Friday, February 7, 2025

మురళీవిలాస


 నల్లని  పొడుగైన  ఉంగరాలు  తిరిగిన  ఆ   చిన్ని  కృష్ణుని

కేశాలు  తల్లి  యశోదకు  నయనానందకరం  కాగా
వాటిని  నెమలి  పింఛం  తోను , సువాసనలు  వేదజల్లేడు పూలతోను
అలంకరించి  మురిసిపోతున్నది
 
నవమి  నాటి  చంద్రుని  పోలిన  విశాలమైన  కృష్ణుని  ఫాల  భాగం
బ్రమరాలను  ఆకర్షింపచేయుచున్న  పూల  వలె , చిరుగాలికి  
నుదుటి  పైకి  జారిన ముంగురులతో  గోపికలకు  ముద్దుగొల్పుచున్నది .

 
కృష్ణుని   అధరామృతాన్ని  నింపుకున్న  వేణు  గానం  సమస్త  జీవకోటికి
చైతన్యం  కలిగిస్తున్నది
 
లలితా  లావణ్యమైన  కృష్ణుని  ముఖారవిందం   గోపికల  మనస్సులను
మదనుని  వలపు  బాణాల  తాకిడికి  చలించిపోతున్న  ప్రేమికుల  మనోరధం
వలె  విచలితం  చేస్తున్నది


మురళీవిలాస  ముగ్ధ  ముఖామ్బుజంతో  విరాజిల్లు  చిన్ని  కృష్ణుని
ముఖ  సౌందర్యాన్ని  వీక్షిస్తూ  ముల్లోకాలు  కూడా  అద్బుత  ఆశ్చర్యాలకు
లోనవుతున్నాయి
 
ఎర్రని  దొందపండ్ల  వంటి  లేత  పెదవులపై  మురళి  ని  అటునిటు  విలాసంగా  తిప్పుతూ విశాలమైన  విలోచనాలలో  మదుర  భావనలు  పలికిస్తూ  గోపికలతో  ముచ్చటిస్తున్న  తీరును  చూసి  పరవశులవని    వారెవరైనా  వుంటారా
 
అట్టి  కృష్ణుని  సౌందర్యాన్ని  చూడజాలని  కనులు  నెమలి  పించముపై  అందంగా  తీర్చబడిన  కనులవలె  ఎంత  సుందరములైనప్పటికి  వ్యర్ధములే  కదా

Thursday, February 6, 2025

ఇది కదా జీవితం

 ఇది కదా జీవితం

ఓ రెండెకరాల పొలం
పొలం సరిహద్దుల చుట్టూ సహజ సిద్దమైన గోడలా మధుర రసాలు వూరించు మామిడి చెట్లు
తీయని జలాలతో కూడిన కొబ్బరి చెట్లు
అరెకరపు పొలంలో వరి పంట
అరెకరపు పొలంలో కూరగాయల సాగు

 ఎకరం పొలం మద్య భాగాన లక్ష్మి నారాయణుల ప్రతిరూపం గా ఒకదానినొకటి పెన వేసుకున్న రావి వేప చెట్లు వాటి మొదలుకు చుట్టూ చక్కగా తీర్చి దిద్దబడిన రాతి అరుగు
వాటికి కొద్ది దూరంలో ఓ చిన్ని అందమైన కుటీరం
కుటీరం చుట్టూ సువాసనలు పూయించు సుకుమార పూబాలలు మల్లెలు సన్నజాజులు
ఆ తరువాతి వరుసలో రాజసం ఒలికించు గులాభిలు
ఆ పై ముద్దొచ్చే మందారాలు ముద్దబంతులు

 ఆ ప్రక్కనే సువాసనలు వెదజల్లు సంపెంగలు ఇలా  పలు రకాల పూల  వనం
దాని ప్రక్కగా చిన్ని చెరువు అందులో విరబూసిన తామరలు ఎగసిపడే చేప పిల్లలు
ఒడ్డున పెద్ద మారేడు వృక్షం ఆ చెట్టు నీడలో సేద తీరుతున్న రెండు  కపిల వర్ణపు గోమాతలు

 ఆ ప్రక్కనే చెంగు చెంగున దూకుతున్న లేగ దూడ
 వేప రావి చెట్లకు సమీపంలో అందంగా తీర్చబడిన రాతి మందిరం . ఆ మందిరంలో అందమైన గోమాత విగ్రహం దానిని ఆనుకుని అందాల కృష్ణుడు చేతిలో వేణువు ప్రక్కనే రుక్మిణి మాత  
ఇంత మనోహరమైన ప్రదేశంలో ఆ కుటీరంలో అమృతమూర్తి తోడుగా జీవన యానం సాగించటం
తెల్లవారు ఝామున నిదుర లేచి స్నానాదులు కావించి ఆవు పాలు సేకరించి కృష్ణ మందిరం పరిశుబ్రమ్  చేసి చక్కని సువాసనలు వెదజల్లు పూబాలలను అమృతమూర్తి తో కలసి సేకరించి తాను చక్కగా కట్టిన తులసి మాలను తీసుకుని ఆ పూలతొ తులసి మాలలతో తల్లి తండ్రులైన రుక్మిణి కృష్ణులను నా అమృతమూర్తి చక్కగా అలంకరిస్తుండగా నేను మహానుభావులు విరచించిన కీర్తనలు ఆలాపించి ఆ పై ఆవు పాలను నైవేద్యంగా సమర్పించి
ఆ తదుపరి ఉదర పోషణార్ధం ఆవశ్యకమైన వ్యవసాయం చేయగోరి పొలంలోకి చేరుకుని పంట యోగ క్షేమాలు చూసుకుంటూ మరోప్రక్క కూరగాయల సాగు చూస్తూ సాగి పోతున్న సమయంలో ఎండ వేడిమికి చమట దారలు కక్కుచున్న వేళ వంట పని ముగించుకుని వండిన పదార్ధాలు చేబూని చెంతకు చేరిన అమృతమూర్తి తన పమిట చెంగుతో ప్రేమగా ముఖం తుడిచి భోజనానికి రమ్మన్న వేళ ఇరువురం కలసి కృష్ణుని చెంతకు చేరి ముందు కొంత పదార్ధాన్ని తల్లి తండ్రులకు నివేదించి రావి చెట్టు నీడకు చేరుకుని అమృతమూర్తి తన అమృత హస్తాలతో కొసరి కొసరి తినిపించగా తృప్తిగా త్రేంచి బడలిక తో ఒకింత సమయం అమృతమూర్తి ఒడిలో సేద తీరి తిరిగి కొంత సమయం ఇరువురం ఆ సాగు పనులలో గడిపి తిరిగి సాయం సమయానికి కుటీరం చేరుకొని తిరిగి స్నానాదులు ముగించి కృష్ణుని మందిరం చేరుకుని కొంత తడువు ఆయన పాదాల చెంత గడిపి
తిరిగి కుటీరం చేరుకుని ఆరు బయట నులక మంచం వేసుకుని కుర్చుని వుండగా అల్పాహారం చేబూని చెంతకు చేరిన అమృతమూర్తి తో కలసి కాసేపు కృష్ణుని లీలలను శ్రవణం మననం చేసుకుని ఆ తదుపరి  అందమైన ఆ నీలాకాశం లో తళుకులీను తారకలను చూస్తు ఆ తారకల నడుమ పచ్చగా మెరయు చంద్రుని అందాలు ఆస్వాదిస్తూ ఆ పసిడి వెన్నల కాంతుల్లో మరింత గా బంగారు నిగారింపు తో మెరియు నా నెచ్చెలి అమృతమూర్తి తో కలసి  ......................
ఆహా ఇది కదా జీవితం అర్ధ వంతమైన ఫల వంతమైన జీవితం
కృష్ణా ఈ జన్మలో నే కోల్పోయిన ఈ గొప్ప జీవితాన్ని నాకు తప్పక ప్రసాదిస్తావని నా అమృతమూర్తి తో కలసి ఆ పరిపూర్ణ మైన జీవితం గడిపి నీ పాదాల చెంతకు చేరుకునే అదృష్టాన్ని మా ఇరువురకు ఇస్తావని అచంచలమైన విశ్వాసంతో కాలం గడిపేస్తున్న


Saturday, February 1, 2025

 రమణీయమగు రామకథ ను బాల్యమందు
భావగర్భితముగా నేర్చిన ఫలమదే జాతికి
జవసత్వములొసగు గీత గా కదనరంగమున
ఆవిర్భవించి గోకుల క్రిష్ణుని గీతాచార్యుని చేసే

Thursday, January 30, 2025

సఖ్యభావమున

 గుక్కపట్టిన గోపబాలకుని కంట నీరు గని కలత

చెందిన కలువ కనుల చిన్ని శిశువు చిట్టి చేతుల
చెలికాని చుబుకము పట్టి కంటి చెమ్మ తుడిచి వూరడించే ఎంత భాగ్యమో ఈ గోపకులది




