ్యానిస్తూ   ఉండిపోయింది

  

చక్కనైన పిరుదుల బరువుతో వేగంగా కదులజాలని ఒక యువతి ఏదో ఒక రహస్యాన్ని చెవిలో   చెప్పబోవు వంకతో కృష్ణుని ముఖారవిందానికి దగ్గరగా తన ముఖాన్నినిలిపి , తన ముఖపు   తాకిడికి గగుర్పాటునొందిన  కృష్ణుని బుగ్గలను చుంబించి తన ఆశను తెలివిగా  నెరవేర్చుకుంటున్నది  

 

ఒక పిల్ల కృష్ణునితో  కూడి జలక్రీడలయందు ఆసక్తితో  యమునానది తీరంలో ప్రబ్బ పొదరింటియందు    విహరిస్తున్న  శ్రీకృష్ణుని పట్టు వస్త్రాన్ని తన చేతితో పట్టుకుని లాగుచున్నది  

 

ఒక జవరాలు రాసక్రీడయందు కృష్ణునితో నృత్యము చేయుచు పాటకు తగినవిధంగా అరచేతులతో   తాళము వేయుచుండగా , ఆ కదలికలకు చేతి గాజులు చేయుచున్న సవ్వడి వేణునాదంతో  కలసి   మరింత  మదుర ధ్వనులను పలికించుచుండగా ఆ చిత్రమునకు కృష్ణుడు ఆమెను మంచి నేర్పరివే అని  ప్రశంసించుచున్నాడు  

  

ఆ కృష్ణుడు ఒక కోమలిని కౌగిలించుకునుచున్నాడు  ఒక చామంతిని చుమ్బించుచున్నాడు  ఒక  రమణీమణితో రమించుచున్నాడు చిరునగవులు చిన్దించుచున్న ఒక  చిత్రాంగిని  తదేకంగా   చూస్తున్నాడు ఒక మదవతి ముందు నడుచుచుండగా  కృష్ణుడామెను అనుసరించి పోవుచున్నాడు

 

కీర్తిని కలిగించునది బృందావన సుందర వనములయందు పరమాత్ముని

అధ్బుత  రహస్య క్రీడా విన్యాసాలను తెలియజేయునది అగు జయదేవుని సూక్తం

మనకు  మంగళమును  కలిగించును

 
 
చందన చర్చిత నీలకళేబర పీత వసన వనమాలీ

కేళి చలన్మణికుండల మండిత గండయుగళ స్మితశాలీ

హరిరిహ ముగ్ధ వధూనికరే  - విలాసిని విలసతి కేళిపరే  

 

పీన పయోధర భారభరేణ హరిం పరిరభ్య సరాగం

గోపవధూ రను గాయతి కాచి దుదుఇజ్చత పంచమరాగం

హరిరిహ............
 
కాపి  విలాసవిలోలవిలోచన ఖేలన జనిత  మనోజం
ధ్యాయతి ముగ్ధ వధూరధికం మధుసూదన వదనసరోజం
హరిరిహ............

 

కాపి  కపోలతలే మిళితా లపితుం కామపి శ్రుతిమూలే

కాపి చుచుమ్బ నితంబవతి దయితం పులకై రనుకూలే  

 హరిరిహ............

 
కేళికళాకుతకేన చ కాచి దముం యమునాజలకూలే  

మంజులవంజులకుంజగతం  విచకర్ష కరేణ దుకూలే  

హరిరిహ............

 
కరతల తాళతరళవలయావళి కలితకలస్వనవంశే  

రాసరసే సహనృత్య పరా హరిణా యువతి:  ప్రససంసే      

హరిరిహ............

 
శ్లిష్యతి  కామపిచుమ్బతి కామపి రమయతి  కామపిరామా

పశ్యతి సస్మిత చామపరా మనుగచ్చతి  వామామ్

హరిరిహ............ 

 
శ్రీ జయదేవ భణిత మిద  మద్భుత కేశవ  కేళి రహస్యం

బృన్దావనవిపినే లలితం  వితనోతు  శుభానియసస్యం   

హరిరిహ............ 



--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


Friday, December 18, 2009

హృదయ మధ్యమున పద్మపత్రంలో

ఓ మనసా ! నారాయణుని కీర్తించు

ఓ శిరమా ! ఆయన పాదాల మోకరిల్లు

ఓ హస్తములార ! ప్రేమతో అంజలి ఘటింపుడు  

ఓ ఆత్మా! పుండరీకాక్షుడు నాగాచలం పై

శయనించివున్నవాడు , పురుషోత్తముడు

పరమసత్యమైనట్టి  నారాయణుని శరణాగతి కోరుము

 

ప్రభు జనార్ధనుని లీలామయగాధలు విను తరుణాన

దేహం రోమాంచితం కానిచో , నయనాలు ఆనంద

భాష్పములనే సుమాలను రాల్చకున్నచో మనసు  పరవసించకున్నచో

అట్టి  నా జీవితం  వ్యర్ధమే కదా

 

