Monday, May 19, 2025

అజ్ఞాతవాసి

 


అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు
 నును సిగ్గుల ఎరుపెక్కే చెలి చెక్కిలి ఆనవాలు 
 ముద్ద మందారపు మాటున చిక్కేనిదిగో
 అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 వలపుల గాలం విసిరే నీ వాలు కనుల సోయగం మత్స్యకన్య కంటి మెరుపులో కనబడేనిదిగో 
 అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 ముత్యపు మెరుపుల వరుసను ప్రతిఫలించె నీ
 నవ్వుల కిలకిలల జాడ గలగలా సాగే సెలయేటి సవ్వడులలో దొరికేనిదిగో
అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 హొయలొలికించె నెచ్చెలి నడక వాన మబ్బుకు 
మురిసి నాట్యమాడే నెమలి నడకలో దాగేనిదిగో 
 అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 పిరుదులపై నాట్యమాడే నీలి కురుల వలపు పాశం 
 బుస కొట్టే నాగు పడగలో నవ్వేనిదిగో
 అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 చమట గంధం అలుముకున్న నీ దేహ సౌరభం 
 మల్లెల పరిమళాల లో ఒదిగెనిదిగొ 
 అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 నీ ఆనవాలుకై అచట నిచట వెదికి అలసిన మది నా గుండె గూటిలో ఒదిగిన నిన్ను చూసి సేదతీరేనిదిగో

1 comment:

Srigiri Nilayam said...

బాగుంది !! 🙏🙏🙏