Tuesday, December 31, 2024

దేహబృందావని

 యోగంబుల చిక్కనివాడు చిక్కెపో

గోపబాండ్ర అమాయకపు ప్రేమకు
ఆటపాటల యందు ఆలింగన సౌఖ్య
మిచ్చుచూ ఇంచుక భావన చేసిన చాలును
గోపాలుర అదృష్టమును ఉల్లము ఝల్లుమనదే


వ్రతముల దక్కనివాడు వనముల వృత్తాకారపు
బంతులు కట్టి చల్ది అన్నపు విందారగించే శౌచ్యాశౌచ్యముల శోధన చేయక లక్ష్మీకిరణుల 
దేహబృందావని పై ఆటలాడగా అరుదెంచవయా
ఆనంద నిలయా యోగ్యాయోగ్యముల కాలయాపన చేయక

Monday, December 30, 2024

ఆలాపన

 వేణుగాన తరంగాలు  వీనుల తాకిన తోడనే 
తడబడిన హృదయాలతో త్వరపడి పరుగులు 
తీసిరి గోపాంగనలు బృందావని వైపు వడివడిగా 
తామున్న తీరును మరచి వేణుగోపాలుని చేర 

వేణువు ఆలాపన ఆలకించగనే అంబారావముల 
పొదుగుల పాలధారలు పొంగించే యిబ్బడిముబ్బడిగా 
సురభి సంతు ఒద్దికగా గోపాలుని చేతులలో ఒదిగే 
లేగలు గంతులు మాని  ప్రకృతియెల్ల పరవశించే 

నిమిషమైన నిలకడగా నీ వేణుగాన స్వర ఝరులు 
ధ్యానించ నానా విధముల గాలుల తాకిడిలో మది
చెదరుచుండె గోవిందుడా నీ వేణుగాన తరంగాల 
లీనమై ఆహ్లాదమొందు అనుభవమీయవయా లక్ష్మీ కిరణులకు 
 

Saturday, December 28, 2024

సుస్మిత వదనమా

 


సుస్మిత వదనమా  మృదుమధుర  దరహాసచంద్రమా 
నీలి వర్ణపు రెక్కలు తొడిగిన మదన మయూఖమా 
అరుణాంబరం దాల్చిన మయూరమా 
నీ నవ్వుల చిరుజల్లులే హరి విల్లులై 
నీ కంటి వెలుగులే కోటి తారకలై 
లేలేత పెదవుల మెరుపులే  హృది ని తాకి 
పరవశింపచేయు తేనె బిందువులై 
అలజడులు రేపుచున్నవి హసిత చంద్రమా 

Friday, December 27, 2024

నవ రూప గురువాయూరప్ప

 


సృష్ట్యాదివి నీవు  సృష్టి అంతము నీవు  ఆది అంతముల 
నడుమ సాగు జీవన యానపు మూల కారణమగు కర్మ 
రూపుడవు నీవు  కర్మ ఫలముల దోషము పరిహరించి 
ఆరోగ్య మీయవే లక్ష్మీకిరణ్  ప్రియభాంధవా   గురువాయూరప్ప 


జల ప్రళయ ఘోష తక్క జీవమేది మిగలని  చోట  చేప
రూపమెత్తి  చుక్కాని పట్టి  సత్య వ్రతుని కాచి వెలుగు రేఖలు
 వెదజల్లిన  మత్స్యరూపధారి  మా పాపములు హరియించి 
ఆరోగ్య మీయవే   లక్ష్మీకిరణ్  ప్రియభాంధవా   గురువాయూరప్ప 

బొటనవ్రేలి ప్రమాణమున బ్రహ్మ నాశిక నుండి బయల్వెడి క్షణ 
కాలంబున సకల భువన ప్రమాణంబు పెరగి నీట మునిగిన నేల 
నుద్ధరించి ధరణీ ధరుడైవితివి యజ్ఞ వరాహ మూర్తి నన్నుద్ధరించి   
ఆరోగ్య మీయవే   లక్ష్మీకిరణ్ ప్రియభాంధవా   గురువాయూరప్ప 

అనంత  జలరాశి జొచ్చి అసురుని వధియించి వేదరాశి ని 
తెచ్చి జీవ జాతికి చైతన్య మిచ్చినాడవు హయగ్రీవుడా నా 
హృదిని జొచ్చి అంధకారము బాపి జ్ఞాన జ్యోతులు వెలిగించి
ఆరోగ్య మీయవే   లక్ష్మీకిరణ్  ప్రియభాంధవా   గురువాయూరప్ప 

మంధర పర్వతము కవ్వము చేసి వాసుకిని తాడుగా చుట్టి
సురాసురులెల్ల పాల సముద్రము చిలుకు వేళ నీట మునుగు 
కవ్వము కుదురు చేయగా కూర్మరూపుడ వైతివి కరుణతోడ
ఆరోగ్య మీయవే   లక్ష్మీకిరణ్ ప్రియభాంధవా   గురువాయూరప్ప 

కలడు కలండని నిశ్చయాత్మక బుద్ధి తో మనో వాక్ కర్మలను 
నీకర్పించిన బాలుని ప్రహ్లాదుని మాట నిజము చేయ స్తంభము
నుండి వెలువడిన నారసింహుడవు నా బుద్దిని నీపై స్థిర పరచి 
ఆరోగ్య మీయవే   లక్ష్మీకిరణ్  ప్రియభాంధవా   గురువాయూరప్ప 

 
వామనుడై మూడడుగులు యాచించి రెండడుగులతో 
ముల్లోకము లాక్రమించిన త్రివిక్రమా  మూడవ అడుగు
 మా  హృదయ పద్మము నందుంచి  త్రిగుణముల గెలిపించి 
ఆరోగ్య మీయవే   లక్ష్మీకిరణ్  ప్రియభాంధవా   గురువాయూరప్ప 