యోగములకు యోగులకు చిక్కని పరబ్రహ్మము
చిక్కె గోపకులకు సఖ్యభావమున రోహిణీకార్తెపు మలయ సమీరంలా శోకముల బాపు ఆత్మబంధు వీతడు లక్ష్మీకిరణల పాలి కులదైవమీతడు

Wednesday, January 29, 2025

 పాల కడలి పై పవళించు పన్నగ శయనుడు 
పాల కుండల దూరి దాగుడు మూత లాడుచు 
తల్లి యశోదకు ముదము గూర్చే భక్త సులభుడన్న  
పెద్దల మాటకు పూనికనిస్తూ పృథ్వి పై ఆటలాడే 

లేత చిగురు పెదవుల హసిత చంద్రికలు పూయ
 కమలపు కనులలో ఆనంద పరాగములు చిలక 
కోమల హస్తముల పాల కుండల దూరనేంచే విశ్వమే 
తానైన విఠలుడు తల్లి యశోదకు   ముదము గూర్చ 

Saturday, January 25, 2025

మనోహరీ

 మనోహరీ

చిరుగాలి తరగల తాకిడికి అలల వలే
కదులాడు కురుల సమూహం
ఎగసి పడే మందాకినీ జలతరంగాల జోరును
ఒడిసి పట్టిన శివుని జటాజుటంలా 
నా మనసు అలలను కొప్పున పట్టి శిరాగ్రమున 
రాణివలే నిలచి హోయల అలలను జాలువార్చుచుండే

సూదంటు చూపుల సందమామ నా అంతరంగమున కలువకొలనులను వికసింప చెసే

గుండెగూటిలో గూడుకట్టిన అనురాగ బంధం విరహాగ్ని వేడిమికి తేనియ పెదవులపై తెరలు
తెరలుగా వెల్లువత్తే

ఫాలాక్షుని ప్రేమభావ వీచికయెకటి నేలకు చేరిన
నెలవంకలా మెరియుచుండే ఈ మనోహరి

అహో
సహజ పరిమళాల నొప్పారు నిగనిగల నల్లని కేశపాశముల కొప్పు కాముని పూలశరముల కుప్ప వలే ఒప్పారుచుండే
పడతి  ఫాలభాగము ఫాలాక్షుని త్రిశూల కాంతులతో   సింధూర వర్ణ శోభను పొందె
కోమలి నల్లకలువ కనుల కోరచూపుల శరముల పరంపర హృదయవీణ ను మీటుచుండె
సంపంగి సొబగుల నాశిక పుటముల లేత ఎరుపుకాంతులు ఎదను గిల్లుచుండె
అలివేణి ప్రేమాధరాల తేనియలు మేఘమాలికలై కమ్మేయుచుండే
ఎర్రమందారమంటి ముగ్ధ మేని ముద్దాడుతూ సిగ్గుమెగ్గలై ఎర్రబారె రుద్రాక్షువులు.          ముక్కంటి మెచ్చిన మనోహరీ నీ రూపం చేయుచుండె మదిలో ఆనందతాండవం

మధుర క్షణం

 నిరంతర ఆలోచన ప్రవాహములే నీ అలంకారపు

 పుష్పమాలికలూ  
ఉచ్ఛ్వాస నిశ్వాసములే ముత్తెపు  ఊయల పందిరి 
భావోద్వేగములే నీ మృష్టాన్న భోజనంబు 

మము కప్పిఉంచు మాయ యే నీ పట్టు పీతాంబరములు 
కనులను ఆకర్షించు విలాసములే నీ రూప లావణ్యములు 
వీనులకు విందు చేయు వాక్ప్రవాహములే నీ మువ్వల సవ్వడులు 
కష్టముల కడలియే పాల సముద్రమని  చేయు కర్మలే నీదు  సేవలని    
మంచి చెడుల వేదన విడచి కలడో లేడో నన్న వూగిసలాట వీడి 
ఈ దేహమే బృందావనమని మా మది యే  నీదు మందిరమని 
నవ ద్వారములే నిను చేరు   నవ విధభక్తిమార్గములని భావన చేసి  
హృదయ పద్మమే ఆత్మ స్వరూపుడగు రాధాకృష్ణుల ఆసనమని 
ఎరుకతోడ నిను కాంచు కనులను ఈ లక్ష్మీకిరణులకొసగి ఊపిరి 
తీయు ప్రతిక్షణం ఓ మధుర క్షణం గా అనుభూతి పొందు 
అదృష్టమీయవయా  సాంద్రానందా  సదానందా