Tuesday, May 28, 2019

నే గుంటూరోడిని

అవును నే  గుంటూరోడిని . చెప్పుకోవటానికి చాలా గర్వంగా అనిపిస్తుంది . మన జన్మస్థలం పై మమకారం సహజమే అయినప్పటికీ అంతకు మించిన బంధమేదో ఆ నేలతో నా మనసుకు ముడిపడిపోయింది. 
ఏమైయివుంటుంది  
దేశం  విడచిపొమ్మని ఇంట్లో కోరినా గుంటూరు దాటనంటి . సకారణం ఏమంటే నాకు తెలియదు అప్పటికి 
కొందరి ఉద్దేశం ఎవరి ప్రేమలోనో పడి వుంటాడు. అందుకే పోనంటున్నాడు అని . నిజమా నాకే ఆశ్చర్యం.   
 శ్రీ కాంతునకు తప్ప ఏ కాంత కు చోటివ్వని ఏకాంత హృదయంతో ఆనందపు లోకాలలో విహరించాలని నా ఆరాటం. 

సరే ఎవరి ఊహలు వారివి. నవ్వి వూరుకోవటమే తప్ప ఖండన మండనలు చేయటానికి రాజకీయులం కాదుకదా . 
కానీ కాలానికి మన నిర్ణయాలతో పని ఏమి . ఇవ్వవలసిన సమయం వచ్చినపుడు తానూ ఇవ్వతలచినదే ఇస్తుంది . తరచి చూస్తే దానికి మనం అంతకు ముందు చేసిన కర్మలే కారణాలు గా కనబడతాయి తప్ప అకారణంగా కాలం ఏది మనకివ్వదు . 
  
 హైదరాబాదు రమ్మంటే అది అభాగ్యనగరం నే రాను అనేవాడిని. కానీ అదే నా పాలి భాగ్యనగరమై నా జీవన యానం సాగటానికి కారణభూతమై నిలచింది. భాగ్య నగరి చేరాక ముందుగా ఇల్లాలు తరువాత ఇల్లు వచ్చి చేరాయి 
కాలం కదిలిపోతుంది రాక పోకలు బాగా తగ్గిపోయాయి కానీ  గుంటూరు మీద మమకారం తగ్గలేదు . ఈ మమకారానికి కారణం ఏమయ్యివుంటుందా తెలుసుకోవాలన్న ఆసక్తి అలానే వుండిపోయింది 
ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో విన్న కొండవీడు రాజుల కథ . మళ్లి  ఇంతకాలం తరువాత చెవిన పడింది. అక్కడికి సమీపంలోని  చెంఘీజ్ ఖాన్ పేటలో కొలువైన వెన్నముద్ద గోపాల స్వామీ గుడి చరిత్ర చూచి రావాలని పనిగట్టుకు మరీ పయనమైతి.  

ఆహా ఏమా సుందర రూపం . కుడి చేత వెన్నముద్ద  పట్టి , ఎడమచేతిని నెలకు అదిమి పెట్టి 
ఎడమ కాలు మడచి ముందుకు పారాడ సిద్ధంగావున్న బాలకృష్ణుని మనోహర రూపం 
 చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ  ఎపుడో మరచిపోయిన మళ్ళి గుర్తుకు వచ్చింది 
అపుడు అనిపించింది 

 గుంటూరు రోడ్లపై తిరుగాడే రోజుల్లో ఎగసి పడిన ఎఱ్ఱని ధూళి కణాలు మోమున కమ్ముచున్నా కొంచెం కూడా చిరాకు అనిపించేది కాదు ఎందుకంటే ఈ బాల కృష్ణడు ఈ  దారుల వెంట పారాడుతూ అక్కడికి చేరినాడనుకుంటా 
అందుకే ఇక్కడ ఎగిరే ధూళి చూస్తుంటే గోకులంలో సాయం సమయాన లేగలను గోవుల వద్దకు తోలుకొస్తున్నపుడు చెంగు చెంగున ఎగురుతూ పరుగులు తీస్తున్న లేగల పద ఘట్టనల తాకిడికి ఎగసిన ఎర్రని ధూళి మేఘంతో కప్పబడిన బాలకృష్ణుడే స్ఫురించేవాడు 
బహుశా అందుకేనేమో ఈ మట్టి అంటే అంత యిష్టం . 

