Monday, March 31, 2025

సదానందుడు

 శిఖమున పింఛము దాల్చి పీతాంబరములు కట్టి
చందనాదులతో మెరయు దేహముతో గోకులాన  
ఆనంద తరంగాల తేలియాడు సదానందుడు 
వేణుగాన తరం

గాల జగతి కి ఆనందలహరులూదే 

పచ్చని పైరు పైటేసిన

 ముడుచుకున్న నుదుటి కమలాన్ని విప్పార్చే
 నులివెచ్చని తొలి పొద్దు కాంతి రేఖలా 
ఇంకిన కనుల కొలనులో అనురాగపు చిరుజల్లులు 
కురిపించే మేఘమాలికలా 
పొడిబారిన పెదవులపై చిరునగవుల తళుకులద్దు 
తారకల మాలికలా 
 వడగాల్పు సెగలకు కమిలిన దేహాన్ని పులకింపచేయు 


చల్లని చిరుగాలి తరగలా 
పచ్చని పైరు పైటేసిన ప్రకృతి కాంతలా మోమున 
మధువులొలుకుచున్నది హసితచంద్రిక  

Sunday, March 30, 2025

యుగాది /ఉగాది

 యుగాది /ఉగాది 


ఉగాది అనగానే ఉగాది పచ్చడి  పంచాంగ శ్రవణం ప్రత్యేకం 
చాలామందికి తమ రాశి ఫలాల గురించి ఆసక్తి అవి ఆశాజనకం గా
లేకపోతే ఆందోళన వుంటాయి 
మాది సింహరాశి మా రాశి  గురించి ఎప్పటి నుండో ఊదరగొట్టేస్తున్నారు 
అష్టమ శని ఇక వీళ్ళ పని ముగిసిపోయినట్లే అని 
నిజంగా అంత భయపడాల్సిన అవసరం వుందా ! కాలం యొక్క ప్రతికూలత 
తగ్గించుకుని అనుకూలత పొందటానికి వున్న కొన్ని తేలిక మార్గాలు తెలుసుకుందాం 
ఈ సంవత్సరానికి అధిపతి సూర్యభగవానుడు . ప్రత్యక్ష నారాయణుడైన సూర్యునకు 
రోజు శ్రీ సూర్యాయ నమః అని  నమస్కరించుకోవటం ఆదిత్య హృదయం చదువుకోవటం ద్వారా కాలం యొక్క అనుకూలత పొందవచ్చు
ఆదిత్య హృదయం చదవటానికి సుమారు 4.నిమిషాల 25 సెకండ్ల కాలం పడుతుంది
సమయం లేదనటం పెద్ద అబద్దం
శ్రీరాముడు సూర్యవంశ సముద్భవుడు
అమ్మ లలిత భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ
అమ్మ లలిత భానుమండలంలో భగమాలినీ శక్తి రూపంలో వుంటుంది
వార్తా పత్రికల్లొ చదువుతుంటాం వేసవి లో....భానుడి భగ భగ అని ఈ తెలుగు నుడికారం వెనుక మర్మం ఇదే

అట్టి ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానునకు నమస్కరించుకోవటం సర్వశ్రేయోదాయకం

అలాగే లలితా సహస్రనామం అనేక నామాల సమాహారంతో కూడుకుని ఉంటుంది 
అలాంటి నామాల సమాహారం ఓ పూలగుత్తివలె ఆహ్లాదకరంగా ద్రాక్ష గుత్తి వలె 
మధురంగా వుంటుంది . ఒక్కో గుత్తి ఒక్కో ఫలాన్ని అందిస్తుంది 

అందులోని ఒక గుత్తి : శ్రీమాత్రే నమః 
భవదావసుధావృష్టి: =సంసారమనెడి దావాగ్ని ని శాంతింపచేయు అమృతవర్ష స్వరూపరాలు 
పాపారణ్యదవానలా =పాపమనెడి అరణ్యమును దహించివేయు దావాగ్ని 
దౌర్భాగ్యతూలవాతూలా=దౌర్భాగ్య
మనెడి దూది ని చెదరగొట్టు సుడిగాలి వంటిది 
జరాధ్వాంతరవిప్రభా  =ముసలితనము యొక్క భాధలను తొలగించు సూర్యకాంతి వంటిది
భాగ్యభ్దిచంద్రికా = భాగ్యములనెడి సముద్రమును పొంగించు వెన్నెల
భక్తచిత్తకేకిఘనాఘనా =భక్తుల మనసనెడి నెమలికి ఆహ్లదమిచ్చు వానమబ్బు వంటిది
రోగపర్వతధంభోలి =రోగములనెడి పర్వతములను ధ్వంసం చేయు వజ్రాయుధం
మృత్యుదారుకుఠారికా =మృత్యువను చెట్టును నరుకు గొడ్డలి వంటిది
శ్రీమాత్రే నమః 
 ఈ నామాలను పదే పదే   మననం చేయటం వలన మనకు కలిగే అష్టకష్టముల నుండి ఉపశమనం కలుగుతుంది
   మనిషి జీవితాన్ని బాగా ప్రభావితం చెసే అవయవం నోరు అది లోపలికి తీసుకునే ఆహారం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యం ప్రభావితమవుతుంది. అది బయటకు పంపే అక్షరం ద్వారా మన జీవన గమనం ప్రభావితమవుతుంది అట్టి నోటిని (పెదవుల నుండి కంఠం వరకు) ఆధారం చేసుకుని వేయి లలితా నామాలను లోకానికి అందించిన వశిన్యాది వాగ్దేవతలు ఉంటారు వీరి నామాలు నిత్యం మననం చేయుట ద్వారా చక్కని ఆరోగ్యం వాక్శుద్ధి దక్కుతాయి.వీరు సాక్షాత్ లలితా దేవి పరిపూర్ణ అవతారములు
శ్రీమాత్రే నమః
 వశిని కామేశ్వరీ మోదినీ విమల అరుణ  జయినీ సర్వేశ్వరీ కౌళినీ  
శ్రీమాత్రే నమః