నీ పాద స్పర్శతో పుడమి తల్లి పులకించగా నలు చెరగుల
నడయాడితివి నరుడవై నారాయణా శ్రీరామ నామాంకితుడవై 
నీ నామ స్మరణామృత  ధారలలో  తనువెల్ల తడిసిపోగా   
ఆరోగ్య మీయవే   లక్ష్మీకిరణ్ ప్రియభాంధవా   గురువాయూరప్ప 


క్రిష్ణ క్రిష్ణా యన్నంతనే ఎద పొంగు మది వేణుగాన మాలపించు 
గోవర్ధనమెత్తి గో సమూహము నెల్ల కాచి గోవిన్దుడవైతివి మా మది 
ఆనంద బృందావని చేయగా అహంకార కాళింది  పై తాండవ మాడుచు 
ఆరోగ్య మీయవే   లక్ష్మీకిరణ్  ప్రియభాంధవా   గురువాయూరప్ప 

 సంకటములు హరియించు నీ పాద పద్మముల చూపుతూ
 నిలచితివి  కనులెదుట వేంకట రమణా గోవిందా యనుచు
 కర్మలు నీ పాదార్పితములు చేసి తిరుమల గిరులను చేరగ 
ఆరోగ్య మీయవే   లక్ష్మీకిరణ్  ప్రియభాంధవా   గురువాయూరప్ప 

సాంద్రానందము

 సర్వనిలయుడా సర్వేశ్వరుడు

ఉచ్వాసమై కదలికలకాధారమై
జల తరంగమై జీవనాధారమై
అగ్నియై చైతన్యదీపికయై
శూన్యమై ఆలోచనలకు ఆటపట్టై
వసుధయై ఆత్మకు ఆలంభనమైన కాయమై
అనుక్షణం కలసి అడుగేస్తున్న అందుకోలేక
సతమతమవుతున్న లక్ష్మీకిరణులపై కృప చూప
కదలివచ్చు సాంద్రానందము చేయి
సాచే ఆనందలహరులలో ఓలలాడింప చెలిమితో

పద్మ వనంబయ్యె 

 



పద్మోద్భవి తోడ  పద్మనాభుడు 
పద్మ సరోవర తీరాన కిశోరీ కిశోరులై 
విహరించు వేళ పరవశించిన పుడమి 
గర్భాన అరుణకాంతులతో విప్పారే 
పద్మ సమూహం బొకటి పద్మాక్షి పద్మాక్షులు  
వికసిత పద్మ వదనులై చూచుచుండ 
కాంచిన మా మది పద్మ వనంబయ్యె  
ఓ పద్మనాభ ప్రియా అడుగిడవమ్మా 
ఆదరమున పద్మ నయనంబుల వాని తోడుగా 

Wednesday, December 25, 2024

॥ ముకుందమాలా స్తోత్రం ॥

 


ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం
హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితమ్ ।
సమాహితానాం సతతాభయప్రదం
తే యాంతి సిద్ధిం పరమాం చ వైష్ణవీమ్ ॥ ౩౮ ॥

హృదయ మధ్యమున  పద్మపత్రంలో  

అవ్యయుడు అనంతుడు అయిన విష్ణువు ని నిలిపి

సదా ధ్యానించు వారలకు సకల భయాలు

తొలగి విష్ణుపదం సన్నిహితమవుతున్నది


యస్య ప్రియౌ శ్రుతిధరౌ కవిలోకవీరౌ
మిత్రౌ ద్విజన్మపదపద్మశరావభూతామ్ ।
తేనాంబుజాక్షచరణాంబుజషట్పదేన
రాజ్ఞా కృతా కృతిరియం కులశేఖరేణ ॥ ౪౦ ॥

నా  మిత్రులు జ్ఞాన మూర్తులు

కవిత్వ సామ్రాజ్యంలో రారాజులు

ద్విజోత్తములు (ద్విజన్మవరుడు , పద్మ శరుడు) . 

నేను కులశేఖర చక్రవర్తి  ని

ఈ  పద్య  కుసుమాలు  పద్మాక్షుని

 చరణాంబుజములకు  

భక్తి ప్రపత్తులతో  సమర్పితం


కుంభేపునర్వసౌజాతం కేరళే చోళపట్టణే ।
కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖరమాశ్రయే ॥

పునర్వసు నక్షత్రమందు కౌస్తుభం యొక్క అంశతో 
కేరళ లోని చోళ పురాధీశుడిగా జన్మించిన కుల శేఖరుని 
భక్తితో ఆశ్రయిస్తున్నాను 

ఇతి ముకుందమాలా సంపూర్ణా ॥

కులశేఖరాళ్వార్ గొప్ప రంగనాథ భక్తుడు . శ్రీరంగంలో 
రంగనాథ సేవలో జీవితాన్ని తరింపచేసుకున్నారు ఆయన 
భక్తికి మెచ్చిన శ్రీ  వేంకటేశ్వరుని తన పాదాల చెంత గడపలా 
పడి  వుండి ఎల్లప్పుడూ తనను చూసుకునే భాగ్యం ప్రసాదించమని 
వరం కోరి తిరుమలలో గర్భగుడిలో వెంకట నాథుని ముందున్న గడప 
(దీనినే కులశేఖరపడి గా పిలుస్తారు)గా జీవితం సార్థకం చేసుకున్న
మహనీయుడు . అప్పటినుండే దేవాలయ ప్రవేశం చేసేటపుడు 



గడపాలకు నమస్కరించే సంప్రదాయం మొదలయ్యింది . ఏ మహా భక్తుడు 
ఏ గుడిలో ఏ గడపగా నిలిచి వున్నాడో ...