కృష్ణుడు సరే విశ్వమంతా తానైన వాడు ఆయన జాడలు వుండటం ఆశ్చర్యమేమీలేదు కానీ 
అఖండ భారతావని అంత  తన పాదపద్మాలతో పునీతం చేసిన శ్రీరాముడి జాడలేమైనా ఇక్కడ వున్నాయా తెలుసుకోవాలనిపించింది . 

అలా అనుకోగానే తెలిసివచ్చిన ఇద్దరు మహనీయులు తన హృదయంలో రాముడిని దర్శింప చేసిన రంగన్న బాబు గారు 
రాముడి సాక్షాత్కారం పొందిన అమ్మ  కనకమ్మ గారు . నా దురదృష్టం ఏమంటే అమ్మ కనకమ్మ గారి గురించి తెలుసుకుని వారిని దర్శించాలని అనుకున్న రెండు రోజులకే వారు రామునిలో ఐక్యం అయ్యారు. (  ఏ టి  అగ్రహారం లోని భారతాశ్రమం లో వీరి ప్రతిమను దర్శించవచ్చు )
ఈలోపు గోరంట్లలో నివసించిన చందోలు శాస్త్రి గారి ఘనకీర్తి వింటి . వీరు అమ్మ లలితాదేవిని సాక్షాత్కరింపచేసుకున్న మహనీయులు 
ప్రస్తుతంలో ప్రస్తుత కుర్తాళ పీఠాధిపతి గా వ్యవహరిస్తున్న సిద్దేశ్వరానంద భారతీ స్వామివారు ,  . వీరు  పూర్వాశ్రమంలో హిందూ కళాశాల అధిపతి గా పనిచేసిన ప్రసాదరాయ కులపతి గారు. సిద్దేశ్వరి దేవి ని  సాక్షాత్కరింప చేసుకున్న మహా మంత్రవేత్త 
ఇలా ఎందరో మహనీయులు . నాకు తెలియని వారు ఇంకెందరో 
అట్టి మహనీయుల నిశ్వాసం గుంటూరు గాలిలో పరిమళాలు  నింపితే అది నా ఉఛ్వ్వాశమై నాలో ప్రాణవాయువుగా చరిస్తూ నా మనసులో గుంటూరు పట్ల తెగని మమకారం ఏర్పడటానికి కారణమయ్యింది 
 గుంటూరు గోవిందుడు గణపతి అన్ని గకారాలే 

అవును నే  గుంటూరోడిని     అది నా గర్వం  అదే నా గర్వం 








Thursday, March 28, 2019

ఎవరీ హనుమ

ఎవరీ హనుమ

హనుమా! పలుక ఓ కమ్మని పదం  
హనుమా! భావింప ఓ సుందర రూపం 
హనుమా ! తలంప ఓ రక్షా కవచం 

ఇంతకూ ఎవరీ హనుమ!

ఎందుకు హనుమ పై మనసుకింత మమకారం ..... 

రామదూత    స్వామి భక్తి పరాయణుడు     భవిష్యద్ బ్రహ్మ  ఇలా ఎవరికీ ఏ భావన నచ్చితే దానికి తగ్గట్లుగా 
హనుమ గూర్చి పలుకుతూఉంటారు 
నిజమే ఎవరాయన నన్ను చాలాకాలం వేధించిన ప్రశ్న .  అమ్మ లలిత దేవి స్వరూపమే తానా అనిపిస్తుంది. అది తెలుసుకోవాలన్న ఆలోచనలకు సమాధానం పెద్దల  ప్రవచనాల రూపంలోనూ , సహస్ర నామ పారాయణా క్రమంలోను సుందరకాండ లో అంతర్లీనంగా దాగిన రహస్యాల ద్వారాను మనకు ఆయన ఎవరో బోధపడుతుంది 
ఒకసారి వాటిని గమనిద్దాం 

ఉత్తర రామాయణం లో పట్టాభిషేకం పూర్తయ్యాక శ్రీరాముడు సీతమాత సమేతుడై  సోదరులతో కలసి కొలువు తీరినపుడు హనుమ స్వామి పాదాల  చెంత ఆసీనుడై ముచ్చట గొలుపు శ్రీరాముని వదనాన్ని చూస్తూ రామ నామ జపంతో తాదాత్మ్యత చెంది వున్న సమయంలో శ్రీరాముడు సభలో ఆశీనులైన మహర్షులను చూస్తూ అడిగిన ప్రశ్న 