ఈ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది

కండరాలు అరిగి నొప్పికి గురి అవుతాయి

ఏదో ఒకరోజు పండుటాకులా రాలిపోతుంది

ఓ  అమాయకుడా ! నయం చేయలేని నానా రకాల మందుల

వెదుకులాట మానుకో  దివ్యమైన అమృతమయమైన  

శ్రీకృష్ణ  నామౌషధాన్ని  మనసారా  త్రాగుము

 

 మనుష్యులెంత  చిత్రమైనవారు

అమృతాన్ని వదిలి  విషాన్ని  పానం చేస్తున్నారు

నారాయణ నామస్మరణ  మాని  నానారకముల

వ్యర్ధ పలుకులను ఆసక్తి  తో  చెప్పుచున్నారు

 
బంధు మిత్రులు  నన్ను  త్యజించినారు

పెద్దలు గురువులు  నన్ను నిరాకరించినారు

అయినప్పటికీ  పరమానందా  గోవిందా  !

నీవే  నాకు  జీవితము

 

ఓ  మనుజులారా ! ఎలుగెత్తి  సత్యం  చాటుతున్న

ఎవరు అనుదినం  రణం లోను మరణం లోను

ముకుందా  నరసింహా  జనార్ధనా  అని  నిరంతరం

ధ్యానిస్తువుంటారో  వారు  తమ  స్వకోర్కెల  గూర్చి

చింతించటం  రాయి  వలె  ఎండుచెక్క  వలె  వ్యర్ధం

 

చేతులెత్తి  బలమైన  గొంతుకతో  చెబుతున్న

ఎవరు  నల్లని  గరళము  వంటి  జీవితము  నుండి

తప్పించుకోజూస్తారో   అట్టి  జ్ఞానులు  ఈ  భవసాగరాన్ని

తిరస్కరించుటకు నిత్యం  ఓం నమో నారాయణాయ  అను 
 మంత్రం వినటమే  తగిన  ఔషధం  

 

ఎట్టి  కారణం చేతనైనను  ఒక్క  నిమిషమైనను

కృష్ణుని  దివ్య పాదారవిందాల స్మరణ మానిన

అట్టి  క్షణమే  ప్రియ మిత్రుల బంధువుల గురువుల

పిల్లల ఆక్షేపణలతోను, నీచపు ఆలోచనల విహారంతోను

గాలి వార్తలతోను మనసు  విష పూరితమగును  

కనుక  కృష్ణా  నీ  ప్రేమామృతం  చాలు

 

కృష్ణుడు జగద్గురువు  కృష్ణుడు  సర్వలోక రక్షకుడు

కనుక ఎల్లప్పుడూ కృష్ణుని పాదాలని ఆశ్రయించేదను  

లోకం లోని మన శత్రువులను నిర్జించి కృష్ణుడు మనలను  

కాపాడును .కృష్ణా  నీకు నమస్కారము

కృష్ణుని నుండే అన్ని  జగములు పుట్టుచున్నవి

జగములన్నియు  క్రిష్ణునిలోనే  ఇమిడియున్నవి

కృష్ణా ! నేను  నీ  దాసుడను

ఎల్లప్పుడూ  నా  రక్షణాభారం వహించు

 

హే  గోపాలక  ,హే  కృపా జలనిదే ,హే  సింధు కన్యా పతే
హే  కంసాంతక  ,హే  గజేంద్ర  కరుణాపారీణా , హే  మాధవ
హే  రామానుజ  ,హే  జగత్త్రయ గురో  ,హే  పుండరీకాక్ష

హే  గోపీజన వల్లభా  నాకు  తెలుసు నీవు తక్క వేరెవ్వరు లేరు

కనుక ఎల్లప్పుడూ నన్ను రక్షించు

 

క్షీర సాగరుని కుమార్తె నీ అర్ధాంగి

ముల్లోకాలు సృష్టించు బ్రహ్మ నీ కుమారుడు

నిన్ను గూర్చిన స్తుతులే  పవిత్ర వేదాలు

సకల దేవతా సమూహము నీ సేవక పరివారము

ముక్తి  నోసగుటయే నీవు  ఆడు  ఆట

దేవకీ  నీ  తల్లి

శత్రువులకు అభేద్యుడగు అర్జునుడు నీ మిత్రుడు

ఇంత  మాత్రమే నాకు తెలుసు  ( నీవు తప్ప తెలుసుకోదగినది వేరేది  లేదు కదా )

 

 ముకుందునకు  ప్రణమిల్లుటయే  శిరస్సు యొక్క ఉత్తమ కర్తవ్యము

పూవులతో అర్చించుటయే  ప్రాణశ్వాస యొక్క  కర్తవ్యము

దామోదరుని  తత్వ చింతనమే మనసు యొక్క  కర్తవ్యము

కేశవుని కీర్తనమే  వాక్కు యొక్క  కర్తవ్యము

 

