Thursday, October 3, 2024
దేవీ నారాయణీయం ప్రథమ దశకం
దేవీ నారాయణీయం ప్రథమ దశకం 1. విశ్వమంతయు దేనినుండి పుట్టుచున్నదో , ఈ విశ్వమంతయూ దేనిని ఆధారంగా చేసుకుని నిలిచి యున్నదో , మన కంటికి అగుపడు సమస్త విశ్వముకన్న ముందుగా ఏది యున్నదో , మన కంటికి అగుపడు సమస్త విశ్వజాలము నందు అంతర్లీనంగా ఏది ప్రకాశిస్తూవున్నదో, మన మనసు మాట కు అందని అట్టి ఆది పరాశక్తి కి నమస్కారములు
2. ఓ ఆది పరాశక్తి! నీవు స్త్రీ పురుష దేవ అసుర నర భూత మొదలగు జీవజాలముకు చెందిన దానవు కాదు నీకు కర్మ గుణాదులు లేవు . నీవు తుది మొదలు లేనిదానవు కాల గమనం అనుసరించి సంభవించే ఎట్టి మార్పులు నీ దరి చేరవు . ఈ సకల చర అచర జగత్తు యంతయు నీ విభవము ప్రకాశిస్తున్నది
3 తల్లీ నీవు రూప రహిత వైననూ నీ మాయచే ఈ విశ్వమను రంగస్థలమున బహు సుందరమైన నర్తకి రూపం ధరించి నీవు చేయు విశ్వక్రీడా నృత్యమును నీ భక్తులైన వారు బహు ఉత్సుకత తో చూస్తూ ఆ నాట్య భంగిమలయందు లీనమైన మనస్సు కలవారై కొన్ని యుగములను సైతం నిమిషములవలె గడుపుచుంటిరి ఏమి చిత్రమిది !
4 తల్లీ నీవు రూప గుణములకు తగ్గ నామములతో విరాజిల్లుదువు . వివేకులు నిన్ను దేవీ దేవ స్వరూపములతో కాంచుదురు . దేవీ స్వరూపమున భాసిల్లునపుడు ఉమా, లక్ష్మీ , సరస్వతీ మున్నగు నామములు ధరించదువు . దేవ రూపమున భాసిల్లు నపుడు షణ్ముఖ , శివ , అచ్యుత మున్నగు నామములు ధరించుదువు
5 నీవే బ్రహ్మ తల్లియగు శక్తి నీవే విష్ణు నీవే రుద్ర స్వరూపము ఈ జగత్తు అంతటికి మహా రాణి వలే నీ శాసనముల ద్వారా సృష్టి పోషణ సంహారము అనే కార్యములను నిర్వర్తిస్తున్నావు . నీవు తప్ప అన్యమెరుగని నీ భక్తులపై దయావర్షం కురిపించి సంరక్షిస్తున్నావు
6 తల్లి తన సంతతికి శుభములను చేకూర్చు కార్యములు చేయును. వారు పురోగతి పొందినపుడు సంతోషించును వారు జీవితమున వెనుకబడినచో దుఃఖమును పొందును . అట్లే ఈ జగత్తు అంతకు తల్లి అయిన నీవు మాత్రము జీవుల కర్మలకు తగిన ఫలములను ప్రసాదించుచు ఎట్టి దుఃఖ భావనలను కర్మ ఫలములను పొందక నిర్వికారముగా ఉండెదవు .
7. ఓ తల్లీ ఈ జగత్తు అంతయు నీ దయావర్షపు బిందువులతో తడిపెదవు . ఎవరు నీ పాదముల పట్ల నిర్మల భక్తి కలిగివుందురో అట్టివారు చక్కని విత్తనం మొలకెత్తి ఫల పుష్పాదులు యిచ్చినట్లు తమ జీవన గమనంలో ఉద్ధరింపబడుదురు . ఎవరు నీపట్ల విముఖులో వారు చేదు విత్తనం నశించినట్లు నశించిపోదురు . ఓ తల్లీ నీవు నిర్గుణవు , పరిపూర్ణమైన దయాస్వరూపము కల దానవు
8 అమృత సముద్ర మధ్యమున వివిధములైన ప్రాకారాల నడిమి భాగాన మూడు లోకములకు గొడుగువలె నీ నివాస స్థానమైన మణిద్వీపం విరాజిల్లుతూ వున్నది . అమ్మా పార్వతీ ఆ ద్వీపమునందు శ్రీచక్రమున సుస్మితమందహాసారవిందయై వెలుగొందుచుంటివి
9 ఎవరు సిగ్గు విడచి నీ గుణ కీర్తనములు హెచ్చు స్వరముతో చేసెదరో ఎవరు తమను తాము మీపాదాలకు సమర్పించుకుందురో అట్టి వారి పాపములను సూర్యుడు చీకట్లను తరిమి నట్లు తరిమివేసెదవు
10 ఎవరు ఇంద్రియ భోగముల పట్ల నిరాసక్తులై వుంటారో వారు నిన్ను సగుణ నిర్గుణ రూపములుగా తెలిసియుందురు . ఎవరు ఇంద్రియభోగములకు లాలసులై వుందురో వారు నిన్ను తెలుసుకొనలేరు . ఓ తల్లీ ఈ క్షణమే నీ గురించి తెలుసుకొనగోరుతున్నాను . ఈ సంసార దుఃఖములనుండి నన్ను విముక్తుడను చేయి. నీ పాద పద్మముల పట్ల అమితమైన భక్తి ని ప్రసాదించు . ఓ అమ్మా నా రక్షణ భారం వహించు నా కోరికలు నెరవేర్చు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment