Thursday, March 6, 2014

భజ గోవిందం

మరణ కాలం చేరువైన వేళ 
వ్యాకరణ జ్ఞానం నిను చేదలేదు  
గోవిందుడినే స్మరించు గోవిందుడినే స్మరించు
ఓ మూఢమతీ గోవిందుడినే స్మరించు 

ధనాశ  వీడి సత్కర్మ ఫలమున 
దొరికిన మితఫలమే హితమని 
సంతుష్టి తో జీవన యానం సాగించు 

గోవిందుడినే స్మరించు గోవిందుడినే స్మరించు
ఓ మూఢమతీ గోవిందుడినే స్మరించు 

అతివల ఘన హృదయ సౌందర్యానికి 
వసుడవు కాబోకు నునుపైన తోలు తొడిగిన 
రక్త మాంసపు ముద్దని మరల మరల తలుచుకో   // గోవిందుడినే స్మరించు //

చంచలమీ జీవితం చపలమగు  బుద్ధి 
నా అను అహంకారం రోగభరిత శరీరం 
కలగలిసిన సోకమయమే ఈ లోకం                 // గోవిందుడినే స్మరించు //

చేతిలో కాసులు గల గల లాడినంతకాలం 
బంధు జనుల సందోహం తో గృహము కళ కళ లాడు 
వయసుడిగి చేతులు ఖాళీ అయినవేళ 
కానరారు కనులకెదురుగా అయిన వారెవరూ   // గోవిందుడినే స్మరించు //

కాయం కదులుతున్నంత కాలం కుశల మడుగుదురెల్లరును 
కదలిక లాగి కట్టె బిగిసిన వేళ దరి చేరరు భయముతో భార్యా బిడ్డలును   // గోవిందుడినే స్మరించు //

ఆట పాటలతో బాల్యము కాంతా కనకపు మొహమున యవ్వనము 
ముగింపు లేని పలు చింతలతో ముదిమి కరిగిపోవు కాని విడువక 
గోవింద స్మరణ చేయు నరులెవ్వరు లోకంలో      // గోవిందుడినే స్మరించు //       
    
 ఆలు బిడ్డలను చింతలు మాని నా దను మోహము వీడి చిత్రమగు జీవన 
చిత్రపు లోతులు తరచి తరచి చూచిన తత్వం తెలియనగు సోదరా   // గోవిందుడినే స్మరించు //

సత్సాంగత్యమున అబ్బును నిస్సంగత్వం 
నిస్సంగత్వ మిచ్చును నిర్మోహత్వం 
నిర్మొహత్వముతొ కలుగు నిశ్చలతత్వం 
నిశ్చలతత్వమున దొరకు జీవన్ముక్తి కి త్రోవ   // గోవిందుడినే స్మరించు //

శుష్క శరీరము కామ వికారము నొందునా 
జలం శోషించిన సరస్సు లందుమా 
విత్తం పోయిన పరివారం మిగులునా 
తత్వం తెలిసిన సంసార మోహముండునా  // గోవిందుడినే స్మరించు //

ధన జన యవ్వన గర్వం తొలగించును కాలం  క్షణ కాలంబున
 అనిత్యమౌ మాయా లోకపు బ్రాంతిని విడచి 
నిత్యసత్యమౌ బ్రహ్మపధంబు చేర వేగిరపడుమా  // గోవిందుడినే స్మరించు //


 దివా రాత్రములు రుతు చక్రములు మరల మరల మరలి   వచ్చు 
కాలము ఆయుష్కాలము కదలి పోవు కాని మరలి రావని నిజంబెరిగియు 
ఆశా పాశములు తెంచ బోడు మానవుడు    // గోవిందుడినే స్మరించు //

సతీ విత్తములపై చిత్తము వీడి సత్సాంగత్యమను నౌకను చేరు 
భవ జలధి ని దాటించి భవహరుని దరి చేర్చు   // గోవిందుడినే స్మరించు //

శిరో ముండనం కాషాయాడంబరం  జటాధారణం 
కనులుండి కనలేని మూఢులు కట్టెదరు  పొట్ట కూటికై బహుకృత వేషం         // గోవిందుడినే స్మరించు //

 నల్లని కురులు పాల పొంగాయే బోసి నోటిలో మాట తడబడే 
వెన్ను వంగిపోయే చేతి కర్ర ఊతమాయె అయినను ఆశల మూట బరువెక్కదాయే   // గోవిందుడినే స్మరించు //

వృక్ష మూలమున విశ్రాంతి  దోసిలి భిక్ష తో ఉదర పోషణ 
శీతొష్ణముల తో సహవాసమున్నా మది మాత్రం ఆశల బంధీనే హన్నా   // గోవిందుడినే స్మరించు //

కోటి తీర్ధ స్నానము  వేల వ్రతా చరణము 
శక్తి  కొలది దానము చేర్చలేవు ముక్తి ధామము 
ఆత్మజ్ఞాన మించుకైన అబ్బనిచో   // గోవిందుడినే స్మరించు //
       
గుడి ప్రాంగణములు చెట్టు మొదళ్ళే ఆవాసములు 
రాతి నేలలే పట్టుపరుపులు జంతు చర్మములే పట్టు వస్త్రములుగా 
తలంచు జ్ఞాన విరాగి సుఖములు పొందకుండునే   // గోవిందుడినే స్మరించు //

యోగి యైనను పరమ భోగి యైనను 
ఏకాకి కాని సరాగి కాని నిరతము  
గోవింద స్మరణ చేయువాడే నిత్య సంతోషి   // గోవిందుడినే స్మరించు //

భగవద్ గీతా పారాయణం గంగాజల పానం 
మురారి నామ స్మరణం అనుదినము కొలది 
మాత్రము చేసిన కాలునితో కలహమెక్కడ   // గోవిందుడినే స్మరించు //

దుర్భర గర్భావాసం చావు పుట్టుకల చక్ర బ్రమణం 
తప్పించుకొన సాధ్యమా మానవులకు  
మురారి నీ కృప లేకను  // గోవిందుడినే స్మరించు //

దొరకిన గుడ్డ పీలికల గోచి కట్టి 
పాప పుణ్యముల చింతన మాని 
యోగమందు మనస్సు నిలిపే యోగి 
పిచ్చి వానివలె ఆత్మానందము నొందు  // గోవిందుడినే స్మరించు //

నీవెవరు నేనెవరు తల్లి తండ్రు లెవరు 
ఎటు నుండి ఎటుకు పయనం 
చింతన చేసిన లోకమెల్ల సార హీనమని 
స్వప్న సదృశ్యమని  సత్యము తెలియు   // గోవిందుడినే స్మరించు //

నీలో నాలో సకల జీవులలో నిండినది ఒకే 
విష్ణు తత్వమని తెలిసిన వేళ అకారణము నైనను 
సకారణము నైనను అసహనముండదు అన్యులపై 
మోక్షము కోరితివా సమబుద్ది ని సాధించు  // గోవిందుడినే స్మరించు //

శత్రువుతో పుత్రునితో భందువుతో 
నెయ్యమైనను కయ్యమైనను నెరపబొకు 
సర్వులలో ఏకాత్మ ను దర్శించి 
అన్నివేళలా అభేదం పాటించు  // గోవిందుడినే స్మరించు //

కామం క్రోధం లోభం మొహం విడచిన మనలో 
మనకు హరి స్వరూపమగుపించు 
ఆత్మజ్ఞానమొందని వారు నరక వాసులై నశించు  // గోవిందుడినే స్మరించు //

గీతా నామ సహస్రముల గాన మాలపించు 
శ్రీహరి రూపమే ధ్యానించు 
సజ్జన సాంగత్యం వైపుకు మనసును మళ్ళించు 
దీన జనుల కొరకు ధనమును వెచ్చించు  // గోవిందుడినే స్మరించు //

కామిని కూడికతో సుఖ పడు కాయం 
తత్ఫలముగా  వ్యాధులతో వెతల్ పాలగు 
మరణం తధ్యమని తెలిసీ వదలడు పాపాచరణం  // గోవిందుడినే స్మరించు //

ధనవంతుడు బిడ్డలతోనూ భీతి నొందు 
సంపద నొసగదు యించుక నిజ సౌఖ్యం 
యిది లోక రీతి తెలిసి విత్తము పై చిత్తము విడనాడు  // గోవిందుడినే స్మరించు //

శ్వాసను నియమించి విషయ వాసనల నుండి మనసు తొలగించు 
నిత్యానిత్య విచారం సమాధి స్థితిలో నామ జపం క్రమ పద్దతిలో కొనసాగించు   // గోవిందుడినే స్మరించు //

గురు  పాదములే రక్షయని తెలిసిన వాడా! మనస్సేంద్రియములను నియంత్రిచు 
జనన మరణ చక్రము దాటి నీలో నిలచిన పరమాత్మను దర్శించు 

గోవిందుడినే స్మరించు గోవిందుడినే స్మరించు
ఓ మూఢమతీ గోవిందుడినే స్మరించు 

(శంకర భగవత్పాదుల భజ గోవిందం నకు ఓ అవివేకి అనుసరణ)

1 comment:

Anonymous said...

Mantri paalem ante maa Hindi maastaari vooru........krishna jillaa nidumolu laakula daggara. Abba mallee choosthamaa aa voollu?