చైత్రనవరాత్రులు శ్రీరాముని ఆరాధనకు లలితా అమ్మవారి ఆరాధనకు విశేషమైనట్టివి  చైత్రశుక్ల నవమి మధ్యాహ్నం పునర్వసు నక్షత్రంలో 12గంటలకు రాముని పుట్టుక అయితే అర్ధరాత్రి 12గంటలకు మృగశీర్షా నక్షత్రంలో పార్వతీ దేవి జననం  

ఇక శని అంటే ఈరోజు మనం చేసిన కర్మకు కాలం యొక్క  ప్రతిస్పందన అంతే
ఎపుడో మనకు తెలియకుండా జరిగి పోయిన తప్పుల వలన కలిగే ప్రతిచర్యల ముప్పు తగ్గాలంటే పైన చెప్పిన వాటితో పాటు 
వికలాంగులకు పేదలకు ఆహారం అందించటం వీధి కుక్కలకు (ఇంటి యందు కుక్కలు పెంచరాదు  దోషకారకం) ఆహారం నీరు
అందేలా చూడటం గోవులను పోషించటం ఉపయుక్తమైన పనులు

జైశ్రీరామ్

Saturday, March 22, 2025

శంఖుపుష్ప

 శంఖుపుష్ప లతలతో అల్లుకున్న 
చామంతి మోముపై విరిసిన మల్లె 
మొగ్గల చిరునవ్వు చంద్రికలు 
మనసును ముప్పిరిగొన 

అరవిచ్చిన నల్ల కలువ కనుల 
మురిపెపు కాంతులు చామంతి 
మోముపై తళుకులీనుతూ 
మనసును రంజింప 


ఓ హసిత చంద్రికా నీవు నిలచిన
 తావు ఆనంద సరాగాల సంద్రమాయెనే 

Sunday, March 16, 2025

హసిత చంద్రమా

 ఇంద్రనీలమణుల కాంతులతో మెరయు 
కనుల కొలనులో విరిసే ప్రేమ సుమాలు 
మదిని మీట 
మార్గశీర్షోదయాన గులాబీ రెక్కలపై మెరిసే 
మంచుబిదువుల్లా లేత ఎరుపు పెదవుల నడుమ 
పూచే హసిత చంద్రికలు మనసు న  ముప్పిరిగొన 
మరకత కుండలపు కాంతులతో చెంపల కెంపులు 
వింతశోభల మెరియ 
విప్పారిన నవకమలంలా ఆ వదనం హృదిలో 
చిత్రించుకుపోయెనే

హసిత చంద్రమా 

జగమంతయు జగన్నాధుని

 నిర్మల సరోవరంబున ప్రతిబింబించు కలువలరేడు
రూపు  కని కోటిచంద్ర ప్రభాసమానమైన గోపికామానస చోరుడని బ్రమసి మకరందపు మాధుర్యము కొరకు బ్రమించు బ్రమరము వలే
పరవశమొంది సరోవర కమలపు రెక్కపై వాలె
  జగమంతయు జగన్నాధుని కాంచు గోపికాబృంగమొకటి

Saturday, March 15, 2025

శ్రీరంగపతీ

 వేడుక తోడ గోపకులమంతయు అద్దిన 
రంగుల తో నేలకు దిగివచ్చిన హరివిల్లాయని 
ముచ్చటగొలుపు మోముతో హరి కడు విలాసముతో 
ఢమ్ ఢమ్ ఢమ్ యనుచు చేసిన ఢమరుక ధ్వనులతో 
గోపాంగనల గుండెలు ఝల్లుమన మోములు ఎరుపెక్కే 
కంసాదుల గుండెలు దడ దడలాడే మోములు నల్లబడే 
ఇంద్రాదుల గుండెలు ఉప్పొంగ మోములు తెల్లబడే 
ప్రకృతి కాంత  పులకింతలతో   ఆకుపచ్చని కాంతులీనే 
 సంబరపు ధ్వనులతో అంబరం నీలివర్ణపు సొబగులద్దుకునే  
ఢమ ఢమ సవ్వడులు సోకి భగభగ లాడు భానుడు పసిడి కాంతుల 
సోముడాయే 
ఏడు రంగుల పూబాలలు ఎదను విచ్చి సువాసనలు వెదజల్లుతూ 
బాల క్రిష్ణుని మురిపించే 
జీవితమే రంగులమయం శ్రీరంగపతీ నీవు తోడుంటే