Saturday, January 25, 2025

మధుర క్షణం

 నిరంతర ఆలోచన ప్రవాహములే నీ అలంకారపు

 పుష్పమాలికలూ  
ఉచ్ఛ్వాస నిశ్వాసములే ముత్తెపు  ఊయల పందిరి 
భావోద్వేగములే నీ మృష్టాన్న భోజనంబు 

మము కప్పిఉంచు మాయ యే నీ పట్టు పీతాంబరములు 
కనులను ఆకర్షించు విలాసములే నీ రూప లావణ్యములు 
వీనులకు విందు చేయు వాక్ప్రవాహములే నీ మువ్వల సవ్వడులు 
కష్టముల కడలియే పాల సముద్రమని  చేయు కర్మలే నీదు  సేవలని    
మంచి చెడుల వేదన విడచి కలడో లేడో నన్న వూగిసలాట వీడి 
ఈ దేహమే బృందావనమని మా మది యే  నీదు మందిరమని 
నవ ద్వారములే నిను చేరు   నవ విధభక్తిమార్గములని భావన చేసి  
హృదయ పద్మమే ఆత్మ స్వరూపుడగు రాధాకృష్ణుల ఆసనమని 
ఎరుకతోడ నిను కాంచు కనులను ఈ లక్ష్మీకిరణులకొసగి ఊపిరి 
తీయు ప్రతిక్షణం ఓ మధుర క్షణం గా అనుభూతి పొందు 
అదృష్టమీయవయా  సాంద్రానందా  సదానందా 

Wednesday, January 15, 2025

కమల నయనా

 అరమోడ్పు కనుల కురియు ఆనందరస ధార

మా హృదిని మీట
పగడపు పెదవుల అలరు బంగరు వేణియ సుధా
రస ధార మా వీనులవిందు చేయ
దట్టపువానమబ్బు దేహఛాయ కురిపించు దయా
జలధి మా మేని తడుప
నళినాక్షు నిండైన రూపంబు లక్ష్మీకిరణుల గుండె
గూటిలో నిరతము నిలవ నీ కృప చూపవే కమల నయనా

గోపికాబృంగ

 గోపికాబృంగ హృదయకమలాలలో

శృంగారలహరులు మీటు నళినాక్షు
నగుమోము వేణునాద తరంగాలు
లక్ష్మీకిరణు హృదయఫలకం పై సంతత
దయారస ధారలు కురిపింప మా చిగురు
టధరములపై పూయు చిరునగవుపూల
మాలలతో నల్లనయ్య కంఠసీమ కావలింతుము

Monday, January 13, 2025

 సిరులమాలచ్చి కంఠసీమను అలంకరించు బాహువులకు 

చల్ది మూటను తగిలించి సర్వ జీవుల పోషించు గోవిందుడు 
ప్రభాతమున గోవత్సముల పోషణార్థము గోపాలురతో కూడి 
కాననములకేగా వడివడిగా నడువసాగె చెలికాండ్ర చేర  

Sunday, January 12, 2025

సంక్రాంతి

  సంక్రాంతి 


గొబ్బిళ్ళ గుర్రాలు పూంచిన ముగ్గుల రథమెక్కి భానుడుదయించు వేళ 
 హరి కీర్తనల రస గుళికలు  పెదవుల జాలువారుచుండ చిడత చప్పుళ్ల
 హరిదాసుల కోలాహలం  చెవులకింపై ఇల్లాండ్ర దోసిళ్ళ జాలువారిన దయ 
 అక్షయపాత్ర లో పొంగు వేళ  తొంగిచూసే తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి హేల

మినప గారెల ఘుమఘుమ అత్తగారి ఆప్యాయతల అరిసె కొత్త బియ్యపు 
పాల పొంగళ్ళు ఆరగింపుకై వేచి యున్న వేళ మామ మురిపెముగా తెచ్చిన
కొత్త వస్త్రాలతో అలంకరించుకుని అలకలు చూపుతూ ఆలి తో కొత్త అల్లుళ్లు 
భోజనాల కుపక్రమించు వేళ  తొంగిచూసే తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి హేల
 
పట్టు పరికిణి మెరుపుల విరిబోణి హోయలు తుంటరి మనస్సులలో ఆశల
విహంగాలను ఎగరేయు వేళ నింగి కెగసిన పతంగులతో పూబోణుల హృదయా
లలో పాగావేయ నెంచిన కొంటెగాళ్ళ కోణంగి చేష్టలతో పులకరించిన పల్లె పడుచుల
గలగలలు కనువిందు చేయు వేళ   తొంగిచూసే తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి హేల


చురుకు చూపుల చురకత్తులు విసురుతూ వడిగా వడివడిగా
రివ్వున రెక్కలు విదిల్చి ఒక్కుదుటున పైకెగసి ఎదుటిదాని
 ఎదపై ఎగదన్న మిక్కుటమైన రోషంతో పుంజులు రెండు
తలపడు  సమరాంగణమొకవైపు మరోవైపు ఆరుగాలం రైతన్న
తోడుగా శ్రమించి  పంటను ఇంటికి చేర్చిన దొడ్డన్న బసవన్న తరగని
తన చేవ ను బరువులు సులువుగా లాగుతూ జనుల హృదయాలు
కొల్లగొట్టు వేళ తొంగిచూసే తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి హేల


కారాదు తెలుగు పల్లె పై సంక్రాంతి సంబరం గతకాలపు ఘనవైభవమ్ 
ఇరుకు బారిన పల్లె హృదయం తిరిగి కావాలి విశాల హృదయం 
మకర సంక్రాతి సంక్రమణం కావాలి నూతన భావాల సంక్రమణం 

Friday, January 10, 2025

వాణీ మధురిమ

 వేణుగాన తరంగాల తలపించు అలివేణి

మృదుమధుర మంజుల వాణీ మధురిమ
వీనుల విందు సేయ నీరజాక్షుడు చెవి ఒగ్గి
వినుచుండే నీరజాక్షి కువకవ ఆశ్చర్యచకితుడై

గోపికామధుమక్షిక

 పాదముల తాకిడి తెలియనీయకనే 
మధుపం పద్మపరాగపు మధువు గ్రోలి
నటుల గోపికామధుమక్షిక సర్వాంతర్యామికి 
రహస్యము చెప్పబోవు నెపమున గోవిందపద్మపు  
అధర మధువు గ్రోలు ముచ్చట తీర్చుకునే నేర్పున