Thursday, December 15, 2016
Tuesday, April 22, 2014
గోవింద దామోదర స్తోత్రం 3
ధండ ధరుడైన యముని దండనకు
గురియగు సమయాన ఓ నాలుకా
మధురమైన హరినామములు భక్తితో స్మరించు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
రసమయము మనోజ్ఞమగు సౌలభ్య మంత్రం
వేద వ్యాసాదులచే కీర్తించబడిన మంత్రం
ఓ నాలుకా భజించు భవ భంధాలు తొలగించు మంత్రం
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
గోపాలా వంశీధర రూప సింధో
లోకేశా నారాయణా దీన భందో
ఎల్లవేళలా హెచ్చు స్వరంతో స్మరించు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
ఓ నాలుకా సదా స్మరించు సుందరమగు
మనోహరమగు క్రిష్ణ నామములు సమస్త
భక్తుల ఆర్తి నివారక నామములు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
గోవింద గోవింద హరి మురారి
గోవింద గోవింద ముకుంద క్రిష్ణ
గోవింద గోవింద రధాంగ పాణి
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
సుఖానుభూతికి సారము నీవు
దుఖం చివరి అంచున భజించబడునది నీవు
దేహం విడుచు వేళ జపించబడునది నీవు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
దుశ్శాసనుని పరుష వాక్కులకు
భీతినొంది ద్రౌపది ప్రవేశించే సభా
మధ్యమునకు మనసు నీపై నిలపి
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
శ్రీక్రిష్ణ రాధాప్రియ గోకులేశ
గోపాల గోవర్ధననాధా విష్ణో
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
శ్రీనాధ విశ్వేశ్వర విశ్వమూర్తే
శ్రీ దేవకీ నందనా , దైత్య శత్రో
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
గోపీపతి, కంసారి , ముకుందా
లక్ష్మీపతి, కేశవ, వాసుదేవా
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
గోపీజనాహ్లాదకర, వ్రజేశా
ఆలమందలకు తోడుగా అరణ్యముల తిరుగువాడ
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
ప్రాణేశా విశ్వంభర కైటభారి
నారాయణ చక్రపాణి
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
హరి మురారి మదుసూదన
శ్రీరామా సీతాప్రియ రావణారి
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
శ్రీ యాదవేంద్ర గిరిధరా కమలనయన
గో గోప గోపీ సుఖ దాన దక్ష
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
గోపాలుడివై భూమి కాచినవాడా
శేషుని సోదరుడివై లీలల వినోదించినవాడ
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
బకి బకాసుర అఘాసుర ధేనుకారి
కేశి తృణావర్తులను నిర్జించినవాడా
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
శ్రీ జానకీ జీవన రామచంద్ర
నిశాచరారి భరతాగ్రజ
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
నారాయణ అనంత హరి నృసింహ
ప్రహ్లదభాధాహర కృపాళు
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
నరోత్తముడైన రామ రూపా
సార్వభౌమా ప్రతాపశాలి
ఓ నాలుక హరి నామామృతమును గ్రోలు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవ
శ్రీక్రిష్ణ గోవింద హరి మురారి
ఓ నాధా నారాయణ వాసుదేవా
Friday, April 11, 2014
Saturday, March 29, 2014
గొవిందా హరి గొవిందా
కంస కౌరవాది దానవుల నిర్మూలించు నెపమున
వృందావని వీడబోవు చిన్ని కొమరుడు క్రిష్ణుని గని
తల్లడిల్లే తల్లి యశోద శోక తప్త హృదయముతో
గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా
నిండు పున్నమి పసిడి కాంతులలో సుధా రస ధారలు కురిపించు
లేలేత మావి చిగురువంటి పెదవుల ముద్దాడ , సర్వమెరింగిన వాని
మోవికి మోవి కలిపే గోపిక రహస్యము చెప్పు నెపమున
గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా
ఆహా ఏమి ఈ వింత! అని గో గోవత్స గోప గోపికా సమూహములెల్ల
ఆశ్చర్యచకితులైయుండ, అరచేత నిలిపె గోవర్ధన గిరిని, ఇంద్రుని
మదమణచ ఉపేంద్రుడు నిశ్చలముగా ఏడు రోజులు
గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా
పట్ట శక్యము కాని తనను పట్ట నెంచి, పరుగులు తీయుచు
అలసిన తల్లి యశోదను చూచి, కరుణ తో చిన్ని తాటి కి
చిక్కే,రెండు అడుగులతో ముజ్జగములు కొలచినవాడు
గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా
పాలిచ్చి ప్రాణములు తీయనెంచిన పూతన ప్రాణములు
హరించి, హరి సందేశమిచ్చే, ఎవ్విధముగా నైన తన స్పర్శ
పొందిన, దుర్గతులు బాపి సద్గతుల నిచ్చెదనని
గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా
ఆయుధము పట్టనని యుద్ధము చేయనని పల్కిన
ఫల్గుణ సఖుడు, రధ చక్రము చేబూని భీష్ముని పైకురికే
మహోగ్రమున, భక్తుని గెలిపించి తానోడే
గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా
రూప రహితమగు పరబ్రహ్మము, పెక్కు రూపులు దాల్చి
గో గోప సమూహములకు ఎల్లలెరుగని ముదిమి కూర్చే
ఏడాది పాటు, బ్రహ్మ మాయను మ్రింగి వేయగా
గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా
పిడికెడు అటుకులు పొంది, అష్టైశ్వర్యములు ఇచ్చి ,
ఆదరమున సమ భావము చూపి, సంపదలకన్నా
ప్రేమాభిమానములే మిన్నయని చాటితివి కదా
గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా
ప్రేమతో చందనాదులు అలమి కురూపి కుబ్జ
కుందనపు బొమ్మాయే, మురిపెమున మనసే
పాదార్పితము చేసిన పొందలేనిదేమున్నది
గొవిందా హరి గొవిందా, గొవిందా హరి గొవిందా
వలువలు దోచి దేహాభిమానము బాపి, సర్వము
గోవింద మయమన్న నిజమెరుకపరచి, దేహబ్రాంతులు
దరిచేరని రాసక్రీడల రంజింప చేసితివి రమణులను
Wednesday, March 26, 2014
గోవింద దామోదర స్తోత్రం (2)
వ్రజ భూమిని వీడ నున్నాడన్న వార్త విన్న
గోప వనితలు గోవిందుని వియోగ వేదనతో
రోదించిరి వీధులబడి సిగ్గును విడచి
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
మణి పంజరమునున్న చిలుకతో చెప్పించసాగె
నును సిగ్గులు నగుమోమున కదులాడ గోపిక
ఆనంద కందా వ్రజ చంద్ర క్రిష్ణా
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
నిదురోవు గోపబాలకుల జుట్టుకు గోవత్సముల
తోకలకు జతకట్టు పద్మ నయనంబులవాడి
చుబుకము పట్టి తల్లి ప్రశ్నించ సాగే
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
గోవత్సముల కాయు కార్యమున కర్రలు చేబూని
వేకువనే విచ్చేసిన ఇష్ట సఖులగు గోప బాలురు
పిలవసాగిరి అవ్యయుని అనంతుని ఆత్మీయ భావమున
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
కాళీయుడిని మర్దించ కదంబ వృక్షాగ్రమునుండి
కాళింది మడుగు లోకి దూకిన క్రిష్ణుని గని
గోప గొపాంగనలు ఘోల్లుమనిరి భయముతో
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
అక్రూరుని తోడుగా మధుర వీధుల యందు
విల్లోత్సవాలలో కంసుని చాపమణచ నడుచు
ముకుందుని చూచి పురజనులు జయద్వానములు పలికే
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
కంసుని దూత రాకతో బృందావని వీడిపోవు
వసుదేవ సుతులని గని యశోద తల్లడిల్లి
సొమ్మసిల్లె గృహ మధ్యమున
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
సరోవరమున కాళీయ సర్పముచే చుట్టబడిన
బాల కృష్ణుని చూసి అసహాయులైన గోపా బాలురు
నేలను పడి పొర్లిరి పట్టరాని దు:ఖమున
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
అక్రూరుని రధముపై మధురా నగరి వైపు
సాగిపోవు యదువంశ నాధుని చూసి వగచి
మరల మరలి రావా యని అడగసాగిరి గోపబాలకులు
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
పూల పానుపు పై పరుండియు చెంత క్రిష్ణుడు లేని
చింతతో కలువ కనుల నిండా కన్నీటితో నుండె
గోపిక వనాంతమున వంటరిగా
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
స్వగృహమునకు చేరువైన గోపిక కట్టుబాట్లతో
కట్టడి చేయు తల్లి తండ్రుల తలంపు రాగా
విశ్వనాదా ! రక్షించమనె బరువైన హృదయముతో
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
అడవి యందు క్రిష్ణుడున్నాడన్న అభయముతొ
అర్ధరాత్రి వేళ బృందావని చేరిన గోపిక కన్నయ్య
కానరాక విలపించే భయముతో వనమున
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
సుఖాసనమున సేదతీరుతూ నీ నామమలు
విడువక మరల మరల పలికిన ప్రేమతో
పొందుదురు నీ సారూప్యము సామాన్యులైనను
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
గోవిందుని వియోగముతో దు:ఖితురాలగు
నీరజాక్షి రాధను చూసి చలించిన చెలి
కలువ కనులు కన్నీటి ధారలు స్రవించే
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
మధుర పదార్ధములయందు అమితాసక్తి కల
నాలుకా హితము కలిగించు నిజమిదే వినుమా
మధుర పదార్ధముల వీడి మధురాక్షరములను భజించు
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా యని
వేద విదులచె కీర్తించబడే నీ నామములు
వ్యాధి నిర్మూలకములనియు సంసార
తాపత్రయ నాశ బీజములనియు
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
తండ్రి మాటను ఔదాల్చ అడవుల కేగు
సీతా లక్ష్మణ సమేత రామచంద్రుని చూసి
తల్లి కౌసల్య శోకముతో తల్లడిల్లే
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
దండకారణ్యమున ఒంటరిగానున్న వేళ
దశ కంటునిచే అపహరణ కు గురైన సీతా మాత
ఆర్తి తో నిను తప్ప అన్య దైవమును తలచలేదు
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
రాముని హృది ని నిలుపుకున్న జానకి
ఆ రాముని వియోగము తాళలేక రోదించే
రఘునాధా శరణు శరణు యని
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
దేవ దానవులకు నొక్క రీతిగా సుఖ దు:ఖముల
నొసగు ఓ విష్ణు రఘువంశ నాధా శరణు శరణు
అని పరితపించె సీత సముద్ర మధ్యమున
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
మకరి నోట చిక్కి జలముల లోనికి లాగబడు వేళ
బెదరి కరి బంధు సమూహములెల్ల చేదిరిపోగా
గజరాజు మరల మరల తలచే నీవే దిక్కని
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
పుణ్యములొసగు హరి నామముల స్మరించుచూ
తొట్టి యందు పడిన పుత్రుని పురొహితుడగు
శంఖయుతుని తో కలసి హంసధ్వజుడు చూచె
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
మనసు యందు నిన్నే నిండుగా నిలుపుకున్న
ద్రౌపది అరణ్య వాసి అయినను దుర్వాసుని
ఆహ్వానించే శిష్య సహితముగా భోజనము నకు
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
యోగుల ధ్యానమునకు సైతము చిక్కనివాడు
చింతలను తొలగించి చింతితముల నిచ్చు పారిజాతము
నుదుటిన కస్తూరి తో నీల వర్ణము తో మెరయు వాడు
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
సంసార కూపమను అగాధమున పడి పతితుడనైతి
విషయ వాసనలకు చిక్కి మోహందుడ నైతి
ఓ విష్ణు నను రక్షించు నా చేయి పట్టి నడిపించు
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
26 నుండి 50 శ్లోకములు
(పూజ్య లీలా శుక విరచిత గోవింద దామోదర స్తోత్రం నకు తెలుగు వివరణ )
Thursday, March 13, 2014
గోవింద దామోదర స్తోత్రం (1)
కురు పాండవ సముహ మధ్యమున
దుశ్శాసన పరాభవితయగు ద్రౌపది
ఆక్రోసముతో పిలిచే క్రిష్ణా నీవే దిక్కని
ఓ గోవింద ఓ దామోదర ఓ మాధవా
శ్రీక్రిష్ణ విష్ణు మధు కైటభ సంహారి
భక్త వత్సలా భగవాన్ మురారి
కేశవా లొకనాధ నను బ్రోవుమా
ఓ గోవింద ఓ దామోదర ఓ మాధవా
వీధుల పాలు పెరుగులమ్మెడి వేళనూ
ప్రేమ పారవశ్యముతో నిండిన చిత్తము
కల గోపిక మనంబు మురారి పాదార్పితము చేసే
ఓ గోవింద ఓ దామోదర ఓ మాధవా
గింజలతో నిండిన తిరుగలి పిడి మరల
మరల త్రిప్పు గోపికలు గానము చేసిరి
జనించిన అనురాగముతో
ఓ గోవింద ఓ దామోదర ఓ మాధవా
మణులు పొదిగిన మణికట్టుపై నిలిచిన
ఎర్రని కెంపు ను పోలిన వంపైన నాసికతో అలరారు
చిలుకతో కమల నయన పలికేనిలా
ఓ గోవింద ఓ దామోదర ఓ మాధవా
గృహ గృహమున ప్రతిక్షణము విడువక
పంజరముల నున్న చిలుకలతో ప్రేమగా
పునః పునః పలికించసాగిరి గోపాంగనలు
ఓ గోవింద ఓ దామోదర ఓ మాధవా
శిశువుల నిదురపుచ్చ ఊయల లూపుతూ
జోల పాడసాగిరి గోపికలు విష్ణు మహిమలు
రాగ తాళ మతిశయిల్లగా
ఓ గోవింద ఓ దామోదర ఓ మాధవా
గుండ్రని నయనముల నటు నిటు సొంపుగా త్రిప్పుతూ
చూపులన్నీ బలరామానుజుని పై నిలపి వెన్నముద్దను
ఆరగించ రా రమ్మని గోపికలు పిలువ సాగిరి
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా
రాజహంస నడక వలె నర్తించు నాలుక
తలచినంతనే చవులూరించు తీయని
నామముల స్మరణలో నిలిచిపోయే
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా
ఒడిలో కూర్చుండి పాలు త్రాగుతున్న
బాలుడైన కమల నాధుని కనులార కాంచి
పులకిత యగు యశోద నీ దయావర్షంలో తడిసే
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా
వ్రజ భూమిలో తోటివారగు గోపబాలకులతో
ఆటపాటలయందు ఆనందించు ఆ నంద నందనుని
పిలిచే యశోద కడు ప్రేమతో
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా
పశువుల కట్టు పలుపు తాడుతో రోటి కి
కట్టబడి బిక్కమొగముతొ కోరే యశోదను
భంధనాలు వదులుచేయమని వెన్నతిన్న గోపాలుడు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా
కంకణములతొ క్రీడించు క్రిష్ణుని కనులను
అరచేత మూసి కడు వయ్యారముల గోపిక
వెన్న ముద్దను చూపి ఆశ పెట్టసాగే
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా
గృహముల యందు గోపకాంతలు ఒకచో
కూడినపుడెల్లను విడువక నీ పుణ్య నామములే
మరల మరల పలుకుచుండిరి అనురక్తితో
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా
గో గోప గోపికా జన సమూహము వివశులై వినుచుండ
మందార వృక్ష మూలమున ముద్దులొలుకు బాల కిశోరుడు
ఎర్రని పెదవులపై వేణువు నుంచి ఆలపించే కమనీయ గానం
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా
వెన్నచిలుకుతూ మురిపెమున యశోదా సుతుని
అల్లరి చేష్టలను పాడుచుండిరి కృతులుగా కవ్వపు
కంకణపు సవ్వడులకు జతగా ప్రాతః కాలమున గోపికలు
ఓ గోవింద ఓ దామోదరా ఓ మాధవా
మేలుకొన్న యశోద గృహమున వెన్నచేయ తలంచియు
తత్తరపడి సందేహ మనస్కురాలై నిజము పలుక మని
నిలదీసే మురారిని వెన్న దొంగయగు వెన్నుని
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
ప్రాతః ప్రార్ధనలు ముగించి పెరుగు చిలుకుతూ
ఉప్పొంగిన ప్రేమతో పాడ సాగిరి హరి గీతములు
గోపికలు చెలులతో కూడి సుస్వరముల
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
వేకువలో గోపికలచే దాచబడిన వెన్నతో
నిండిన కుండలను ముక్కలుగా పగులగొట్టి
కేరింతలాడుతూ చిందులేసే ముకుందుడు
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
ఆట పాటల లీనమై ఆకలి దప్పుల మరచి
పిలిచినా రా నిరాకరించు క్రిష్ణుని పదే పదే
పిలిచే యశోద పొంగు మాతృ వాత్సల్యమున
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
శేష శయ్య పై సుఖాసీనుడైన విష్ణుని
స్తుతించు దేవర్షి సంఘములు పొందే
నీ అంశారూప మచ్యుతా
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
అరుణోదయ వేళ నిదురను వీడి వేద విధులు
కావించిన విప్ర వరేణ్యులు వేదాధ్యయనము
ముగిసిన పిమ్మట పలికెదరు నీ నామములు
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
బృందావనమున గోవిందుని వియోగముతో
పరితపించు రాధ హృదయవేదన చూసి
చెమరించు కనులతో గోప గోపికలు గానము చేసే
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
ప్రభాతమున గ్రాసమునకై వెడలిన గోవుల చూసి
యశోద మృదు మదుర హస్త స్పర్సతో
గోపాలుని తట్టి నిదుర లేపసాగే
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
వృక్ష మూలములందు ముత్యపు జటల తో
శాఖముల భక్షణ తో శోభిల్లు శరీరములు కల
మునులు జపించు చుండిరి నీ నామములు
ఓ గోవిందా ఓ దామోదరా ఓ మాధవా
(పూజ్య లీలా శుక విరచిత గోవింద దామోదర స్తోత్రం నకు తెలుగు వివరణ తొలి 25 శ్లోకములు )
Thursday, March 6, 2014
భజ గోవిందం
మరణ కాలం చేరువైన వేళ
వ్యాకరణ జ్ఞానం నిను చేదలేదు
గోవిందుడినే స్మరించు గోవిందుడినే స్మరించు
ఓ మూఢమతీ గోవిందుడినే స్మరించు
ధనాశ వీడి సత్కర్మ ఫలమున
దొరికిన మితఫలమే హితమని
సంతుష్టి తో జీవన యానం సాగించు
గోవిందుడినే స్మరించు గోవిందుడినే స్మరించు
ఓ మూఢమతీ గోవిందుడినే స్మరించు
అతివల ఘన హృదయ సౌందర్యానికి
వసుడవు కాబోకు నునుపైన తోలు తొడిగిన
రక్త మాంసపు ముద్దని మరల మరల తలుచుకో // గోవిందుడినే స్మరించు //
చంచలమీ జీవితం చపలమగు బుద్ధి
నా అను అహంకారం రోగభరిత శరీరం
కలగలిసిన సోకమయమే ఈ లోకం // గోవిందుడినే స్మరించు //
చేతిలో కాసులు గల గల లాడినంతకాలం
బంధు జనుల సందోహం తో గృహము కళ కళ లాడు
వయసుడిగి చేతులు ఖాళీ అయినవేళ
కానరారు కనులకెదురుగా అయిన వారెవరూ // గోవిందుడినే స్మరించు //
కాయం కదులుతున్నంత కాలం కుశల మడుగుదురెల్లరును
కదలిక లాగి కట్టె బిగిసిన వేళ దరి చేరరు భయముతో భార్యా బిడ్డలును // గోవిందుడినే స్మరించు //
ఆట పాటలతో బాల్యము కాంతా కనకపు మొహమున యవ్వనము
ముగింపు లేని పలు చింతలతో ముదిమి కరిగిపోవు కాని విడువక
గోవింద స్మరణ చేయు నరులెవ్వరు లోకంలో // గోవిందుడినే స్మరించు //
ఆలు బిడ్డలను చింతలు మాని నా దను మోహము వీడి చిత్రమగు జీవన
చిత్రపు లోతులు తరచి తరచి చూచిన తత్వం తెలియనగు సోదరా // గోవిందుడినే స్మరించు //
సత్సాంగత్యమున అబ్బును నిస్సంగత్వం
నిస్సంగత్వ మిచ్చును నిర్మోహత్వం
నిర్మొహత్వముతొ కలుగు నిశ్చలతత్వం
నిశ్చలతత్వమున దొరకు జీవన్ముక్తి కి త్రోవ // గోవిందుడినే స్మరించు //
శుష్క శరీరము కామ వికారము నొందునా
జలం శోషించిన సరస్సు లందుమా
విత్తం పోయిన పరివారం మిగులునా
తత్వం తెలిసిన సంసార మోహముండునా // గోవిందుడినే స్మరించు //
ధన జన యవ్వన గర్వం తొలగించును కాలం క్షణ కాలంబున
అనిత్యమౌ మాయా లోకపు బ్రాంతిని విడచి
నిత్యసత్యమౌ బ్రహ్మపధంబు చేర వేగిరపడుమా // గోవిందుడినే స్మరించు //
దివా రాత్రములు రుతు చక్రములు మరల మరల మరలి వచ్చు
కాలము ఆయుష్కాలము కదలి పోవు కాని మరలి రావని నిజంబెరిగియు
ఆశా పాశములు తెంచ బోడు మానవుడు // గోవిందుడినే స్మరించు //
సతీ విత్తములపై చిత్తము వీడి సత్సాంగత్యమను నౌకను చేరు
భవ జలధి ని దాటించి భవహరుని దరి చేర్చు // గోవిందుడినే స్మరించు //
శిరో ముండనం కాషాయాడంబరం జటాధారణం
కనులుండి కనలేని మూఢులు కట్టెదరు పొట్ట కూటికై బహుకృత వేషం // గోవిందుడినే స్మరించు //
నల్లని కురులు పాల పొంగాయే బోసి నోటిలో మాట తడబడే
వెన్ను వంగిపోయే చేతి కర్ర ఊతమాయె అయినను ఆశల మూట బరువెక్కదాయే // గోవిందుడినే స్మరించు //
వృక్ష మూలమున విశ్రాంతి దోసిలి భిక్ష తో ఉదర పోషణ
శీతొష్ణముల తో సహవాసమున్నా మది మాత్రం ఆశల బంధీనే హన్నా // గోవిందుడినే స్మరించు //
కోటి తీర్ధ స్నానము వేల వ్రతా చరణము
శక్తి కొలది దానము చేర్చలేవు ముక్తి ధామము
ఆత్మజ్ఞాన మించుకైన అబ్బనిచో // గోవిందుడినే స్మరించు //
గుడి ప్రాంగణములు చెట్టు మొదళ్ళే ఆవాసములు
రాతి నేలలే పట్టుపరుపులు జంతు చర్మములే పట్టు వస్త్రములుగా
తలంచు జ్ఞాన విరాగి సుఖములు పొందకుండునే // గోవిందుడినే స్మరించు //
యోగి యైనను పరమ భోగి యైనను
ఏకాకి కాని సరాగి కాని నిరతము
గోవింద స్మరణ చేయువాడే నిత్య సంతోషి // గోవిందుడినే స్మరించు //
భగవద్ గీతా పారాయణం గంగాజల పానం
మురారి నామ స్మరణం అనుదినము కొలది
మాత్రము చేసిన కాలునితో కలహమెక్కడ // గోవిందుడినే స్మరించు //
దుర్భర గర్భావాసం చావు పుట్టుకల చక్ర బ్రమణం
తప్పించుకొన సాధ్యమా మానవులకు
మురారి నీ కృప లేకను // గోవిందుడినే స్మరించు //
దొరకిన గుడ్డ పీలికల గోచి కట్టి
పాప పుణ్యముల చింతన మాని
యోగమందు మనస్సు నిలిపే యోగి
పిచ్చి వానివలె ఆత్మానందము నొందు // గోవిందుడినే స్మరించు //
నీవెవరు నేనెవరు తల్లి తండ్రు లెవరు
ఎటు నుండి ఎటుకు పయనం
చింతన చేసిన లోకమెల్ల సార హీనమని
స్వప్న సదృశ్యమని సత్యము తెలియు // గోవిందుడినే స్మరించు //
నీలో నాలో సకల జీవులలో నిండినది ఒకే
విష్ణు తత్వమని తెలిసిన వేళ అకారణము నైనను
సకారణము నైనను అసహనముండదు అన్యులపై
మోక్షము కోరితివా సమబుద్ది ని సాధించు // గోవిందుడినే స్మరించు //
శత్రువుతో పుత్రునితో భందువుతో
నెయ్యమైనను కయ్యమైనను నెరపబొకు
సర్వులలో ఏకాత్మ ను దర్శించి
అన్నివేళలా అభేదం పాటించు // గోవిందుడినే స్మరించు //
కామం క్రోధం లోభం మొహం విడచిన మనలో
మనకు హరి స్వరూపమగుపించు
ఆత్మజ్ఞానమొందని వారు నరక వాసులై నశించు // గోవిందుడినే స్మరించు //
గీతా నామ సహస్రముల గాన మాలపించు
శ్రీహరి రూపమే ధ్యానించు
సజ్జన సాంగత్యం వైపుకు మనసును మళ్ళించు
దీన జనుల కొరకు ధనమును వెచ్చించు // గోవిందుడినే స్మరించు //
కామిని కూడికతో సుఖ పడు కాయం
తత్ఫలముగా వ్యాధులతో వెతల్ పాలగు
మరణం తధ్యమని తెలిసీ వదలడు పాపాచరణం // గోవిందుడినే స్మరించు //
ధనవంతుడు బిడ్డలతోనూ భీతి నొందు
సంపద నొసగదు యించుక నిజ సౌఖ్యం
యిది లోక రీతి తెలిసి విత్తము పై చిత్తము విడనాడు // గోవిందుడినే స్మరించు //
శ్వాసను నియమించి విషయ వాసనల నుండి మనసు తొలగించు
నిత్యానిత్య విచారం సమాధి స్థితిలో నామ జపం క్రమ పద్దతిలో కొనసాగించు // గోవిందుడినే స్మరించు //
గురు పాదములే రక్షయని తెలిసిన వాడా! మనస్సేంద్రియములను నియంత్రిచు
జనన మరణ చక్రము దాటి నీలో నిలచిన పరమాత్మను దర్శించు
గోవిందుడినే స్మరించు గోవిందుడినే స్మరించు
ఓ మూఢమతీ గోవిందుడినే స్మరించు
(శంకర భగవత్పాదుల భజ గోవిందం నకు ఓ అవివేకి అనుసరణ)
Subscribe to:
Posts (Atom)