తాను  సర్వసమర్థుడైనప్పటికీ,  సుగ్రీవుడు వాలి చేత కొట్టబడి పారిపోతున్నావాలిని నిగ్రహించక  మౌనంగా సుగ్రీవుడిని అనుసరించి వెళ్ళటానికి కారణమేమి ,ఈ  హనుమ గురించి  నాకు తెలుసుకోవాలని వుంది . 
సత్యం మాత్రమే పలికే మహర్షులకు సత్యమే తానైన శ్రీరాముడి ప్రశ్న 

అందుకు బదులుగా అగస్త్యుల వారు పల్కిన సమాధానమిది 

తొల్లిటి పుట్టుక నేక పాద రుద్రుం డిత డంచు గొందఱు బుధుల్ గణియింపుదు రారహస్య మెవ్వం డెఱుఁగున్ జరాచర భవంబు లెఱిఁగిన నీవు దక్కగన్ (కంకంటి పాపరాజు గారు -ఉత్తర రామాయణం)

రుద్రులలో ప్రథముడైన ఏక పాద రుద్రుడే ఈ హనుమ అని కొందరు పెద్దలు చెబుతారు. కానీ ఆ రహస్యం సకల చరాచర జీవుల రహస్యమెరిగిన శ్రీమన్నారాయణుడవు నీకు కాక ఇంకెవరికి తెలుస్తుంది రామా అని బదులిస్తారు అగస్త్యులవారు .

దాని పరమార్ధం ఆ పరమేశ్వరుడే ఈ స్వామి హనుమ .  శివ అంటేనే మంగళకరం అని స్వామి హనుమాన్ స్మరణ తోనే మనకు కలుగుతాయి సర్వమంగళములు 

ఇక శరవణ భవుడైన సుబ్రహ్మణ్యుడి విషయానికొస్తే ఆయన జన్మకు హనుమ జన్మకు సారూప్యతలెన్నో 
శివ శక్తుల  తేజస్సు అగ్నిలో చేరి అక్కడ నుండి గంగమ్మ లో నిలిచి రెల్లుగడ్డి పొదల్లో పడి శరవణభవుడుగా ఉద్భవిస్తే 

అదే శివ తేజస్సు కొంతకాలం అమ్మవారి అనుజ్ఞ ద్వారా అగ్ని చేత సంరక్షింపబడి తరువాత వాయువుకు అందజేయబడితే ఆ తేజస్సు వాయు దేవుని ద్వారా ఫల రూపకంగా అమ్మ  అంజనాదేవి కి అందజేయబడినది

అగ్ని వాయువులు శివుని అష్టమూర్తులలో  ప్రముఖమైనట్టివారు . శివ స్వరూపమే హనుమ హనుమయే శరవణభవుడు 

సిద్ది ప్రదాయకుడు గణపతి . తనను స్మరించి కార్యాలను ఉపక్రమించే వారికి విజయాలు చేకూరుస్తాడు హనుమ.  తమిళనాట సగం హనుమ సగం గణపతి రూపంతో కూడిన స్వరూపానికి ఆరాధన కొన్ని ప్రాంతాలలో కనబడుతుంది 

హనుమ దుస్సాధ్యమైన సాగరాన్ని దాటి ఆవలి తీరం చేరాక ఆయన ఘనకార్యాన్ని మెచ్చుకుంటూ దేవతలు చెప్పిన స్తోత్రమిది 
                               యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ 
                               ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు న సీదతి


ఈ  చెప్పిన ధృతి ర్దృష్టి ర్మతి ర్దాక్ష్యం ఈ గొప్పవైన లక్షణాలు లేదా నామాలుగా వీటిని భావిస్తే లలితా సహస్రంలో  కుమార గణనాదాంభా -  తుష్టి:-పుష్టి -ర్మతి -ర్ధృతిః  అన్న నామాలను గమనిస్తే అమ్మ యొక్క రూపమే స్వామి హనుమ అని విదితమవుతుంది 

స్వామీ హనుమ వానరుడైనప్పటికీ ఎంతో సుందరంగా మనసును ఆకట్టుకుంటారు ఎందుకంటే అందమైన తల్లి ఆ లలితా త్రిపుర సుందరి ప్రతిరూపమే తానూ కనుక . 

ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మికం 
ఈ హనుమ యే బ్రహ్మ విష్ణువు శివుడు          ఈ హనుమ యే అమ్మ  లలితా  త్రిపుర సుందరి 
ఆయనే సకల దేవతా స్వరూపం సకల గుణ నిధానం 

హనుమన్నితి మే స్నానం  హనుమన్నితి మే జపః 
హనుమన్నితి మే ధ్యానం హనుమత్కీర్తనం  సదా   (శ్రీ గంధ మాధనః  )

Tuesday, April 22, 2014

గోవింద దామోదర స్తోత్రం 3

ధండ ధరుడైన యముని దండనకు 
గురియగు సమయాన ఓ నాలుకా 
మధురమైన హరినామములు భక్తితో స్మరించు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ 

రసమయము మనోజ్ఞమగు సౌలభ్య మంత్రం 
వేద వ్యాసాదులచే కీర్తించబడిన మంత్రం 
ఓ నాలుకా భజించు భవ భంధాలు తొలగించు మంత్రం 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ 
 
గోపాలా  వంశీధర  రూప సింధో 
లోకేశా  నారాయణా దీన భందో 
ఎల్లవేళలా హెచ్చు స్వరంతో స్మరించు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ 

ఓ నాలుకా సదా స్మరించు సుందరమగు 
మనోహరమగు క్రిష్ణ నామములు సమస్త 
భక్తుల ఆర్తి నివారక నామములు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ 

గోవింద గోవింద హరి మురారి 
గోవింద గోవింద ముకుంద క్రిష్ణ 
గోవింద గోవింద  రధాంగ పాణి 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ 

సుఖానుభూతికి సారము నీవు 
దుఖం చివరి అంచున భజించబడునది నీవు 
దేహం విడుచు వేళ జపించబడునది నీవు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ 

దుశ్శాసనుని పరుష వాక్కులకు 
భీతినొంది ద్రౌపది ప్రవేశించే సభా
మధ్యమునకు మనసు నీపై నిలపి  
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ 

శ్రీక్రిష్ణ రాధాప్రియ గోకులేశ  
గోపాల గోవర్ధననాధా విష్ణో 
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ 

శ్రీనాధ  విశ్వేశ్వర   విశ్వమూర్తే 
శ్రీ దేవకీ నందనా , దైత్య శత్రో 
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ          

గోపీపతి, కంసారి , ముకుందా 
లక్ష్మీపతి, కేశవ, వాసుదేవా  
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ          

గోపీజనాహ్లాదకర, వ్రజేశా 
ఆలమందలకు తోడుగా అరణ్యముల తిరుగువాడ 
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ          

ప్రాణేశా  విశ్వంభర  కైటభారి 
నారాయణ చక్రపాణి 
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ   

హరి మురారి మదుసూదన 
శ్రీరామా సీతాప్రియ రావణారి 
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ   

శ్రీ యాదవేంద్ర గిరిధరా కమలనయన 
గో గోప గోపీ సుఖ దాన దక్ష 
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ   

గోపాలుడివై భూమి కాచినవాడా 
శేషుని సోదరుడివై లీలల వినోదించినవాడ 
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ   

బకి బకాసుర అఘాసుర ధేనుకారి 
కేశి  తృణావర్తులను నిర్జించినవాడా 
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ   

శ్రీ జానకీ జీవన రామచంద్ర 
నిశాచరారి భరతాగ్రజ 
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ   

నారాయణ  అనంత హరి నృసింహ 
ప్రహ్లదభాధాహర కృపాళు 
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ   

నరోత్తముడైన రామ రూపా 
సార్వభౌమా ప్రతాపశాలి  
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ   

శ్రీక్రిష్ణ గోవింద హరి మురారి 
ఓ నాధా నారాయణ వాసుదేవా 
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ   

సర్వులు పలుక సమర్ధులైనను జనులెవ్వరు
 
 
పలుకకుంటిరి తీయని నీ నామములు 
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు 
ఓ గోవింద  ఓ దామోదరా  ఓ మాధవ   

ఇది శ్రీ బిల్వ మంగళాచార్య విరచిత 
శ్రీ  గోవింద దామోదర స్తోత్రం 

Friday, April 11, 2014

సద్గురు దర్శనం

 
భారత మాతను తమ పాద స్పర్శతో పునీతం చేసిన పుణ్యమూర్తులు 
నిత్య ప్రాతః స్మరణీయులు 

Saturday, March 29, 2014

గొవిందా హరి గొవిందా

కంస కౌరవాది దానవుల నిర్మూలించు నెపమున 
వృందావని వీడబోవు చిన్ని కొమరుడు క్రిష్ణుని గని 
తల్లడిల్లే  తల్లి యశోద శోక తప్త హృదయముతో 
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా

నిండు పున్నమి పసిడి కాంతులలో  సుధా రస ధారలు కురిపించు  
లేలేత మావి చిగురువంటి పెదవుల ముద్దాడ , సర్వమెరింగిన వాని
మోవికి మోవి కలిపే గోపిక రహస్యము చెప్పు నెపమున   
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా

ఆహా ఏమి ఈ వింత! అని గో గోవత్స గోప గోపికా సమూహములెల్ల 
ఆశ్చర్యచకితులైయుండ,  అరచేత నిలిపె గోవర్ధన గిరిని, ఇంద్రుని 
మదమణచ ఉపేంద్రుడు నిశ్చలముగా ఏడు రోజులు 
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా

పట్ట శక్యము కాని తనను పట్ట నెంచి, పరుగులు తీయుచు 
అలసిన తల్లి యశోదను చూచి, కరుణ తో చిన్ని తాటి కి 
చిక్కే,రెండు అడుగులతో ముజ్జగములు కొలచినవాడు 
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా 

పాలిచ్చి ప్రాణములు తీయనెంచిన పూతన ప్రాణములు 
హరించి, హరి సందేశమిచ్చే, ఎవ్విధముగా నైన తన స్పర్శ 
పొందిన, దుర్గతులు బాపి సద్గతుల నిచ్చెదనని 
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా

ఆయుధము పట్టనని  యుద్ధము  చేయనని పల్కిన 
ఫల్గుణ సఖుడు,  రధ చక్రము చేబూని భీష్ముని పైకురికే
మహోగ్రమున, భక్తుని గెలిపించి తానోడే 
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా 

రూప రహితమగు పరబ్రహ్మము, పెక్కు రూపులు దాల్చి 
గో గోప సమూహములకు ఎల్లలెరుగని ముదిమి కూర్చే 
ఏడాది పాటు, బ్రహ్మ మాయను మ్రింగి వేయగా 
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా

పిడికెడు అటుకులు పొంది, అష్టైశ్వర్యములు ఇచ్చి ,
ఆదరమున సమ భావము చూపి, సంపదలకన్నా 
ప్రేమాభిమానములే మిన్నయని చాటితివి కదా 
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా

ప్రేమతో చందనాదులు అలమి కురూపి కుబ్జ 
కుందనపు బొమ్మాయే, మురిపెమున మనసే 
పాదార్పితము చేసిన పొందలేనిదేమున్నది 
 గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా

వలువలు దోచి దేహాభిమానము బాపి, సర్వము
గోవింద మయమన్న నిజమెరుకపరచి, దేహబ్రాంతులు
దరిచేరని రాసక్రీడల రంజింప చేసితివి రమణులను 
 
గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా

Wednesday, March 26, 2014

గోవింద దామోదర స్తోత్రం (2)

వ్రజ భూమిని వీడ నున్నాడన్న వార్త విన్న 
గోప వనితలు గోవిందుని వియోగ వేదనతో 
రోదించిరి వీధులబడి సిగ్గును విడచి 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 


మణి  పంజరమునున్న చిలుకతో చెప్పించసాగె 
నును సిగ్గులు నగుమోమున కదులాడ గోపిక 
ఆనంద కందా  వ్రజ చంద్ర క్రిష్ణా 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

నిదురోవు గోపబాలకుల జుట్టుకు గోవత్సముల 
తోకలకు జతకట్టు పద్మ నయనంబులవాడి 
చుబుకము పట్టి తల్లి ప్రశ్నించ సాగే 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

గోవత్సముల కాయు కార్యమున కర్రలు చేబూని 
వేకువనే విచ్చేసిన ఇష్ట సఖులగు గోప బాలురు 
పిలవసాగిరి అవ్యయుని అనంతుని ఆత్మీయ భావమున 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

కాళీయుడిని మర్దించ కదంబ వృక్షాగ్రమునుండి
కాళింది మడుగు లోకి దూకిన క్రిష్ణుని   గని 
గోప గొపాంగనలు ఘోల్లుమనిరి భయముతో 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

అక్రూరుని తోడుగా మధుర వీధుల యందు
విల్లోత్సవాలలో కంసుని  చాపమణచ నడుచు 
ముకుందుని చూచి పురజనులు జయద్వానములు పలికే 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

కంసుని దూత రాకతో బృందావని వీడిపోవు 
వసుదేవ సుతులని గని యశోద తల్లడిల్లి 
సొమ్మసిల్లె గృహ మధ్యమున 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

సరోవరమున కాళీయ సర్పముచే చుట్టబడిన 
బాల కృష్ణుని చూసి అసహాయులైన గోపా బాలురు 
నేలను పడి పొర్లిరి పట్టరాని దు:ఖమున 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

అక్రూరుని రధముపై మధురా నగరి వైపు 
సాగిపోవు యదువంశ నాధుని చూసి వగచి 
మరల మరలి రావా యని అడగసాగిరి గోపబాలకులు 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

పూల పానుపు పై పరుండియు చెంత క్రిష్ణుడు లేని 
చింతతో కలువ కనుల నిండా కన్నీటితో నుండె 
గోపిక వనాంతమున వంటరిగా 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

స్వగృహమునకు చేరువైన గోపిక కట్టుబాట్లతో 
కట్టడి చేయు తల్లి తండ్రుల తలంపు రాగా 
విశ్వనాదా ! రక్షించమనె బరువైన హృదయముతో 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

అడవి యందు క్రిష్ణుడున్నాడన్న అభయముతొ 
అర్ధరాత్రి వేళ బృందావని చేరిన గోపిక కన్నయ్య 
కానరాక విలపించే భయముతో వనమున  
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

సుఖాసనమున సేదతీరుతూ నీ నామమలు 
విడువక మరల మరల పలికిన ప్రేమతో 
పొందుదురు నీ సారూప్యము సామాన్యులైనను 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

గోవిందుని వియోగముతో దు:ఖితురాలగు 
నీరజాక్షి రాధను చూసి చలించిన చెలి 
కలువ కనులు కన్నీటి ధారలు స్రవించే 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

మధుర పదార్ధములయందు అమితాసక్తి కల 
నాలుకా  హితము కలిగించు నిజమిదే వినుమా 
 మధుర పదార్ధముల వీడి మధురాక్షరములను భజించు 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా యని 

వేద విదులచె కీర్తించబడే నీ నామములు 
వ్యాధి  నిర్మూలకములనియు సంసార 
తాపత్రయ నాశ బీజములనియు 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా

తండ్రి మాటను ఔదాల్చ అడవుల కేగు 
సీతా లక్ష్మణ సమేత రామచంద్రుని చూసి
తల్లి కౌసల్య శోకముతో తల్లడిల్లే  
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా

దండకారణ్యమున ఒంటరిగానున్న వేళ 
దశ కంటునిచే అపహరణ కు గురైన సీతా మాత 
ఆర్తి తో నిను తప్ప అన్య దైవమును తలచలేదు 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా

రాముని హృది ని నిలుపుకున్న జానకి 
ఆ రాముని వియోగము తాళలేక రోదించే 
రఘునాధా శరణు శరణు యని 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా

దేవ దానవులకు నొక్క రీతిగా సుఖ దు:ఖముల
నొసగు ఓ విష్ణు  రఘువంశ నాధా  శరణు శరణు
అని పరితపించె సీత సముద్ర మధ్యమున 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా  

 మకరి నోట చిక్కి జలముల లోనికి  లాగబడు వేళ 
 బెదరి  కరి బంధు సమూహములెల్ల చేదిరిపోగా 
 గజరాజు మరల మరల తలచే నీవే దిక్కని 
 ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

పుణ్యములొసగు హరి నామముల స్మరించుచూ 
 తొట్టి యందు పడిన పుత్రుని  పురొహితుడగు 
శంఖయుతుని తో కలసి  హంసధ్వజుడు చూచె 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

మనసు యందు నిన్నే నిండుగా నిలుపుకున్న 
ద్రౌపది అరణ్య వాసి అయినను దుర్వాసుని 
ఆహ్వానించే శిష్య సహితముగా భోజనము నకు 
ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా 

యోగుల ధ్యానమునకు సైతము చిక్కనివాడు 
చింతలను తొలగించి చింతితముల నిచ్చు పారిజాతము 
నుదుటిన కస్తూరి తో  నీల వర్ణము తో మెరయు వాడు  
 ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా

సంసార కూపమను అగాధమున పడి పతితుడనైతి 
విషయ వాసనలకు చిక్కి మోహందుడ నైతి 
ఓ విష్ణు నను రక్షించు నా చేయి పట్టి నడిపించు 
 ఓ గోవిందా  ఓ దామోదరా  ఓ మాధవా
26 నుండి 50 శ్లోకములు 
(పూజ్య లీలా శుక  విరచిత గోవింద దామోదర స్తోత్రం నకు తెలుగు వివరణ )