Monday, December 23, 2024

స్నేహితుడా

 


చెలికాండ్రు గోపబాలక సమూహముతో అచ్చట 
ముచ్చటలాడుతూ వనములందు వారు తెచ్చిన 
చద్దిఅన్నము అదరమున ఆరగించితివి 

హితుడవని విశ్వసించి నీ చెంత చేరిన సుధాముని 
చేలమున దాగిన అటుకులు ప్రీతితో గుప్పెడు  స్వీకరించి 
 సిరిసంపదలు అడగకనే అపారముగా ఒసగితివి 

ప్రియసఖుడగు ఫల్గుణి రధసారధివై 
భీష్మద్రోణాది భీకర మకరములతో 
ఉప్పెనలా వచ్చిన కౌరవ సేనా సాగరమును 
ఒడుపుగా దాటించి ఆత్మబంధువై నిలిచివుంటివి 


హితుడవని ఆత్మీయుడవని నమ్మి 
నీ పాద పద్మములు మా హృదిని 
నిలిపితిమి లక్ష్మికిరణుల ఆర్తి నెఱింగి 
ఆప్తుడవై నీ స్నేహ మాధుర్యము రుచి 
చూపవయా గోపీజనవల్లభా గోవిందా 

Saturday, December 21, 2024

ముకుందమాలా స్తోత్రం-10

 

వ్యామోహ ప్రశమౌషదం మునిమనోవృత్తి ప్రవృత్త్యౌషధం
దైత్యేంద్రార్తికరౌషధం త్రిభువనీ సంజీవనై కౌషధమ్ ।
భక్తాత్యన్తహితౌషధం భవభయప్రధ్వంసనై కౌషధం
శ్రేయఃప్రాప్తికరౌషధం పిబ మనః శ్రీకృష్ణదివ్యౌషధమ్ ॥ ౨౪ ॥

 వ్యామోహం నుండి చిత్తశాంతి  నొసగు  ఔషధం  

ముని పుంగవుల చిత్త  ఏకాగ్రత నొసగు  ఔషధం

దానవ  చక్రవర్తులను నియంత్రించు  ఔషధం

ముల్లోకాలకు  జీవమొసగు  ఔషధం

భక్తులకు హితమొనర్చు  ఔషధం

సంసార భయాలను తొలగించు  ఔషధం  

శ్రేయస్సు నొసగు  ఔషధం  

ఓ మనసా  ! తనవితీరా  ఆస్వాదించు

శ్రీకృష్ణ  దివ్యౌషధం


ఇదం శరీరం పరిణామపేశలం
పతత్యవశ్యం శ్లధసంధిజర్జరం
కిమౌషధై: క్లిశ్యసి మూఢ దుర్మతే
నిరామయం కృష్ణరసాయనం పిబ//

ఈ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది

కండరాలు అరిగి నొప్పికి గురి అవుతాయి

ఏదో ఒకరోజు పండుటాకులా రాలిపోతుంది

ఓ  అమాయకుడా ! నయం చేయలేని నానా రకాల మందుల

వెదుకులాట మానుకో  దివ్యమైన అమృతమయమైన  

శ్రీకృష్ణ  నామౌషధాన్ని  మనసారా  త్రాగుము


కృష్ణో రక్షతు నో జగత్త్రయ గురు: కృష్ణం నమస్యామ్యహం
కృష్ణేనామరశత్రవో వినిహితా: కృష్ణాయ తుభ్యం నమ:
కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం

 

కృష్ణుడు జగద్గురువు  కృష్ణుడు  సర్వలోక రక్షకుడు

కనుక ఎల్లప్పుడూ కృష్ణుని పాదాలని ఆశ్రయించేదను  

లోకం లోని మన శత్రువులను నిర్జించి కృష్ణుడు మనలను  

కాపాడును .కృష్ణా  నీకు నమస్కారము

కృష్ణుని నుండే అన్ని  జగములు పుట్టుచున్నవి

జగములన్నియు  క్రిష్ణునిలోనే  ఇమిడియున్నవి

కృష్ణా ! నేను  నీ  దాసుడను

ఎల్లప్పుడూ  నా  రక్షణాభారం వహించు

Friday, December 20, 2024

ముకుందమాలా స్తోత్రం-9

 


తత్త్వం బ్రువాణాని పరం పరస్మాత్
మధు క్షరన్తీవ సతాం ఫలాని ।
ప్రావర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే
నామాని నారాయణ గోచరాణి ॥ ౩౦ ॥

ఓ  నాలుకా  ! చేతులు  జోడించి వేడుకొనుచుంటిని

తేనే  వలె చవులూరించు పరమ సత్యమైన పలువిధముల 

నారాయణ  నామామృతాన్ని  పదే  పదే  చప్పరించు

మనసుకు ఆహ్లాదాన్ని కలిగించు


నమామి నారాయణపాదపంకజం
కరోమి నారాయణపూజనం సదా ।
వదామి నారాయణనామ నిర్మలం
స్మరామి నారాయణతత్త్వమవ్యయమ్ ॥ ౩౫ ॥

నారాయణా  ! నీ  పాద పంకజమునకు  నా  నమస్సులు

నారాయణా  ! సదా  నీ  పూజలో  పరవశించెదను  

నారాయణా  ! నీ  నిర్మల  నామాలను నిత్యం  స్మరించెదను

నారాయణా  ! నీ  తత్వాన్నే  ధ్యానించెదను  


శ్రీనాథ నారాయణ వాసుదేవ
శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణే ।
శ్రీపద్మనాభాచ్యుత కైటభారే
శ్రీరామ పద్మాక్ష హరే మురారే ॥ ౩౬ ॥

అనంత వైకుంఠ ముకుంద కృష్ణ

గోవింద దామోదర మాధవేతి ।
వక్తుం సమర్థోఽపి న వక్తి కశ్చిత్
అహో జనానాం వ్యసనాభిముఖ్యమ్ ॥ ౩౭ ॥

శ్రీనాధా   నారాయణా  వాసుదేవా

శ్రీకృష్ణా  భక్త ప్రియా  చక్రపాణీ 

శ్రీ పద్మనాభ  అచ్యుతా  కైటభారి

శ్రీరామ  పద్మాక్షా  హరీ  మురారీ

 

 అనంతా   గోవర్ధనగిరిధారీ   ముకుందా  

కృష్ణా  గోవిందా  దామోదరా  మాధవా

ఎట్టివారలమైనను ఎ ఒక్క  నామమైనను

స్మరించవచ్చు  కాని  ఏది  స్మరించలేక

 ప్రమాదముల వైపు  పరుగెడుచున్నాము

Thursday, December 19, 2024

ముకుందమాలా స్తోత్రం-8

 

అమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం
మేదశ్ఛేదఫలాని పూర్తవిధయః సర్వే హుతం భస్మని ।
తీర్థానామవగాహనాని చ గజస్నానం వినా యత్పద-
ద్వంద్వామ్భోరుహసంస్మృతిర్విజయతే దేవః స నారాయణః ॥ ౨౫ ॥

ముకుందా ! నీ పాదస్మరణ  లేని

 పవిత్ర నామ  ఉచ్చారణ  అడవిలో  రోదన  వంటిది

వేదకార్యాల  నిర్వహణ  శారీరిక  శ్రమను  మాత్రమే  మిగుల్చును

యజ్ఞాయాగాదులు  బూడిదలో  నేయి  కలిపిన చందము

పుణ్యనది  స్నానం  గజస్నానం  వలె         నిష్ఫలము 

 కనుక  నారాయణా  నీకు  జయము  జయము



మదన పరిహర స్థితిం మదీయే
మనసి ముకుందపదారవిందధామ్ని ।
హరనయనకృశానునా కృశోఽసి
స్మరసి న చక్రపరాక్రమం మురారేః ॥ ౨౯ ॥



మురారి  పాదాలకు  పీటమైనట్టి   నా  మదిని  

మన్మధుడా ! వీడి  మరలి పొమ్ము

హరుని  కంటిచుపులో  కాలిపోయిన  నీకు

హరి  చక్రపు  మహోగ్ర  తీక్ష్ణత తెలియకున్నది



మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే
మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ ।
త్వద్భృత్యభృత్యపరిచారకభృత్యభృత్య-
భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ ॥ ౨౭ ॥


ఓ  లోకనాధా  ! నీ  పాదదాసుల  యొక్క  సేవక  సమూహానికి
సేవకులైన  వారి  సేవకులకు  నన్ను   సేవకుడిగా  పుట్టించు
మధు  కైటభులను  నిర్జించిన  హరీ  ! నీ నుండి  నే కోరు వరము
నా  జీవితానికి అర్ధమొసగు ఫలము అదియే  సుమా

Wednesday, December 18, 2024

 పక్షుల కిలకిల సవ్వడులు సందడి చేయువేళ

లేగల అంబారావముల సంబరములు మిన్నంటు వేళ
తూరుపుకాంత నిదురమబ్బు చెదరగొడుతూ
ప్రసరించు బాలభానుని లేత ఎరుపు సిగ్గుమొగ్గలు
తాకి విప్పారిన నవకమల కన్యకలా

గోపికాలక్ష్మీ చేతి కంకణముల గలగలలతో సంగమించిన
చిలకబడు పెరుగు సుకారములు చేయు మధుర ధ్వనుల తరంగాలు చెవులు తాకగా నిదుర నెరుగని నంద నందనుడు నిదుర వీడి బుడి బుడి
అడుగులతో నడచివచ్చి కవ్వము పట్టి కలువ కనుల జాలువార్చిన ప్రేమ జల్లులు తాకి ఝల్లుమనే గోపికాలక్ష్మీహృదయం 
ఆ పులకింత నిత్యనూతనం కావాలను తలంపు మది నిండగా

Tuesday, December 17, 2024

ముకుందమాలా స్తోత్రం-7

 


హే మర్త్యాః పరమం హితం శ్రుణుత వో వక్ష్యామి సంక్షేపతః

సంసారార్ణవమాపదూర్మిబహులం సమ్యక్ ప్రవిశ్య స్థితాః ।

నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం-
మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహుః ॥ ౧౮ ॥


దురదృష్టమనే  అలలతో  కూడిన  సంసార సాగరంలో

అటునిటు  త్రోయబడుచున్న నరులార! 

 చిరుమాట  వినండి జ్ఞానఫలం  కోసం  నిష్ఫల యత్నాలు  

వీడి ఓం  నారాయణా  నామజపం  తో  ముకుందుని  పాదాల పై  

 మోకరిల్లండి


నాథే నః పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతసా
సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్ఠతి ।
యం కంచిత్పురుషాధమం కతిపయగ్రామేశమల్పార్థదం
సేవాయై మృగయామహే నరమహో మూఢా వరాకా వయమ్ ॥ ౨౮ ॥


 ఎంత  అవివేకులము  సుమీ  !

పురుషోత్తముడు  ముల్లోకాలకు  అధిపతి

శ్వాసను  నియంత్రించిన  మాత్రాన  అధినుడగునట్టివాడు  

స్వయంగా  మన  చెంతకు  రానుండగా ,

 తనవన్ని  మనకు  పంచనుండగా

అధములైనట్టి  రాజులను  యజమానులను

అల్పమైన  కోర్కెల   కోసం  ఆశ్రయించుచున్నాము



బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైః సరోమోద్గమైః
కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణబాష్పాంబునా ।
నిత్యం త్వచ్చరణారవిందయుగళధ్యానామృతాస్వాదినాం
అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితమ్ ॥ ౨౦ ॥



ముకుళిత  హస్తాలతో  వినమ్రతతో  వంగిన  శిరస్సుతో

 రోమాంచిత  దేహంతో  గద్గద  స్వరంతో  కృష్ణ  నామాన్ని  

పదే  పదే స్మరిద్దాం  సజల  నేత్రాలతో  నారాయణుని  

వేడుకుందాం   ఓ  సరోజ పత్ర  నేత్రా  …..ఎర్ర  తామరలను  బోలిన  

నీ  పాదద్వయం  నుండి జాలువారు అమృతం  సేవించుచు మా జీవనం  కొనసాగించు  భాగ్యం  కలిగించు 

Monday, December 16, 2024

ముకుందమాలా స్తోత్రం-6



 హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే
హే కంసాంతక హే గజేంద్రకరుణాపారీణ హే మాధవ ।
హే రామానుజ హే జగత్త్రయగురో హే పుండరీకాక్ష మాం
హే గోపీజననాథ పాలయ పరం జానామి న త్వాం వినా ॥ ౨౧ ॥

హే  గోపాలక  ,హే  కృపా జలనిదే ,హే  సింధు కన్యా పతే
హే  కంసాంతక  ,హే  గజేంద్ర  కరుణాపారీణా , హే  మాధవ
హే  రామానుజ  ,హే  జగత్త్రయ గురో  ,హే  పుండరీకాక్ష

హే  గోపీజన వల్లభా  నాకు  తెలుసు నీవు తక్క వేరెవ్వరు లేరు

కనుక ఎల్లప్పుడూ నన్ను రక్షించు



భక్తాపాయభుజంగగారుడమణిస్త్రైలోక్యరక్షామణిః
గోపీలోచనచాతకాంబుదమణిః సౌందర్యముద్రామణిః ।
యః కాంతామణిరుక్మిణీఘనకుచద్వంద్వైకభూషామణిః
శ్రేయో దేవశిఖామణిర్దిశతు నో గోపాలచూడామణిః ॥ ౨౨ ॥

భక్తుల  అపాయాలనే సర్పాల పాలిట  గరుడమణి

ముల్లోకాలకు  రక్షామణి  

గోపికల కనులను ఆకర్షించు చాతకమణి

సౌందర్య  ముద్రామణి  

కాంతలలో  మణిపూస యగు రుక్మిణి  కి  భూషణ మణి

అగు దేవ శిఖామణి  గోపాలా !  మాకు  దోవ చూపు

 

శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్యసంపూజ్యమంత్రం
సంసారోత్తారమంత్రం సముచితతమసః సంఘనిర్యాణమంత్రమ్ ।
సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగసందష్టసంత్రాణమంత్రం
జిహ్వే శ్రీకృష్ణమంత్రం జప జప సతతం జన్మసాఫల్యమంత్రమ్ ॥ ౨౩ ॥

శత్రువులను  నిర్మూలించు మంత్రం
  ఉపనిషత్తులచే  కీర్తించబడిన మంత్రం


  సంసార భందాలను త్రెంచివేయు  మంత్రం
  అజ్ఞాన అంధకారం తొలగించు మంత్రం
  సకల ఐశ్వర్యాలు  ప్రసాదించు మంత్రం
  ఈతి బాధలనే  పాముకాట్లనుండి  రక్షించు మంత్రం
  ఓ  నాలుకా  ! పదే  పదే  జపించు  జన్మసాఫల్యత నొసగు   
  మంత్రం  శ్రీకృష్ణ మంత్రం