ఓం నమో నారాయణా అని స్మరించినంత మాత్రాన

పాపులు కూడా ఉద్దరించబడుతున్నారు  . అట్టిది

పూర్వ  జన్మలలో  ఎన్నడు  నారాయణుని  నామ స్మరణ  

చేయకుంటినేమో  ఇప్పుడు  గర్భావాసపు  దుఖాన్ని భరించవలసివచ్చే


హృదయ మధ్యమున  పద్మపత్రంలో  

అవ్యయుడు అనంతుడు అయిన విష్ణువు ని నిలిపి

సదా ధ్యానించు వారలకు సకల భయాలు

తొలగి విష్ణుపదం సన్నిహితమవుతున్నది

 

ఓ  హరీ ! ఓ పురుషోత్తమా ! ఓ విష్ణు

నీవు దయా సముద్రుడవు

పాపులకు మరల మరల ఈ  భవసాగరమే  గతి అగుచున్నది

నీ దయావర్షం  నాపై కురిపించి

నన్ను ఉద్దరించు ముకుందా

  

పాల కడలిలో అలల తుంపరలు దేహాన్ని తాకుతూ

నీలాకాశాన తారకలు వలె మెరుయుచుండగా

శేషతల్పం మీద సుఖాసీనుడవైన  మాధవా

మధుసంహారీ నీకివే నా మనఃపూర్వక  ప్రణామములు

 
కృష్ణ  కృష్ణ  అన్న నామాలు చాలు  

జీవిత కర్మఫలాలు దూరంగా నెట్టి వేయబడటానికి

ముకుందుడి  పై ఎనలేని ప్రేమభావమున్న

సిరి సంపదలు  మోక్ష ద్వారం  అందుబాటులో వుంటాయి

 

నా  మిత్రులు జ్ఞాన మూర్తులు

కవిత్వ సామ్రాజ్యంలో రారాజులు

ద్విజోత్తములు . నేను కులశేఖర చక్రవర్తి  ని

ఈ  పద్య  కుసుమాలు  పద్మాక్షుని  చరణాంబుజములకు  

భక్తి ప్రపత్తులతో  సమర్పితం



--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


Wednesday, December 16, 2009

Fwd: nenemi kOravale





నేనేమి  కోరవలెను

 అవును నారాయణా  నేనేమి  కోరగలను

 నీ  పాదాల చెంత చోటడుగునందునా

 మహా జ్ఞానులు మహా భక్తులు అయిన కులశేఖర ఆళ్వారు , పోతన మహాకవి  

లాంటి వారు  ఇప్పటికే వాటిని ఆశ్రయించి వున్నారు

మరి వారి సరసన చోటు కోరేంతటి వాడనా నేను

 

నా హృదయం లో నిలచిపోమ్మందునా

గోప కాంతలు నన్ను చూచి ఫక్కున నవ్వుతున్నారు

నిజమే కదా వారికున్న నిష్కళంకమైన అమాయకపు ప్రేమ నాకు లేదు కదా

 

ఎల్లప్పుడూ  నిన్నే తలచు  మనసిమ్మందునా

 కష్టాలలో  తప్ప సుఖాలలో  నిన్ను  గుర్తించమాయే

అయినా నేనేమి నీ మేనత్త కుంతీ ని కాదు కదా

ఎల్లప్పుడూ మాకు భాధలనే కలిగించు .ఆ విధంగా నైనా ఎల్లప్పుడూ నీ చింతన

చేయగల అదృష్టం మాకు కలుగుతుంది అని ప్రార్ధించ

అంతటి మనో నిబ్బరం మాకు లేదుకదా

 
అనన్య శరణాగతి కోరుదునా
కలడు కలండను వాడు కలడో లేడో అన్న సంశయమే తప్ప

 అందుగలడిందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడన్న  

ప్రహ్లాదుని నిశ్చల బుద్ది కాని

 నీవే తప్ప ఇహపరంబెరుగనన్న గజేంద్రుని దీక్ష కాని

నాకు లేవు కదా

 
ప్రేమగా  పిలిచి  నైవేద్యం స్వీకరించమందునా  

 మడి ఆచారాలంటూ తర్జన భర్జనలు , వాటిని సక్రమంగా

చేయలేక మనసంతా ఆందోళనలే తక్క

 బ్రతుకు తెరువుకోసం మట్టికుండలు చేస్తూ , చేతికంటిన బంకమట్టి తోనే

మట్టిపూలు సమర్పించిన కురువరతి నంబి వలె

ప్రేమ ప్రపత్తులు లేవు కదా

 
ఇన్ని లేమిలతో  సతమవుతున్న నాకు నీ చెలిమి అనే కలిమిని ప్రసాదించి

ఈ జీవన కురుక్షేత్రంలో పార్దుడిని నడపించినటుల నన్ను నడిపించు

నారాయణా శ్రీమన్నారాయణ  హరే  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA





--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA