Friday, February 15, 2013

హరి హర ! ఓ చిన్న విన్నపం

హర నాలోని అహంకారాన్ని నీవు స్వీకరించు వినయమనే అమృత బిందువులు నాకు అందించు హరి సంసారమనే సముద్రంలో నీవు విహరించు శాంతం అనే సౌధంలో నన్నుంచు శివ నాలోని మదనుడిని నీవు తీసుకో నీ వైరాగ్య భావన నాకు ఇవ్వు క్రిష్ణ నాలోని అరిషడ్ వర్గమనే ఆరు తలల పాముపై నీవు నాట్యమాడు నీ పాద పద్మముల మకరందం గ్రోలు మనస్సునివ్వు శంభు: అమంగళ మగు ఆలోచనలను హరించు మంగళకరమగు ఆలోచనలను ప్రేరేపించు ధరణీధర సకల జీవులలో నిన్నే కాంచు కనులనివ్వు మా భారం వహించు మమ్మను అనుగ్రహించు

Thursday, February 7, 2013

నీ పాద పద్మముల వైపు నా గమ్యం గమనం

నూనూగు మీసాల నూత్న యవ్వన కాలం నుండి నడి సంధ్యకు కాయం కదిలినా ఊహల సౌందర్య లోకం నుండి అనుభవాల రాపిడిలో కాయం పండినా మనసు మాత్రం పచ్చితనం వీడలేదు పుండరీక వరదా !
అలవికాని ఆలోచనలతో సతమతమవుతూ అందుకోరాని వాటికి ఆరాటపడుతూ ఉహాలోకంలో విహరిస్తూ వాస్తవంలో నిట్టూరుస్తూ నీ ఉనికిని మరచి కల్లోల జగత్తులో కాయం కరిగిపోతున్నది అజామిళోద్దారక ! పూల మకరందం కోసం అర్రులు చాచు తుమ్మేదలవలె దీపపు కాంతుల వైపు పరుగులుతీయు చిమ్మెటల వలే కాంతా కనకాదులకై పరితపిస్తూ శాంతిని విడచి విలపిస్తూ పట్టవలసిన నీ పాదాలు పట్టలేక పతిత తీరాల వైపు పయనిస్తున్నది పురుషోత్తమా ! ఇంతటి కారు చీకటిలో కల్లోల కడలికి ఆవలి వైపున మిరుమిట్లు గొలిపే ఆశా దీపం వెలిగిపోతున్నది తరచి తరచి చూచిన మది కాంచెను కనకపు కాంతులతో లలిత లావణ్య ముగ్ద మనోహరం గా ప్రకాశిస్తున్న నీ పాద పద్మం భక్తి అనే పడవలో నీ నామమనే తెడ్డు ఊతంగా ఇచ్చి నా గమ్యం గమనం నీ వైపుకు త్రిప్పుకో పద్మ నాభుడా !

Wednesday, February 6, 2013

అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు


అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు నును సిగ్గుల ఎరుపెక్కే చెలి చెక్కిలి ఆనవాలు ముద్ద మందారపు మాటున చిక్కేనిదిగో అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు వలపుల గాలం విసిరే నీ వాలు కనుల సోయగం మత్స్యకన్య కంటి మెరుపులో కనబడేనిదిగో అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు ముత్యపు మెరుపుల వరుసను ప్రతిఫలించె నీ నవ్వుల కిలకిలల జాడ గలగలా సాగే సెలయేటి సవ్వడులలో దొరికేనిదిగో
అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు హొయలొలికించె నెచ్చెలి నడక వాన మబ్బుకు మురిసి నాట్యమాడే నెమలి నడకలో దాగేనిదిగో అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు పిరుదులపై నాట్యమాడే నీలి కురుల వలపు పాశం బుస కొట్టే నాగు పడగలో నవ్వేనిదిగో అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు చమట గంధం అలుముకున్న నీ దేహ సౌరభం మల్లెల పరిమళాల లో ఒదిగెనిదిగొ అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు నీ ఆనవాలుకై అచట నిచట వెదికి అలసిన మది నా గుండె గూటిలో ఒదిగిన నిన్ను చూసి సేదతీరేనిదిగో

Tuesday, January 29, 2013

హే క్రిష్ణా

హే క్రిష్ణా నా మనసమనే మడుగులోకి దూకేదెన్నడో కాముడనే కాళిందిని మదించుటెప్పుడొ కాలం కాయం కరిగిపోతున్నవి కాని నా మనసు మాత్రం నీ పాదాలను పట్టలేకున్నది నీవు నిత్యమూ సత్యము అన్న నిజం తెలిసిన అలుసేమో నీ పట్ల ఇవి తాత్కాలికము అశాశ్వతము అనే భయమూ పొతే దొరకవేమొనన్నా బెంగ నిన్ను ఇప్పుడు కాకపొతే ఇంకేపుడైనా పట్టుకొవచ్చులేనన్న అలసత్వం
ఆనందానికి ఆనందపు బ్రాంతి కి తేడా తెలుసుకోలేని మూర్ఖత్వం నీ పాదపద్మపు మకరందం గ్రోలలేని నిస్సార జీవన గమనం లోకి నన్ను నేట్టివేస్తున్నవి క్రిష్ణా నీవు మాత్రం నీ దయావర్షాన్ని నాపై కురిపించాటాన్ని వాయిదా వేయబోకు వెన్నుకు దన్నుగా నిలచిన నీ చైతన్యాన్ని హృదయాన్ని తాకకుండా హృదయ పద్మం వికసించకుండా చేయటంలో కామ సర్పం సఫలమైతే దాని నల్లని గరళం శరీరమంతా వ్యాపించకుండా నల్లనయ్య పాదాలను పట్టుకోవటంలో బుద్ధి విఫలమైనది వ్యాధులతో శరీరం వ్యాకులతతో మనసు సతమతమవుతున్నా మాయతో కప్పబడిన బుధ్ధి నిన్ను స్మరించలేకున్నది నిన్ను వదలి మలిన దేహాలవైపు పరుగులుతీస్తున్నది మాయకు సోదరుడవు మాయాతీతుడవు మాయతో కప్పబడిన మా మనస్సనే యమునలో విహరించు మాయను ఛేదించు ఈ దేహాన్ని బృందావనం చేయి నీ ప్రేరణతో ఉదరం లో ఉద్భవించే అక్షరాలను పారిజాతాలుగా ధరించు ఉపిరి లో వేణుగానాలను ఆస్వాదించు ఉచ్చ్వాస నిశ్వాస లలో ఊయల లూగు నా కంటి పాపలనే కాంతులీను మణులుగా ధరించు నన్నుద్ధరించు ఉద్దవ బాంధవా

Thursday, December 6, 2012

అజ్ఞాతవాసి

ఓ అజ్ఞాతవాసి జ్ఞాతం లోకి పయనించు పలకరింపులనే తొలకరింపులను మాపై చిలకరింపు ఎదురుచూపులతో ఎండిన కనులకోలనులలో కలువలు పూయించు ఓ అజ్ఞాతవాసి జ్ఞాతం లోకి పయనించు తడి తడి తళుకులతో అలరారు లేలేత చిగురుటాకుల పెదవులపై చిరునవ్వులు కురిపించు ఆప్తుని ఆదరం లేక అవిసిపోయిన అధరాలపై ఆనందపు జల్లులు కురిపించు
ఓ అజ్ఞాతవాసి జ్ఞాతం లోకి పయనించు జ్ఞాపకాల దొంతరలను కదిలించి తీపి గురతుల ఆనవాళ్ళను పెకలించి మోడువారిన గుండె గూటిలో నీ చిలిపి అల్లరుల చిరుగజ్జెలు మోగించు ఓ అజ్ఞాతవాసి జ్ఞాతం లోకి పయనించు చేతిలో చేతిని కలిపి చూపులో చూపుని నిలిపి నీడను కాను నీలో సగాన్ని అని నాలో నిలిచిపో

Saturday, November 24, 2012

మాయ చాలా చిన్న పదం చాలా లోతైన పదం అందరికి అనువైన పదం ఎవ్వరికి అంతుబట్టని పదం ఎవ్వరు అతీతులు కాని పదం ఈ జగం లోని జనులందరిచే ఆ జగన్నాటక సూత్రదారి జనార్ధనుడు ఆడించే ఆటకు ఆయువుపట్టు ఈ మాయ మాయ చేతికి చిక్కని వాళ్ళు మాయకు లొంగని వాళ్ళు లోకం లో లేనే లేరు కొందరిని రూప లావణ్యాలతోను లో మరికొందరిని సిరి సంపదల రూపంలోనూ ఇంకొందరిని అధికార దర్పం రూపం లోను , ఇలా నానా రకాల జనులను నానా రకాలుగా మోహ పరచి వారి పలు రకాల వింత చేష్టలను వినోదంగా వీక్షిస్తుందీ మాయ అంతటి శక్తివంతమైంది ఈ మాయ అసలు ఇంతకూ ఏమిటి ఈ మాయ ? ఎవరు ఈ మాయ , ఈ లోకంలో అత్యంత శక్తివంతులెవ్వరు ......ఇంకెవ్వరు.....నారాయణుడు ........నారాయణి ఆ నారాయణి అంశ ......మాయ నారాయణి మరో పేరు దుర్గ మాత తానే మాయా స్వరూపం కనుక దుర్గమ్మ కను సన్నలలో మాయ చరిస్తూ వుంటుంది ఆ నారాయణుడికి సోదరిగా బృందావనంలో మహా మాయగా అవతరించింది కనుక ఆ క్రిష్ణునికి విధేయంగా వుంటుంది సకల శుభదాయకుడు ఆ శివునికి సగమై సర్వమంగళ గా శుభాలు కలిగించేది ఈ దుర్గమ్మ కనుక ఆ మాయ ఈ పరమేష్టిని కూడా చేరదు కనుక మాయను దాటాలంటే మాయాతీతులైన ఈ మువ్వురి ఆరాధన మనకు తప్పనిసరి . అందుకే ముఖ్యమైన మాసాలన్ని కుడా హరి హర పూజకు అనువుగా వుంటాయి. కార్తీకం లో శివ పూజ ఎంతటి విశేషమో దామోదరుడి పూజ కూడా అంతే ఆవశ్యకం హరిహరులను సేవిద్దాం మాయను చేదిద్దాం

Monday, April 5, 2010

మీకు తెలియనిది ఏమున్నది

నారాయణా  మీకు  తెలియనిది  ఏమున్నది

కాల స్వరూపులు , కర్మసాక్షి అయిన  ప్రత్యక్ష సూర్యనారాయణులు

జీవిని  బంధించు త్రిగుణ స్వరూపము మీరే

నరులను తమ చిత్తం వచ్చినట్లు ఆడించు మాయకు యజమానులు

 మీకు  తెలియని  విషయమేమున్నది

 అయినా మీ  పాద పద్మముల  చెంత నిలబడి  నా  వేదన  విన్నవించుకుంటున్నాను

కొంచెం  కరుణా స్వభావం  తో  వినండి

 ఒక్కసారి  నా  జీవితాన్ని వెనుదిరిగి చూస్తే  కాస్త లోకజ్ఞానం తెలసిననాటి  నుండి నేటి వరకు నన్ను వీడక దహించి వేస్తున్న దావాగ్ని నుండి పుట్టిన కొన్ని ఫలాలు

 

తొలినాళ్ళలో మదురమైన ఊహలలో  విహరింపజేసి నేడు  సాధారణ  దాహార్తి  కూడా

తీర్చుకోవటానికి  పనికిరాని ఎండమావుల  పాల్జేసినావు

 

ఆనాడు  దైవ  సమానులైన  గురువు పట్ల కూడని కార్యాన్ని చేయించి

నేడు  ఆ  కర్మ ఫలాన్ని బహు చక్కగా  అనుభవింపచేస్తున్నావు  .

నాకు  తెలుసులే  కృష్ణా  నీకు  అర్ధమయ్యిందని  మరి  వివరంగా చెప్పించాలనుకోకు  

 చదువును పక్కన పెట్టి పెద్దల నమ్మకాన్ని వమ్ము చేసి నాడు సాగించిన ఘనకార్యపు ఫలితం నేడు నమ్మి చేయి పుచ్చుకున్నవారికి తీరని వేదనగా మారి పరిహాసించుచున్నది పరంధామా

 

పరమపవిత్రమైన ధామంలో  నీ పాద పద్మముల చెంత కనులు ముసుకుపోయి ప్రవర్తించిన ఫలం నేడు నా జీవితాన్ని అపహాస్యం చేస్తున్నది కృష్ణా

 

ఏనాటి కర్మఫలమో నేడు ఇతరుల ధనం పట్ల తీరని ఆసక్తిని కలిగించి

అగ్ని చేత ఆకర్షించబడిన మిణుగురులు దహించుకుపోయినట్లుగా నా  జీవితాన్ని

దగ్ధం చేస్తున్నది  రామా

 

ఇంకా నాడు  రైలు ప్రయాణంలో వృద్దుని  పట్ల  నా తీరు , తల్లి  తండ్రుల  పట్ల  బాధ్యతారాహిత్య  ప్రవర్తన  

 

ఇవన్ని  నారాయణా నీ  కృపతో  నే  సంపాదించిన  ఆస్తులు

ఇక చాలు చాలు  ముకుంద  వీటి  భారమిక  నే మోయలేను

 

నా ఆస్తులన్నిటిని  సర్వ హక్కులతో  నీకు ధారాదత్తం చేస్తున్నాను

బలి  నుండి  మూడడుగుల నేల కోరి తృప్తి పొందిన  వామనా

నా ఈ  కొద్దిపాటి  ఆస్తులను  కూడా  ప్రేమతో  స్వీకరించు


--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA